అమెరికా: బానిసత్వంలో మగ్గిన నల్ల జాతీయులకు పరిహారమే పరిష్కారమా?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయం మొదలై 400 ఏళ్లు పూర్తి కావస్తున్నాయి.
ఇంగ్లిష్ వలసవాదులు బందీలుగా పట్టుకున్న 20 మంది ఆఫ్రికన్లను తీసుకువచ్చిన ఓడ అమెరికాలోని వర్జీనియా రాష్ట్ర తీరానికి 1619లో చేరుకుంది. అమెరికాలో మొట్ట మొదటి తరం నల్లజాతి బానిసలు వాళ్లు.
ఆ తర్వాత కొన్ని వందల ఏళ్ల పాటు బానిసత్వం కొనసాగింది. కోట్లమంది నల్ల జాతీయులు నరకకూపంలో జీవించారు.
ఆ తర్వాత బానిసత్వం నుంచి బయటపడ్డా, వారి కష్టాలు తీరలేదు. ఇప్పటికీ నల్ల జాతీయులు జాతి విద్వేషాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు.
అలాంటి నల్లజాతీయులకు ఇప్పటికైనా పరిహారం లభించాలని వాదిస్తున్న గొంతుకలు అమెరికాలో పెరుగుతున్నాయి. 'రీపార్షన్స్ ఫర్ స్లేవరీ' అనే పేరుతో ఈ డిమాండ్‌ను పిలుస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నల్ల జాతి మేధావులు, ఉద్యమకారులు ఎప్పటి నుంచో దీని కోసం డిమాండ్ చేస్తున్నారు. కానీ వారి అభ్యర్థనను రాజకీయ నాయకులు పెద్దగా పట్టించుకున్న సందర్భాలు లేవు.
జాతి అసమానతలకు వ్యతిరేకంగా పోరాటాలు పెరగడం, దేశాధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నవారి మధ్య జరిగిన చర్చలు ఈ అంశాన్ని మరోసారి తెరమీదకు తెచ్చాయి.
అధికారికంగా బానిసత్వం రద్దైన 'సివిల్ వార్' కాలం నుంచి నల్లజాతీయులకు పరిహారం చెల్లించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
బానిసత్వ కాలంలో నల్లజాతీయులు పడిన కష్టానికి కొందరు నిపుణులు లెక్కగట్టారు. బిలియన్ల నుంచి ట్రిలియన్ల డాలర్ల మధ్య అది ఉండొచ్చని అంచనా వేశారు. బానిసత్వం రద్దైన తర్వాత కూడా నల్లజాతీయులు ఎదుర్కొన్న శ్రమ దోపిడీని పరిగణనలోకి తీసుకుంటే ఆ మొత్తం ఇంకా పెరుగుతుంది.
బానిసత్వం సాంకేతికంగా రద్దైన తర్వాత కూడా నల్లజాతి అమెరికన్లకు విద్య, ఓటు హక్కు, ఆస్తి హక్కు వెంటనే రాలేదు. చాలా కాలం వాళ్లు ద్వితీయ శ్రేణి పౌరుల్లానే ఉన్నారు.
ఆదాయం, గృహకల్పన, వైద్యం, జైలుశిక్షలు.. ఇలా ఏ అంశం తీసుకున్నా తెల్ల జాతీయులకు, నల్ల జాతి అమెరికన్లకు మధ్య ప్రస్తుతం అంతరం ఉండటానికి ఈ చారిత్రక అసమానతలే కారణాలని రీపార్షన్స్ కోసం డిమాండ్ చేస్తున్నవారు అంటున్నారు.
అమెరికాకే ఉన్న ఈ ప్రత్యేకమైన సమస్యకు ఆ దేశ చరిత్రే ఒక కారణమని ఓహియో స్టేట్ వర్సిటీ ప్రొఫెసర్ డారిక్ హామిల్టన్ అంటున్నారు.
''బానిసత్వ పునాదుల మీదే దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను మనం నిర్మించుకున్నాం. అందుకే అవి ప్రమాదకరంగా, అసమానతలను పెంచేవిగా తయారయ్యాయి'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో బానిసత్వం చరిత్ర ఇది..
1619 - ఇంగ్లిష్ వలసవాదులు నల్లజాతీయులను బానిసలుగా కొనుక్కొని వర్జీనియాకు తీసుకువచ్చారు. అమెరికాలో తొలితరం బానిసలు వీళ్లే. అయితే, యూరోపియన్ వలసవాదులు అంతకుముందు నుంచే బానిసలను ఉపయోగించుకుంటున్నారు.
1788 - బానిసలను వ్యక్తిలో ఐదింట్లో మూడో వంతుగా లెక్కగడుతూ అమెరికా చట్టం చేసింది.
1808 - ఆఫ్రికన్ బానిసల వ్యాపారంపై అమెరికా అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ నిషేధం విధించారు.. కానీ, అమెరికాలో, ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాల్లో దేశీయంగా బానిసల కొనుగోళ్లు, అమ్మకాలు బాగా పెరగడం మొదలైంది.
1822 - బానిసత్వం నుంచి విముక్తి పొందిన ఆఫ్రికన్ అమెరికన్లు పశ్చిమ ఆఫ్రికాలో లైబీరియా అనే దేశాన్ని స్థాపించుకున్నారు.
1860 - అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యారు. దక్షిణ రాష్ట్రాలు విడిపోయి, ఆ మరుసటి ఏడాది సివిల్ వార్ మొదలైంది.
1862 - లింకన్ దాస్య విమోచన ప్రకటనతో విడిపోయిన రాష్ట్రాల్లోని బానిసలంతా విముక్తులయ్యారు.
1865 - దక్షిణ రాష్ట్రాలు యుద్ధంలో ఓడిపోయాయి. 13వ రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికాలో బానిసత్వం అధికారికంగా రద్దైంది.
1868 - 14వ సవరణ ద్వారా ఆఫ్రికన్ అమెరికన్లందరికీ అమెరికా పౌరసత్వం లభించింది.
1870 - 15వ సవరణ ద్వారా ఆఫ్రికన్ అమెరికన్ పురుషులకు ఓటు హక్కు వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
రీపార్షన్స్ ఎలా పనిచేస్తాయి?
రీపార్షన్స్ అనగానే నల్ల జాతి అమెరికన్లకు నగదు పరిహారం చెల్లించాలన్న డిమాండ్ చర్చకు వస్తుంది. కానీ, దాన్ని అమలు చేయాలంటే ట్రిలియన్ల డాలర్ల భారం అమెరికాపై పడుతుందని కొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు.
డబ్బు ఇచ్చినంత మాత్రాన సమస్య మూలాల నుంచి పరిష్కారం కాదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. నగదు చెల్లింపు ఆలోచనను తాను సమర్థిస్తానని, అదొక మంచి సంకేతం అవుతుందని ప్రొఫెసర్ హామిల్టన్ బీబీసీతో చెప్పారు.
''అన్యాయం జరిగిన చోట సమస్యను గుర్తించినంత మాత్రాన అది పరిష్కారం అయిపోదు. బాధితులకు పరిహారం అందాలి. అలా అని ఒక్క పరిహారం చెల్లించడంతోనే అమెరికాకు సంస్థాగతంగా ఉన్న సమస్యలు తీరిపోవు. ఆ సంస్థాగత సమస్యలను అడ్డంపెట్టుకుని కొన్ని వర్గాలు ఎంతో దోచుకున్న విషయాన్ని మరిచిపోవద్దు. నల్ల జాతీయులకు ఆర్థికంగా న్యాయం చేసే బిల్లు తేవాలి'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
పరిహార చెల్లింపులతో పాటు నల్లజాతీయుల విద్య, ఆరోగ్యం, ఆస్తుల పెంపునకు దోహదపడే పలు విధానాలను తేవాలని ఆర్థిక వేత్త విలియమ్ డారిటీ అన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, 2016లో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీపడ్డ హిల్లరీ క్లింటన్ రీపార్షన్స్ విధానాన్ని ఎప్పుడూ సమర్థించలేదు.
కానీ, ఇప్పుడు ఆ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీలో ఉన్న నాయకులు మాత్రం రీపార్షన్స్ గురించి పదేపదే మాట్లాడుతున్నారు.
ఆ పార్టీకి చెందిన సెనేటర్ కమలా హారిస్ లక్ష అమెరికన్ డాలర్ల కన్నా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు పన్ను మినహాయింపులు వర్తింపజేయాలని ప్రతిపాదించారు. దేశంలో అందరూ సమాన అవకాశాలతో ప్రయాణాలు ఆరంభించలేదన్న విషయాన్ని అంగీకరించాల్సిందేనని ఆమె అన్నారు.
సెనేటర్ ఎలిజబెత్ వారెన్ కూడా రీపార్షన్స్‌ను సమర్థించారు.
గృహకల్పనలో, ఉద్యోగకల్పనలో వివక్ష కారణంగా అమెరికాలో సగటు తెల్ల జాతి కుటుంబం వద్ద వంద డాలర్లు ఉంటే, నల్లజాతి కుటుంబం వద్ద ఐదు డాలర్లే ఉండే పరిస్థితి ఏర్పడిందని ఆమె సీఎన్ఎన్ టౌన్‌హాల్ కార్యక్రమంలో అన్నారు.
సెనేటర్ కోరి బుకర్ కూడా కమలా హారిస్ తరహాలోనే పలు ప్రతిపాదనలు చేశారు. మరికొందరు నాయకులు కూడా ఇలాంటి ఆలోచనలను సమర్థించారు.
సెనేటర్ బెర్నీ శాండర్స్ మాత్రం రీపార్షన్స్‌ను తోసిపుచ్చారు.
''సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం మనకుంది. అయితే, చేతికి చెక్కులు ఇవ్వడం కన్నా మెరుగైన పరిష్కారాలు చాలా ఉంటాయి'' అని ఏబీసీ ఛానెల్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన అభిప్రాయపడ్డారు.
రీపార్షన్స్ గురించి చర్చ జరగడం చాలా మంచి విషయమని, జరగబోయేదానికి ఇదొక ముందడుగని ప్రొఫెసర్ హామిల్టన్ అన్నారు.
ఇవి కూడా చూడండి:
- నగరంలో ఇల్లు కొనుక్కునే స్తోమతు లేదా? సగం ఇల్లు కొంటే ఎలా ఉంటుంది?
- అంతరిక్షంలోకి కొత్త జంటల ప్రేమ సందేశాలు
- #HerChoice: నా భర్త నన్ను ప్రేమించాడు, కానీ పడగ్గదిలో హింసించాడు
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- కోలివింగ్: ఉద్యోగ రీత్యా నగరాలు మారే యువత కొత్త చాయిస్
- ఒక అమ్మాయికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్... ఆ ముగ్గురితో ప్రేమ సాధ్యమేనా?
- ఆ 132 గ్రామాల్లో అసలు ఆడపిల్లలే పుట్టలేదా...
- కార్గిల్ స్పెషల్: యుద్ధంలో పాక్ సైనికులకు ఆహారం అందించిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారు?
- ‘రాజకీయ నేతల ప్రేమ వ్యవహారాలపై ఎవ్వరూ బహిరంగంగా ఎందుకు మాట్లాడరు?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









