భారతదేశంలో వర్ణ వివక్ష: ‘‘ఇక్కడ ఉన్నంత మరెక్కడా చూడలేదు’’

ఒయామా

నాడు దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీని రైలు నుంచి గెంటి వేసింది ఆయన ఒంటి రంగు కారణంగానే. అమానుషమైన వర్ణవివక్షను అంతమొందించాలని పాటుపడిన మహాత్ముని మాతృభూమిలోనే తామిప్పుడు జాతి వివక్షను ఎదుర్కొంటున్నట్లు ఆఫ్రికన్ జాతీయులు ఆరోపిస్తున్నారు.

గతంలో ఆఫ్రికన్లపై అనేక దాడులు జరగగా, ఏడాది కిందట దిల్లీలో ఓ నల్లజాతీయున్ని చంపేశారు. అంతేకాదు, దక్షిణాఫ్రికాలోనూ తమను భారతీయులు తక్కువగా చూస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ వివాదంపై దక్షిణాఫ్రికా నుంచి బీబీసీ ప్రతినిధి జుబైర్ అహ్మద్ అందిస్తున్న కథనం.

వీడియో క్యాప్షన్, వీడియో: ‘దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు, నా మనసు తేలికయింది’

‘‘నేను ప్రపంచం మొత్తం చుట్టి వచ్చాను. అయితే, భారత్‌లో ఎదుర్కొన్నంత వర్ణవివక్ష మరెక్కడా చూడలేదు’’ అంటున్నారు దక్షిణాఫ్రికా జాతీయుడైన ఒయామా. ఉద్యోగ రీత్యా ఆయన భారత్‌లో తొమ్మిది నెలలున్నారు.

ఓ బహుళజాతి కంపెనీలో ఆయనొక పెద్ద ఉద్యోగి. అయినప్పటికీ తాను వర్ణవివక్షను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన చెబుతున్నారు.

‘‘ఒక తెల్లవ్యక్తితో నేను ఏదైనా హోటల్‌కు వెళ్తే, ముందుగా ఆ వ్యక్తినే పలకరిస్తారు. ముందుగా నన్ను పలకరించరు. అద్దె ఇంటి కోసం ఎంతో ప్రయత్నించా. చివరకు తోటి ఉద్యోగులను తీసుకెళ్తే కానీ ఇల్లు దొరకలేదు. నల్లజాతీయులను వివక్ష నుంచి కాపాడే ఎటువంటి చట్టాలూ భారత్‌లో లేవు. మమ్మల్ని అనేక విధాలుగా దూషిస్తారు. మా చావుకు మమ్మల్ని వదిలేస్తారు’’ అని ఆయన ఆరోపించారు.

గడువు ముగియక ముందే ఒయామా ఉద్యోగం వదలేసి దక్షిణాఫ్రికా వెళ్లిపోయారు.

భారత్‌లో ఇటీవల ఆఫ్రికన్లను వివక్షతో చూడటం, వారిపై దాడులకు పాల్పడ్డ అనేక ఘటనలు నమోదయ్యాయి.

దక్షిణాఫ్రికాలో ఒక మహిళ

‘భారత్‌లోనే కాదు దక్షిణాఫ్రికాలోనూ అంతే..’

‘‘భారత్‌లో ఆఫ్రికన్ల మీద జరిగే దాడులు చెప్పలేని బాధని కలిగిస్తాయి. తప్పు ఎక్కడుంది? మా మాటలోనా? మా తీరులోనా? ఇది మాకు అర్థం కాని విషయం. ఈ విషయంలో మేం ఓపికతో పోరాడుతున్నాం. తీరు మారకుంటే మేం కూడా అలాగే స్పందించాల్సి వస్తుంది’’ అని దక్షిణాఫ్రికా రాజకీయ నేత ఫుమ్లాని ఎంఫెకా అన్నారు.

ఈ వివక్ష భారత్‌లో మాత్రమే లేదు. సొంత దేశంలోనూ తమను భారతీయులు చిన్నచూపు చూస్తున్నట్లు ఆఫ్రికన్లు ఆరోపిస్తున్నారు. ఇది మెల్లగా రాజకీయ రంగు పులుముకుంటోంది.

‘‘భారతీయుల తీరులో మార్పు వస్తుందని నేను అనుకోవడం లేదు. నేను నమ్మను కూడా. ఈ వివక్ష ఎప్పటికీ కొనసాగుతుంది. ఇది వారి మనుగడకు సంబంధించినది కాదు. ఇది మా మీద వారి మనసుల్లో పేరుకు పోయిన తప్పుడు భావజాలం’’ అని ఫుమ్లాని ఎంఫెకా చెప్పారు.

దక్షిణాఫ్రికాలో ముగ్గురు మహిళలు

‘భారతీయుల్ని చూసి వాళ్లు ఓర్చుకోలేకపోతున్నారు’

దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష చాలా క్లిష్టమైన సమస్య. ఇక్కడ తాము కూడా జాతి వివక్షకు లోనవుతున్నట్లు భారతీయులు చెబుతున్నారు. భారతీయులను లక్ష్యంగా చేసుకొని నల్లజాతి ఆఫ్రికన్లు దాడులకు పాల్పడ్డ ఘటనలు కూడా కొన్ని జరిగాయి.

దీనిపై దక్షిణాఫ్రికాలో న్యాయ సలహాదారుగా పనిచేస్తున్న అశ్విన్ త్రికంజీ మాట్లాడుతూ.. ‘‘దక్షిణాఫ్రికాలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. దీన్నుంచి దృష్టి మళ్లించాలంటే ఒక బలిపశువు కావాలి. అందుకని భారతీయులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. భారతీయులు ఎంతో కష్టపడి డబ్బు సంపాదించుకున్నారు. ఇళ్లు, కార్లు కొన్నారు. దీన్ని వారు ఓర్చుకోలేక పోతున్నారు’’ అని చెప్పారు.

మంచి ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చినప్పటికీ ఒయామా సంతోషంగానే స్వదేశానికి వచ్చారు.

‘‘దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు, నా మనసు తేలికయింది. నా సొంత గడ్డపై తిరిగి అడుగు పెట్టడం చెప్పలేని సంతోషాన్ని ఇచ్చింది’’ అని ఒయామా అన్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)