2300 ఏళ్ల కిందట అరిస్టాటిల్ వర్ణించిన జలాంతర్గామి ఇది!

ఫొటో సోర్స్, The J. Paul Getty Museum
ప్రశాంతంగా ఉన్న సముద్రం. కానీ కొన్ని కిలోమీటర్ల లోతులో యుద్ధానికి సన్నద్ధమవుతున్న పటాలం. గుట్టుచప్పుడు కాకుండా శత్రునౌకలను ధ్వంసం చేసే ఒక ప్రత్యేక నౌక. అదే జలాంతర్గామి. ఇప్పుడు అందరికీ తెలిసిన జలాంతర్గామి సృష్టికి గ్రీకుల కాలం నుంచే ప్రయత్నాలు జరిగాయా? చరిత్ర అదే చెబుతోంది.
మన భూమిపై ఇంకా అంతుపట్టని ప్రదేశాలేవైనా మిగిలి ఉన్నాయంటే.. అవి కచ్చితంగా మహా సముద్రాల్లోని లోతులే.
మనోహరమైన సముద్ర గర్భం అడుగున ఏముందో తెలుసుకోవాలనే ఉత్సాహం మనుషులకు మొదట్నుంచీ ఉంది.
ఎలాంటి పరికరాల సాయం లేకుండానే నీటి అడుగున జీవించాలనే ప్రయత్నంలో, మానవునికి ఎదురైన కష్టాలు దానిపై ఆసక్తిని మరింత పెంచాయి.
ఆ కష్టాలు మనిషి ఊహలను, రూపకల్పనను, చివరికి ఈరోజు మనకు తెలిసిన అత్యాధునిక జలాంతర్గాముల ఆవిర్భావాన్ని ఆపలేకపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
మొట్ట మొదట నీటి అడుగున మునిగే సాధనాన్ని గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ క్రీ.పూ. నాలుగో శతాబ్దంలోనే తయారు చేశారు. ఈ ఘటనలో ఆయన అత్యంత ప్రియ శిష్యుడు అలెగ్జాండర్ భాగమయ్యారు.
నీటి అడుగున అలెగ్జాండర్ చేసిన సాహసాల ప్రస్తావన మధ్య యుగంలో, ముఖ్యంగా జర్మన్ సాహిత్యంలో విస్తృతంగా ఉంది.
సముద్రాల అన్వేషణపై అలెగ్జాండర్ చాలా ఉత్సాహంగా ఉండేవారని వాటిలో ఒక కథనం చెబుతోంది. గాజుతో చేసిన ఒక గంట లాంటి దాంట్లో తనతోపాటు కుక్క, పిల్లి, కోడిపుంజును తీసుకుని ఆయన నీటిలో మునిగి ఉండేవారట.
అయితే ఒకసారి అలెగ్జాండర్ ప్రియురాలి ప్రేమికుడు.. ఆమెను తనతోపాటూ తీసుకెళ్లిపోడానికి.. అలెగ్జాండర్ గాజు గంట లోపల ఉన్నప్పుడు ఆ గొలుసును సముద్రంలో వదిలేశాడు. దాంతో అలెగ్జాండర్ ప్రమాదంలో చిక్కుకుని.. తర్వాత ఎలాగోలా బయటపడ్డారు.
గాజుతో చేసిన పీపా
టైర్ నగర ముట్టడి సమయంలో అలెగ్జాండర్ గాజుతో చేసిన పీపాలో కాసేపు నీటిలో ఉండి, ఆ తర్వాత తిరిగి పైకి వచ్చేవారని మరో కథనం చెబుతోంది.
ఈ వివరణల వెనుక వాస్తవాలలో కొంత అస్పష్టత ఉన్నా.. బోర్లించిన పడవ లేదా గంటలాంటి వాటిలో గాలి నిలుస్తుందని, దానిలో ఆక్సిజన్ ఉన్నంతవరకూ లోపలున్న వారు సముద్రం అడుగున ఉండవచ్చనేది నౌకా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికి తెలిసిన విషయమే.
ఎజియాన్ సముద్రంలోకి వెళ్లే స్పాంజ్ మత్స్యకారులు ఈ నీళ్లలో మునిగే గంట పద్ధతిని శతాబ్దాలుగా ఉపయోగించేవారు.

ఫొటో సోర్స్, Getty Images
ముందే ఊహించిన లియోనార్డో
పునరుజ్జీవనోద్యమం, మధ్య యుగంలో నీటి అడుగున వెళ్లే వాహనం, సైనిక సామర్థ్యాలు జలాంతర్గమి రూపకల్పనలో కీలకపాత్ర పోషించాయి.
ఎగిరే వాహనాలు, యుద్ధ ట్యాంకుల గురించి లియోనార్డో డావిన్సీ ముందే ఊహించారు. 16వ శతాబ్దం ప్రారంభంలో ఆయన రెండు భాగాలుగా ఉండే ఒక పడవ బొమ్మను చిత్రించారు.
దానిలో ఒక వ్యక్తి కూర్చోడానికి వీలుగా ఒక చట్రం ఉండేది.
దీని ఆధారంగానే ఆధునిక జలాంతర్గాముల రూపకల్పన జరిగిందని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మొదటి నమూనాలు
అసలైన జలాంతర్గామిగా భావించే మొదటి నమూనాను.. 1578లో బ్రిటిష్ నౌకాదళ అధికారి విలియం బోర్న్ రూపొందించి ఉండొచ్చు.
నిజానికి అది నీరు ఇంకని చర్మంతో చేసిన ఒక పడవ. మనుషులే దాన్ని నీళ్లలోపల మునిగేలా చేసేవారు. కానీ దానిలో సిబ్బందికి ఎక్కువ స్థలం ఉండేది కాదు.
అయితే బోర్న్ ఆలోచన బ్లూ ప్రింట్స్ దశను దాటలేకపోయింది. కానీ తర్వాత నీటిలో మునిగే వాహనాన్ని తయారు చేయాలనుకున్న మిగతావారిలో ఆయన ఆలోచన స్ఫూర్తి నింపింది.
బోర్న్ నమూనా ఆధారంగా 1605లో జర్మనీకి చెందిన మాగ్నస్ పెగిలియస్ నీటి అడుగున నడిచే మొట్ట మొదటి జలాంతర్గామిని నిర్మించారు.
కానీ దాని రూపకల్పనలో నీటి అడుగున ఉండే మట్టిని పరిగణనలోకి తీసుకోలేదు. దాంతో అది మొదటి పరీక్షలోనే విఫలమైంది.

ఫొటో సోర్స్, COLIN SMITH CREATIVE COMMONS LICENSE IMAGE
1621లో ఇంగ్లాండ్‌లో మొదటి జేమ్స్ సభలో పనిచేసిన కార్నీలియస్ డ్రెబ్బెల్ అనే డచ్ వైద్యుడు ఒక జలాంతర్గామిని డిజైన్ చేశారు. దాన్ని విజయవంతమైన మొట్టమొదటి జలాంతర్గామిగా భావిస్తున్నారు.
డ్రెబ్బెల్ నౌక.. బోర్న్, పెగిలియస్ రూపొందించిన వాటిలాగే ఉంటుంది. దీని బయటి భాగానికి తోలు అతికించారు. దానిపైన చెక్క నిర్మాణం ఉంటుంది.
తెడ్లు దానికి కదిలే శక్తిని ఇస్తాయి. దానికి అమర్చిన తేలే ట్యూబులు లోపల తెడ్డు వేసేవారికి గాలి అందించేవని భావిస్తున్నారు.
థేమ్స్ నదిలో దీనిని మూడు నుంచి ఐదు మీటర్ల లోతులో చాలా సార్లు పరీక్షించి చూశారు. దాదాపు మూడు గంటలపాటు నీటి అడుగునే ఉంచారు.

ఫొటో సోర్స్, ROYAL SUBMARINE MUSEUM GOSPORT UK
జలాంతర్గమి తయారీలో 17వ శతాబ్దానికే చెందిన మరిన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. నీటి అడుగున ఎక్కువ సమయం ఉండేలా, ఎక్కువ దూరం వెళ్లగలిగే నౌక గురించి ఆలోచించినా దాన్ని నిర్మించడం అసాధ్యం అని భావించారు.
నీటి అడుగున కదలిక విషయంలో భౌతిక, మెకానికల్ సిద్ధాంతాలను సరిగా అర్థం చేసుకోలేకపోవడం అనేది ప్రధాన సమస్యల్లో ఒకటి.
నీటిలో మునుగుతున్నప్పుడు కిందకు వెళ్లే కొద్దీ నీటి ఒత్తిడి పెరుగుతుంది.
దీనితో మరింత ఎక్కువ నిరోధకత కలిగిన పదార్ధాలు ఉపయోగించాలని ఊహించారు. అయితే అది పడవ బరువు పెంచి, కదలికను కష్టం చేసింది.

ఫొటో సోర్స్, CREATIVE COMMONS
యుద్ధంలో ఆయుధం
1775లో అమెరికాకు చెందిన డేవిడ్ బుష్నెల్ టర్టిల్ జలాంతర్గామిని నిర్మించారు. ఈ జలాంతర్గామిని తాబేలు చిప్పలా ఉండే రెండు మూతలను అతికించి నిర్మించారు.
ఇది ఒక్కరు మాత్రమే వెళ్లగలిగే జలాంతర్గామి. దీనిని అమెరికా స్వాతంత్ర్య యుద్ధం సమయంలో బ్రిటిష్ నౌకలను సముద్రంలో ముంచడానికి ఉపయోగించేవారు.
దీనిని పెడల్స్ ద్వారా నడిపేవారు. శత్రువుల నౌక పైభాగానికి డైనమైట్ పెట్టడానికి రంధ్రం చేయడం దీని పని. అందుకోసం దీనికి కార్క్ స్క్రూ లేదా మొనతో ఉన్న స్క్రూ ఉంటుంది.
కానీ మొదటిసారి దానిని ఉపయోగించినపుడు అది విఫలమైంది.
తర్వాత తరాలను ఆ వైఫల్యం నిరాశకు గురిచేయలేదు. రెండు శతాబ్దాల్లో సైనిక ఉపయోగాల కోసం భారీ, శక్తిమంతమైన అణు జలాంతర్గాముల ఉత్పత్తి జరిగింది. వైజ్ఞానిక, వాణిజ్య అవసరాల కోసం నేడు రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే అత్యాధునిక మినీ జలాంతర్గాములూ ఆవిర్భవించాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








