ఆంధ్రప్రదేశ్: స్కూల్లోనే పిల్లల కాళ్లను తాళ్లతో బంధించారు

పిల్లల్ని తాళ్లతో కట్టేశారు

ఫొటో సోర్స్, Sunil

ఫొటో క్యాప్షన్, పిల్లల్ని తాళ్లతో కట్టేసిన విషయం తెలుసుకుని విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేశారు
    • రచయిత, హృదయ విహారి బండి
    • హోదా, బీబీసీ కోసం

కదిరి మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఒకవైపు తరగతులు జరుగుతున్నాయి. మరోవైపు హెడ్‌మాస్టర్ గదిలో ఇద్దరు పిల్లల కాళ్లను, స్కూలు బెంచ్‌కు కట్టేశారు. ఒక్క అడుగు కూడా పక్కకు కదల్లేని పరిస్థితి. పరిగెత్తే కాళ్లను తాళ్లతో బంధించారు.

''మేము అతి చేసినమంట. అందుకే నన్ను, రెండో తరగతి పిల్లోడిని తాళ్లతో కట్టేసినారు. అప్పుడు రెండో క్లాసు టీచరు కూడా అక్కడేవుంది. సీనియర్ అన్నకు చెప్పి మా ఇద్దర్నీ హెచ్.ఎం.టీచరే కట్టేపిచ్చింది'' అని ఐదో తరగతి పిల్లాడు చెప్పడం, స్థానిక మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని మశానంపేట మున్సిపల్ స్కూల్లో బుధవారంనాడు ఈ సంఘటన జరిగింది.

''అమ్మ ఒడి పథకంలో పిల్లలు, తల్లిదండ్రుల పేర్లు నమోదు చేయడంలో నేను బిజీగా ఉన్నాను. తల్లిదండ్రులు, పిల్లలు నా దగ్గరికి వచ్చిపోతున్నారు. ఈ మధ్యలో, ఇద్దరు పిల్లలను నా చైర్ దగ్గరున్న బెంచ్‌కు ఎవరో కట్టేశారు. పనిలోపడి, ఆ విషయం నేను గమనించలేదు'' అని స్కూల్ హెడ్‌మాస్టర్ శ్రీదేవి బీబీసీతో అన్నారు.

పిల్లలను కట్టేశారన్న విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు, మీడియా ప్రతినిధులు బుధవారం మధ్యాహ్నం స్కూలుకు చేరుకున్నారు. హెడ్ మాస్టర్ శ్రీదేవిని ఈ విషయమై ప్రశ్నించారు. ఆమెను సస్పెండ్ చేయాలని ఆందోళన చేశారు.

కదిరి పట్టణంలోని మశానంపేట మున్సిపల్ స్కూల్

ఫొటో సోర్స్, Sunil

ఫొటో క్యాప్షన్, కదిరి పట్టణంలోని మశానంపేట మున్సిపల్ స్కూల్

‘‘బాధిత పిల్లల తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నడుపుతున్నారు. తల్లులు, ఇళ్లల్లో పని చేస్తున్నారు. ఐదవ తరగతి చదువుతున్న బాధిత పిల్లాడు, తనకు రోజుకు రెండు రూపాయలిస్తేతప్ప, స్కూలుకు వెళ్లనని గొడవ చేయడం, విరామ సమయంలో స్కూలు ఎగ్గొట్టడం లాంటివి చేస్తుండటంతో, విధిలేని పరిస్థితుల్లో తానే ఇలా కట్టేసిట్లు పిల్లాడి తల్లి అధికారుల ముందు చెప్పారు’’ అని ఎమ్ఈఓ చెన్నక్రిష్ణ బీబీసీతో అన్నారు.

''టీచర్లు కానీ, తల్లిదండ్రులు కానీ, ఎవ్వరైనా సరే, ఇలా పిల్లలను కట్టేయడం నేరమే. ఈ విషయమే టీచర్లకు, పిల్లల తల్లిదండ్రులకు వివరించి చెప్పాం. బుధవారం రాత్రి పిల్లల తల్లిదండ్రులు, సిబ్బందితో ఐసీడీఎస్ పి.డి, ఆర్డీఓ, డీఎస్పీ అందరూ మాట్లాడారు. తన కొడుకును తానే కట్టేశానని ఒక విద్యార్థి తల్లి చెప్పింది. ఇంకో పిల్లోడిని ఇంకెవరో కట్టేశారు. ఈ విషయమై కలెక్టర్‌కు నివేదిక పంపాము'' అని ఎమ్ఈఓ చెన్నక్రిష్ణ బీబీసీకి వివరించారు.

''పిల్లలను ఇలా కట్టేయడం ఇది మొదటిసారి కాదు. మంగళవారం కూడా ఒక పిల్లోడ్ని ఇట్లే కట్టేసినారు సార్. పిల్లలు అల్లరి చేయడం మామూలే. అట్లని కట్టేస్తారా? పిల్లల తల్లులు, హెచ్.ఎం.కు తెలీకుండా, ఆమె కుర్చీకి నాలుగు అడుగుల దూరంలోని బెంచ్‌కు కట్టేసేది సాధ్యమేనా సార్? మేం పిల్లలతో మాట్లాడినాం. ఒక సీనియర్ పిల్లోడిని పిలిచి, ఇద్దర్నీ కట్టేయమని శ్రీదేవి మేడం చెప్పిందని వారు చెబుతున్నారు'' అని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకుడు బాబ్‌జాన్ బీబీసీతో అన్నారు.

ఘటనపై విచారణ జరుపుతున్న అధికారుల

ఫొటో సోర్స్, Sunil

ఫొటో క్యాప్షన్, ఘటనపై విచారణ జరుపుతున్న అధికారుల

''వీరిలో ఐదో తరగతి చదువుతున్న పిల్లాడు స్కూలుకు రావాలంటే రోజుకు రెండు రూపాయలు ఇవ్వాలంట. లేకపోతే స్కూలుకు రాడు అని, అతని తల్లి చెప్పింది. నిన్న కూడా తనకు డబ్బులు ఇవ్వాలని మొండి చేస్తే, 'ఇప్పుడు నాదగ్గర డబ్బుల్లేవు, మళ్లీ ఇస్తానని చెప్పాను, అయితే నేను వచ్చేలోపు వీడెక్కడికైనా పారిపోతాడన్న భయంతోనే ఇలా బెంచ్‌కు కట్టేశాను సార్' అని ఆ పిల్లాడి తల్లి మాతో చెప్పింది. కానీ ఇంకొక పిల్లాడిని మాత్రం, స్కూలు పిల్లలే కట్టేశారట. వీరిని కట్టేసింది కూడా హెడ్ మాస్టర్ గదిలోనే, ఆమె చైర్‌కు ఐదు అడుగుల దూరంలోనే'' అని కదిరి డీఎస్పీ షేక్‌లాల్ అహ్మద్ అన్నారు.

''ఈ ఘటనపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని పై అధికారుల నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి. ఈ ఘటనను సుమోటోగా తీసుకుని, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం'' అని డీఎస్పీ అన్నారు.

పిల్లల తల్లిదండ్రులను సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ స్కూలు నుంచి, అధికారుల నుంచి వారి వివరాలు పెద్దగా తెలియరాలేదు. సంఘటన జరిగిన మరుసటిరోజు అంటే గురువారం పిల్లలు ఇద్దరూ స్కూలుకు రాలేదు. పిల్లల పేర్లను, ఇతర వివరాలను బహిర్గతం చేయడం తమకు ఇష్టం లేదని తల్లిదండ్రులు తమతో చెప్పినట్లు డీఎస్పీ బీబీసీకి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)