మహారాష్ట్ర: అమిత్ షాపై శరద్ పవార్ రాజకీయ చదరంగంలో ఎలా గెలిచారు.. అసలు చాణక్యుడు ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
'మహారాష్ట్ర చాణక్యుడు శరద్ పవార్ మిగతా చాణక్యులందరి ఆట కట్టించారు'... మహారాష్ట సీఎం పదవికి బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా చేశాక, ఎన్సీపీ నేత నవాబ్ మలిక్ అన్న మాట ఇది.
మలుపుల మీద మలుపులతో సాగుతున్న మహారాష్ట్ర రాజకీయాల్లో అనుకోని పెద్ద మలుపు మంగళవారం వచ్చింది. ఎన్సీపీలో చీలిక తెచ్చి, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
నవంబర్ 27న బలపరీక్ష జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో, మెజార్టీ లేక మంగళవారం (నవంబర్ 26న) ఫడణవీస్ రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమమైంది.
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నా, ఈ పరిణామాల వల్ల అత్యంత ప్రయోజనం శరద్ పవారే పొందుతున్నారని కొందరు అంటున్నారు.
అమిత్ షా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత.. బీజేపీ అత్యధిక సీట్లు గెలిచి కూడా, అధికారం దక్కించుకోలేకపోవడం ఇదే మొదటిసారి.
దీనికి ముందు గోవాలో, హరియాణాలో మెజార్టీ సీట్లు రాకపోయినా, బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగింది. కర్ణాటకలోనూ అధికారం చేజిక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసింది.
మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటుండగానే, నవంబర్ 23న ఉదయం అకస్మాత్తుగా ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ మద్దతుతో ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, శరద్ పవార్ ముందు బీజేపీ రాజకీయ తంత్రాలు పనిచేయలేదు.

ఫొటో సోర్స్, Getty Images
పవార్ ఎలా గెలిచారు?
తన కెరీర్‌లోనే ఇలాంటి రాజకీయ క్రీడను ఎప్పుడూ చూడలేదన్నారు సీనియర్ పాత్రికేయురాలు సుజాత ఆనందన్.
''ప్రభుత్వ ఏర్పాటుకు ఎప్పుడైనా తగినంత సంఖ్యా బలమున్న పార్టీనే ముందుకు వస్తుంటుంది. అజిత్ పవార్ వెంట 10-12 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలే వచ్చారని అర్థమవుతోంది. ఆ తర్వాత వాళ్లు కూడా ఆయన్ను విడిచి వెళ్లారు. ఎన్సీపీకి ఉన్న 54 మంది ఎమ్మెల్యేల్లో 53 మంది శరద్ పవార్ వద్దే ఉన్నారు. తానొక్కడే మిగలడంతో మరో అవకాశం లేక, అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్... తమ ఎమ్మెల్యేల మద్దతు పోకుండా చూసుకోవడంలో సఫలమయ్యాయి'' అని ఆమె వివరించారు.
అజిత్ పవార్ ముందు నుంచీ సేఫ్ గేమ్ ఆడుతున్నారని, ఈ పరిణామాలతో బాగా నష్టపోయింది బీజేపీయేనని సుజాత అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్రలో ఎన్నికలు జరగకముందే బీజేపీ, ఎన్సీపీల మధ్య పెనుగులాట మొదలైంది.
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలోనే ఎన్ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) శరద్ పవార్, అజిత్ పవార్‌లపై కేసులు పెట్టింది. ఈ పరిణామంతో అజిత్ పవార్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారు.
శరద్ పవార్‌కు వయసు కూడా మీద పడుతుండటంతో ఇక ఎన్సీపీ కథ కంచికి చేరుతోందన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి.
కానీ, ఎన్నికల ప్రచార సమయంలో శరద్ పవార్ 100కుపైగా బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని, 125 సీట్లలో పోటీ చేశారు. అన్ని సీట్లు ఎన్సీపీకి కేటాయించడంపై కాంగ్రెస్‌లోనూ కొంత వ్యతిరేకత వ్యక్తమైంది.
''100 సీట్లలో పోటీ చేసేందుకు కూడా ఎన్సీపీ సిద్ధంగా ఉన్నప్పుడు 125 సీట్లు ఎందుకు ఇవ్వడం అని చర్చ నడిచింది. కానీ, శరద్ పవార్ అంతటి స్థాయి ఉన్న మరో నాయకుడిని తీసుకువస్తే, వ్యతిరేకిస్తున్నవారి మాట వినేందుకు సిద్ధమని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ అన్నారు. దీంతో ఎవరూ నోరు మెదపలేదు. మహారాష్ట్ర ఎన్నికల విషయంలో శరద్ పవార్‌పై సోనియా పూర్తి నమ్మకం ఉంచారు'' అని సుజాత ఆనందన్ అన్నారు.
''కాంగ్రెస్ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనూ శరద్ పవార్ ప్రచారం చేశారు. ఎన్నికల్లో ఎన్సీపీ 54 సీట్లు, కాంగ్రెస్ 44 సీట్లు గెలిచాయి. బీజేపీకి 105, శివసేనకు 56 సీట్లు వచ్చాయి'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్సీపీని మూడు సార్లు ఢీకొట్టి బీజేపీ మూల్యం చెల్లించుకుందని సుజాత అంటున్నారు.
''ఎన్నికలకు ముందు ఎన్సీపీలోని సీనియర్ నాయకులను లక్ష్యంగా చేసుకున్నారు. ఆ తర్వాత ఈడీ కేసు పెట్టారు. మూడో సారి పవార్ కుటుంబాన్ని విడదీయాలని చూశారు. పవార్ అన్నీ చూస్తూ మౌనంగా కూర్చోరు. ఆయన రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగానే బీజేపీని దెబ్బకొట్టారు'' అని ఆమె వ్యాఖ్యానించారు.
శరద్ పవార్ విజయంలో బీజేపీ పొరపాట్ల పాత్ర కూడా ఉందని సుజాత అన్నారు. క్షేత్ర స్థాయిలోని వాస్తవ పరిస్థితులను ఆ పార్టీ విస్మరించిందని, శివసేనకు తగిన గౌరవం ఇవ్వలేదని అభిప్రాయపడ్డారు.
''కాంగ్రెస్ 10-15, ఎన్సీపీ 20-22 సీట్లు గెలవొచ్చని భావించాం. కానీ, వాళ్లు చాలా సీట్లు గెలిచారు. హిందూత్వ వ్యతిరేక ఓట్లే దీనికి కారణం. 105 సీట్లకే పరిమితమైన బీజేపీ... శివసేన డిమాండ్లను గౌరవించాల్సింది'' అని అన్నారు.
మహారాష్ట్ర రాజకీయ చదరంగంలో అమిత్ షాకు శరద్ వవార్ చెక్ చెప్పి, ఓడించారని ఇప్పుడు చర్చ జరుగుతోంది.
ఈ అభిప్రాయంతో సీనియర్ పాత్రికేయుడు గిరీశ్ కుబేర్ ఏకీభవిస్తున్నారు.
''ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో గొప్ప రాజకీయ పరిపక్వతతో శరద్ పవార్ విజయవంతమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, సిక్కిం, గోవాల్లో చేసినట్లుగా మహారాష్ట్రలోనూ అధికారంలోకి రావాలని అమిత్ షా అనుకున్నారు. ఆయన మహారాష్ట్రను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. చిన్న పిల్లల ఆటలా, తనకు ఇష్టం వచ్చినట్లు చేస్తూ పోయారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిఘటన ఎప్పుడూ ఉంది. అందుకే ఆయన పాచిక పారలేదు'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పరిణామాల వల్ల ఎన్సీపీ బాగా లాభపడిందని, రాబోయే రోజుల్లోనూ అది కొనసాగుతుందని గిరీశ్ కుబేర్ అభిప్రాయపడ్డారు.
''ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత శరద్ పవార్ తన కారులో బారామతీ వైపు వెళ్తున్నప్పుడు.. ఈ కథ అంతా మొదలైంది. ఆయనకు శివసేన నేత సంజయ్ రౌత్ ఫోన్ చేశారు. ప్రస్తుతానికి బీజేపీతో కలిసి తమ పార్టీ వెళ్తోందని.. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కలిసే అవకాశాలు ఉన్నాయా? అని ఆయన పవార్‌ను అడిగారు'' అని గిరీశ్ వివరించారు.
''పవార్, రౌత్‌ల మధ్య ఈ చర్చ జరిగిన కొన్ని రోజుల తర్వాత రాబోయే ఐదేళ్లు ముఖ్యమంత్రి పదవిలో తమ పార్టీ వారే ఉంటారని ఫడణవీస్ బహిరంగంగా ప్రకటించారు. ఈ ఘటనతోనే ఆలోచనల దశలో ఉన్న ఆ కూటమికి పునాదులు పడ్డాయి. పవార్ నెమ్మదిగా తమ ప్రభావాన్ని పెంచుకుంటూ పోయారు. ఆయన బయటకు ఏమీ మాట్లాడలేదు కానీ, ఈ పరిణామాల వల్ల అందరి కన్నా అధిక ప్రయోజనం ఎన్సీపీకే కలిగింది'' అని అన్నారు.
''శరద్ పవార్ తమతో వస్తారంటూ బీజేపీ నాయకులు ప్రచారం మొదలుపెట్టారు. కానీ, శరద్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ లౌకికవాదిగానే ఉన్నారు. ఆయన్ను అర్థం చేసుకోవడంలో బీజేపీ విఫలమైంది. శివసేనకు గౌరవం ఇవ్వకపోవడమే వాళ్లు చేసిన మొదటి పెద్ద తప్పు'' అని గిరీశ్ అభిప్రాయపడ్డారు.
బీజేపీ మిత్రుడినీ అర్థం చేసుకోలేకపోయిందని, శత్రువునీ అర్థం చేసుకోలేకపోయిందని గిరీశ్ అన్నారు.
''మహారాష్ట్ర రాజకీయాలను పూర్తి స్థాయిలో గొప్పగా అర్థం చేసుకున్న నేతలు ఇంతవరకూ ఇద్దరే. వాళ్లు ప్రమోద్ మహాజన్, శరద్ పవార్. బీజేపీ ఇంకా అపరిపక్వంగానే ఉంది'' అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
కూటమి ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా?
రాజకీయ భావజాలపరంగా చూసుకుంటే మహారాష్ట్రలో ఏకమవుతున్న ఈ పార్టీల మధ్య చాలా అంతరం ఉంది.
రామ మందిరం మొదలుకొని చాలా అంశాలపై శివసేన హిందూత్వ ఓటు బ్యాంకును తమ వైపు ఆకర్షించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విదేశీ మూలాలను ఇదివరకు ఎన్సీపీ ప్రశ్నించింది.
కాంగ్రెస్ రాజకీయాలు లౌకికవాదం చుట్టూ తిరుగుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఈ మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వం ఎన్నాళ్లు స్థిరంగా ఉండగలదన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఒక వేళ పాలన స్థిరంగా కొనసాగితే, లాభపడేది ఎవరు? నష్టపోయేది ఎవరు?
సర్కారు స్థిరంగా ఉన్నా, పడిపోయినా శివసేనకు నష్టం తప్పదని గిరీశ్ కుబేర్ అంటున్నారు.
''శివసేన పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా. ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా? అన్న సందేహం సరైనదే. ప్రభుత్వం నడపడం అంటే అంకెలు, లెక్కలు కాదు. అన్ని పక్షాల మధ్య అవగాహన, పరస్పర సహకారం అవసరం'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''ఒకవేళ బీజేపీ మహారాష్ట్రలో ఎన్‌ఆర్‌సీ అంశాన్ని లేవనెత్తితే ఈ మూడు పార్టీలు ఏం చేస్తాయి? శివసేన ఏం చేస్తుంది? శివసేన హిందూత్వ రాజకీయాలు చేస్తూనే ఉంది. ఉద్ధవ్ ఠాక్రే అయోధ్యకు వెళ్లొస్తారు. రామ మందిరం నిర్మించాల్సిందే అంటారు. ఇలాంటి వ్యాఖ్యలే మున్ముందూ చేస్తే, కాంగ్రెస్ ఊరుకుంటుందా? మహారాష్ట్రకు బయట ఈ విషయం గురించి కాంగ్రెస్‌కు ప్రశ్నలు ఎదురుకావా? ఈ ప్రశ్నలన్నింటికీ బదులు చెప్పడం కష్టం'' అని గిరీశ్ అన్నారు.
మహారాష్ట్రలో ఎన్సీపీ బలం చాటుకుందని, ప్రభుత్వం విఫలమైనా ఆ పార్టీ లాభపడుతుందని గిరీశ్ అన్నారు.
''ఈ ప్రభుత్వం పడిపోతే, తామే ప్రభుత్వం నడుపుతామని బీజేపీ బలంగా చెబుతుంది. అలాంటి పరిస్థితుల్లో శివసేన ఏం చేస్తుందనేది కాలమే నిర్ణయిస్తుంది. ఈ మూడు పార్టీలు నిర్ణయించుకున్న కనీస ఉమ్మడి ప్రణాళికను ఎంతవరకూ అమలు చేయగలుగుతారన్న దానిపై ప్రభుత్వం నడిచే అవకాశాలు ఆధారపడి ఉంటాయి'' అని అన్నారు.
మహారాష్ట్రలో ఎదురైన వైఫల్యం ప్రభావం జాతీయ స్థాయిలోనూ బీజేపీపై కచ్చితంగా ఉంటుందని గిరీశ్ కుబేర్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి.
- చైనాలోని ముస్లిం శిబిరాలపై ఓ యువతి చేసిన టిక్‌టాక్ వీడియో వైరల్
- మహారాష్ట్రలో ఆపరేషన్ కమలం ఎలా జరిగిందంటే...
- ‘మహిళల ప్రమేయంతోనే అత్యాచారాలు జరుగుతున్నాయి’ - భాగ్యరాజా
- మహారాష్ట్ర సీఎంగా ఫడణవీస్ ప్రమాణ స్వీకారం... సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్
- మీ పెంపుడు కుక్కతో జాగ్రత్త... ముద్దులు పెడితే ప్రాణాలు పోతున్నాయి
- మహారాష్ట్ర: బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో తెరవెనుక ఏం జరిగింది?
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- చనిపోయిన జింక కడుపులో 7 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు
- మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం రేపు.. ఎన్సీపీలోనే ఉంటానన్న అజిత్ పవార్
- పోర్న్ తారల అకౌంట్లను ఇన్‌స్టాగ్రామ్ ఎందుకు తొలగిస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








