షుగర్ మానేయడం వల్ల కేవలం 10 రోజుల్లో మీ శరీరంలో వచ్చే మార్పులేంటో తెలుసా?

యాడెడ్ షుగర్, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, సిరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే కుటుంబాల్లో 56 శాతం మంది నెలకు 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు కేకులు, బిస్కెట్లు, చాక్లెట్, ఐస్ క్రీం మొదలైన వాటిని వినియోగిస్తున్నారని ఒక అధ్యయనం చెబుతోంది. వారిలో 18 శాతం మంది ప్రతిరోజూ తీసుకుంటున్నారు.

అంతేకాదు, ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఎక్కువ (55 శాతం) మంది స్వీట్లను తినకుండా ఉండలేమని.. అయితే, వాటిలో చక్కెర శాతం తక్కువగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఈ రోజుల్లో, ప్రజలు తాము తినే ఏ ఆహారంలో ఎంత చక్కెర ఉందో తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచుకుంటున్నారు. చాలామంది చక్కెర ఎక్కువైతే ఆరోగ్యానికి హానికరం అని గ్రహించడం ప్రారంభించారు.

ఈ మధ్య 'షుగర్ కట్ ఛాలెంజ్' ట్రెండ్ అవుతోంది. అంటే, తెల్ల చక్కెర లేదా బ్రౌన్ చక్కెర మంచిదా అనే దానితో సంబంధం లేకుండా, నిర్ణీత రోజుల పాటు అన్ని రకాల చక్కెర ఆహారాలను తగ్గించడం లేదా మానేయడం.

"10 రోజులు చక్కెరను నివారించిన తర్వాత నా ముఖం ప్రకాశవంతంగా మారింది", "నేను బరువు తగ్గాను" అంటూ పలువురు ఇంటర్నెట్‌లో పోస్టులు చేస్తున్నారు.

ఇంతకీ, చక్కెరను పూర్తిగా మానేస్తే ఏమవుతుంది? దీనిపై 6 ప్రశ్నలు, సమాధానాలు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
షుగర్, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ

ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు, రెండు రకాల చక్కెరల గురించి మనం తెలుసుకోవాలి.

మొదట, ఆహారాలు లేదా పానీయాలను తయారు చేసినప్పుడు లేదా ప్రాసెస్ చేసినప్పుడు వాటికి కలిపే చక్కెర లేదా స్వీటెనర్‌ను 'యాడెడ్ షుగర్స్' అంటారు.

తెల్ల చక్కెర, గోధుమ చక్కెర, తేనె, బెల్లం, నల్ల ఎండుద్రాక్ష, బిస్కెట్లు, కేకులు, వాటి నుంచి తయారు చేసిన శీతల పానీయాలన్నీ ఈ కోవలోకి వస్తాయి. తేనె, ఇతర ఉత్పత్తులు సహజంగా లభించినప్పటికీ, అవి యాడెడ్ షుగర్స్.

ఈ యాడెడ్ షుగర్‌ను ఎక్కువగా తీసుకోవడం ప్రమాదకరమని అనేక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మరొకటి పాలు, పండ్లు, కూరగాయలలో సహజంగా లభించే చక్కెర. ఇవి మీ ఆరోగ్యానికి మంచివని వైద్యులు అంటున్నారు.

2023లో 'లాన్సెట్' ప్రచురించిన అధ్యయనం ప్రకారం, భారత్‌లో 10.1 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అత్యధికంగా మధుమేహ బాధితులు ఉన్న రాష్ట్రాలు గోవా (26.4 శాతం), పుదుచ్చేరి (26.3 శాతం), కేరళ (25.5 శాతం) అని కూడా అధ్యయనం పేర్కొంది.

"ఇది కేవలం మధుమేహం మాత్రమే కాదు, యాడెడ్ షుగర్ ఆహారాన్ని ఎక్కువగా తినడం శరీరానికి అనేక విధాలుగా హానికరం" అని చెన్నైకి చెందిన వైద్యుడు, మధుమేహ నిపుణులు సింథియా దినేష్ అంటున్నారు.

ఇది టైప్-2 డయాబెటిస్, ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం(ముఖ్యంగా నడుము చుట్టూ), నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, గుండె జబ్బులు, దంత క్షయం వంటి అనేక పరిణామాలకు దారితీస్తుందని కూడా సింథియా దినేష్ హెచ్చరిస్తున్నారు.

యాడెడ్ షుగర్, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ

"మన శరీరానికి గ్లూకోజ్ అనే చక్కెర కచ్చితంగా అవసరం. మెదడు పనితీరుకు ఈ గ్లూకోజ్ చాలా అవసరం. ఇది మొత్తం శరీరానికి శక్తినిచ్చే ప్రధాన వనరు" అని యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చెబుతోంది.

"కానీ, మీరు ఆహారంలో గ్లూకోజ్‌ను విడిగా కలపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు తినే ఆహారం నుంచి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులను విచ్ఛిన్నం చేయడం ద్వారా మీ శరీరం దానికి అవసరమైన గ్లూకోజ్‌ను తయారు చేసుకోగలదు" అని చెబుతోంది.

షుగర్, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ

"పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పాల ఉత్పత్తులు వంటి కార్బోహైడ్రేట్లున్న అన్ని ఆహారాలలో చక్కెర సహజంగా కనిపిస్తుంది. సహజ చక్కెరున్న తృణధాన్యాలను తీసుకోవడం హానికరం కాదు" అని హార్వర్డ్ మెడికల్ స్కూల్ వ్యాసం ఒకటి చెబుతోంది.

"మొక్కల ఆధారిత ఆహారాలలో అధిక మొత్తంలో ఫైబర్, ముఖ్యమైన ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. పాల ఆహారాలలో ప్రోటీన్, కాల్షియం ఉంటాయి. మానవ శరీరం ఈ ఆహారాలను నెమ్మదిగా జీర్ణం చేస్తుంది. కాబట్టి, వాటిలోని చక్కెర మన కణాలకు స్థిరమైన శక్తిని అందిస్తుంది. ఎక్కువ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని కూడా తేలింది" అని వ్యాసం చెబుతోంది.

ఉదాహరణకు, మీరు ఒక నారింజను తింటే, సహజ చక్కెరలతో పాటు పోషకాలు, ఫైబర్‌ను పొందుతారు.

యాడెడ్ షుగర్

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ

"యాడెడ్ షుగర్ తగ్గించడం వల్ల చాలా స్పష్టమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు, తక్కువ కేలరీల వినియోగం వల్ల దంత ఆరోగ్యం మెరుగుపడుతుంది, బరువు తగ్గుతారు. కాగా, యాడెడ్ షుగర్‌ను నివారించినప్పుడు, ప్రారంభంలో కొంతమందికి తలనొప్పి, అలసట లేదా మానసిక స్థితిలో మార్పులు వంటి కొన్ని లక్షణాలు కనిపించవచ్చు" అని డాక్టర్ సింథియా చెప్పారు.

అదే సమయంలో, "కొంతమందికి ఇటువంటి ప్రభావాలు కలగడానికి కారణం, వారు గతంలో తమ ఆహారంలో ఎక్కువ చక్కెరను తీసుకోవడం. ఉదాహరణకు, ఒక కప్పు కాఫీకి 4 నుంచి 6 చెంచాల తెల్ల చక్కెరను కలిపే వ్యక్తులను చూశాను" అని చెన్నైకి చెందిన పోషకాహార నిపుణుడు తరిణి కృష్ణన్ అంటున్నారు.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
బీబీసీ

అమెరికాలో (2015) ఊబకాయం ఉన్న పిల్లలలో నిర్వహించిన ఒక అధ్యయనంలో.. శరీర బరువులో గణనీయమైన మార్పు లేనప్పటికీ, యాడెడ్ షుగర్ 10 రోజుల పాటు పూర్తిగా నివారించడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలలో మార్పులు వచ్చాయని తేలింది.

"యాడెడ్ షుగర్‌ను నివారించడం ద్వారా, మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యం 5- 6 రోజుల్లో మెరుగుపడుతుంది. 7- 8 రోజుల్లో మానసిక స్థితిలో సానుకూల మార్పులు వస్తాయి. 9- 10 రోజుల్లో చర్మం ప్రకాశవంతంగా మారడం ప్రారంభమవుతుంది" అని డాక్టర్ సింథియా చెప్పారు.

డయాబెటిక్ రోగులు 3- 5 రోజుల్లోపు వారి రక్తంలో చక్కెర స్థాయిలలో సానుకూల మార్పులను చూస్తారని కూడా డాక్టర్ చెప్పారు.

"శరీర బరువులో మార్పులను చూడటానికి కనీసం ఒక నెల పాటు యాడెడ్ షుగర్‌కు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. కానీ, డైటీషియన్ సలహాతో దానిని అనుసరించడం ఉత్తమం" అని సింథియా చెప్పారు.

షుగర్, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
బీబీసీ

"మీ రోజువారీ కేలరీలలో 10 శాతానికి పైగా యాడెడ్ షుగర్ ఉండకూడదు. దీనిని 5 శాతంకి తగ్గిస్తే అదనపు ప్రయోజనాలు పొందవచ్చు" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది.

వయసుల వారీగా యూకే జాతీయ ఆరోగ్య సేవ ప్రకారం:

  • పెద్దలు రోజుకు 30 గ్రాములకు మించి యాడెడ్ షుగర్ తినకూడదు.
  • 7 నుంచి 10 సంవత్సరాల వయస్సు గల పిల్లలు రోజుకు 24 గ్రాములకు మించి యాడెడ్ షుగర్ తినకూడదు.
  • 4 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు రోజుకు 19 గ్రాములకు మించి యాడెడ్ షుగర్ తీసుకోకూడదు.
  • 2 నుంచి 3 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు రోజుకు 14 గ్రాములకు మించి యాడెడ్ షుగర్ తినకూడదు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు యాడెడ్ షుగర్‌ను పూర్తిగా నివారించడం మంచిదని డా. సింథియా సూచిస్తున్నారు.

"వారు ఆపిల్, జామ, పాలు, క్యారెట్లను పరిమిత పరిమాణంలో తినవచ్చు. తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉన్న ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు" అని డాక్టర్ చెప్పారు.

"ఇంటర్నెట్ ట్రెండ్ కోసం 10 రోజులు, 20 రోజులు కాకుండా, జీవితాంతం చక్కెరను తగ్గించడం లేదా నివారించడం ఉత్తమ మార్గం" అని పోషకాహార నిపుణురాలు తరిణి కృష్ణన్ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)