పది కేజీల బరువున్న బాలుడి పేగుల్లో రెండు కేజీల మలం.. పిల్లల్లో మలబద్ధకం ప్రాణాలకే ప్రమాదమా?

ఎలీసా
    • రచయిత, కేటీ థాంప్సన్, జో బ్లాక్
    • హోదా, బీబీసీ న్యూస్

మలబద్ధకానికి చికిత్స అందకపోయి ఉంటే తన రెండేళ్ల కొడుకు చనిపోయి ఉండేవాడే మోనని భయపడిన ఓ తల్లి పిల్లలకు నిరంతర వైద్యసేవలను ప్రాధాన్యాంశంగా తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవాన్ నిరంతరం వాంతులతో బాధపడ్డాడని, బరువు తగ్గిపోయాడని, మలబద్ధకం తీవ్రత కారణంగా చాలా నొప్పిని అనుభవించాడని ఆయన తల్లి ఎలీసా నొవాక్ చెప్పారు.

ఇవాన్ బరువు పది కేజీలు ఉంటే అందులో రెండు కేజీలు మలమే అని అంచనా వేసినట్టు ఓ డాక్టరు చెప్పారు.

మలబద్ధకం, ఇతర లక్షణాలతో యూకేలోని ఆసుపత్రులలో చేరిన 16 ఏళ్ల లోపు పిల్లల సంఖ్య 2023-24లో పదేళ్ల గరిష్ఠానికి చేరుకుంది.

2023-24లో 44,000 మందికి పైగా ఈ సమస్యతో ఆస్పత్రులలో చేరాని ఎన్‌హెచ్ఎస్ గణాంకాలు చెబుతున్నాయి.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా మల,మూత్ర సంబంధిత సమస్యలకు వైద్య సేవలు అందుబాటులో లేని కారణంగా పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఓ నిపుణుడు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇవాన్

ఫొటో సోర్స్, Elissa Novak

‘పాతికసార్లు ఆస్పత్రిలో చేర్చాం’

యూకేలో మల, మూత్ర విసర్జన సంబంధిత ఆరోగ్య సమస్యలపై పనిచేసే బ్లాడర్ అండ్ బౌల్ అనే చారిటీ సంస్థ వివరాల ప్రకారం యూకేలో 15లక్షలమంది పిల్లలు మలబద్ధకంతో బాధపడుతున్నారు.

గత కొద్ది వారాల్లో చాలామంది పిల్లలు స్కూళ్ల నుంచి ఇళ్లకు తిరిగిరాగానే తమ సహాయ కేంద్రాలకు ఫోన్లు రావడం పెరిగిందని చారిటీ సంస్థలు బీబీసీకి చెప్పాయి.

''అదో పెద్ద సమస్య. చాలామంది ఆరోగ్యసంరక్షణ నిపుణులు పిల్లల్లో దాన్ని తీవ్రమైన సమస్యగా భావించరు'' అని చారిటీ సంస్థలో పిల్లల ప్రత్యేక నర్సుగా పనిచేస్తున్న డెవినా రిచర్డ్‌సన్ చెప్పారు.

ప్రస్తుతం ఐదేళ్ల వయసున్న ఇవాన్ మలబద్ధకం వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్యల కారణంగా తన బాల్యాన్ని పూర్తిగా కోల్పోయారని ఎలీసా తెలిపారు.

అత్యవసర చికిత్స కోసం ఆ బాలుడిని 2022లో కేవలం ఆరు నెలల వ్యవధిలో 25 సార్లు ఆసుపత్రిలో చేర్చారు. "ఇది భయంకరమైనది" అని ఎలీసా చెప్పారు.

"బాబు చాలా బలహీనంగా ఉన్నాడు, అతను తనంతట తాను పైకి లేవలేడు. సొంతంగా ఏమీ చేయలేడు. అతను ఎప్పుడూ నొప్పితో బాధపడుతూ ఉన్నచోటనే అలా ఉండిపోయేవాడు'' అని ఎలీసా చెప్పారు.

నునియాటన్ కు చెందిన 35 ఏళ్ల ఎలీసా తన బిడ్డ సమస్యపై సహాయం, సమాధానాల కోసం పిల్లల వైద్యుల చుట్టూ తిరిగినట్లు చెప్పారు.

ఆ సమయంలో వార్విక్‌షైర్‌లో మల,మూత్రాశయ సమస్యలకు అవసరమైన ప్రాథమిక, సాధారణ సేవలు లేకపోవడం వల్ల వారు ప్రతిసారీ అత్యవసర చికిత్సకు వెళ్లాల్సి వచ్చేదన్నారు.

పరిస్థితి తీవ్రమైన తరువాత మాత్రమే ఇవాన్ అనుభవిస్తున్న నొప్పికి కారణం మలబద్ధకం అని ఎలీసాకు చెప్పారు.

చికిత్సలో మరింత జాప్యం జరిగి ఉంటే చనిపోయి ఉండేవాడేమోనని ఆమె అన్నారు.

పెద్దపేగు నిండా మలం నిండిపోవడంతో అది ఉబ్బిపోయి ఊపిరితిత్తుల వరకు వ్యాపించిందని.. ఊపిరితిత్తులకు హాని కలిగించిందని వైద్యులు చెప్పారని ఎలీసా అన్నారు.

"అతని కడుపు ఉబ్బిపోయింది. అతని అవయవాలన్నీ పట్టు తప్పాయి'' అని ఎలీసా తెలిపారు.

"మేం ఒకేసారి 12 గంటల పాటు అత్యవసర వార్డులో ఉండాల్సి వచ్చింది'' అన్నారామె.

ఎలీసా నొవాక్

ఫొటో సోర్స్, Elissa Novak

ఫొటో క్యాప్షన్, మలవిసర్జన కాకపోవడంతో ఇవాన్ కడుపు ఉబ్బిపోయింది

ముదిరేవరకూ గుర్తించలేదు

ఇవాన్‌కు జన్యపరమైన సమస్యలు ఉన్నాయి. దీనివల్ల అతని బుద్ధి తగినంతగా వికసించలేదు. మలబద్దక సమస్య వెంటనే నిర్థరణ కాకపోవడానికి ఇదీ ఒక కారణమని ఎలీసా భావిస్తున్నారు.

బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలు అలాగే ఉంటారనే కోణంలోనే దీనిని చూశారు. ఇలాంటి పిల్లలు అలా అరుస్తూనే ఉంటారని ఓ కన్సల్టెంట్ మాకు చెప్పారు అని ఎలీసా తెలిపారు.

''బాబు సమస్య ముదిరిపోయేవరకు దానిని సరిగా పరిశీలించలేదు. తీవ్రంగానూ తీసుకోలేదు. అతనికి అంత నొప్పి ఎందుకు వస్తోందో గుర్తించలేకపోయారు. నిజానికి ఇవన్నీ కలిపే తీవ్ర పరిణామాలకు దారితీశాయి''

ఇవాన్‌కు ఇప్పుడు కేర్ ప్యాకేజీ (ఇంటివద్దనే తీసుకునే ప్రత్యేక సేవల సహాయం) ఉంది. తేలికగా మలవిసర్జన జరిగేందుకు మందులు, ఎనీమా వంటి సదుపాయాలు పొందుతున్నారు.

''ఇది అతని జీవితంలో ఓ పెద్ద విషయం. ఇప్పుడు కూడా బాధపడుతున్నాడు. కానీ కొంచెం మెరుగయ్యాడు''అని తల్లి చెప్పారు.

దేశవ్యాప్తంగా మల,మూత్ర ఆరోగ్య సేవల కోసం ఎలీసా ప్రచారం చేస్తున్నారు.

''కొంతమందికి సరైన సేవలు అందడంలేదు'' అంటారు ఆమె.

ఈ జాగ్రత్తలు పాటిస్తే

పిల్లల్లో మల విసర్జన సాఫీగా జరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

  • మీ పిల్లల ఆహారంలో ఎక్కువగా పళ్లు, కాయగూరలు ఉండేలా చూడండి.
  • పిల్లలు తగినంతంగా నీరున్న పానీయాలు తాగుతున్నారని నిర్థరించుకోండి. డీహైడ్రేషన్ మలబద్ధకాన్ని ఎక్కువచేస్తుంది. ఒక్కోసారి పరిస్థితి చేయిదాటేలానూ చేస్తుంది.
  • సరైన పద్దతిలో కూర్చోవడం కూడా మలవిసర్జనకు సాయపడుతుంది. తొడలు, వీపు, పాదాలు తగిన భంగిమలో ఉండేలా కూర్చుంటే మలవిసర్జన సాఫీగా జరుగుతుంది.

‘సమస్యను గుర్తించడంలోనే సమస్య’

పిల్లల పేగు, మూత్రాశయ సమస్యలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థ ఎరిక్ కు చెందిన పిల్లల ప్రత్యేక నర్సు బ్రెండా చియర్ మాట్లాడుతూ, పిల్లల్లో మలబద్ధకం అనేక కారణాల వల్ల పెరుగుతోందని, వీటిలో మలవిసర్జనపై శిక్షణ ఆలస్యం కావడం నేటి తరం పిల్లలు శిశు సంరక్షణలో ఎక్కువ సమయం గడపడం కారణాలని చెప్పారు.

ప్రత్యేక బాలల సంరక్షణ సేవలు లేని ప్రాంతాల్లో పిల్లలు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. ఆ సేవల్లో చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు.

ఐడా
ఫొటో క్యాప్షన్, ఐడాకు తగిన సాయం పొందలేకపోవడం ఓ తల్లిగా తనను తీవ్రంగా కలిచివేసిందని హోలీ చెప్పారు.

తన కుమార్తె ఐడా మలవిసర్జన సమస్యతో మూడేళ్లు బాధపడిందని హొల్లీ బ్రెర్నాన్ బీబీసీకి చెప్పారు. ఎటువంటి సాయం అందక తాను తీవ్ర ఇబ్బంది పడ్డానని చెప్పారు.

ఐడాకు రెండేళ్ల వయసులో వైరస్ సోకిందని హోలీ తెలిపారు. అప్పటి నుంచి పరిస్థితి తీవ్రమైందని చెప్పారు. తాను ఆరుసార్లు తన జనరల్ ప్రాక్టీసనర్ వద్దకు వెళ్లగా మందులు సూచించారని 31 ఏళ్ల బ్రెర్నాన్ తెలిపారు. కానీ వాటిని ఎలా వాడాలో ఎటువంటి సూచనలు చేయలేదని, కానీ తన కుమార్తె ఆ సమస్యనుంచి బయటపడుతుందని చెప్పారని పేర్కొన్నారు.

సమస్య ఏమిటంటే నియంత్రణలేని మలవిసర్జన కారణంగా ఐడా రోజుకు 15సార్లు ఇబ్బంది పడేది.

''ఇది మూడేళ్ల నరకం. ఇది ఆమె ఎదుగుదలపై ప్రభావం చూపింది''

''మేం దీనివల్ల పాపను తీసుకుని బయటకు వెళ్లలేని పరిస్థితి. ఎందుకంటే బయటకు వెళితే మీకు టాయిలెట్ ఎక్కడుందో తెలియదు.. పాపకు నియంత్రణలేకుండా విరేచనాలు అయ్యే పరిస్థితి''

''ఇది పూర్తిగా ఒత్తిడికి గురయ్యే విషయం. దీన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయం మా ఆలుమగల మధ్య వాదనలకు దారితీసేది'' అన్నారామె.

ఐడా

‘‘జీవితం టాయ్‌లెట్ చుట్టూ తిరిగింది’’

''మూడేళ్లపాటు మా జీవితం టాయిలెట్ చుట్టూ తిరిగింది''

ఐడాకు తదుపరి చికిత్స గానీ, లేదా పిల్లలకు సహాయం అందించే సేవల గురించి కానీ ఎవరూ చెప్పలేదు. చివరకు ఎటు వెళ్లాలో తెలియని స్థితికి చేరామని ఆమె చెప్పారు.

చారిటీ సంస్థ ఎరిక్ గురించి తెలిసినప్పటి నుంచి పరిస్థితులు కొంత మెరుగవడం ప్రారంభమయ్యాయి.

''ఎట్టకేలకు నా కూతురుకు ఎలా సాయపడగలనో సమాధానం దొరికింది'' అని హోలీ చెప్పారు.

ఐడా ఇప్పుడు మలవిసర్జన మందులు ఆపేశారు.అలాగే నియంత్రణ కూడా సాధించారు.

పిల్లలకు మలబద్దకం లాంటి సమస్యల విషయంలో తగిన సంరక్షణ, మద్దతు అందించడానికి కట్టుబడి ఉన్నామని ఆరోగ్య, సామాజిక సంరక్షణ విభాగానికి చెందిన ప్రతినిధి ఒకరు చెప్పారు.

సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ అందించడానికి తగిన పదేళ్ల ప్రణాళిక రూపొందించినట్టు ఆ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ''నాణ్యమైన, వ్యక్తిగత సేవలు పొందేలా ఇంటింటికి తిరిగి ఆరోగ్య సేవలు అందించే కార్యక్రమాన్ని పటిష్ఠం చేస్తాం'' అని పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)