గొంతులో టాబ్లెట్ ఇరుక్కుని 4 ఏళ్ల చిన్నారి మృతి: మాత్రలు వేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఆరోగ్యం, చిన్నారులు, వైద్యం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సిరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జ్వరానికి వేసుకున్న మాత్ర గొంతులో ఇరుక్కుని, ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన దిగ్భ్రాంతికర ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా, తిరుత్తణిలో జరిగింది.

తిరుత్తణి సమీపంలోని ఆర్ పల్లికుప్పం గ్రామానికి చెందిన దంపతుల నాలుగేళ్ల కుమారుడికి జ్వరం రావడంతో, ఆగస్ట్ 18 ఉదయం చిన్నారిని తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడి డాక్టర్ చిన్నారికి కొన్ని మందులు రాసిచ్చారు. ఆ రోజు రాత్రి తమ బిడ్డకు ఆ మాత్రలు వేసినట్లు చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నారు.

మాత్ర మింగినప్పుడు, అది గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడ్డాడు. వెంటనే చిన్నారిని తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆస్పత్రిలో బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. దీనిపై పోలీసు కేసు నమోదైంది.

అసలు.. ఇలా ఎందుకు జరగుతుంది? చిన్నారులకు మాత్రలు వేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటి? పెద్దవాళ్లలోనూ ఇలా జరిగే అవకాశం ఉందా?

ఆరోగ్యం, చిన్నారులు, వైద్యం

ఫొటో సోర్స్, Getty Images

పిల్లలకు టాబ్లెట్స్ వేయొచ్చా?

"ఐదేళ్ల కంటే తక్కువ వయసు పిల్లలకు గొంతులో ఆహారం లేదా ఇతర చిన్నచిన్న వస్తువులు అడ్డుపడితే ఊపిరాడకపోవచ్చు. వారి గొంతులో ఏదైనా ఇరుక్కుపోయి శ్వాస తీసుకునే మార్గం మూసుకుపోతే, వారి ఊపిరితిత్తులు, మెదడుకు ఆక్సిజన్ నిలిచిపోయే అవకాశం ఉంంది. మెదడుకు 4 నిమిషాల కంటే ఎక్కువసేపు ఆక్సిజన్ అందకపోతే, మెదడు దెబ్బతినడంతో పాటు మరణానికి దారితీయొచ్చు" అని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ పేర్కొంది.

అయితే, "టాబ్లెట్స్ మింగడం అంత సులభం కాదు. ఇది కేవలం చిన్నపిల్లలకు మాత్రమే కాదు, కొంతమంది పెద్దవారికి కూడా కష్టమే. మాత్రలు మింగడం వల్ల మూడింట ఒకవంతు మందికి వాంతులు, వికారం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి ఎదురవుతాయి'' అని హార్వర్డ్ మెడికల్ స్కూల్ తెలిపింది.

ఈ విషయంపై ఈరోడ్‌కు చెందిన చిన్నపిల్లల వైద్యనిపుణులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ, "సాధారణంగా, 6 ఏళ్లలోపు పిల్లలకు మాత్రలు ఇవ్వకుండా ఉండడమే మంచిది. వాటిని పొడిచేసి నీటితో కలిపి ఇవ్వొచ్చు. నీటిలో కరిగేవాటినే పిల్లలకు ఎక్కువగా సూచిస్తారు" అని అన్నారు.

ఆరోగ్యం, చిన్నారులు, వైద్యం
ఫొటో క్యాప్షన్, చిన్నపిల్లలకు టాబ్లెట్స్ సూచించడం సాధారణ విషయమేనని డాక్టర్ అరుణ్ కుమార్ అన్నారు.

సాధారణంగా, నోటిలో కొన్ని నీళ్లు తీసుకుని.. వాటితో పాటు టాబ్లెట్ మింగడం ఉత్తమమేనని ఆయన అంటున్నారు. కానీ, " చిన్నపిల్లలతో అలా చేయించడం కంటే, పౌడర్ రూపంలో నీటితో కలిపి ఇవ్వడం మంచిది'' అని ఆయన అన్నారు.

కొన్ని మందులు టాబ్లెట్ రూపంలోనే దొరుకుతాయి, సిరప్ రూపంలో కూడా అందుబాటులో ఉండవు. కాబట్టి పిల్లలకు టాబ్లెట్స్ సూచించడం మామూలు విషయమేనని ఆయన అన్నారు.

''పిల్లలకు వాటిని ఎలా వేయాలో డాక్టర్లు సూచిస్తారు. కానీ, పిల్లలకు టాబ్లెట్స్ వేసేప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సింది తల్లిదండ్రులే" అని అరుణ్ కుమార్ అన్నారు.

పిల్లల్లో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయే ప్రమాదాన్ని నివారించేందుకు మాత్రలను చూర్ణం చేసి నీటితో కలిపి ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్యం సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా సిఫార్సు చేస్తోంది.

ఆరోగ్యం, చిన్నారులు, వైద్యం, వృద్ధులు

ఫొటో సోర్స్, Getty Images

పెద్దలు కూడా జాగ్రత్తగా ఉండాలా?

"వయసు పైబడిన వారికి కూడా మాత్రలు మింగడం చాలా కష్టం, ముఖ్యంగా 65 ఏళ్ల పైబడిన వృద్ధులు. వయసు పైబడిన తర్వాత ఎక్కువ మొత్తంలో మాత్రలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి, అవి అడ్డుపడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది" అని ఒక ఆర్టికల్‌లో హార్వర్డ్ మెడికల్ స్కూల్ పేర్కొంది.

వికారంగా ఉండడం, వాంతులు అవ్వడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల వంటి వాటి కారణంగా వారు కొన్నిసార్లు మందులు వేసుకోవడానికి ఇష్టపడరని, అది వారి ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజార్చవచ్చని అందులో పేర్కొన్నారు.

టాబ్లెట్ ఆకారం, పరిమాణం, రుచి వంటివి కూడా మాత్రలు మింగడాన్ని కష్టతరం చేస్తాయని, అమెరికాలో దాదాపు 2 కోట్ల మంది మధుమేహానికి వేసుకునే మెట్‌ఫార్మిన్ వంటి టాబ్లెట్ల పరిమాణం ఓ పెద్ద సమస్య అని ఆ ఆర్టికల్‌లో ఉదహరించింది.

"వృద్ధులకు మాత్రలు ఇచ్చేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటిని నీటిలో కరిగించి ఇవ్వడం మంచిది. అప్పుడు మాత్రలను మింగవలసిన అవసరం ఉండదు. అవి క్యాప్సూల్ రూపంలో ఉన్నా కూడా, దానిని విరగ్గొట్టి నీటిలో కరిగించవచ్చు'' అని డాక్టర్ అరుణ్ కుమార్ చెప్పారు.

ఆరోగ్యం, చిన్నారులు, వైద్యం, వృద్ధులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హైమ్‌లక్ మనూవర్ ప్రాథమిక చికిత్స విధానాన్ని 1974లో ప్రవేశపెట్టారు.

గొంతులో ఏదైనా ఇరుక్కుపోతే ఏం చేయాలి?

"పిల్లలు, లేదా పెద్దవాళ్లలో ఏదైనా వస్తువు గొంతులో ఇరుక్కుపోయి శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారితే వెంటనే 'హైమ్‌లక్ మనూవర్' అనే పద్ధతిలో ప్రాథమిక చికిత్స చేయాలి" అని డాక్టర్ అరుణ్ కుమార్ అన్నారు.

"అంటే, బాధితుడి వెనుక నిల్చుని.. మీ రెండు చేతులను వారి నడుము చుట్టూ వేసి గట్టిగా పట్టుకోవాలి. పొత్తికడుపు నుంచి పైవైపుకి 5 లేదా 6 సార్లు వేగంగా నొక్కాలి. అలా ప్రయత్నించినప్పటికీ గొంతులో ఇరుక్కుపోయిన వస్తువు బయటికి రాకపోతే వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్లడం ఉత్తమం" అని డాక్టర్ చెప్పారు.

అయితే, ఏడాదిలోపు చిన్నారులకు, ఊపిరాడక స్పృహకోల్పోయిన వారికి, గర్భిణులకు ఈ విధానాన్ని సిఫార్సు చేయరు.

ఒకవేళ, పిల్లల వయస్సు ఏడాది కంటే తక్కువ ఉంటే.. వారిని ఒడిలోకి తీసుకుని, వారి వీపుపై తట్టాలని ఆయన చెబుతున్నారు.

"చాలా స్కూల్స్‌లో ఈ ప్రాథమిక చికిత్సను బోధిస్తున్నారు. అందరికీ దీనిని నేర్పించాలి. ఇది చాలా సులభమైన పద్ధతి" అని అరుణ్ కుమార్ అన్నారు.

ఆరోగ్యం, చిన్నారులు, వైద్యం

'టాబ్లెట్స్ బలవంతంగా వేయకూడదు'

"మీరు టాబ్లెట్లను పొడి చేసినా, చేయకపోయినా.. మాత్రలు వేసుకోవాలంటూ పిల్లలను ఎప్పుడూ బలవంతం చేయకూడదు. అది వారిని భయాందోళనకు గురిచేయొచ్చు. అప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు పెరుగుతాయి" అని చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పీడియాట్రిక్స్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రేవతి అంటున్నారు.

పిల్లలకు నెమ్మదిగా చెబుతూ అలవాటు చేయాలని ఆమె సలహా ఇస్తున్నారు.

అలాగే, "కొంతమంది టాబ్లెట్లను నీళ్లలో కరిగించి, పిల్లల ముక్కుమూసి నోట్లో పోస్తుంటారు, అది చాలా తప్పు, చాలా ప్రమాదకరం కూడా" అని ఆమె అన్నారు.

చిన్నపిల్లల శ్వాసనాళాలు ఇరుకుగా ఉండడం వల్ల మాత్రలు గొంతులో ఇరుక్కుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆమె తెలిపారు.

"ఆరేళ్లలోపు చిన్నారులకు, మాత్రను కచ్చితంగా నీళ్లలో కరిగించాలి. 6 నుంచి 10 ఏళ్లలోపు పిల్లలకు ముక్కలుగా విరగ్టొట్టి లేదా నమలగలిగిన మాత్రలు సూచించడం ఉత్తమం. 10 ఏళ్లు దాటిన పిల్లలను టాబ్లెట్స్ వేసుకోమని చెప్పవచ్చు, అయితే జాగ్రత్తగా ఉండాలి" అని డాక్టర్ రేవతి చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)