మహిళా అథ్లెట్ల వక్షోజాలు, రుతుక్రమం వారి ఆటతీరుపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?

ఇంగ్లండ్ స్ట్రైకర్ క్లోయ్ కెల్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూఈఎఫ్ఏ మహిళల యూరో 2022 ఫైనల్ సందర్భంగా జర్మనీపై ఇంగ్లండ్ స్ట్రైకర్ క్లో కెల్లీ గోల్‌ చేసి, జట్టుకు విజయాన్ని అందించారు.
    • రచయిత, జేమ్స్ గల్లఘర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈ వేసవిలో, మహిళల యూరో కప్ ఫుట్‌బాల్ పోటీ ముగిసింది. అయితే, మైదానంలో క్రీడాకారిణుల భావోద్వేగ దృశ్యాలు, ఉత్సాహానికి మరోవైపు ఒక శాస్త్రీయ అధ్యయనం కూడా జరుగుతోంది.

క్రీడలు మహిళల శరీరాలను ఎలా ప్రభావితం చేస్తాయనేది తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.

మహిళలు పరిగెత్తే విధానాన్ని వక్షోజాలు ఎలా మారుస్తాయి?

సరైన స్పోర్ట్స్ బ్రా వారికి ఎలా సహాయపడుతుంది?

మహిళల ఆటతీరును పీరియడ్స్ ఎలా ప్రభావితం చేస్తాయి?

పీరియడ్స్ ట్రాకర్ల పాత్ర ఎంతవరకు?

కొన్ని గాయాలు మహిళలకే ఎక్కువ ఎందుకు అవుతుంటాయి? తదితర విషయాలను తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

గతంలో ప్రజలు మహిళా అథ్లెట్లను తరచుగా 'మినీ మెన్'గా పరిగణించేవారు. కానీ, అప్పటికీ ఇప్పటికీ చాలానే మారింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బ్రెస్ట్ బయోమెకానిక్స్

2022 యూరోపియన్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో పాపులర్ సన్నివేశాన్ని గుర్తుచేసుకోండి.

వెంబ్లీలో జరుగుతున్న మ్యాచ్‌లో అదనపు సమయమది, ఇంగ్లండ్ ప్లేయర్ క్లో కెల్లీ జర్మనీపై గోల్ కొట్టి జట్టును గెలిపించారు. ఈ వేడుకలో కెల్లీ ఒంటిపై ఉన్న ఇంగ్లండ్ జెర్సీని తీసివేసి, లోపలి స్పోర్ట్స్ బ్రాతో పరిగెత్తారు.

ఆ బ్రాను పోర్ట్స్‌మౌత్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జోవన్నా వేక్‌ఫీల్డ్-స్కర్ ఫిట్టింగ్ చేశారు. ఆమె తనను తాను "బ్రా ప్రొఫెసర్" అని పిలుచుకుంటారు.

ప్రొఫెసర్ వేక్‌ఫీల్డ్-స్కర్ వక్షోజాల గురించి ఈ విషయాలు పంచుకున్నారు:

  • ఒక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో వక్షోజాలు దాదాపు 11,000 సార్లు బౌన్స్ అవుతాయి.
  • ఎలాంటి సపోర్టు లేకుండా ప్రతి బౌన్స్‌కు 8 సెం.మీ.(3 అంగుళాలు) వరకు కదలొచ్చు.
  • అవి 5జీ శక్తితో (గ్రావిటీకి.. గురుత్వాకర్షణ శక్తికి ఐదు రెట్లు) కదులుతాయి, ఇది ఫార్ములా 1 కారు డ్రైవర్ అనుభవం మాదిరి ఉంటుంది.
ఆరోగ్యం, మహిళలు, క్రీడాకారిణులు

ఫొటో సోర్స్, University of Portsmouth

ఫొటో క్యాప్షన్, శారీరక వ్యాయామం సమయంలో రొమ్ము కణజాల కదలికను పర్యవేక్షించడానికి పోర్ట్స్‌మౌత్ విశ్వవిద్యాలయం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.

ఛాతీపై కదలికలను పరిశీలించే మోషన్ సెన్సార్లను ఉపయోగించి చేసిన ల్యాబ్ పరీక్షల్లో, కదిలే వక్షోజాల కణజాలం శరీరంలోని ఇతర భాగాల పనితీరును ఎలా మారుస్తుందో, ఇది క్రీడల్లో పెర్ఫార్మెన్స్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో చూపించింది.

"కొంతమంది స్త్రీలకు బరువైన వక్షోజాలు ఉండవచ్చు. వారు కదిలితే, అది వారి శరీరం కదిలే విధానాన్ని, మైదానంలో వారి శక్తిసామర్థ్యాలను కూడా మార్చగలదు" అని వేక్‌ఫీల్డ్-స్కర్ నాతో చెప్పారు.

మహిళలు తమ పైభాగాన్ని నిశ్చలంగా ఉంచుతూ వక్షోజాల బౌన్స్‌ను నియంత్రించడానికి ప్రయత్నించినప్పుడు, అది వారి తుంటి స్థానాన్ని మారుస్తుంది, ప్రతి అడుగును చిన్నదిగా చేస్తుంది. అందుకే స్పోర్ట్స్ బ్రాలు సౌకర్యం, ఫ్యాషన్ కోసం మాత్రమే కాకుండా, పెర్ఫార్మెన్స్ మెరుగుపరచడానికి కూడా ఒక సాధనం.

"వక్షోజాల మద్దతు ఎక్కువగా లేకపోవడంతో, ఒక అడుగు దూరం నాలుగు సెంటీమీటర్ల వరకు తగ్గిందని మేం కనుగొన్నాం" అని వేక్‌ఫీల్డ్-స్కర్ వివరించారు.

"మీరు మారథాన్‌లో వేసే ప్రతి అడుగుకు నాలుగు సెంటీమీటర్లు కోల్పోతే, అది మొత్తం ఒక మైలు అవుతుంది" అని ఆమె అన్నారు.

స్పోర్ట్స్ బ్రాలు వక్షోజాల లోపల ఉన్న మృదు కణజాలాలను కూడా రక్షిస్తాయని ఆమె చెప్పారు.

యూరోపియన్ చాంపియన్‌షిప్ ఫైనల్‌

ఫొటో సోర్స్, Getty Images

పీరియడ్స్, వాటి ప్రభావం

రుతుక్రమం(పీరియడ్స్) శరీరంపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది భావోద్వేగాలు, మానసిక స్థితి, నిద్రను ప్రభావితం చేస్తుంది. అలాగే అలసట, తలనొప్పి, తిమ్మిరిని కలిగిస్తుంది.

కానీ, క్రీడలపై పీరియడ్స్ ప్రభావం గురించి మాట్లాడటం ఇప్పటికీ నిషిద్ధమని, మనం ఇంకా దానితో పోరాడుతున్నందున అలా ఉండకూడదని ఒలింపిక్స్‌లో గ్రేట్ బ్రిటన్‌కు ప్రాతినిధ్యం వహించిన డిస్టేన్స్ రన్నర్ క్యాలి హాగర్ థాకెరీ చెప్పారు.

పీరియడ్స్ సమయంలో "నేను అలసిపోయినట్లు అనిపిస్తుంది, నా కాళ్లు బరువుగా ఉంటాయి. కొన్నిసార్లు బురదలో పరిగెడుతున్నట్లు అనిపిస్తుంది. ప్రతిదానికీ సాధారణం కంటే ఎక్కువ ప్రయత్నం అవసరం అనిపిస్తుంది" అని క్యాలి హాగర్ థాకెరీ చెప్పారు.

ముఖ్యంగా పెద్ద రేసుల సమయంలో పీరియడ్స్ ఆందోళనపరుస్తాయని, అందుకే పీరియడ్స్ ట్రాకర్‌పై ఆధారపడుతానని క్యాలి చెప్పారు.

అలాంటి ఒక పెద్ద రేసు, బోస్టన్ మారథాన్.

ఆమె పీరియడ్స్ సమయంలో ఏప్రిల్‌లో మారథాన్ జరిగింది. రేసులో కాలీ ఆరవ స్థానంలో నిలిచారు. తనకు పీరియడ్స్ లేకపోతే మెరుగ్గా రాణించి ఉండేదాన్నని ఆమె ఇప్పటికీ అనుకుంటున్నారు.

క్యాలి హాగర్ థాకెరీ

ఫొటో సోర్స్, Calli Hauger-Thackery

ఫొటో క్యాప్షన్, రన్నర్ క్యాలి హాగర్ థాకెరీ

'గెలిచారు, ఓడారు'

ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే రెండు హార్మోన్లలో హెచ్చుతగ్గులపై రుతుక్రమం ఆధారపడి ఉంటుంది. అయితే, ఇది అథ్లెటిక్ ఆటతీరుపై ఎంత భారీగా ప్రభావం చూపుతుంది?

"ఇది అందరికీ భిన్నంగా ఉంటుంది, చాలా క్లిష్టమైనది కూడా. రుతుక్రమం ప్రతిసారీ పెర్ఫార్మెన్స్‌ను ప్రభావితం చేస్తుందని చెప్పడం కష్టం" అని మాంచెస్టర్ మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయంలో ఫీమేల్ ఎండోక్రైనాలజీ, ఎక్సర్‌సైజ్ ఫిజియాలజీ ప్రొఫెసర్ కిర్స్టీ ఎలియాట్-సేల్ చెప్పారు.

"రుతుక్రమం సమయంలో చాలా పోటీలు జరిగాయి, చాలామంది వ్యక్తిగత స్థాయిలో ఉత్తమ విజయాలు, ప్రపంచ రికార్డులు నెలకొల్పారు, గెలిచారు, ఓడారు" అని ఆమె గుర్తుచేశారు.

ఇందులో 2022 షికాగో మారథాన్‌లో రుతుస్రావ నొప్పులతో పరిగెత్తి, ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన పౌలా రాడ్‌క్లిఫ్ కూడా ఉన్నారు.

క్రిస్టీ ఎలియట్-సేల్
ఫొటో క్యాప్షన్, మాంచెస్టర్ మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కిర్స్టీ ఎలియాట్-సేల్

రుతుక్రమం అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్‌ను ప్రభావితం చేస్తుందో, లేదో అర్థం చేసుకోవడానికి, ముందుగా హార్మోన్ల వల్ల కలిగే శారీరక మార్పులు, రుతు లక్షణాలను ఎదుర్కోవడంలో ఎదురయ్యే సవాళ్లు, పీరియడ్స్ సమయంలో పోటీ వల్ల మానసికంగా పడే ప్రభావం, వీటన్నింటినీ అర్థం చేసుకోవడం ముఖ్యం.

"ఒక వ్యక్తి బలంగా లేదా బలహీనంగా ఉండే దశంటూ లేదు. గెలిచే లేదా ఓడిపోయే దశ కూడా ఉండదు" అని ప్రొఫెసర్ ఎలియాట్-సేల్ చెప్పారు.

"కానీ సిద్ధాంతపరంగా, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఎముకలు, కండరాలు లేదా గుండె వంటి శరీర భాగాలను ప్రభావితం చేయగలవు" అని ఆమె స్పష్టం చేశారు.

"ఇంకా అర్థం కానిది ఏమిటంటే: ఇది మన పెర్ఫార్మెన్స్‌పై నిజంగా ప్రభావం చూపుతుందా?'' అని ప్రశ్నించారు.

"నిద్రలేమి, అలసట, తిమ్మిరి మన పెర్ఫార్మెన్స్‌ను ప్రభావితం చేస్తాయనేది ఆమోదయోగ్యమైన ముగింపు.

పీరియడ్స్ సమయంలో భారీ జనసమూహం ముందు పోటీపడే అథ్లెట్లకు భయం, ఆందోళన ఉంటాయి" అని ప్రొఫెసర్ ఎలియాట్ చెప్పారు.

లీకేజీ ప్రమాదాన్ని, దాని ఫలితంగా వచ్చే ఇబ్బందిని నివారించడానికి మూడు పొరలుగా పీరియడ్స్ ప్యాంట్స్ ధరించిన అథ్లెట్లతో మాట్లాడిన తర్వాత, "ఇది చాలా పెద్ద భారం" అని ఎలియాట్ అభిప్రాయపడ్డారు.

కేటీ డాలీ-మెక్‌లీన్
ఫొటో క్యాప్షన్, కేటీ డాలీ-మెక్‌లీన్, ఇంగ్లండ్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన రగ్బీ క్రీడాకారిణి.

'బహిరంగ చర్చలు అవసరం'

సేల్ షార్క్స్ విమెన్ రగ్బీ టీమ్, మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తోంది. గ్రేట్ బ్రిటన్ మాజీ రగ్బీ కెప్టెన్, ఇంగ్లండ్ ఆల్-టైమ్ లీడింగ్ స్కోరర్ కేటీ డాలీ-మెక్‌లీన్‌ను నేను కలిశాను.

పీరియడ్స్ వల్ల కలిగే ప్రభావాన్ని, దాని కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థం చేసుకోవడానికి వీరి జట్టు బహిరంగ సంప్రదింపులు జరుపుతుంటుంది.

"దీనిపై నేను ఏమీ చేయలేను" అని అనుకోవడం కంటే, మూడు రోజుల ముందుగానే ఇబుప్రోఫెన్ మాత్రలు తీసుకోవడం ఇందులో ఒకటని డాలీ-మెక్‌లీన్ చెప్పారు.

"ఈ అవగాహన, సమాచారంతో మనం దాని గురించి మాట్లాడగలం. ప్రణాళికలు రూపొందించగలం, ఒకరి ప్రవర్తనను మార్చగలం, వారిని మంచి రగ్బీ ప్లేయర్‌గా మార్చగలం" అని డాలీ చెప్పారు.

థామస్ డోస్'శాంటోస్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ థామస్ డోస్'శాంటోస్, మాంచెస్టర్ మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం

గాయాలను ఎలా నివారించాలి?

ప్రస్తుతం మహిళలు కొన్ని రకాల గాయాల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు గమనించారు.

ముఖ్యంగా, యాంటిరియర్ క్రూసియేట్ లిగమెంట్ (ఏసీఎల్) గాయాలు – కాలు పై, దిగువ భాగాలను కలిపి ఉంచే మోకాలిలోని ఒక భాగం దెబ్బతినడం. ఈ గాయాలు తీవ్రమైనవి, నయం కావడానికి ఏడాది సమయం పట్టవచ్చు.

క్రీడను బట్టి పురుషుల కంటే మహిళలకు ఏసీఎల్ గాయాలయ్యే ప్రమాదం 3 నుంచి 8 రెట్లు ఎక్కువగా ఉంటుందనీ, ఇది పెరుగుతోందని మాంచెస్టర్ మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ థామస్ డోస్'శాంటోస్ చెప్పారు.

దీనికి ఒకే కారణం లేదని, ఇరువురిలో శరీర నిర్మాణ వ్యత్యాసం ఇందులో ఒకటని శాంటోస్ అభిప్రాయపడ్డారు.

ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లు ఏసీఎల్ గాయం ప్రమాదాన్ని పెంచుతాయా లేదా అని పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.

కాగా, పురుషుల మాదిరి మహిళలకు సమానమైన శిక్షణ లేకపోవడం ఒక పెద్ద కారకమని శాంటోస్ అభిప్రాయపడ్డారు. మహిళలను క్రీడలకు దూరంగా ఉంచడం కంటే, ఒత్తిడిని తట్టుకునేంత బలంగా వారిని మార్చాలని ఆయన సూచించారు.

'మినీ-మెన్' కాదు

2007లో తాను రగ్బీ ఆడటం ప్రారంభించినప్పటి నుంచి చూస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయని కేటీ డేలీ-మెక్‌లీన్ చెప్పారు.

ఆ సమయంలో శిక్షణ.. పురుష ఆటగాళ్ల డేటా ఆధారంగా ఉండేదని, మహిళలను "మినీ-మెన్"గా పరిగణించేవారని ఆమె తెలిపారు.

ఇప్పుడు, బాలికలు, మహిళలను ఎక్కువగా ఆడనిస్తున్నారని, ఇది పెర్ఫార్మెన్స్ పెంచుతుందని కేటీ అభిప్రాయపడ్డారు.

చాలామంది యువతులు శరీర ఆకృతి, పీరియడ్స్ లేదా సరైన స్పోర్ట్స్ బ్రా లేకపోవడం వంటి సులభంగా పరిష్కరించగలిగే సమస్యల వల్ల ఆటలు మానేస్తున్నారని ఆమె చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)