ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన ఐదు ముస్లిం దేశాలు, అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
గాజాలో జరుగుతున్న యుద్ధంలో ఒక ముఖ్యమైన, వివాదాస్పద నిర్ణయమైన గాజా నగరాన్ని "ఆక్రమించే" ప్రణాళికను ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం(ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్) ఆమోదించింది.
గాజా ప్రాంతం(స్ట్రిప్) ఉత్తర భాగంలో ఉన్న ఈ నగరం యుద్ధానికి ముందు అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం, లక్షలాది మంది పాలస్తీనియన్లు ఇక్కడ నివసించారు.
ఇజ్రాయెల్ చర్య 'పెద్దయెత్తున బలవంతపు తరలింపులు', 'మరిన్ని హత్యలకు' దారితీయవచ్చని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.
మరోవైపు, హమాస్ మాత్రం 'తీవ్రమైన ప్రతిఘటన' ఉంటుందని ప్రతిజ్ఞ చేసింది.
ఇజ్రాయెల్ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ముస్లిం దేశాల నుంచి స్పందనలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ చర్య మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసే నిర్ణయంగా అభివర్ణించాయి.
సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఖతార్, కువైట్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) సహా అనేక దేశాలు దీనిని అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన, రెండు దేశాల పరిష్కారానికి అడ్డంకి, పాలస్తీనా ప్రజల హక్కులపై ప్రత్యక్ష దాడిగా ఆరోపించాయి.


ఫొటో సోర్స్, Dan Kitwood / Getty Images
సౌదీ అరేబియా
ఇజ్రాయెల్ నిర్ణయాన్ని సౌదీ అరేబియా ఖండించింది. ఇది గాజాలో కరవు పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుందని, పాలస్తీనా పౌరులపై జాతి నిర్మూలన విధానంలో ఇదొక భాగమని ఆరోపించింది.
"ఇజ్రాయెల్ దాడులు, ఉల్లంఘనలను అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెంటనే ఆపకపోతే, అది అంతర్జాతీయ ఆదేశాలు, చట్టబద్ధత పునాదులను దెబ్బతీస్తుంది.
ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి ముప్పును కలిగిస్తుంది. మారణహోమం, బలవంతపు తరలింపులను ప్రోత్సహించే పరిస్థితులను సృష్టిస్తుంది" అని సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఖతార్
ఇజ్రాయెల్ గాజా ప్రణాళికను ఖతార్ కూడా ఖండించింది.
ఈ నిర్ణయం మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని, కాల్పుల విరమణ ప్రయత్నాలను దెబ్బతీస్తుందని ఖతార్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.
"ఇజ్రాయెల్ అంతర్జాతీయ మానవతా చట్టాలను, తీర్మానాలను ఉల్లంఘిస్తూనే ఉంది, వాటిలో ఆహారాన్ని యుద్ధ ఆయుధంగా ఉపయోగించడం, పౌర జనాభాను ఉద్దేశపూర్వకంగా ఆకలితో అలమటించేలా చేయడం వంటివి ఉన్నాయి" అని ఒక ప్రకటనలో పేర్కొంది.

ఫొటో సోర్స్, dia images via Getty Images
పాకిస్తాన్
ఇజ్రాయెల్ నిర్ణయం మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని, శాంతి అవకాశాలను నాశనం చేస్తుందని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ అభిప్రాయపడ్డారు.
"ఈ విషాదానికి నిజమైన కారణాన్ని మనం మర్చిపోకూడదు, అదే పాలస్తీనా భూమిని చాలా కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడం. ఈ ఆక్రమణ కొనసాగినంత కాలం, శాంతి ఒక కలగానే ఉంటుంది" అని ఆయన అన్నారు.
"ఇజ్రాయెల్ దురాక్రమణను ఆపడానికి, అమాయక పౌరుల భద్రతకు, గాజా ప్రజలకు అవసరమైన మానవతా సహాయం సరఫరా కోసం అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని షరీఫ్ అన్నారు.
కువైట్
ఇజ్రాయెల్ ప్రణాళికను అంతర్జాతీయ, మానవతా చట్టాల ఉల్లంఘనగా కువైట్ అభివర్ణించింది. ఇది రెండు దేశాల పరిష్కార అవకాశాన్ని దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది.
"ఈ అమానవీయ చర్యలను ఆపడానికి, గాజాకు తగినంత, తక్షణ సహాయం చేరుకోవడానికి సరిహద్దు మార్గాలను తెరిచేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, అంతర్జాతీయ సమాజం చొరవ చూపాలి. ఇజ్రాయెల్ ఆకలి, జాతి నిర్మూలన విధానాన్ని ఆపడానికి తమవంతు బాధ్యతను నిర్వర్తించాలి" అని కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
తుర్కియే
ఇజ్రాయెల్ నిర్ణయం పాలస్తీనియన్ల హక్కులకు విరుద్ధమని తుర్కియే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
"పాలస్తీనియన్లను వారి సొంత భూమి నుంచి బలవంతంగా వెళ్లగొట్టడమే ఇజ్రాయెల్ లక్ష్యం" అని ఆరోపించింది.
మరోవైపు, గాజాలో యుద్ధాన్ని వెంటనే ఆపాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ విజ్ఞప్తి చేశారు. పరిస్థితి మరింత దిగజారితే, తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు.
"పెద్దయెత్తున బలవంతంగా తరలింపులు, హత్యలు, అనవసరమైన విధ్వంసం జరగవచ్చు" అని వోల్కర్ అన్నారు.

ఫొటో సోర్స్, https://new.oic-oci.org/
ఓఐసీ
గాజాను తిరిగి ఆక్రమించి, పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లను అక్కడి నుంచి పంపించేసే ప్రణాళికలు ప్రస్తుత మానవతా పరిస్థితిని మరింత దిగజార్చగలవని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) అభిప్రాయపడింది.
"శాశ్వత, సమగ్ర కాల్పుల విరమణను అమలు చేయడానికి ఐరాస భద్రతా మండలి తక్షణ, నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి. గాజాకు మానవతా సహాయం, అవసరమైన సామగ్రిని సరఫరా చేయాలి. పాలస్తీనా ప్రజలకు అంతర్జాతీయ రక్షణ అందించాలి. ఇజ్రాయెల్ ఆక్రమణను అంతం చేయడానికి అంతర్జాతీయ సమాజం అవసరమైన చర్యలు తీసుకోవాలి" అని ఓఐసీ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా, గాజా ప్రణాళికపై పలు దేశాల నుంచి వస్తున్న విమర్శలను ఇజ్రాయెల్ తిరస్కరించింది. ఆంక్షలు విధిస్తామంటూ బెదిరించే దేశాలు "మా మనోధైర్యాన్ని బలహీనపరచలేవు" అని ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ అన్నారు.
"మా శత్రువులు మేమెంత బలవంతులమో తెలుసుకుంటారు, వారికి గట్టి దెబ్బ తగులుతుంది" అని ఆయన అన్నారు.
ఇజ్రాయెల్ ప్రణాళికను ముస్లిం దేశాలతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలూ ఖండించాయి. ఇజ్రాయెల్‌కు జర్మనీ సైనిక ఎగుమతులను నిలిపివేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్ ప్రణాళిక ఏమిటి?
ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) "గాజా నగరాన్ని నియంత్రించడానికి సిద్ధం అవుతాయి" అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
యుద్ధాన్ని ముగించడానికి ఐదు 'సూత్రాలను' ప్రకటించింది.
మొత్తం గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ నియంత్రించాలని కోరుకుంటున్నట్లు క్యాబినెట్ సమావేశానికి ముందు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. కానీ, కొత్త ప్రణాళిక ప్రకటనలో గాజా నగరాన్ని మాత్రమే ప్రస్తావించారు.
గాజా నగరాన్ని నియంత్రించడం అనేది గాజా ప్రాంతం (స్ట్రిప్)ను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకునేందుకు 'మొదటి అడుగు'గా బీబీసీ మిడిల్ ఈస్ట్ కరస్పాండెంట్ హ్యూగో బచెగా అభిప్రాయపడ్డారు.
హమాస్ ఈ ప్రణాళికను 'కొత్త యుద్ధ నేరం'గా అభివర్ణించింది.
"ఈ నేరపూరిత చర్యకు భారీ నష్టం వాటిల్లుతుంది, ఇది అంత సులువు కాదు" అని హెచ్చరించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














