క్షామం అంటే ఏంటి, ఆకలి ఎన్ని రోజుల తర్వాత ప్రాణాంతకంగా మారుతుంది?

ఆకలి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రెబెకా థార్న్, ఏంజెలా హెన్షల్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీసు ప్రతినిధులు

గాజా స్ట్రిప్‌లో ప్రతి ముగ్గురిలో కనీసం ఒకరు చాలా రోజులుగా ఆకలితో బాధపడుతున్నారని యునైటెడ్ నేషన్స్ ఫుడ్ ఎయిడ్ ప్రోగ్రామ్ (ఐరాస ఆహార సహాయ కార్యక్రమం) హెచ్చరించింది.

గాజాలో ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పగా, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దీన్ని ఖండించారు.

గాజాలో క్షామం ఉందనే వాదనలను గత కొన్నిరోజులుగా ఇజ్రాయెల్ ఖండిస్తోంది.

ఈ ప్రాంతంలో ఆహార సరఫరాలను అందించేందుకు తాత్కాలికంగా కాల్పుల విరమణను ప్రకటించింది ఇజ్రాయెల్.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆకలిని (స్టార్వేషన్‌ను) అరికట్టేందుకు పెద్ద మొత్తంలో ఆహారం అవసరం ఉందని యూఎన్ హ్యుమానిటేరియన్ చీఫ్ టామ్ ఫ్లెచర్ అన్నారు.

గాజా నగరంలో ప్రతి ఐదుగురిలో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, ప్రతిరోజూ ఈ కేసుల సంఖ్య పెరుగుతోందని యూఎన్ ఏజెన్సీ (యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ) తెలిపింది.

ఆహార కొరతతో బాగా నీరసించిన రోగులతో ఆస్పత్రులు నిండి పోతున్నాయని యూఎన్ తెలిపింది. చాలామంది గాజా ప్రజలు ఓపిక లేక రోడ్లపైనే పడిపోతున్నారు.

గాజాలో క్షామం ఉందని యూఎన్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

కానీ, ఈ ప్రాంతం తీవ్రమైన క్షామంలో చిక్కుకునే ప్రమాదంలో ఉందని ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (ఐపీసీ) హెచ్చరించింది.

గాజాలో పరిస్థితి

ఫొటో సోర్స్, Majdi Fathi/NurPhoto/Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర గాజా నుంచి రిలీఫ్ ట్రక్కుల నుంచి పిండి బస్తాలను తీసుకెళ్తున్న పాలస్తీనియన్లు

క్షామం అంటే ఏమిటి? ఎప్పుడు ప్రకటిస్తారు?

ఒక ప్రాంతంలోని జనాభాకు తక్కువ ధరలో, తగినంత, పోషకాహారం పొందడం ఎంత కష్టమవుతుందో అంచనా వేసేందుకు ఉపయోగించే ప్రపంచ ప్రమాణమే ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (ఐపీసీ).

అత్యంత తీవ్రమైన స్థాయి ఫేజ్ 5. దీన్నే క్షామం అంటారు. ఒక ప్రాంతాన్ని ఫేజ్-5 గా ఎప్పుడు వర్గీకరిస్తారంటే..

  • 20 శాతం కుటుంబాలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నప్పుడు,
  • తీవ్రమైన పోషకాహార లోపంతో కనీసం 30 శాతం మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పుడు,
  • ఆకలి, పోషకాహార లోపం, వ్యాధులతో ప్రతి 10 వేల మందిలో కనీసం ఇద్దరు పెద్దవారు లేదా నలుగురు పిల్లలు ప్రతి రోజూ చనిపోతున్నప్పుడు

ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అక్కడ క్షామం నెలకొన్నట్లు ప్రకటిస్తారు.

ఐపీసీ మే 12న విడుదల చేసిన రిపోర్టులో గాజాలో మొత్తం జనాభా ఫేజ్ 3 సంక్షోభ కేటగిరీలో లేదా ఆపైన ఉన్నట్టు పేర్కొంది.

2025 మే నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 4.69 లక్షల మంది ప్రజలు తీవ్రమైన ఆహార సంక్షోభంతో (ఫేజ్ 5) బాధపడతారని అంచనా వేసింది.

పరిస్థితులు మరింత తీవ్రమైనప్పుడు, యూఎన్, కొన్నిసార్లు ఆ దేశంలోని సంబంధిత ప్రభుత్వాలు, ఇంటర్నేషనల్ రిలీఫ్ ఆర్గనైజేషన్లతో కలిసి ఆ ప్రాంతాన్ని అధికారికంగా క్షామం నెలకొన్న ప్రాంతంగా ప్రకటిస్తుంది.

గాజాలో ఆకలి కేకలు

ఫొటో సోర్స్, Getty Images

ఆకలితో అలమటించినప్పుడు శరీరానికి ఏమవుతుంది?

దీర్ఘకాలం పాటు సరిపడినంత ఆహారం పొందలేకపోవడమే స్టార్వేవేషన్.

అంటే శరీరం తన ముఖ్యమైన అవసరాలను తీర్చుకునేందుకు కూడా సరిపడినంత కేలరీల శక్తిని పొందలేదు.

సాధారణంగా శరీరం ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి గ్లూకోజ్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కానీ, ఆహారమే లేనప్పుడు కాలేయంలో, కండరాలలో ఉండే గ్లైకోజెన్‌ను శరీరం విచ్చిన్నం చేసి, రక్తంలోకి గ్లూకోజ్‌ను విడుదల చేస్తుంది.

గ్లైకోజెన్ కూడా అయిపోయినప్పుడు, శరీరం తనకు అవసరమైన ఎనర్జీ కోసం తొలుత కొవ్వును, ఆ తర్వాత కండరాలను విచ్ఛిన్నం చేస్తుంది.

స్టార్వేషన్‌తో ఊపిరితిత్తులు, కడుపు, పునరుత్పాదక అవయవాలు కుచించుకుపోతాయి. మెదడుపై ప్రభావం చూపుతుంది.

ఇది భ్రాంతులకు, డిప్రెషన్‌కు, యాంగ్జైటీకి కారణమవుతుంది.

కొంతమంది వ్యక్తులు నేరుగా ఆకలి బాధతోనే చనిపోతుంటారు. కానీ, తీవ్ర పోషకాహార లోపంతో బాధపడే కొందరు శ్వాసకోశ, జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్లతో ప్రాణాలు కోల్పోతుంటారు.

ఎందుకంటే, ఆకలి వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది.

ఆకలి అన్నది ఒక్కొక్కరిపై ఒక్కొక్క విధంగా ప్రభావం చూపుతుంది.

వేడి ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

పోషకాహార లోపం పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

పిల్లల్లో పోషకాహార లోపం దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుంది. ముఖ్యంగా మెదడు ఎదుగుదల ఆగిపోతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినదాని ప్రకారం.. పోషకాహార లోపం, తరచూ ఇన్‌ఫెక్షన్లు, తగినంత మానసిక సంరక్షణ లేకపోవడం వల్ల పిల్లల్లో ఎదుగుదల ఆగిపోతుంది. ఈ పిల్లలు వారి వయసుకంటే చిన్నగా కనిపిస్తుంటారు.

పోషకాహార లోపంతో బాధపడే చాలామంది మహిళలు, పోషకాహార లోపంతో ఉన్న పిల్లల్ని కనే అవకాశం ఉందని యూఎన్ ఫౌండేషన్ తెలిపింది.

గర్భిణీగా ఉన్నపుడు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తహీనత, ప్రీ-ఎక్లంప్సియా, రక్తస్రావం, మరణం సంభవించే ప్రమాదం ఉందని యూనిసెఫ్ తెలిపింది.

దీనివల్ల, పిల్లలు జీవం లేకుండా పుట్టడం, తక్కువ బరువుతో పుట్టడం, పిల్లల్లో ఎదుగుదల ఆగిపోవడం లేదంటే ఎదుగుదల ఆలస్యం కావడం వంటివి కూడా జరగొచ్చు.

పోషకాహార లోపంతో బాధపడే తల్లులు పిల్లలకు పాలిచ్చేందుకు పోషకాహారం ఉన్న పాలను ఉత్పత్తి చేసుకోలేరు.

దీని ప్రభావం జీవితకాలం ఉంటుందని పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులకు చికిత్స చేసే డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఎంఎస్ఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన డాక్టర్ నురుద్దీన్ అలీబాబా చెప్పారు.

''ఎదుగుదల ఆగిపోవడం అనే దాన్ని తిరిగి తెప్పించలేం. అంటే, పోషకాహార లోపం కాలం ముగిసినా పిల్లలు ఎత్తు తక్కువగానే ఉంటారు. ఇది వారికి తీవ్ర ప్రమాదకరం. తరచూ వారు నేర్చుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంటారు. స్కూల్‌కు వెళ్లేంత వరకు కూడా వారు ఏది ఏంటన్నది గుర్తు పట్టలేకపోతారు'' అని డాక్టర్ నురుద్దీన్ చెప్పారు.

‘‘పోషకాహార లోపం రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తూ, ఎక్కువగా ఇన్‌ఫెక్షన్లకు గురయ్యేలా చేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. బాలికల్లో పోషకాహార లోపం ఒక స్థాయిలో ఇన్‌ఫెర్టిలిటీకి (సంతానం కలగకపోవడానికి) దారితీస్తుందని చాలామందికి తెలియదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా, పిల్లలు తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంటుంది'' అని వివరించారు.

పోషకాహార లోపం వల్ల వచ్చే మరో వ్యాధి ఆస్టియోపోరోసిస్. ఇది ఎముకలను బలహీనపరిచే వ్యాధి.

చిన్న గాయం కూడా ఎముక విరిగిపోయేందుకు కారణమవుతుందని డాక్టర్ అలీబాబా చెప్పారు.

స్టార్వేషన్‌ను ఎలా అరికట్టాలి?

''ఈ సంక్షోభాన్ని అరికట్టేందుకు రెండు విషయాలు చాలా అవసరం. గాజాలోకి పెద్ద మొత్తంలో ఆహార పదార్ధాలను సరఫరా చేయాలి. అవసరమైన పోషకాలుండే ప్రత్యేక ఆహారాన్ని అందుబాటులోకి తేవాలి. ఆ ఆహారాన్ని తక్షణమే అక్కడి పిల్లలకు, వారి తల్లులకు అందించాలి'' అని యూకేలోని గ్లాస్గో యూనివర్సిటీకి చెందిన హ్యూమన్ న్యూట్రిషన్‌లో ఆనరరీ సీనియర్ రీసెర్చ్ ఫెలో ప్రొఫెసర్ షార్లెట్ రైట్ చెప్పారు.

‘‘నవజాత శిశువులకు తల్లిపాలు అనేది చాలా సురక్షితమైనది, శుభ్రమైనది. కానీ, తల్లులకు అవసరమైన ఆహారం అందినప్పుడే, పుట్టే పిల్లలకు పాలివ్వగలుగుతారు. మహిళలకు, పిల్లలకు అవసరమైన ఆహారాన్ని అందించడం అసలైన సవాలు'' అని తెలిపారు.

పోషకాహార లోపం తీవ్రమైన పర్యవసనాలను కలిగిస్తుందని, ముఖ్యంగా పిల్లల్లో ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని బీబీసీ అరబిక్ హెల్త్ కరెస్పాండెంట్ స్మితా ముండాసాద్ చెప్పారు. అంత తేలికగా దీనికి చికిత్స చేయలేమని అన్నారు.

‘‘పరిస్థితి విషమించిన కేసులలో ఆహారం తినలేనప్పుడు, ఆస్పత్రిలో లేదా క్లినిక్‌లో వారికి ప్రత్యేక పోషకాహారాన్ని అందించాల్సి ఉంటుంది. ఇన్‌ఫెక్షన్‌కు ప్రత్యేక చికిత్స చేయాలి. కొన్ని కేసుల్లో సరైన ఆహారం ఇవ్వకపోవడం ప్రమాదకరంగా మారుతుంది'' అని చెప్పారు.

ఆహారం ఇవ్వడం కాదు, సరైన ఆహారం ఇవ్వడం ముఖ్యమని స్మితా చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)