‘నా కొడుక్కి బొమ్మల శబ్దాల కన్నా, బాంబుల సౌండ్లు బాగా తెలుసు’

    • రచయిత, లారా ఎల్ గిబాలీ, హయా అల్ బదర్నే
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
గాజా మహిళలు

2023 అక్టోబరులో గాజాలో ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే, ఇద్దరు పాలస్తీనియన్లు బీబీసీ కోసం తమ రోజువారీ జీవితాన్ని చిత్రీకరించడం ప్రారంభించారు.

తన భద్రత కోసం అసీల్ తాను ఉండే భూభాగంలో దక్షిణానికి పారిపోగా, ఖాలిద్ మాత్రం అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు.

వాళ్లిద్దరూ గాజాలో పేలుళ్లు, ఒక చోటి నుంచి ఒకచోటికి తరలిపోవడాలు, మరణాలు, సంఘర్షణలో చిక్కుకున్న పిల్లలు అనుభవించిన గాయాలను రికార్డు చేశారు.

హాలౌమ్ (ఎడమ), హమూద్ (కుడి)
ఫొటో క్యాప్షన్, యుద్ధ వాతావరణంలోనే హాలౌమ్ (ఎడమ), హమూద్ (కుడి) ఆటలు

ఖాలిద్

ఉత్తర గాజాలో బాంబు కారణంగా దెబ్బ తిన్న ఒక ఇంట్లో ఆరేళ్ల హమూద్, నాలుగేళ్ల హాలౌమ్ ఆడుకుంటున్నారు. వాళ్లు ఒక బొమ్మకు కుట్లు వేస్తున్నట్లు నటిస్తున్నారు.

‘‘తను గాయపడింది. ఆమె మీద చాలా రాళ్లు పడ్డాయి’’ అని ఆ బొమ్మ గురించి హమూద్ అన్నాడు.

గత సంవత్సరంలో గాజాలో లెక్కలేనన్ని సార్లు అలాంటివి చూడడం వల్ల వాళ్ల ఆటల్లోనూ ఇలాంటి ఘటనలే కనిపిస్తాయి. అక్టోబర్ 2023లో ప్రారంభమైన ఘర్షణలో మరణించిన ప్రతి ముగ్గురిలో ఒకరు పసివాళ్లేనని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

హమాస్ జరిపిన అక్టోబర్ 7 దాడుల్లో సుమారు 1,200 మంది మరణించిన తర్వాత ఇజ్రాయెల్ ఈ దాడులను కొనసాగిస్తోంది.

ఆ పిల్లల తండ్రి ఖాలిద్ వాళ్లు ఆడుకోవడాన్ని దూరం నుంచి ఆందోళనగా గమనించారు.

‘‘ఇవి పిల్లలు ఆడుకోవాల్సిన ఆటలు కావు. వాళ్లు ఇలాంటి ఆటలు ఆడుతుంటే నా గుండె పగిలిపోతుంది.’’ అని ఖాలిద్ అన్నారు.

యుద్ధం ప్రారంభమైన తర్వాత డిసెంబరులో ఉత్తర గాజాలోని ఆసుపత్రులు పనిచేయడం మానేయడంతో, ఖాలిద్ ఇజ్రాయెల్ ఆదేశాలకు వ్యతిరేకంగా, తన ప్రజలకు వైద్య సేవలను అందించడానికి ఉత్తర గాజాలోని జబాలియాలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

ఫిజియోథెరపిస్ట్‌గా శిక్షణ పొందిన ఖాలిద్, ఒక వైద్య సామాగ్రి కంపెనీలో డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు.

“నేను డాక్టర్‌ను కాదు, ఫిజియోథెరపిస్ట్‌నని అందరికీ తెలుసు. కానీ క్లిష్ట పరిస్థితిలో, నేను కట్లు కడతానని మా వాళ్లకు చెప్పాను. ఆసుపత్రులు లేవు కాబట్టి నేను వెళ్లిపోతే చాలామంది ప్రాణాలు కోల్పోతారు.’’ అన్నారాయన.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కొన్ని ప్రాథమిక శస్త్రచికిత్స నైపుణ్యాలు, కొన్ని మందులతో (వాటిలో కొన్ని గడువు ముగిసినవి) ఆయన తన ఇంట్లోనే ఒక క్లినిక్‌ను ప్రారంభించారు. అక్కడ పిల్లలకు చికిత్స చేస్తుంటారు. ఆయన పిల్లలు వాళ్లు చూసిన వాటిని అనుకరించడం ప్రారంభించారు.

‘‘అతన్ని అంబులెన్స్‌ దగ్గరకు తీసుకెళ్లండి’’ అని హమూద్ అరిచాడు. ఆ పిల్లవాడు అది క్షిపణి గాయమా లేక భవనం కూలడం వల్ల కలిగిన గాయమా అని తన సోదరితో చర్చించడం ఖాలిద్ విన్నారు.

“హమూద్‌కి తన బొమ్మల శబ్దాల కంటే బాంబుల శబ్దాలు బాగా తెలుసు. ఇక హాలౌమ్ చిన్న వయస్సులోనే చాలా బాధలు భరించింది. ఈ యుద్ధం వాళ్లపై చూపే దీర్ఘకాలిక ప్రభావాల గురించి నేను భయపడుతున్నాను.’’ అని ఖాలిద్ అన్నారు.

ఒకచోటి నుంచి మరొక చోటికి తరలిపోవడం, గాయాలు, పాఠశాల విద్య లేకపోవడం లాంటి వాటి ప్రభావాలు గాజాలోని పిల్లలపై జీవితకాలం ప్రభావం చూపుతాయని అంతర్జాతీయ రెస్క్యూ కమిటీ తెలిపింది.

ఖాలిద్ పిల్లలు ఆకలిని కూడా అనుభవించారు. గాజాలో 96% మంది ప్రజలు "తీవ్రమైన ఆహార కొరతను" ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్య సమితి జూన్‌లో అంచనా వేసింది.

హమూద్ తమ ఇంటి పైకప్పుపైకి ఎక్కి సహాయక విమానం విసిరేసే ఆహార పొట్లాల కోసం జెండాను ఊపుతుండగా, ఒక ఇజ్రాయెలీ జెట్ వేసిన బాంబు సమీపంలోని భవనం మీద పెద్ద చప్పుడుతో పేలింది.

‘‘వాళ్లు బాంబులు వేసే బదులు, ఆహారపు పొట్లాలు వేస్తే బాగుండు’’ అని హమూద్ అన్నారు.

హయత్
ఫొటో క్యాప్షన్, హయత్ డిసెంబర్ 2023లో గాజాలో జన్మించింది. తను యుద్ధం తప్ప మరేమీ చూడలేదు

అసీల్

దక్షిణ గాజాలో, ఇటీవలే తన బిడ్డకు జన్మనిచ్చిన 24 ఏళ్ల అసీల్, తన పాప హయత్‌కు ఎలా ఆహారం ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారు.

"మార్కెట్‌లో ఆహారం లేదు కాబట్టి నేను సరిగ్గా తినడం లేదు. అందుకే నా బిడ్డకు పాలు ఇవ్వలేకపోతున్నాను.’’ అని అసీల్ అన్నారు.

గాజాలో 17,000 మంది గర్భిణీ స్త్రీలు ఆహార కొరతతో బాధ పడుతున్నారని ఐక్య రాజ్య సమితి జనాభా నిధి (యూఎన్‌ఎఫ్‌పీఏ) ఈ నెలలో హెచ్చరించింది.

అసీల్, ఆమె భర్త ఇబ్రహీం తమ 14 నెలల పసిబిడ్డ రోజ్‌లు ఇజ్రాయెల్ ఆదేశాల ప్రకారం తమ ఇంటిని వదిలి గాజా దక్షిణ భాగంవైపు వెళ్లవలసి వచ్చింది.

ఎనిమిది నెలల గర్భిణి అయిన అసీల్ అనేకమైళ్ల దూరం నడవాల్సి వచ్చింది. ‘‘మా దగ్గర తగినన్ని నీళ్లు లేవు. నేను రక్తహీనతతో బాధపడేదాన్ని. నేలమీద ఎటు చూసినా మృతదేహాలు. కేవలం నా కూతురు రోజ్ గురించి, నా లోపల పెరుగుతున్న శిశువు గురించి మాత్రం ఆలోచించేదాన్ని’’ అని అసీల్ అన్నారు.

వాళ్లు దక్షిణాన కొంచెం సురక్షితంగా ఉండే డెయిర్ అల్-బలాహ్ చేరుకున్న తర్వాత, ఒక కొత్త సమస్య వచ్చింది. ఆమె ప్రసవించడానికి ఆసుపత్రులు ఏవీలేవు. సమీపంలో ఉన్న నుసిరత్‌లోని అల్ అవదా ఆసుపత్రిలో మాత్రమే ప్రసవాలు చేస్తారు.

డిసెంబర్ 13న అసీల్ కూతురు హయత్ అక్కడ జన్మించింది.

"ఈ విధ్వంసం మధ్య పాప పుట్టడంతో మళ్లీ మాకు ప్రాణాలు వచ్చినట్లైంది. చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా జీవితం కొనసాగుతుందని ఆ పాప నాకు గుర్తుచేస్తుంది.’’ అని అసీల్ తెలిపారు.

ఫోటోగ్రాఫర్ అయిన ఇబ్రహీం తన భార్యను, తన కూతురు రోజ్‌ను, అప్పుడే పుట్టిన బిడ్డను వదిలి తన విధి నిర్వహణకు వెళ్లాల్సి వచ్చింది.

‘‘నేను వాళ్లకు జీవితంలోని కనీస అవసరాలు, తిండి, బట్ట లాంటి వాటి కోసమే ఇదంతా చేస్తున్నా’’ అని ఇబ్రహీం అన్నారు.

మేలో ఇబ్రహీం, అసీల్ తిరిగి దీర్ అల్-బలాహ్‌లో తిరిగి కలిశారు. తమ పిల్లలను బయటకు తీసుకెళ్లారు.

‘‘యుద్ధం జరగని రోజు ఒక్కటి కూడా హయత్‌ చూడలేదు’’ అని ఇబ్రహీం అన్నారు. ‘‘ఆమె ఈ విధ్వంస దృశ్యాల మధ్య, బాంబుల శబ్దాల మధ్య పుట్టింది.’’ అన్నారు అసీల్.

ఆరు నెలల హయత్, ముందు సీటులో తన తల్లి ఒడిలో కూర్చోగా, వాళ్ల కారు రాళ్ల పొరల కింద ఉన్న రోడ్ల మీదుగా, నేలమట్టమైన భవనాల మధ్య వెళుతోంది.

" ఏం జరిగినా, తను నవ్వుతూనే ఉంటుంది’’ అని ఇబ్రహీం తన కూతురు గురించి అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

The World Service’s BBC Eye investigations for Storyville film Life and Death in Gaza can be seen on BBC World Service YouTube. The film is part of a group of programmes on the BBC marking one year on from 7 October and the war between Israel and Hamas. Another BBC Storyville, Surviving October 7th: We Will Dance Again is also available to watch in the UK on the BBC iPlayer.