తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు ఎందుకు నిర్వహించింది? తైవాన్ ఏం చేసింది?

తైవాన్ యుద్ధ విమానం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, తైవాన్ యుద్ధ విమానం

తైవాన్ చుట్టూ సోమవారం(అక్టోబర్ 14) చైనా భారీ సైనిక విన్యాసాలు నిర్వహించింది. స్వాతంత్ర్యం కోరుతున్న వారికి ఇది ఒక ‘‘హెచ్చరిక’’గా ఉపయోగపడుతుందని చైనా పేర్కొంది. ‘జాయింట్ స్వోర్డ్ 2024బీ’ అనే పేరుతో ఈ విన్యాసాలను నిర్వహించారు.

ఈ విన్యాసాలలో యుద్ధనౌకలు, ఫైటర్ జెట్‌లు పాల్గొన్నాయి. వీటిలో 25 విమానాలు, ఏడు నేవీ నౌకలు, మరో నాలుగు నౌకలను గుర్తించినట్లు తైవాన్ తెలిపింది.

కొన్ని రోజుల కిందట తైవాన్ అధ్యక్షుడు విలియం లై, చైనా చేస్తున్న ‘‘విలీన’’ ప్రయత్నాలను ప్రతిఘటిస్తానని, తమ ప్రభుత్వం చైనా నియంత్రణను అంగీకరించదని అన్నారు. ఆయన అలా మాట్లాడిన తర్వాత చైనా ఈ విన్యాసాలు నిర్వహించింది.

ఈ ఏడాది ప్రారంభంలో అధికారం చేపట్టాక, విలియం లై తైవాన్ స్వయం పాలిత హోదాను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

చైనా గతంలోనూ తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలు చేసి, ఈ ద్వీపంపై తమ నియంత్రణను ప్రకటించింది. తైవాన్ తీరంలో చైనా తాజా విన్యాసాలు రెండు ప్రభుత్వాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి.

తైవాన్ ద్వీపం చుట్టూ తొమ్మిది ప్రదేశాలలో ఈ విన్యాసాలు జరిగాయి.

చైనా

ఫొటో సోర్స్, China Coast Guard

ఫొటో క్యాప్షన్, చైనా సైన్యం పెట్రోలింగ్ చేసిన ప్రాంతం చిత్రాన్ని చైనా కోస్ట్ గార్డ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది

చైనా, తైవాన్ మధ్య వివాదం ఏంటి?

తైవాన్ సార్వభౌమత్వాన్ని చైనా గుర్తించడం లేదు.

స్వయం ప్రతిపత్తి కలిగిన తైవాన్‌ తమదని చైనా పేర్కొనడం ఈ సమస్యకు మూలం.

తైవాన్‌ను చైనా తమ నుంచి విడిపోయిన ప్రావిన్స్‌గా చూస్తుంది. దీన్ని తమ దేశంలో కలుపుకోవడానికి అవసరమైతే బలప్రయోగం చేస్తామని అంటోంది.

చైనా సైన్యం తన విన్యాసాలను ‘‘వేర్పాటువాద శక్తులకు బలమైన ప్రతిఘటన’’గా, ‘‘జాతీయ సార్వభౌమత్వాన్ని, జాతీయ ఐక్యతను కాపాడే చట్టబద్ధమైన, అవసరమైన చర్య"గా అభివర్ణించింది.

విలియం లై గతంలో చేసిన ప్రసంగానికి ప్రతిస్పందనగా, చైనా మే 2024లోనూ జాయింట్ స్వోర్డ్ 2024ఏ పేరుతో సైనిక విన్యాసాలను నిర్వహించింది. తాజా విన్యాసాలను వాటికి కొనసాగింపుగా భావిస్తున్నారు.

చైనా మిలిటరీ ఈస్టర్న్ థియేటర్ కమాండ్ తాజా విన్యాసాల వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో బీజింగ్ సైనిక సామర్థ్యాలను ప్రదర్శించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ టైమ్స్, ఈ వీడియో చైనా సైన్యం ‘‘సంసిద్ధతను, పోరాట కార్యకలాపాలలో పాల్గొనే సామర్థ్యాన్ని’’ ప్రదర్శిస్తుందని పేర్కొంది.

చైనా ఆర్మీ విడుదల చేసిన చిత్రం

ఫొటో సోర్స్, China People's Liberation Army

ఫొటో క్యాప్షన్, ఎరుపు రంగులో చూపిస్తున్న ప్రాంతాల్లో తాజా సైనిక విన్యాసాలు జరిగాయి. పసుపు రంగులోని ప్రాంతాల్లో ఈ ఏడాది మే నెలలో చైనా విన్యాసాలు నిర్వహించింది. నీలి రంగులోని ప్రాంతాల్లో 2022లో చైనా సైనిక విన్యాసాలు చేపట్టింది.

చైనా వీడియోపై తైవాన్ ప్రతిస్పందిస్తూ, తమ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. చైనా "రెచ్చగొట్టే" సైనిక చర్యలను ఖండిస్తూ తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనను విడుదల చేసింది

చైనా మిలిటరీ ప్రకారం, ఈ విన్యాసాలు తైవాన్‌ మీద అన్ని వైపుల నుంచీ దాడి చేయడానికి రిహార్సల్ లాంటివి. అయితే నిజంగా ఘర్షణే జరిగితే దానికి ప్రతిస్పందించడానికి వీలుగా తమ దళాలను సంసిద్ధం చేస్తున్నట్లు తైవాన్ తెలిపింది.

చైనా వ్యాప్తి చేస్తున్న తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని తైవాన్ రక్షణ శాఖ తమ ప్రజలను హెచ్చరించింది.

విలియం లై

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తైవాన్ అధ్యక్షుడు విలియం లై చైనాకు వ్యతిరేకంగా తన గళాన్ని పెంచుతున్నారు

ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. లై చేసిన ప్రసంగం ‘‘రొటీన్’’ అన్న అమెరికా, దానిని తీవ్రంగా పరిగణించి, ఈ చైనా విన్యాసాలు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. శాంతి కోసం చైనా సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది.

చైనా రష్యాతో కలిసి మరికొన్ని చోట్లా నావికాదళ విన్యాసాలు నిర్వహించింది. రష్యా, చైనీస్ యుద్ధనౌకలు వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో యాంటీ-సబ్‌మెరైన్, వైమానిక రక్షణ కసరత్తులతో కూడిన విన్యాసాలు నిర్వహించాయి. జులైలో రష్యా, చైనీస్ జెట్‌ విమానాలు అమెరికా గగనతలానికి దగ్గరలో మొదటి ఉమ్మడి బాంబర్ గస్తీని నిర్వహించాయి.

1996లో తైవాన్ మొదటి అధ్యక్ష ఎన్నికల తర్వాత తైవాన్‌కు సమీపంలో చైనా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంతో చైనా సైనిక బెదిరింపులు ప్రారంభమయ్యాయి.

2008-2016 మధ్య సంబంధాలు మెరుగుపడినా, తైవాన్ స్వాతంత్ర్య అనుకూల డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన త్సాయ్ ఇంగ్-వెన్ ఎన్నికైన తర్వాత మళ్లీ క్షీణించాయి.

చైనా సైనిక విన్యాసాలు ప్రాంతీయ శాంతి, సుస్థిరతకు భంగం కలిగించే ప్రయత్నాలనీ, తైవాన్ తన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకుంటుందని అధ్యక్షుడు లై ఒక ప్రకటనలో తెలిపారు.

తాజా విన్యాసాలు విజయవంతంగా ముగిశాయని చైనా ప్రకటించింది. అయితే, అవసరమైతే మళ్లీ ఇలాంటి విన్యాసాలు నిర్వహిస్తామని చెప్పింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)