భూమి మీదికి తిరిగి వచ్చిన ఎలాన్ మస్క్ స్టార్‌షిప్ బూస్టర్, ప్రపంచంలో ఇదే మొదటిసారి..

Elon Musk's Starship booster

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, ఎస్మే స్టాలార్డ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రయోగించిన స్టార్‌షిప్ రాకెట్‌ బూస్టర్ సురక్షితంగా భూమి మీదికి (లాంచ్ ప్యాడ్‌కు) తిరిగి వచ్చింది. ప్రపంచంలో ఇలా లాంచ్ ప్యాడ్ మీదకు వచ్చిన మొదటి బూస్టర్‌గా ఇది గుర్తింపు పొందింది.

ఐదవ టెస్ట్ ఫ్లైట్‌లో భాగంగా, ఈ బూస్టర్ దిగువ సగభాగాన్ని, లాంచ్ టవర్ పక్కన మెకానికల్ ఆర్మ్స్ సురక్షితంగా పట్టుకున్నాయి.

దీనితో పూర్తిగా పునర్వినియోగించుకోగల రాకెట్‌ను అభివృద్ధి చేయాలనే స్పేస్‌ఎక్స్ సంస్థ ఆశయం నెరవేరే అవకాశాలు తొందరలో నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.

సూపర్ హెవీ బూస్టర్‌గా పిలిచే రాకెట్ కింది భాగం, తొలి ప్రయత్నంలోనే ఎలాంటి ఆటంకమూ లేకుండా ఇలా కిందికి దిగుతుందని ఎవరూ ఊహించలేదు.

ప్రయోగానికి ముందు స్పేస్‌ఎక్స్ బృందం, అవసరమైతే బూస్టర్‌ను గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ల్యాండ్ అయ్యేలా చూస్తామని చెప్పారు.

గత రెండు ప్రయోగాలలో స్పేస్‌ఎక్స్ కొన్ని అసాధారణ విజయాలు సాధించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Reuters

పద్దెనిమిది నెలల క్రితం స్పేస్‌ఎక్స్ సంస్థ చేపట్టిన మొదటి ప్రయోగంలో, కొద్దిసేపటికే ఆ వాహనం పేలిపోయింది. అయితే ఈ వైఫల్యాలూ అభివృద్ధి ప్రణాళికలో భాగమేనని స్పేస్‌ఎక్స్ చెప్పింది.

అది విఫలం అవుతుందని భావించి ప్రయోగించడం, తద్వారా వీలైనంత ఎక్కువ డేటాను సేకరించడం వల్ల, తమ ప్రత్యర్థుల కంటే వేగంగా రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేయవచ్చని ఈ సంస్థ అంటోంది.

తాజా పరీక్షలో ఆరోహణ ప్రారంభ దశలు మునుపటిలాగే ఉన్నాయి. రాకెట్ భూమి నుంచి పైకి ఎగిరాక 2 నిమిషాల 45 సెకన్ల తర్వాత షిప్, బూస్టర్ వేరయ్యాయి.

అనంతరం బూస్టర్ టెక్సస్‌లోని బోకా చికా వద్ద ఉన్న లాంచ్ ప్యాడ్ వైపు తిరిగి రావడం ప్రారంభించింది.

ల్యాండింగ్‌కు కేవలం రెండు నిమిషాల సమయం మాత్రమే ఉండగా, టవర్‌ను నిర్వహిస్తున్న బృందం తుది తనిఖీలు నిర్వహించడంతో, ఈ ప్రయోగం జరుగుతుందా అనే అనుమానాలు తలెత్తాయి.

సూపర్ హెవీ బూస్టర్ భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు, దాని రాప్టర్ ఇంజన్‌లు దాని వేగాన్ని తగ్గించేలా చేశాయి.

బూస్టర్ 146 మీట్లర ఎత్తున్న ల్యాండింగ్ టవర్‌ను సమీపించినప్పుడు, దాని చుట్టూ నారింజ రంగు మంటలు కనిపించాయి. అనంతరం భారీ మెకానికల్ ఆర్మ్స్‌ నేర్పుగా ఆ బూస్టర్‌ను పట్టుకున్నాయి.

బూస్టర్ నుంచి విడిపోయిన తర్వాత రాకెట్‌లోని షిప్ భాగం తన ఇంజన్లను మండించుకుని మందుకు వెళ్లింది. భవిష్యత్తులో ఆ షిప్ భాగంలోనే పరికరాలను, సిబ్బందిని తరలిస్తున్నారు.

దాదాపు నలభై నిమిషాల తర్వాత ఆ షిప్ భాగం హిందూ మహాసముద్రంలో విజయవంతంగా ల్యాండ్ అయింది.

షిప్ ఖచ్చితంగా ల్యాండ్ అవ్వడమే కాకుండా, రాకెట్‌కు సంబంధించిన హార్డ్‌వేర్‌ కూడా పాడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

స్టార్‌షిప్ లాంఛింగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఐదవ టెస్ట్ ఫ్లైట్ కోసం టెక్సస్‌లోని లాంచ్‌ ప్యాడ్ నుంచి బయలుదేరిన స్టార్‌షిప్

బూస్టర్‌ను లాంచ్ ప్యాడ్‌లో ‘ల్యాండ్’ చేయడం కంటే ‘పట్టుకోవడం’ వలన భూమిపై సంక్లిష్టమైన వ్యవస్థ అవసరం తగ్గుతుంది.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా ఈ ప్రయోగం విజయవంతమైనందుకు సంతోషంగా ఉంది. 2026 నాటికి వ్యోమగాములను చంద్రుని ఉపరితలంపైకి తీసుకువెళ్లే సామర్థ్యం ఉన్న ల్యాండర్‌గా, స్టార్‌షిప్‌ను అభివృద్ధి చేయడానికి స్పేస్‌ఎక్స్‌కు నాసా భారీగా నిధులను సమకూర్చింది.

ఎలాన్ మస్క్ బృందం వీలైనంత త్వరగా రాకెట్‌ను తిరిగి ప్రయోగించాలని ఆసక్తిగా ఉంది.

కానీ అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) , నవంబర్‌లోపు దీనిని అనుమతించబోమని గతంలో స్పష్టం చేసింది. లైసెన్స్ జారీ చేయడానికి ముందు, ఎఫ్ఏఏ పర్యావరణంపై ఫ్లైట్ ప్రభావాన్ని సమీక్షిస్తుంది.

గత నెల నుంచి ఎఫ్ఏఏ, ఎలాన్ మస్క్‌ల మధ్య లైసెన్స్ షరతులపై గొడవ జరుగుతోంది.

లైసెన్స్ నియమాలను అనుసరించడం లేదని, మునుపటి ప్రయోగాలకు అనుమతులు పొందలేదని ఎఫ్ఏఏ ఆరోపిస్తోంది.

దీనికి ప్రతిస్పందనగా, ఎఫ్ఏఏపై దావా వేస్తానని మస్క్ హెచ్చరించారు. రాకెట్‌లో కొంత భాగం పర్యావరణాన్ని కలుషితం చేస్తోందని అనడం "తప్పుడు రిపోర్టింగ్" అని స్పేస్‌ఎక్స్ దాన్ని తిప్పి కొట్టింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)