థామస్ చెరియన్: విమానం కూలిన 56 ఏళ్ల తర్వాత దొరికిన జవాను మృతదేహం

ఫొటో సోర్స్, Defence PRO, Thiruvananthapuram
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 56 సంవత్సరాల ఎనిమిది నెలల నిరీక్షణకు ముగింపు పలికిన ఫోన్ కాల్. కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని పోలీస్ స్టేషన్ నుంచి ఆ ఫోన్ కాల్ వచ్చింది. విమాన ప్రమాదంలో అదృశ్యమైన థామస్ చెరియన్ మృతదేహం లభించిందనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. ఆ ఫోన్ కాల్ అందుకున్నది చెరియన్ సోదరుడు థామస్.
చెరియన్ ఆర్మీలో క్రాఫ్ట్స్‌మెన్‌గా ఎంపికయ్యారు. 1968లో ఆయన ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ప్రతికూల వాతావరణం కారణంగా హిమాలయాల్లో కూలిపోయింది. ఆ సమయంలో అందులో 102 మంది ఉన్నారు.
రోహ్‌తంగ్ పాస్ (హిమాచల్ ప్రదేశ్‌ను కశ్మీర్‌తో కలిపే దారి)పై ఎగురుతున్న సమయంలో విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది.
చాలా ఏళ్లు ఈ ఐఏఎఫ్ ఏఎన్-12 విమానాన్ని జాడతెలియనిదిగా పరిగణించారు. దాని జాడ మిస్టరీగానే మిగిలింది. అయితే 2003లో ఓ పర్వతారోహకుల బృందం ఆ విమానంలోని ప్రయాణీకులలో ఒకరి మృతదేహాన్ని కనుగొంది.
తర్వాత, కొన్నేళ్ల పాటు ఆర్మీ బృందాలు శోధించడంతో మరో ఎనిమిది మృతదేహాలు దొరికాయి. ఇదే క్రమంలో 2019లో పర్వతాలలో విమాన శిథిలాలూ కనుగొన్నారు.


ఫొటో సోర్స్, Defence PRO, Thiruvananthapuram
ఎవరీ చెరియన్?
కొన్ని రోజుల క్రితం, చెరియన్ థామస్ సహా మరో నలుగురి మృతదేహాలను ఆర్మీ బృందం వెలికితీసింది. ఈ వార్త విన్నప్పుడు 56 ఏళ్ల బాధ ఒక్కసారిగా తొలగినట్టనిపించిందని చెరియన్ సోదరుడు థామస్ బీబీసీకి చెప్పారు.
"నేను చివరకు మళ్లీ ఊపిరి పీల్చుకోగలిగాను" అని ఆయన చెప్పారు.
ఐదుగురు సంతానంలో రెండోవాడైన చెరియన్ అదృశ్యమైనప్పుడు ఆయన వయసు 22 సంవత్సరాలు. హిమాలయ ప్రాంతంలోని లేహ్‌లో చెరియన్‌కు మొదటి ఫీల్డ్ పోస్టింగ్ పడటంతో అక్కడ రిపోర్టు చేయడానికి చెరియన్ విమానం ఎక్కారు. ఆ విమానమే కూలిపోయింది.
2003లో మొదటి మృతదేహం కనుగొన్న తర్వాత, చెరియన్ స్టేటస్ మిస్సింగ్ నుంచి మృతికి మారింది.
"1990లో మా నాన్న, 1998లో అమ్మ చనిపోయారు. ఇద్దరూ చెరియన్ గురించిన వార్తల కోసం ఎదురు చూసేవారు" అని థామస్ గుర్తుచేసుకున్నారు.
చెరియన్ మృతదేహం ఎలా దొరికింది?
ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి ఇప్పటివరకు 13 మృతదేహాలు లభ్యమయ్యాయి. కఠినమైన వాతావరణం, మంచుతో నిండిన ప్రాంతం కావడంతో అక్కడ వెతకడం సెర్చ్ టీమ్‌కు కష్టంగా మారుతోంది.
కొద్దిరోజులు కిందట నారాయణ్ సింగ్, మల్కాన్ సింగ్, మున్షీరామ్‌లతో పాటు చెరియన్ మృతదేహం కూడా ఢాకా హిమనీనదం సమీపంలో సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో లభించింది.
తాజా సెర్చ్ ఆపరేషన్‌ను డోగ్రా స్కౌట్స్ (భారత సైన్యంలోని డోగ్రా రెజిమెంట్ యూనిట్), తిరంగా మౌంటైన్ రెస్క్యూ సభ్యులు సంయుక్తంగా నిర్వహించారు.
మృతదేహాలను కనుగొనడానికి ఉపగ్రహ చిత్రాలు, రెక్కో రాడార్, డ్రోన్‌లను ఉపయోగించినట్టు డోగ్రా స్కౌట్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ లలిత్ పలారియా చెప్పారు.
ఈ రాడార్‌కు 20 మీటర్ల లోతు వరకు మంచు కింద కూరుకుపోయిన లోహపు వస్తువులను గుర్తించే సామర్థ్యం ఉంది. ఇదే విమాన శిథిలాలను కనుగొంది. సెర్చ్ టీం వాటిని తవ్వి, ఒక మృతదేహాన్ని వెలికితీశారు. హిమనీనదంలో పగుళ్లు నుంచి మరో మూడు మృతదేహాలను కనుగొన్నారు.
చెరియన్ యూనిఫాంపై ‘థామస్ సి’. అనే నేమ్ ట్యాగ్ ఉంది. ఈ ట్యాగ్‌తో పాటు జేబులో ఒక డాక్యుమెంట్ కూడా లభించడంతో అధికారులు మృతదేహాన్ని గుర్తించగలిగారు.
ఆయనను కోల్పోయిన బాధ ఎప్పటికీ పోదని, కనీసం మృతదేహం లభించడంతో కొంత ఊరట లభించిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
అక్టోబర్ 3న జాతీయ జెండా చుట్టి ఉన్న చెరియన్ శవపేటికను అధికారులు కుటుంబానికి అందజేశారు. మరుసటి రోజు స్వగ్రామమైన ఎలంతూరులోని చర్చిలో అంత్యక్రియలు నిర్వహించారు.

ఫొటో సోర్స్, Asif Al
ప్రతీ కుటుంబానిదీ అదే వ్యథ
సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని, చెరియన్ మృతదేహం కనిపించినపుడు చెబుతామని ఆర్మీ అధికారులు ఏళ్లుగా ఏదో ఒక సమాచారం ఇస్తున్నారని థామస్ అన్నారు.
"ఇన్ని రోజులు వారు మాకు సమాచారం అందించినందుకు నిజంగా కృతజ్ఞతలు" అని చెప్పారు. చెరియన్ అదృశ్యమైన తర్వాత కూడా ఆయన దగ్గరి బంధువులు సైన్యంలో చేరారని థామస్ అన్నారు.
ఇక ఇటీవల మృతదేహాలు లభించిన ఇతర సైనికుల కుటుంబాలు కూడా శోకం, ఉపశమనం రెండింటినీ అనుభవిస్తున్నాయి.
తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములతో సహా వారి దగ్గరి బంధువులు చాలామంది అదృశ్యమైపోయిన జవాన్ల జాడ కోసం ఎదురుచూస్తూ మరణించారు.
ఉత్తరాఖండ్‌లో జైవీర్‌సింగ్ కుటుంబానిదీ ఇలాంటి కథే. అక్టోబరు ప్రారంభంలో నారాయణ్ సింగ్ మృతదేహాన్ని జైవీర్‌సింగ్‌కు అప్పగించారు. నారాయణ్ సింగ్ అదృశ్యమై చాలా ఏళ్లు గడవడంతో ఆయన కుటుంబం ఆశలు కోల్పోయింది. కుటుంబసభ్యుల సమ్మతితో ఆయన భార్య బసంతీ దేవి నారాయణ్ సింగ్ కజిన్స్‌లో ఒకరిని పెళ్లి చేసుకున్నారు. వారికి పుట్టిన పిల్లల్లో జైవీర్ సింగ్ ఒకరు.
నారాయణ్ సింగ్ తిరిగి వస్తాడనే ఆశతో తన తల్లి కొన్నాళ్లపాటు అలాగే వేచిచూశారని జైవీర్ సింగ్ చెప్పారు. ఆమె 2011లో మరణించారు.
"జ్ఞాపకంగా ఉంచుకోవడానికి అంకుల్ ఫోటో కూడా నా దగ్గర లేదు" అని జైవీర్ సింగ్ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














