ఐసీ 814: ‘కాందహార్’ విమానం హైజాక్ కథాంశంగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్‌పై వివాదం ఏమిటి?

ఫొటో సోర్స్, Netflix PR
- రచయిత, నేయాజ్ ఫారూకీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
1999లో భారత ప్రయాణికుల విమానం హైజాక్ కథాంశంగా తీసిన వెబ్ సిరీస్‌లో కొన్ని పాత్రల చిత్రీకరణపై వివాదం తలెత్తింది.
‘ఐసీ 814’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్‌కు అనుభవ్ సిన్హా దర్శకుడు.
1999లో కఠ్మాండూ నుంచి దిల్లీకి వస్తున్న విమానం హైజాక్‌కు గురైంది. భారత్‌లో ఖైదీలుగా ఉన్న మిలిటెంట్ల విడుదలే లక్ష్యంగా ఈ హైజాక్ జరిగింది.
అప్పటికి తాలిబాన్‌ల నియంత్రణలో ఉన్న అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు హైజాకర్లు ఈ విమానం తీసుకెళ్లారు.
ఈ ఘటనల ఆధారంగానే తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ఐసీ 814’.
చిత్రంలో హైజాకర్ల పాత్రలకు వాడిన పేర్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
దీనిపై వివరణ కోరుతూ నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు కూడా జారీ చేసింది.
అప్పట్లో ఈ హైజాక్ వ్యవహారం భారత ప్రభుత్వం, హైజాకర్ల మధ్య ఒప్పందం కుదరడంతో ముగిసింది. విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా విడుదల చేయించడం కోసం మసూద్ అజార్ సహా ముగ్గురు మిలిటెంట్లను భారత్ జైలు నుంచి విడిచిపెట్టింది.
విడుదలైన తర్వాత జైషే మహ్మద్ గ్రూప్‌ను స్థాపించిన అజార్, దేశంలో పలు దాడులకు పాల్పడ్డారని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి కూడా అతడిని ఉగ్రవాదిగా పేర్కొంది.
అయితే, అజార్‌తో పాటు ఇతరుల విడుదల నిర్ణయం వివాదాస్పదమైంది.
ఆ సమయం (1999)లో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.


ఫొటో సోర్స్, Getty Images
వివాదం ఏమిటి?
హైజాక్ అయిన విమానానికి కెప్టెన్‌గా ఉన్న దేవి శరణ్, జర్నలిస్ట్ శ్రీంజయ్ చౌదరి రాసిన ‘ఫ్లైట్ ఇన్‌టు ఫియర్: ది కెప్టెన్స్ స్టోరీ’ అనే పుస్తకం ఆధారంగా ఈ ఆరు ఎపిసోడ్‌ల మినీ-సిరీస్ రూపొందించారు.
గత వారం ఈ సిరీస్ విడుదలైంది. కఠ్మాండూలోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో హైజాకర్లు విమానం ఎక్కడంతో ‘కథ’ మొదలవుతుంది.
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తమతో సహా 179 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్న ఆ విమానాన్ని హైజాక్ చేస్తున్నట్లు అందులోని అయిదుగురు హైజాకర్లు ప్రకటిస్తారు.
ఈ చిత్రం హైజాకర్లు, సిబ్బంది, ప్రయాణికుల మధ్య జరిగిన ఘటనలపై దృష్టి పెడుతుంది.
హైజాక్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి భారత ప్రభుత్వ అధికారులు ఎలా ప్రయత్నించారో చూపిస్తుంది.
కాగా, హైజాకర్లు పాకిస్తాన్‌కు చెందిన ఇబ్రహీం అథర్, షాహిద్ అక్తర్ సయ్యద్, సన్నీ అహ్మద్ ఖాజీ, మిస్త్రీ జహూర్ ఇబ్రహీం, షకీర్ అయితే వారిలో ఇద్దరికి భోలా, శంకర్ అనే హిందూ పేర్లను పెట్టారని కొందరు సోషల్ మీడియా యూజర్లు చిత్రనిర్మాతలను విమర్శించడంతో వివాదం మొదలైంది.

ఫొటో సోర్స్, Netflix PR
సిరీస్ వివాదంపై బీజేపీ నాయకుడు అమిత్ మాలవీయ ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘‘ఈ సిరీస్‌లో హైజాకర్లకు “ముస్లిమేతర” పేర్లను ఉపయోగించడం వల్ల IC-814 విమానాన్ని హిందువులే హైజాక్ చేశారని ప్రజలు భావించేలా చిత్రనిర్మాతలు చేశారు’’ అని ఆరోపించారు.
మరోవైపు, ఈ సిరీస్‌ను నిషేధించాలని కోరుతూ హిందూ రైట్‌వింగ్ గ్రూప్ దిల్లీ కోర్టులో కేసు వేసింది.
‘‘చిత్రనిర్మాతలు వాస్తవాలను వక్రీకరించారు, చారిత్రక సంఘటనలను తప్పుగా చూపించారు’’ అని పిటిషనర్లు ఆరోపించారని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.
ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వంతో నెట్‌ఫ్లిక్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సమావేశమయ్యారని పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. దీనిపై భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, నెట్‌ఫ్లిక్స్‌లను బీబీసీ సంప్రదించగా వారు స్పందించలేదు.

ఫొటో సోర్స్, Netflix PR
వాస్తవాలేంటి?
మరోవైపు ఈ సిరీస్‌ను పలువురు సమర్థించారు.
హైజాకింగ్ సమయంలో ఒకరితో ఒకరు సంభాషించుకోవడానికి హైజాకర్లు భోలా, శంకర్ వంటి మారుపేర్లు ఉపయోగించుకున్నారని భారత హోం మంత్రిత్వ శాఖ 2000లో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
“ఈ హైజాకర్లు ఒకరినొకరు (1) చీఫ్, (2) డాక్టర్, (3) బర్గర్, (4) భోలా, (5) శంకర్‌లుగా పిలుచుకోవడం విమానంలోని ప్రయాణికులు గమనించారు" అని ఆ ప్రకటన తెలిపింది.
సాక్షులు, ఈ సంఘటనను రిపోర్టు చేసిన పాత్రికేయులు కూడా గతంలో ఈ సమాచారాన్ని ధ్రువీకరించారు.
హైజాకింగ్ నుంచి బయటపడిన కొల్లాట్టు రవికుమార్, అమెరికా- ఆధారిత సంస్థలో మర్చంట్ నేవీ కెప్టెన్‌గా పనిచేస్తున్నారు.
2000లో రెడిఫ్ న్యూస్ పోర్టల్‌తో రవికుమార్ ఈ మారుపేర్లను ధ్రువీకరించారు.
“మమ్మల్ని గమనిస్తూ ఉన్న నలుగురు హైజాకర్లకు బర్గర్ అనే నాయకుడు ఉన్నారు. బర్గర్ తరచుగా అరుస్తూ ఉన్నారు. ఆయన వారిని భోలా, శంకర్, డాక్టర్ అని పిలుస్తుండటం విన్నాను ”అని రవికుమార్ చెప్పారు.
అంతర్జాతీయ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు భారత్‌లో ఇబ్బందులు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు.
2024 జనవరిలో విడుదలైన ఒక తమిళ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో నెట్‌ఫ్లిక్స్ దానిని తొలగించింది.
2021లో అమెజాన్ ప్రైమ్ షోలో విడుదలైన తాండవ్ వెబ్ సిరీస్‌లో హిందూ దేవుళ్లను అపహాస్యం చేశారని ఆరోపణలు రావడంతో ఆ చిత్ర బృందం క్షమాపణలు చెప్పింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














