విజయవాడ రైల్వే స్టేషన్: ఈ డివిజన్‌లో వర్షాలు పడితే దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలపై ఎందుకు ప్రభావం పడుతుంది?

విజయవాడ, వరదలు, రైల్వే స్టేషన్, రైళ్ల దారి మళ్లింపు, రైల్వే సరకు రవాణా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విజయవాడ రైల్వే స్టేషన్
    • రచయిత, మురారి రవి కృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలుగు రాష్ట్రాలలో కురిసిన భారీ వర్షాలు రైల్వే వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. అనేక రైళ్లను దారి మళ్లించింది.

దీంతో ప్రయాణికులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అనేక రైళ్లను చిన్నచిన్న స్టేషన్లలో నిలిపేయడంతో ఆహారం అందక, కాలకృత్యాలు తీర్చుకునే అవకాశం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వర్షాల కారణంగా అన్నిటికన్నా ఎక్కువగా దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్ తీవ్రంగా ప్రభావితమైంది.

తెలుగు రాష్ట్రాలలో శని, ఆదివారాలు కురిసిన వర్షాలు విజయవాడ, సికింద్రాబాద్ డివిజన్‌లను అతలాకుతలం చేశాయి.

విజయవాడ-సికింద్రాబాద్ వెళ్లే దారిలో ఇంటికన్నె-కేసముద్రం, మహబూబాబాద్-తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ తీవ్రంగా దెబ్బతింది.

ట్రాక్ పక్కనున్న చెరువుల నుంచి వచ్చిన వరదనీటి కారణంగా రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో అక్కడ యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

దీంతో అటు దిల్లీ, ముంబయి, హైదరాబాద్ వైపు మార్గం.. ఇటు చెన్నై, హౌరా వైపు మార్గాలలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సోమవారం సాయంత్రం నాటికి 481 రైళ్లను రద్దు చేసి, 152 రైళ్లను దారి మళ్లించగా, 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు సికింద్రాబాద్ జోనల్ సీపీఆర్ఓ ఎ.శ్రీధర్ తెలిపారు.

విజయవాడ డివిజన్‌లోని రాయనపాడు దగ్గర కూడా ట్రాక్‌పై నీళ్లు ప్రవహిస్తున్నాయని చెప్పారు.

బీబీసీతో మాట్లాడుతూ ఆయన.. ‘మహబూబాబాద్ వద్ద ఒకే రోజు 40 సెంటీమీటర్ల వర్షం కురవడంతో ట్రాక్ కొట్టుకుపోయింది. మంగళవారం సాయంత్రానికి కనీసం ఒక ట్రాక్ పునరుద్ధరించే అవకాశం ఉంది’ అన్నారు.

కేసముద్రం స్టేషన్‌లో నిలిచిపోయిన సంఘమిత్ర రైలు ప్రయాణికులకు స్వచ్ఛంద సంస్థల సహాయంతో ఆహారాన్ని అందజేసినట్లు తెలిపారు.

చెన్నై వెళ్లాల్సిన కొన్ని రైళ్లను డైవర్ట్ చేసి గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు శ్రీధర్ చెప్పారు.

ప్రస్తుత వర్షాల కారణంగా సింగరేణి బొగ్గు గనుల్లోకి నీరు చేరడం, రైల్వే లైన్లు దెబ్బతినడంతో పలు థర్మల్ స్టేషన్లకు బొగ్గు రవాణాలో ఆటంకం ఏర్పడింది.

విజయవాడలో రైల్వే హెల్ప్ లైన్ నంబర్ : 7569305697 ను ఏర్పాటు చేసినట్లు విజయవాడ డివిజనల్ రైల్వే అధికారులు ‘ఎక్స్‌’లో తెలిపారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇండియన్ రైల్వేస్, భారీ వర్షాలు, వరదలు, విజయవాడ

విజయవాడ ప్రాధాన్యం

దక్షిణ మధ్య రైల్వేలో ఆరు డివిజన్లు ఉండగా, వాటిలో విజయవాడ డివిజన్ గుండెకాయలాంటిది. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్ ప్రాధాన్యం మరింత పెరిగింది.

ఇక్కడి నుంచి సికింద్రాబాద్, ముంబయి, చెన్నై, దిల్లీ, హౌరా, ఖరగ్‌పూర్, త్రివేండ్రం, బెంగళూరు, గోవా, హుబ్బళ్లి, తిరుపతి, కోచి, భువనేశ్వర్, అహ్మదాబాద్, పట్నా, భోపాల్‌ వంటి వివిధ ప్రముఖ నగరాలకు రైళ్లున్నాయి.

చెన్నై నుంచి దిల్లీ (గ్రాండ్ ట్రంక్ రూట్), హౌరా, హైదరాబాద్ వెళ్లాలన్నా.. ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్లాలన్నా.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్, బెంగళూరు వెళ్లాలన్నా.. త్రివేండ్రం నుంచి దిల్లీ వెళ్లాలన్నా విజయవాడ మీదుగానే వెళ్లాలి.

సాధారణంగా రెండు డైరెక్షన్‌లకు మించి రైల్వే లైన్లు ఉన్న స్టేషన్లను జంక్షన్ అని అంటారు.

అలాంటిది విజయవాడలో ఐదు డైరెక్షన్లకు రైల్వే లైన్లు ఉన్నాయి.

అవి... కాజీపేట (సికింద్రాబాద్, దిల్లీ రూట్‌), గుంటూరు, చెన్నై, గుడివాడ, విశాఖపట్నం.

ప్రస్తుతం విజయవాడ- కాజీపేట్ రూట్ మినహా మిగతా అన్ని మార్గాలలో రైళ్లు తిరుగుతున్నాయని విజయవాడ డివిజన్ పీఆర్‌ఓ నుస్రత్ ఎమ్. మండ్రూప్కర్ తెలిపారు.

అయితే, ‘‘రైళ్ల సంఖ్య పెరుగుతున్నా స్థలాభావంతో స్టేషన్ విస్తరణకు అవకాశం లేకపోవడం వల్ల ప్లాట్‌ఫామ్‌ల సంఖ్యను పెంచడానికి ఆస్కారం లేదు’’ అని మండ్రూప్కర్ తెలిపారు.

కాజీపేట్ రూట్ పునరుద్ధరణ జరిగేంతవరకు అనేక రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

విజయవాడలో పది ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. రోజూ ఎక్స్‌ప్రెస్, పాసింజర్లు కలిపి 250కి పైగా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా వెళ్తాయి.

కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు సరకు రవాణాలో విజయవాడ డివిజన్ కీలకపాత్ర పోషిస్తుంది.

ఈ డివిజన్‌లో డీజిల్ ఇంజిన్లు, ఎలక్ట్రిక్ ఇంజిన్లతో నడిచే రైళ్లు, డెము (డీఈఎమ్‌యూ-డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్), మెము (ఎమ్‌ఈఎమ్‌యూ -మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్)లు నడుస్తున్నాయి.

అత్యంత సుదీర్ఘమైన ప్రయాణ సమయం (మూడు రోజుల పైనే) కలిగిన వివేక్ ఎక్స్‌ప్రెస్ కూడా (దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారికి) విజయవాడ మీదుగానే వెళ్తుంది.

రైల్వేలు, ప్రయాణికులు, భారతీయ రైల్వే
ఫొటో క్యాప్షన్, వరద నీటి తాకిడికి కొట్టుకు పోయిన రైల్వే ట్రాక్
రైల్వేలు, ప్రయాణికులు, భారతీయ రైల్వే

ఫొటో సోర్స్, South Central Railway

ఫొటో క్యాప్షన్, రైళ్లు నిలిపివేయడంతో ప్రయాణికుల్ని బస్సుల్లో గమ్యస్థానానికి చేర్చిన అధికారులు

విజయవాడపై తీవ్ర ఒత్తిడి

ఇటీవలి కాలంలో విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. రైళ్ల సంఖ్య పెరుగుతున్నా ప్రస్తుతం ఉన్న స్థల పరిమితి రీత్యా ప్లాట్‌ఫామ్‌ల సంఖ్యను పెంచడానికి ఆస్కారం లేదు.

హైదరాబాద్ విషయానికి వస్తే నాంపల్లి రైల్వే స్టేషన్‌తో పాటు సికింద్రాబాద్, కాచిగూడ ప్రధాన స్టేషన్‌లుగా ఉన్నాయి.

ఏదైనా ఒకే స్టేషన్‌పై ప్రయాణికుల ఒత్తిడి కొంతవరకు తగ్గుతోంది.

మరోవైపు ఇప్పటికే లింగంపల్లి స్టేషన్ శాటిలైట్ స్టేషన్‌గా ఉండగా, మరికొద్ది రోజుల్లో చర్లపల్లి స్టేషన్ కూడా శాటిలైట్ స్టేషన్‌గా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అదే జరిగితే మిగతా స్టేషన్ల మీద ఒత్తిడి మరింత తగ్గుతుంది.

విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించడానికి, ఇలాంటి శాటిలైట్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

రాయనపాడులో ఇలాంటి శాటిలైట్ స్టేషన్‌ను ఏర్పాటు చేసినా, అది కేవలం గూడ్స్ రైళ్లకు మాత్రం పరిమితం అయింది.

భారీ వర్షాలు, రైల్వే లైన్లు, ప్రయాణికులు
ఫొటో క్యాప్షన్, విజయవాడలో రైల్వే ట్రాక్‌ పక్కన ప్రవహిస్తున్న వరద నీరు

డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు

ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ కలిగి ఉన్న భారతీయ రైల్వేలు ప్రయాణికుల రవాణాలోనైనా, సరకు రవాణాలోనైనా దేశ రవాణా రంగానికి వెన్నెముకలాంటివి.

సాధారణ, మధ్య తరగతి ప్రజలే కాదు ఉన్నత వర్గాల వారిలో చాలామంది దూర ప్రయాణాలకు ఇప్పటికీ రైళ్లనే ఆశ్రయిస్తారు.

గూడ్స్ రైళ్ల విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో ఉన్న పలు సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి సిమెంట్ రవాణా విజయవాడ మీదుగానే జరుగుతుంది.

ఇక్కడి నుంచి ప్రధానంగా బొగ్గు, ఎరువులు, స్టీల్, బియ్యం, పెట్రోలియం ఉత్పత్తులు రవాణా అవుతాయి.

సింగరేణి, మణుగూరు నుంచి విజయవాడ మీదుగా బొగ్గు రవాణా జరుగుతుంది.

మామిడి పండ్ల సీజన్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తర భారతదేశానికి ప్రత్యేకంగా ‘మ్యాంగో స్పెషల్’ రైళ్లను కూడా నడుపుతారు.

దేశంలో ఇటీవల రైల్వేల ద్వారా సరకు రవాణాను సులభతరం చేయడానికి ప్రతిపాదించిన మూడు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లలో రెండు విజయవాడ మీదుగా ప్రతిపాదించారు.

వాటిలో ఒకటి ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ (ఖరగ్‌పూర్-విజయవాడ) కాగా, రెండోది నార్త్-సౌత్ ఫ్రైట్ కారిడార్ (ఇటార్సీ-విజయవాడ). ఇవి ఇంకా డీపీఆర్ దశలోనే ఉన్నా, ఇవి పూర్తయితే ప్యాసింజర్‌/ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయపాలన మరింత మెరుగుపడుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)