శ్రీవైకుంఠం: 48 గంటలపాటు రైలులో చిక్కుకున్న 957మంది ప్రయాణికులు

తమిళనాడులో కురిసిన భారీవర్షాల కారణంగా 957 మంది ప్రయాణికులు రెండురోజులపాటు ఒక రైలులో చిక్కుకుపోయారు.
చుట్టూ వరద నీరు, కుండపోత వర్షం కారణంగా వారు రైల్లోంచి బయటకు కాలుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది.
ఓ చిన్న రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయిన రైలులో రెండురోజులపాటు నానా తిప్పలు పడిన వీరిని, 48 గంటల తరువాత రక్షణ బృందాలు మూడు కిలోమీటర్ల దూరంలోని బస్టాండ్ వద్దకు తరలించగలిగాయి.
కుండపోత వర్షాలకు తమిళనాడు దక్షిణాది జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. తిరునల్వేలి, తెన్‌కాశీ, తూత్‌కుడి, కన్యాకుమారి జిల్లాల్లో జనజీవనం అస్తవ్యవస్తమైంది.
చెన్నై వాతావరణ శాఖ 24గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది.
ఈ నాలుగు జిల్లాల్లో ఏడాదిపాటు కురిసే వర్షం ఒక్కరోజులోనే కురిసింది.
వానలు మొదలవడానికి ఒక రోజు ముందు అంటే ఈ నెల 17న (ఆదివారం) రాత్రి 8 గంటల 25 నిమిషాలకు తిరుచెందూరు రైల్వే స్టేషన్ నుంచి సెందూరు ఎక్స్‌ప్రెస్ చెన్నైకు బయల్దేరింది.
భారీవర్షాల కారణంగా ఈ మార్గంలోని శ్రీవైకుంఠం దదన్‌కుళం వద్ద మట్టి కరిగిపోయి రైల్వే ట్రాక్ కింద ఉండే కంకర మొత్తం కొట్టుకుపోవడంతో రైల్వే ట్రాక్ బలహీనంగా మారింది. ఈ సమాచారాన్ని వెంటనే సెందూరు ఎక్స్‌ప్రెస్ డ్రైవర్‌కు తెలియజేయడంతో ఆయన రైలును శ్రీవైకుంఠం స్టేషన్‌లో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులందరూ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
కాలుబయటకు పెట్టలేనంత వాన పడుతుండటంతో ట్రైన్‌లోనే ఉండిపోయిన ప్రయాణికులలో ఆందోళన మొదలైంది.

గ్రామస్తుల సాయం
తిరుచెందూరులో స్వామి దర్శనం కోసం కుటుంబంతో మైలాదుతురై నుంచి వచ్చానని సురేష్ అనే ప్రయాణికుడు బీబీసీకి తెలిపారు.
‘‘తిరుచెందూరులో రైలు ఎక్కుతున్నప్పుడే భారీవర్షం పడుతోంది. రైలు శ్రీవైకుంఠం చేరుకునే సరికి రాత్రి 9గంటల 15 నిమిషాలు అయింది. రైలు ఇక్కడ నిలిచిపోయింది’’ ఆయన చెప్పారు.
రైలులోని ప్రయాణికులందరూ తమను మరో రైల్లో తరలిస్తారనే ఆలోచనలో ఉన్నారు కానీ రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడం వలన రైలు ముందుకు కదిలే పరిస్థితి లేదని కొందరు రైల్వే ఉద్యోగులు తెలిపారు.
దీనికితోడు శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్ వరదనీటిలో చిక్కుకుపోయింది.
దీంతో ప్రయాణికులు రైలు నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
ఆ రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రయాణికులు తెల్లారిన తరువాత (సోమవారం ఉదయం, డిసెంబరు 18) చినుకులు మాత్రమే పడుతుండటంతో ఎలాగో స్టేషన్ బయటకు వచ్చారు కానీ చుట్టూ వరదనీరే ఉడటంతో ఏం చేయాలో తోచలేదు. దగ్గరలోని షాపు వద్ద వారికి కేవలం బన్నులు, బిస్కెట్లు మాత్రమే దొరికాయి.
ఈ స్టేషన్‌కు అరకిలోమీటరు దూరంలో ఉన్న గ్రామస్తులకు విషయం తెలిసి వారు కూడా అతికష్టం మీద స్టేషన్ వద్దకు చేరుకున్నారు.
అక్కడే ఉన్న భద్రకాళి అమ్మన్ ఆలయంలో తమకు చేతనైనంతవరకు వంటలు చేసి ప్రయాణికులలో కొందరి ఆకలి తీర్చగలిగారు.
ప్రతి బోగి వద్దకు వెళ్ళి పిల్లలు ఎవరైనా ఉన్నారా అని కనుక్కుని వారికి పాలు పంపిణీ చేశారు.
ఆపద్బాంధవుల్లా వచ్చిన గ్రామస్తులను ప్రయాణికులు ఎంతో ప్రశంసించారు.
ఇలా వీరికి మంగళవారం రాత్రివరకు అవకాశం ఉన్నంత మేర సాయం అందించినట్టు సురేష్ బీబీసికి వివరించారు.

హెలికాప్టర్‌తో ఆహారపొట్లాల సరఫరా
‘‘మంగళవారం ఉదయం హెలికాప్టర్ ద్వారా ఫుడ్ ప్యాకెట్స్ అందించారు. కానీ ప్రయాణికులెవరినీ హెలికాప్టర్ ద్వారా తరలించలేదు. ఇక ఆరోజు సాయంత్రం రైల్వే రక్షక బృందం రంగంలోకి దిగింది. అప్పటిదాకా వర్షం కురుస్తూనే ఉండటంతో శ్రీవైకుంఠం రైల్వేస్టేషన్ చిన్నదీవిలా మారిపోయింది. దీంతో రైలు నుంచి ప్రయాణికులను తరలించడానికి రక్షణ బృందాలు తాళ్ళు ఏర్పాటు చేసి, దాని సాయంతో ప్రతిప్రయాణికుడిని వెల్లూరు దగ్గరలోని గ్రామానికి తరలించారు’’ అని సురేష్ తెలిపారు.
మొదటి దఫాలో ఆరుబస్సుల్లో బస్సుకు వందమంది చొప్పున వాంచిమైనాచీ రైల్వేస్టేషన్‌కు తరలించారు. ‘‘ ఇంకా నాలుగువందలమందికిపైగా రైల్వేస్టేషన్‌లో వేచి ఉన్నారు’’ అని ఆయన చెప్పారు.
‘‘ నా జీవితంలో నేనిప్పటిదాకా ఇంతటి ప్రకృతి విలయాన్ని చూడలేదు. నేను నా కుటుంబం గడిచిన రెండురోజులుగా ఎంతో ఇబ్బంది పడ్డాం. మాకు సాయం అందించిన గ్రామం కూడా భారీగా దెబ్బతింది’’ అని సురేష్ తెలిపారు.
ఈ గ్రామానికి రక్షణ బృందాలేవీ రాలేదు. రక్షణ బృందాలు ఈ గ్రామానికి వచ్చి బాధితులను ఆదుకోవాలని సురేష్ కోరారు.

మహిళల్లో ఆందోళన
ఆదివారం రాత్రి నుంచి రైలు శ్రీవైకుంఠం స్టేషన్‌లో నిలిచిపోయిందని, భారీవర్షం కారణంగా రైలు నుంచి బయటకు రాలేని పరిస్థితి కావడంతో ఆదివారం రాత్రంతా రైల్లోనే నిద్రపోయామని మహేశ్వరి అనే ప్రయాణికురాలు బీబీసీతో చెప్పారు.
‘‘రైల్లోని పిల్లలు, వృద్ధులు ఆకలితో అలమటించారు. దగ్గరలోని షాపులు కేవలం బన్నులు, బిస్కెట్లు మాత్రమే దొరికాయి. తిండీతిప్పలు లేకుండా మేం రైల్వేస్టేషన్ లో చిక్కుకుపోయామని అర్థమైంది. కానీ శ్రీవైకుంఠం గ్రామ ప్రజలు వారికున్నంతలో మాకు ఏదో ఒకటి పెట్టి మా ఆకలి తీర్చారు’’ అని మహేశ్వరి చెప్పారు.
రైల్లో చిక్కుకుపోయినవారిలో చాలామంది ప్రయాణికులు రోజూవారీ మందులు తీసుకోవాల్సిన వారు ఉన్నారు. అదృష్టవశాత్తూ వారు తమతోపాటు మందులు తెచ్చుకున్నారు కాబట్టి, ఎటువంటి అనారోగ్యానికి గురికాలేదు.
కాలుబయటపెట్టలేని పరిస్థితిని చూసి రైల్లోని మహిళలు ఎంతో ఆందోళన చెందారు. ‘‘నేను నా కూతురు తిరుచెందూరులో స్వామి దర్శనం చేసుకుని బయల్దేరాం. తెల్లవారితే మా అమ్మాయికి పరీక్ష ఉంది. కానీ మేం రైల్లో చిక్కుకుపోయాం. పరీక్ష రాయని కారణంగా మేమెంతో నిరాశకు గురవుతున్నాం’’ అని మహేశ్వరి వివరించారు.
అసలు భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా రైళ్ళను రద్దుచేసి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదని ఆమె అన్నారు.
‘‘కేవలం హెలికాప్టర్ ద్వారా ఆహారపొట్లాలు మాత్రం అందించారు. వారెవరినీ రక్షించ లేదు. తరువాత రైల్వే రక్షణ దళం వచ్చి బస్సుల వద్దకు ప్రయాణికులను తరలించింది’’ అని ఆమె తెలిపారు.

తప్పిన ప్రమాదం
‘‘ మంగళవారం మధ్యాహ్నం వాన తగ్గి, వరద నీరు క్రమంగా తగ్గుతుండటంతో మేమంతా స్టేషన్ బయటకు వచ్చి కాలినడకన ఎన్‌డీఆర్ఎఫ్ బృందాల సాయంతో బయటపడ్డాం. కానీ కొంతమంది వృద్ధులు స్టేషన్ వద్దే ఉండిపోయారు. కొంతమందిని పడవల సాయంతో తరలించారు’’ అని రైలు డ్రైవర్ షాజు చెప్పారు.
‘‘మేం బయటకు వచ్చేసరికి అక్కడ ఆరు బస్సులు సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా మేం మైనాచీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాం. ఇక్కడ మాకు అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తున్నారు. మరో రైలులో ప్రయాణికులందరినీ చెన్నైకు పంపిస్తున్నారు’’ అని షాజు తెలిపారు.
‘‘ శ్రీవైకుంఠం స్టేషన్ చేరేసరికి ఇక ఎంతమాత్రం రైలును ముందుకు నడపొద్దని పై అధికారుల నుంచి హెచ్చరిక వచ్చింది. దీంతో నేను రైలును అక్కడే నిలిపివేయడం వలన పెద్ద ప్రమాదం తప్పినట్టయింది’’ అని షాజు చెప్పారు.
రైల్వేస్టేషన్‌లో ఇలా రెండురోజులపాటు చిక్కుకుపోవడం అనేది ఓ మరిచిపోలేని సంఘటన అని, రైల్వే అధికారులు ఎంత వరక సహాయం చేయగలరో అంతవరకు చేశారని, పరిసర గ్రామ ప్రజలు కూడా తమ వంతు సాయం అందించారని, ఇలా విపత్కర పరిస్థితుల్లో ఎవరిపైనో నిందలు వేయడంకంటే తోచిన సాయం చేయడమే ఉత్తమమైన పని అని షాజు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- జేఎన్1: కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా? దీని లక్షణాలేంటి? టీకాలు పనిచేస్తాయా?
- కామారెడ్డి: ‘అప్పు కట్టాలన్నందుకే ఒకే కుటుంబంలో ఆరుగురిని చంపేశాడు. ఎవరి హత్యకు ఎలా పథకం వేశాడంటే..’
- Lizards: బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా, ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?
- ‘80 ఏళ్ల వయసులో మళ్లీ సెక్సువల్ రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెడతానని అనుకోలేదు’
- బిగ్ బాస్ 7: పోటీదారులకు లక్షల మంది అభిమానులు ఎలా పుట్టుకొస్తున్నారు? రోడ్లపై ఈ విధ్వంసానికి కారణం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














