మొరాకో భూకంపం: 2000 దాటిన మృతుల సంఖ్య...ఎటు చూసినా కుప్పకూలిన భవనాలు, శిథిలాల కింద శవాలు

ఫొటో సోర్స్, Getty Images
మొరాకోలో భూకంపం కారణంగా 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు అదే సంఖ్యలో గాయపడ్డారు.
1400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.
మూడు రోజులపాటు జాతీయ సంతాప దినాలుగా పాటించాలని మొరాకో రాజు కింగ్ మొహమ్మద్ 6 ఆదేశించారు.
6.8 తీవ్రతతో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11:11 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది.
మరకేశ్ నగరానికి 71 కి.మీ దూరంలోని హై అట్లాస్ పర్వతాల్లో 18.5 కి.మీ. లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది.
భూకంప బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేశంలో మూడో వంతు ప్రాంతం భూకంపానికి ప్రభావితమైంది.
భూకంప తీవ్రత కారణంగా అట్లాస్ పర్వతాల్లోని మారుమూల ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడానికి కష్టతరమవుతున్నట్లు కథనాలు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, EVN SCREENSHOT
పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే చారిత్రాత్మక నగర మరకేశ్ తీవ్రంగా దెబ్బతింది.
అల్ హఉజ్, మరకేశ్, ఉరాజాజాతె, అజీలాల్, చీచావువా, టారౌడంట్ మున్సిపాలటీలలోని ప్రజలు భూకంపం వల్ల ప్రాణాలు కోల్పోయారని, 329మందికి పైగా గాయపడ్డారని హోం మంత్రిత్య శాఖ తెలిపింది.

ఫొటో సోర్స్, REUTERS
భవనాలు కంపించడం, కూలిపోవడం, వీధుల్లో ప్రజలు అరుస్తూ పరుగులు పెట్టడం, దట్టమైన దుమ్ము నుంచి కొందరు బయటకు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి.
మరకేశ్‌లోని మెదినాలో పెద్ద సంఖ్యలో భవనాలు కూలిపోవడంతో శిథిలాల కింద చాలా కుటుంబాలు చిక్కుకుపోయాయి.
నగరంలోని ఆసుపత్రులు క్షతగాత్రులతో నిండిపోవడంతో, రక్తదానం చేయాలని స్థానికులను అధికారులు కోరారు.

ఫొటో సోర్స్, REUTERS
పాత నగరంలోని కొన్ని భవనాలు కూలిపోయాయని స్థానికులు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.
భవనాలు కూలిపోతున్న వీడియోలను అనేక మంది ట్విటర్‌లో షేర్ చేశారు.
ఆ వీడియోలు ఏ ప్రాంతానికి చెందనవనేది బీబీసీ స్వయంగా నిర్ధరించలేదు. ఘటన తర్వాత నగరంలోని ప్రజలు భయంతో ఇళ్లలోకి వెళ్లకుండా బయటే ఉండిపోయారు.

ఫొటో సోర్స్, EPA
“అంతా భయాందోళనలో ఉండి పోయారు. పిల్లలు ఏడుస్తుంటే తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు” అని స్థానికులు అబ్దెల్హక్ ఎల్ అమ్రానీ ఏఎఫ్పీ న్యూస్ ఏజెన్సీతో ఆ క్షణాలను గుర్తుచేసుకున్నారు.
పది నిముషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోపాటు ఫోన్ లైన్స్ కూడా పనిచేయలేదని తెలిపారు.
భవనాలు కదులుతున్న దృశ్యాలు చూసి భయంకరమైన అనుభూతికి లోనయ్యానని మరొక వ్యక్తి తెలిపారు.

ఫొటో సోర్స్, G20
జీ20 సమావేశాల్లో మోదీ సంతాపం
ఢిల్లీలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాదంపై స్పందించారు. మొరాకో దేశానికి బాసటగా దేశాలన్ని ఉన్నాయని అన్నారు.
‘‘జీ20 సదస్సు ప్రారంభించడానికి ముందు, మొరాకో భూకంపంలో చనిపోయిన ప్రజలకు సంతాపం తెలియజేస్తున్నా. ఈ ప్రకృతి విపత్తులో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ కష్ట సమయంలో మొరాకోకు అవసరమైన సాయమంతా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ’’ అని మోదీ తెలిపారు.
జర్మనీ కౌన్సిలర్ ఒలాఫ్ స్కోల్జ్ స్పందిస్తూ, ఇది విధ్వంసకర ఘటన అని అన్నారు.

ఫొటో సోర్స్, USGS
రాజధానికి 350 కిలోమీటర్ల దూరంలో..
భూకంప కేంద్రం పర్యతాల్లో ఉంది. మొరాకో రాజధానికి 350 కి.మీ దూరంలోనే భూప్రకంపనాలు వచ్చాయి.
దీంతో కాసాబ్లాంకా, ఐజోరియా వంటి నగరాలు షేకయ్యాయి. మరకేశ్ నగరం భూకంపానికి తీవ్రంగా ప్రభావితమైంది.
మొరాకోలో మరకేశ్ నగరం పర్యాటక కేంద్రం.
పెద్ద సంఖ్యలో సందర్శకులు ఈ నగరానికి వస్తుంటారు. పర్యాటకులు కూడా ఈ భూకంపానికి ప్రభావితలైనట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
- భారత్: ‘ఇండియా’ అనే పేరుపై జిన్నా అప్పట్లో ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు?
- కుంభమేళా: యాంటీబయాటిక్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కోటి మంది చనిపోతారా, డబ్ల్యూహెచ్వో ఎందుకు హెచ్చరించింది?
- ఇండియా-భారత్: గత వందేళ్లలో ప్రపంచంలోని అనేక దేశాలు పేర్లు ఎలా మార్చుకున్నాయంటే...
- పుతిన్, కిమ్ జోంగ్ ఉన్: వీరిద్దరూ కలవడం ప్రపంచానికి ఆందోళనకరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














