సిరియా భూకంప శిథిలాలలో బొడ్డుతాడు తెగకుండా ప్రాణాలతో దొరికిన ‘మిరకిల్ బేబీ’ అఫ్రా ఇప్పుడెలా ఉంది?

చిన్నారి అఫ్రా
ఫొటో క్యాప్షన్, చిన్నారి అఫ్రా
    • రచయిత, ఫెతి బెనైస్సా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సిరియాలో భారీ భూకంపానికి కూలిపోయిన భవనం శిథిలాలలో అఫ్రా కనిపించినప్పుడు, ఆమె బొడ్డు తాడు తల్లి నుంచి ఇంకా తెగిపోలేదు. ఆ చిన్నారి ఈ ప్రపంచంలోకి వచ్చిన కాసేపటికే ఆమె తల్లి కన్నుమూశారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ భూకంపం వచ్చినప్పుడు, శిథిలాల నుంచి ఈ శిశువును, బయటకు తీసుకొస్తున్న వీడియో ప్రపంచం ఆకర్షించింది. తల్లి లేకపోయినా ఆ చిన్నారి కోలుకుంది.

ఇప్పుడు అఫ్రాకు ఆరు నెలలు నిండాయి. చాలా ఆరోగ్యంగా ఉంది. సిరియాలోని జిండిరెస్ పట్టణంలో ఆమె తన మేనత్త, మామ, వారి ఏడుగురు పిల్లల మధ్య ఆమె పెరుగుతోంది.

‘‘ఆమె నవ్వుతుంటే, వాళ్ల నాన్న, వాళ్ల అక్కల ముఖాలే గుర్తుకొస్తున్నాయి. వాళ్లంతా భూకంపంలో చనిపోయారు’’ అని అఫ్రా మేనత్త హలా భర్త ఖలీల్ అల్ సవాడీ అన్నారు.

ఇప్పుడు ఆమె కుటుంబంలో బతికి ఉన్న ఏకైక వ్యక్తి అఫ్రాయే. ఆమె తండ్రి, నలుగురు అక్కలు కూడా ప్రాణాలు కోల్పోయారు.

మిరకిల్ బేబీ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, పుట్టిన కొత్తలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి అఫ్రా

‘ఆ దృశ్యం కళ్లముందే కదలాడుతోంది’

శిథిలాల కింద నుండి ఆఫ్రాను బయటకు తీసిన క్షణాలు ఖలీల్‌కు బాగా గుర్తున్నాయి.

‘‘ ఇంటి పైకప్పు వారిపై పడింది. ఎవరో నాకు ఫోన్ చేసి ఒక మహిళ మృతదేహాన్ని కనుగొన్నామని చెప్పారు. నేను అక్కడికి చేరుకుని శిథిలాలు తొలగించడం ప్రారంభించా. అప్పుడే నాకు ఒక ఏడుపు వినిపించింది. ఇది అఫ్రాదే. అప్పటికి ఆమె ఇంకా తల్లికి పేగుకు అతుక్కునే ఉంది.’’ అన్నారు ఖలీల్.

ఆసుపత్రికి తీసుకు వచ్చినప్పుడు ఆమె పరిస్థితి ఏమీ బాగాలేదని, ఒళ్లంతా రక్తం, గాయాలు ఉన్నాయని, ఊపిరి కూడా సరిగా పీల్చుకోలేకపోతోందని అప్పట్లో డాక్టర్లు చెప్పారు.

ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆ పాపకు అక్కడి సిబ్బంది ‘అయా’ అని పేరు పెట్టారు. అయా అంటే అరబ్బీ భాషలో అద్భుతం అని అర్ధం. ప్రస్తుతం అయాను ఆమె తల్లి అఫ్రా పేరుతో పిలుస్తున్నారు కుటుంబ సభ్యులు. ఆమె ఒంటిపై అయిన గాయాలు ఇప్పుడు కనిపించడం లేదు.

"భూకంపపు శిథిలాల నుంచి వచ్చిన ధూళి కారణంగా ఆమెకు ఛాతీలో సమస్యలు వచ్చాయి’’అని ఖలీల్ గుర్తు చేసుకున్నారు.

మిరకిల్ బేబీ
ఫొటో క్యాప్షన్, చిన్నా అఫ్రాకు ఇప్పుడు ఆరు నెలలు

దత్తత కోసం పోటాపోటీ

అఫ్రా ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా వేలమంది ఆమెను దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. ఖలీల్, ఆయన భార్య హలాకు కూడా అఫ్రాను అప్పగించడానికి ఆసుపత్రి సిబ్బంది మొదట నిరాకరించారు. ఆమె వారి రక్త సంబంధీకురాలు అని నిరూపించుకోవాల్సి వచ్చింది. డీఎన్ఏ పరీక్షల ద్వారా అఫ్రా హలాకు దగ్గరి బంధువు అని తేలాక ఆమెకు అప్పగించారు.

"మొదట రక్త పరీక్ష మాత్రమే అన్నారు. వారం తర్వాత నా భార్య నుండి మరోసారి రక్తం, జుట్టు శాంపిల్స్ తీసుకున్నారు. రిపోర్ట్ రావడానికి 10 రోజులు పట్టింది’’ అన్నారు ఖలీల్.

అఫ్రా గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలియడంతో ఆమెను ఆసుపత్రి నుంచి కిడ్నాప్ చేసే ప్రమాదం ఉందని భావించి తాము ఆసుపత్రిలో ఉండి జాగ్రత్తగా కాపాడుకున్నట్లు ఖలీల్ చెప్పారు. ‘‘ సివిల్, మిలిటరీ పోలీసులు ఆమెను రక్షించడంలో మాకు చాలా సాయం చేసారు’’ అని ఆయన వెల్లడించారు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే ఖలీల్, హలా చేసిన మొదటి పని ఆమెకు కొత్త పేరు పెట్టడం. ఆమె తల్లిపేరునే అఫ్రాకు పెట్టారు.

‘‘ఆమె నా కూతుళ్లలో ఒకరు. దాన్ని చూడకుండా కాసేపు కూడా ఉండలేను’’ అన్నారు ఖలీల్.

‘‘తను పెద్దయ్యాక, ఏం జరిగిందో ఆమెకు చెబుతా. ఆమె అమ్మా నాన్నలు, అక్కల ఫొటోలు చూపిస్తా’’ అన్నారాయన.

మిరకిల్ బేబీ
ఫొటో క్యాప్షన్, ఖలీల్, హలాల ఏడుగురు పిల్లలతోపాటు అఫ్రా కూడా ఆ కుటుంబంలో చేరిపోయారు.

‘ఎత్తుకెళతారని భయం’

చిన్నారి అఫ్రా తల్లి, ఆమె మేనత్త దాదాపు ఒకే సమయంలో గర్భం దాల్చారు. చిన్నారి అఫ్రా పుట్టిన మూడు రోజులకు హలా కూడా ఒక అమ్మాయికి జన్మనిచ్చారు. ఆమెకు ఆ భూకంపంలో చనిపోయిన అఫ్రా మరో మేనత్త ‘అతా’ పేరు పెట్టారు.

జిండిరెస్‌లోని ఖలీల్ ఉంటున్న ఇల్లు బాగా దెబ్బతినడంతో కుటుంబంతో కలిసి అక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోయారు.

‘‘ఇంటికి పెద్ద పెద్ద పగుళ్లు వచ్చాయి. అది అంత సురక్షితం కాదు. నా ఇల్లు దెబ్బతింది, కారు కూడా దెబ్బతింది. ఒకేసారి కష్టాలన్నీ చుట్టుముట్టినట్లయింది. పిల్లలను స్కూలుకు పంపే స్థోమత కూడా లేదు’’ అన్నారు ఖలీల్.

మిరకిల్ బేబీ
ఫొటో క్యాప్షన్, 2023 ఫిబ్రవరిలో సిరియా, తుర్కియేలలో భారీ భూకంపం సంభంవించింది.

రెండు నెలలపాటు ఒక శిబిరంలో ఉన్నారు. తర్వాత వారికి ఒక అద్దె ఇల్లు దొరికింది. అయితే, అద్దె ఎక్కువగా ఉండటంతో ఇక్కడ కూడా ఎక్కువ కాలం ఉండలేమని వారు ఆందోళన చెందుతున్నారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదంటే, యూకేకు వెళ్లడానికి సాయం చేస్తామని కొందరు ముందుకు వచ్చినా ఖలీల్ దాన్ని తిరస్కరించారు.

‘‘మేం విదేశాలకు వెళితే, మా అఫ్రాను ఎవరైనా ఎత్తుకెళ్లిపోతారని నా భయం’’ అన్నారు ఖలీల్.

ఆయన సొంతూరు భూకంపం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న వాటిలో ఒకటి. అక్కడ వేల కుటుంబాల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.

భారీ భూకంపం కారణంగా సిరియా, తుర్కియేలలో సుమారు 50 వేలమంది మరణించారని, మరో 50 వేలమంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.

వీడియో క్యాప్షన్, భూకంపం శిథిలాల్లో పుట్టిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందంటే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)