అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?

స్వీటెనర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జేమ్స్ గల్లఘెర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కృత్రిమ చక్కెర (స్వీటెనర్) అయిన 'అస్పర్టేమ్' మనుషులు వాడటానికి సురక్షితమన్న సిఫార్సులను కొనసాగించడానికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మొగ్గుచూపింది.

అస్పర్టేమ్ భద్రత, "క్యాన్సర్ కారకం" అన్న వాదనపై నిపుణులతో కూడిన రెండు బృందాలు వేలాది శాస్త్రీయ అధ్యయనాలను సమీక్షించిన తర్వాత డబ్ల్యూహెచ్‌వో ఈ నిర్ణయానికి వచ్చింది.

"క్యాన్సర్‌కు కారణం కావచ్చు" అనే విషయం విన్నప్పుడు భయం, గందరగోళం ఏర్పడటం సర్వసాధారణం. కానీ క్యాన్సర్ కారకం అవుతుందనడానికి సరైన ఆధారాలు పూర్తిగా లేవని కూడా దీనర్థం .

సురక్షితమైనదిగా పరిగణించే అస్పర్టేమ్‌‌ను చాలామంది పరిమితి కంటే తక్కువగానే వాడుతుంటారు. అయితే ఎక్కువగా వినియోగించేవారు తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది.

అస్పర్టేమ్ అంటే ఏమిటి?

అస్పర్టేమ్‌ అనేది అమైనో ఆమ్లాల కలయిక, ఇది చక్కెర కంటే 200 రెట్లు తియ్యగా ఉంటుంది.

1965లో అల్సర్‌లకు పరిష్కారాలను కనుగొనే పనిలో ఉన్న ఒక రసాయన శాస్త్రవేత్త అనుకోకుండా దీనిని కనుగొన్నారు.

1980లలో మార్కెట్లోకి ప్రవేశపెట్టినప్పటి నుంచి అస్పర్టేమ్‌ పరిశీలనలో ఉంది.

చాలా రకాల పాపులర్ బ్రాండ్‌లు తమ ఉత్పత్తులలో అస్పర్టేమ్‌ ను ఉపయోగిస్తాయి.

కోకా-కోలా జీరో, డైట్ వెర్షన్‌లలో, పెప్సీ విత్ మ్యాక్స్, 7 అప్ ఫ్రీ.. ఇలా టూత్‌పేస్ట్ నుంచి పెరుగు, దగ్గు మందు వరకు దాదాపు 6,000 ఉత్పత్తులకు విస్తరించింది అస్పర్టేమ్‌.

అయితే అస్పర్టేమ్‌ మాత్రమే కృత్రిమ స్వీటెనర్ కాదు. 1990లలో సుక్రోజ్ కూడా ఒక ప్రసిద్ధ స్వీటెనర్. కానీ తర్వాత దాని బ్రాండ్ పడిపోయింది.

ఇంట్లో పెరిగే మొక్కల ఆకుల నుంచి తీసిన స్టెవియా వంటి ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అయినప్పటికీ అస్పర్టేమ్‌ నేడు అత్యంత విస్తృతంగా వినియోగించే తక్కువ కేలరీలున్న స్వీటెనర్.

అస్పర్టేమ్

ఫొటో సోర్స్, Getty Images

క్యాన్సర్‌తో సంబంధం ఉందా?

అస్పర్టేమ్‌ క్యాన్సర్‌కు కారణమవుతుందన్న వాదనపై ఆసక్తి చూపిన మొదటి విభాగం ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాన్సర్ నిపుణుల గ్రూప్ .

ఈ సంస్థ నాలుగు అవకాశాలను వర్గీకరించింది.

  • గ్రూప్ 1 – మనుషుల్లో క్యాన్సర్‌కు కారణమయ్యేవి.
  • గ్రూప్ 2 ఏ – మనుషుల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం ఉండొచ్చు అనుకునేవి (ప్రాబబుల్)
  • గ్రూప్ 2 బీ: మనుషుల్లో బహుశా క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం (పాసిబుల్) ఉన్నవి.
  • గ్రూప్ 3: ఏ వర్గానికీ చెందనివి.

ఈ అస్పర్టేమ్‌ ను అలోవెరా వంటి ఇతర పదార్ధాలతో " క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం ఉన్న " వర్గంగా తేల్చారు.

కాలేయ క్యాన్సర్‌కు సంబంధంపై జరిగిన మూడు అధ్యయనాలపై ఈ సంస్థ ఫోకస్ పెట్టి, నిర్ణయం వెల్లడించింది.

అస్పర్టేమ్‌కు వ్యతిరేకంగా ఆధారాలు బలంగా ఉంటే అది మరొక వర్గంలోకి వెళుతుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుందా?

ఆహారం వినియోగానికి సురక్షితమైన మోతాదులను సూచించే బాధ్యతను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ జాయింట్ ఎక్స్‌పర్ట్ కమిటీ నిర్వహిస్తుంది.

ఇది క్యాన్సర్ ప్రమాదం, ఇతర కొరోనరీ హార్ట్ డిసీజ్, టైప్ 2 డయాబెటిస్ వంటి ఇతర వ్యాధుల ప్రభావాన్ని కూడా పరిశీలించింది.

అయితే 1981 నుంచి ఉన్న దాని సిఫార్సులను మార్చడానికి "తగినంత కారణం కనబడలేదు".

శరీర బరువులో ప్రతి కేజీకి రోజుకు 40 మిల్లీగ్రాముల వరకూ అస్పర్టేమ్‌ను తీసుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

కృత్రిమ స్వీటెనర్లతో కూడిన పానీయాలు బరువు తగ్గడానికి సహాయపడవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే తెలిపింది.

అస్పర్టేమ్

ఫొటో సోర్స్, Getty Images

ఎలుకలపై పరిశోధనలో..

2000 ప్రారంభంలో ఎలుకలపై చేపట్టిన పరిశోధనల్లో అస్పర్టేమ్‌ క్యాన్సర్‌కు కారణం కావొచ్చని తేలింది. అయితే, మిగతా జంతువులపై చేపట్టిన అధ్యయనాల్లో ఈ విషయం రుజువుకాలేదని నిపుణులు చెప్పారు.

ఆ తర్వాత 1,05,500 మంది మనుషులపై మరో అధ్యయనం సాగింది.

దీనిలో అస్పర్టేమ్‌ భారీగా తీసుకుంటే క్యాన్సర్ ముప్పు ఉంటుందని, అయితే, ఇక్కడ ఇతర ఆరోగ్య సమస్యలు, జీవన శైలి కూడా ప్రభావం చూపించొచ్చని దీనిలో వెల్లడైంది.

ఈ విషయంపై ఇంటర్నేషనల్ స్వీటెనర్స్ అసోసియేషన్‌కు చెందిన ఫ్రాన్సెస్ హంట్-వుడ్ స్పందిస్తూ.. ‘‘ఎక్కువ పరిశోధనలకు కేంద్రమైన ఆహార పదార్థాల్లో అస్పర్టేమ్‌ కూడా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా 90కిపైగా దేశాల్లో ఆహార పరిశోధన సంస్థలు ఇది సురక్షితమైనదని తేల్చాయి.’’ అని చెప్పారు.

అయితే, కొంతమంది అస్పార్టేమ్ తీసుకోకూడదు. వీరిలో ఫెనిల్‌ కీటోన్యూరియా లాంటి వ్యాధులతో బాధపడేవారు ఉంటారు, వీరు అస్పర్టేమ్‌ను జీర్ణించుకోలేరు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)