పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?

పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఐవీబీ కార్తికేయ
    • హోదా, బీబీసీ కోసం

అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్లానింగ్ ఉండటమే అదృష్టం అంటాడు నోబెల్ గ్రహీత థామస్ అల్వా ఎడిసన్.

గతంలో ఎన్నోసార్లు చెప్పినట్టు పర్సనల్ ఫైనాన్స్ విషయంలో ప్లానింగ్ అంటే ఒక ప్రణాళిక ఉండటం మన ఆర్థిక లక్ష్యాలను అందుకోవడానికి చాలా కీలకం.

నెలవారీ కార్యక్రమాలకు వెళ్ళే ముందు స్థూలంగా మన ఆర్థిక పరిస్థితిని క్రింద చెప్పిన అంశాల పరంగా సమీక్షించుకోవాలి:

బీమా, పొదుపు, పన్ను, లక్ష్యాల సమీక్ష

1. మన ఇంట్లో అందరికి తగినంత బీమా ఉండేలా చూసుకోవాలి. కంపెనీ అందించే బీమా సదుపాయంతో పాటు వ్యక్తిగతంగా తీసుకున్న బీమా మన అవసరాలకు సరిపోతుందా అనేది ఆలోచించాలి. ఈ బీమాకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ జీవిత భాగస్వామికి అందుబాటులో ఉండాలి. తగినంత బీమా ఉండటం మదుపు చేయడం కంటే ముఖ్యమనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

2. మన ఆర్థిక లక్ష్యాలు ఏమిటో ఒకసారి తరచి చూసుకోవాలి. ప్రతి ఒక్క లక్ష్యానికి అనుబంధంగా ఒక మదుపు ఉండాలి. ఆ మదుపు నెలవారి మొత్తం అయితే అది ఆటో డెబిట్ మార్గంలో వెళ్ళేలా ఏర్పాటు చేయలి. ఒకవేళ త్రైమాసిక లేదా వార్షిక మొత్తం అయితే ఆ సమయానికి తగినంత మొత్తం మన దగ్గర ఉండేలా ఇప్పటి నుండే జాగ్రత్త పడాలి. త్రైమాసిక లేదా వార్షికంగా చేసే మదుపు నెలవారి చేసే మదుపు కంటే అధికంగా ఉంటుంది కాబట్టి నెల జీతం ద్వారా ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయడం కష్టం.

3. ఆదాయపు పన్ను నుంచి గరిష్ఠంగా లాభం పొందుతున్నామా లేదా అనే విషయం గమనించాలి. సెక్షన్ 80సి లక్షన్నర, ఎన్.పి.ఎస్, 80డి ద్వారా మరో డెబ్బై ఐదు వేల దాకా పన్ను రాయితీ పొందే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని పుర్తిగా ఉపయోగించుకోవాలి. అలాగే రిటైర్మెంట్ కోసం చేసే ప్రావిడెంట్ ఫండ్ కొంత పెంచే అవకాశం ఉందేమో చూడాలి. ప్రావిడెంట్ ఫండ్ పన్ను బాధ లేని మదుపు మర్గం కాబట్టి బాగా ఉపయోగించుకోవాలి.

4. గత ఏడాది మన ఆర్థిక లక్ష్యాలకు చేరుకున్నామా? ఒకవేళ లేకుంటే అందుకు కారణాలేమిటి, అలాంటి పరిస్థితులే ఈసారీ పునరావృతం అవుతాయా అనేది ఆలోచించుకోవాలి. సహజంగా అనుకోకుండా వచ్చే ఖర్చులు ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వస్తాయి. కానీ అలాంటి పరిస్థితులే పునరావృతం అవుతుంటే అప్పుడు ఆ ఖర్చులు కూడా మన ప్రణాళికలో భాగంగా కలుపుకోవాలి.

క్రెడిట్ కార్డులు

ఫొటో సోర్స్, Getty Images

ఈ తప్పులు చేయొద్దు...

ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో ఏం చేయలో అర్థం చేసుకున్నట్టుగా ఏం చేయకూడదు అనే అవగాహన కూడా ఉండాలి. సంపద సృష్టించడాంకి చాలా సంవత్సరాలు పడుతుంది కానీ దాన్ని కోల్పోవడానికి కొన్ని తప్పులు చాలు. ఈ క్రింద చెప్పిన తప్పులకు దూరంగా ఉండాలి:

1. క్రెడిట్ కార్డ్ మీద లోన్, వ్యక్తిగత లోన్ తీసుకుని ఉంటే వెంటనే ఆ బాకీ చెల్లించి ఆ లోన్ ముగించాలి. గృహ రుణం కాకుండా మిగిలిన ఏ రుణాలు కూడా మంచిది కాదు అనేది కొందరు పర్సనల్ ఫైనాన్స్ నిపుణుల వాదన.

2. క్రెడిట్ కార్ద్ బాకీ ప్రతి నెలా గడువు తీరే లోపు జమ చేయడం. ఆన్లైన్లో ఈ పని చేయడానికి రెండు మూడు నిమిషాలు పడుతుంది కానీ ఈ పని చేయకపోతే అది మీ క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది. ముంత లాభం చిల్లు తీసింది అన్నట్టుగా ఉంటుంది.

3. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. మనకు అవసరం లేని వస్తువులు కొంటూ ఉంటే భవిష్యత్తులో మనకు అవసరం అయిన వస్తువులు కూడా అమ్ముకోవలసి వస్తుంది అనే బఫెట్ గారి ఉవాచ అందరికీ వర్తిస్తుంది.

4. రియల్ ఎస్టేట్, క్రిప్టో కరెన్సి లాంటి ఒడిదొడుకులు ఉన్న మదుపు మార్గాలలో మదుపు చేయకుండా ఉండటమే మేలు. ఎందుకంటే మన ప్రతి మదుపు ఏదో ఒక ఆర్థిక లక్ష్యానికి అనుసంధంగా ఉన్నదే కనుక ఈ రంగాల వల్ల మనకు ఆశించిన మొత్తం సరైన సమయానికి అందకపోవచ్చు.

పెట్టుబడులు

ఫొటో సోర్స్, Getty Images

ఏ నెలలో ఎలా ప్లాన్ చేయాలంటే...

ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ పరంగా అనేక అంశాలు ఈ ఏడాది వివిధ నెలల్లో ఎలా పూర్తి చేయాలో దానికి తగిన ముందస్తు ప్రణాలిక ఎలా ఉండాలో చూద్దాం. 

ఫిబ్రవరి:

1. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తారీఖు ప్రకటించే బడ్జెట్ వల్ల మనకు జరిగే లాభనష్టాలు అర్థం చేసుకోవాలి. సాధారణంగా ప్రతీ ఏడాది మనల్ని ప్రభావితం చేసే మార్పులు ఉండవు కానీ ముఖ్యమైన తేదీలు, కొత్త రకమైన దరఖాస్తులు వగైరా సమాచారం తెలుసుకోవాలి.

2. కొన్ని కంపెనీలలో హోం లోన్, 80సీ, ఇతర మదుపుకు సంబంధించిన రుజువులు సమర్పించే గడువు ఫిబ్రవరి మొదటి రెండు వారాలలో ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని జాగ్రత్తగా పూర్తి చేయాలి. లేదంటే అది మార్చి, ఏప్రిల్ ఒకటవ తారీఖున వచ్చే జీతం మీద ప్రభావం చూపుతుంది. 

మార్చ్:

1. పాన్ - ఆధార్ అనుసంధించడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు మార్చ్ 31న ముగుస్తుంది.

2. ఆర్థిక సంవత్సరం ముగింపుకు వచ్చినందువల్ల మన మదుపు-పన్ను రాయితీ సరిపోతున్నాయో లేదో సమీక్షించుకోవాలి.

ఆదాయ పన్ను

ఫొటో సోర్స్, Getty Images

కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు

ఏప్రిల్:

1. ఆదాయపు పన్ను రాయితీ కోసం చేసే 80సి, ఇతర మదుపు వివరాలు కంపెనీకి తెలపడానికి గడువు ఏప్రిల్ రెండో వారంలో ఉంటుంది. కొన్ని కంపెనీలలో ప్రతి నెలా ఈ వివరాలు మార్చుకునే అవకాశం ఉంటుంది కానీ ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ నెలలో ముగించడం చెప్పదగిన సూచన.

2. కొత్త మదుపు, ఉన్న మదుపులో ఏవైనా మర్పులు చేస్తే అందుకు తగినట్టు మన బ్యాంక్ అకౌంట్ నుంచి వేళ్ళే ఆటో డెబిట్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి.

3. క్రెడిట్ కార్ద్ సంబంధించిన ఏదైనా వివాదాలు ఉంటే అవి పరిష్కరించుకోవడానికి తగిన సమయం.

మే, జూన్:

ఈ రెండు నెలల్లో ప్రభుత్వానికి లేదా కంపెనీకి సంబంధించిన గడువులు లేవు. అందువల్ల మన పోర్ట్ ఫోలియో పనితీరు సమీక్షించుకోవడనికి ఇది సరైన సమయం. వ్యక్తిగత ఆర్థిక సలహాదారు ఉంటే వారితో మాట్లాడి మన పోర్ట్ ఫోలియోలో ఏవైనా మార్పులు చేయడానికి ఇది తగిన సమయం.

జూలై:

ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు 31న ముగుస్తుంది. జరిమానా నుంచి తప్పించుకోవడానికి గడువు లోపు రిటర్న్స్ దాఖలు చేయాలి.

మనీ

ఫొటో సోర్స్, Getty Images

పండుగల సీజన్...

ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్:

ముఖ్యమైన పండగలు వచ్చే నెలలు. కొంత అధిక ఖర్చులు ఉండే నెలలు. పర్సనల్ ఫైనాన్స్ మౌలిక సూత్రం ప్రకారం తప్పించుకోలేము అని తెలిసిన ఖర్చుల కోసం ముందు నుంచే తయారుగా ఉండాలి. అంటే పండగ ఖర్చులు కోసం కూడా ఇప్పటి నుంచే ఆలోచించాలి.

పండగ ఖర్చులతో పాటూ ఈ మూడు నెలల్లో పిల్లల స్కూల్ ఫీజులు రెండవ/మూడవ ఇన్స్టాల్మెంట్ కట్టే సమయం.

కాబట్టి మనం చేసే స్వల్ప కాలిక మదుపు ప్రతీ ఏడాది ఆగస్ట్/సెప్టెంబర్ మధ్య మనకు అందుబాటులో ఉండేలా చూసుకోవడం చెప్పదగిన సూచన. 

నవంబర్, డిసెంబర్:

ఏడాదిలో ముప్పావు భాగం పూర్తయ్యే సమయం.

1. ఇప్పటి దాకా మనం చేసిన మదుపు మన ఆర్థిక లక్ష్యాలకు తగిన విధంగ ఉందో లేదు చూసుకోవాలి. గత ఎడాదితో పోల్చుకుంటే మన మదుపు ఎంత రాబడి ఇచ్చిందో ఆర్థం చేసుకోవాలి. అవసరమైతే మదుపు మార్గాలను మార్చడానికి తగిన సమయం.

2. జనవరి/ఫిబ్రవరి నెలల్లో కంపెనీలో సమర్పించాల్సిన డాక్యుమెంట్లన్నీ జాగ్రత్త పరుచుకోవడానికి తగిన సమయం. మనం ఏప్రిల్ నెలలో చెప్పిన మదుపు చేయడం కుదరకపోతే ఆ మదుపు చేసే చివరి అవకాశం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)