రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు సరిపడా డబ్బు రావాలంటే ఏం చేయాలి?

పెన్షన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఐవీబీ కార్తికేయ
    • హోదా, బీబీసీ కోసం

మనకంటే ముందు తరాలకు, మన తరానికి మధ్య అతిపెద్ద తేడా ‘‘రిటైర్మెంట్ జీవితం’’ అంటే అతిశయోక్తి కాదు. పింఛను గ్యారంటీ లేని మొదటి తరం మనదే. కాబట్టి మన రిటైర్మెంట్ జీవితం ఎలా ఉండబోతుంది అనే విషయం మీద అన్నీ ఊహాగానాలు, సిద్ధాంతాలే తప్ప సరైన అవగాహన లేదు.

ఇలాంటి తరుణంలో రిటైర్మెంట్ జీవితం ఒడిదొడుకులకు గురయ్యే అవకాశం ఎక్కువ. మిగిలిన ఆర్థిక లక్ష్యాలకు రిటైర్మెంట్ విషయానికి మధ్య కొంత వ్యత్యాసం ఉంది.

రిటైర్మెంట్ తర్వాత మనకు నెలవారి జీతం తరహాలో ఆదాయం కావాల్సి ఉంటుంది. మరోవైపు ఏదైనా ఆరోగ్య సంక్షోభం లేదా ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు కొంత పెద్ద మొత్తం కూడా కావాలి. ఎందుకంటే పదవీ విరమణ తర్వాత, బ్యాంక్ రుణం పొందటం చాలా కష్టం.

డబ్బు

ఫొటో సోర్స్, PTI

ఆర్థిక ప్రణాళికల్లానే రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా అందరికీ ఒకేలా ఉండదు. వ్యక్తిగత పరిస్థితులకు తగినట్టుగా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి.

అలాగే ఉద్యోగి పని చేస్తున్న రంగాన్ని బట్టి కూడా.. రిటైర్మెంట్ ప్లాన్ విషయంలో మార్పులు అవసరం అవుతాయి. చాలామంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొంత వరకూ ఆరోగ్య బీమా కవరేజ్ ఉంటుంది. కానీ ప్రైవేట్ ఉద్యోగులకు ఆ వెసులుబాటు ఉండదు.

ఇలాంటి విషయాలన్నీ క్షుణ్నంగా ఆలోచించి మన అవసరాలకు తగినట్టుగా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి. గతంలో అనేకసార్లు చెప్పినట్టు రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది పర్సనల్ ఫైనాన్స్ పరంగా ఎక్కువగా నిర్లక్ష్యానికి గురయ్యే అంశం. కానీ ఇది సరైన ఆలోచనా ధోరణి కాదు. మన ఆర్థిక లక్ష్యాలలో రిటైర్మెంట్ అవసరాలకు కూడా తగినంత ప్రాధాన్యం ఇవ్వాలి.

ఆరోగ్య బీమా

ఫొటో సోర్స్, GETTY IMAGES/PETER DAZELEY

ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

వచ్చే ఐదు-పదేళ్లలో రిటైర్ అయ్యేవారికి చాలా పరిమితులు ఉంటాయి. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది దీర్ఘకాలిక అంశం. ప్రతీ ఆర్థిక లక్ష్యానికీ అవసరం అయ్యే సమయానికంటే చాలా ముందు నుంచే ప్రణాళిక ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలి.

కానీ ఐదేళ్లలో రిటైర్ అయ్యేవారికి ఆ వెసులుబాటు ఉండదు. ఎందుకంటే వారి ఆర్థిక లక్ష్యం చాలా దగ్గర్లో ఉంది. ఇలాంటి వారు తీసుకోవలసిన తదుపరి చర్యలు ఏమిటో ఒకసారి చూద్దాం..

  • ఆరోగ్య బీమా తగినంత ఉందో లేదో చూసుకుని ఒకవేళ తగినంత లేకపోతే కొత్తది తీసుకోవాలి. తాము తీసుకున్న పాలసీ మధుమేహం, రక్తపోటు లాంటి దీర్ఘకాలిక ఇబ్బందులకు కవరేజ్ ఇస్తుందో లేదో తెలుసుకోవాలి. ఆ వ్యాధులకు కవరేజ్ లేకపోతే వాటికి కవరేజ్ ఇచ్చే టాప్‌అప్ లేదా కొత్త పాలసీ ఎంచుకోవాలి. పైన చెప్పినట్టు కొందరు ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఆరోగ్య బీమా వెసులుబాటు ఉంటుంది. కానీ అందరికీ ఆ అవకాశం రాదు. అవకాశం ఉన్న వారికి కూడా తగినంత కవరేజ్ ఉండకపోవచ్చు. కాబట్టి వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తప్పకుండా తీసుకోవాలి.
  • ఏదైనా దురదృష్టకరమైన పరిస్థితులు జరిగినప్పుడు.. మన కుటుంబాన్ని కాపాడే మొదటి రక్షణ కవచం జీవిత బీమా. జీవిత బీమా లేకపోతే ఇప్పుడు వచ్చే అవకాశం ఉందేమో విచారించాలి. చాలా కంపెనీలు యాభై ఏళ్లు దాటినవారికి జీవిత బీమా పాలసీ ఇచ్చేందుకు విముఖత చూపిస్తాయి. ఎన్నో ప్రశ్నలు వేసి పాలసీని తిరస్కరిస్తుంటాయి. కాబట్టి మన పరిస్థితిని బట్టి పాలసీ కోసం జాగ్రత్తగా ప్రయత్నించాలి.

ఈ రెండు బీమా పాలసీలు మన రిటైర్మెంట్ ప్లానింగ్ విషయంలో అంతర్భాగమని గుర్తించాలి. ఎందుకంటే రిటైర్మెంట్ వయసు దగ్గర పడే కొద్దీ ఈ బీమా ప్రీమియం కూడా పెరుగుతుంది. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బీమా తీసుకోవాలి.

డబ్బు

ఫొటో సోర్స్, Getty Images

  • ఇప్పటిదాకా చేసిన మదుపు, తీసుకున్న పాలసీల వివరాల గురించి మన కుటుంబ సభ్యులకు, జీవిత భాగస్వామికి అవగాహన కల్పించాలి. ఫిక్సిడ్ డిపాజిట్ లాంటివి చేసి ఉంటే ఆ బ్యాంక్ ఖాతా వివరాలు కుటుంబ సభ్యులకు తెలపాలి. ఎవరూ వెనక్కు తీసుకోని ధనం మన దేశ బ్యాంకులలో కొన్ని వేలకోట్లు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు మన బ్యాంక్ వివరాలు తెలియజేయడం వల్ల ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు మన కుటుంబ సభ్యులకు ఇబ్బందులు ఉండవు.
  • మనం తీసుకున్న పాలసీలకు ఎవరిని నామినీగా చేశామో వారికి ఆ విషయం స్పష్టంగా తెలియచేయాలి. ఒకవేళ ఎవరైనా మైనర్ వ్యక్తిని నామినీగా చేసి ఉంటే.. వారి గార్డియన్ స్థానంలో ఉన్న వారికి ఈ విషయం తెలపాలి. మన తదనంతరం ఎవరికి చెందాలని మనం మదుపు చేశామో వారికి ఆ విషయం తెలియకపోతే మనం చేసిన మదుపు వృథా అని మర్చిపోకూడదు.
  • మన ఫైనాన్షియల్ సలహాదారుడి ఫోన్ నంబర్ కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంచాలి.
  • మన ఆర్థిక లావాదేవీలన్నీ ఏదైనా యాప్ ద్వారా చేస్తుంటే ఆ యాప్ పాస్‌వర్డ్ ఇతర వివరాలు మన కుటుంబ సభ్యులకు తెలిసి ఉండాలి.
వీడియో క్యాప్షన్, క్రెడిట్ స్కోర్ ఎందుకు ముఖ్యం, అది బాగుంటే కలిగే అదనపు ప్రయోజనాలు ఏంటి?

ఇప్పుడు ఎలాంటి మదుపు మార్గాలను ఎంచుకోవాలో చూద్దాం..

  • రిటైర్మెంట్ ఎంతో దూరంలో లేదు కాబట్టి.. వీరికి రిస్క్ తీసుకునే ఆస్కారం కూడా ఉండదు. అందుకే ఈక్విటీ సంబంధిత మదుపు మార్గాలలో మదుపు చేయకపోవడమే మేలు. ఒకవేళ ఏవైనా ఈక్విటీ మదుపు మార్గాలలో మదుపు చేసి ఉంటే ఆ మొత్తాన్ని అలాగే ఉంచేసి కొత్త మదుపు మాత్రం అందులో చేయకూడదు.
  • మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మదుపు చేస్తున్న వారు కూడా రిస్క్ ఎక్కువగా ఉన్న స్మాల్‌క్యాప్, ఇతర అగ్రెసివ్ ఫండ్స్ నుంచి బయటకు వచ్చి.. ఆ మొత్తాన్ని డెబిట్ ఫండ్స్ లేదా ఇతర ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మదుపు చేయడం ద్వారా నష్ట భయాన్ని తగ్గించుకోవాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ సూత్రాల ప్రకారం.. మన ఆర్థిక లక్ష్యానికి మూడేళ్ల ముందు నుంచీ మనం ఈక్విటీ మార్కెట్ నుంచి పూర్తిగా బయటపడాలి. కోవిడ్ సంక్షోభ సమయంలో దాదాపు ఏడాదిపాటుగా ఈక్విటీ మార్కెట్ డీలా పడింది. మన ఆర్థిక లక్ష్యం ఆ సమయంలో ఉంటే మనకు నష్ట భయం ఎక్కువగా ఉండేది.
  • రియల్ ఎస్టేట్, ఫ్యూచర్స్ & ఆప్షన్స్ లాంటి ఒడిదొడుకులు ఎక్కువగా ఉన్న మదుపు మార్గాలను కూడా దూరం పెట్టడం మంచిది. ఈ రంగాలలో లాభాలు సాధించినవారి గురించి అందరూ చెప్పుకుంటారు. కానీ నష్టాలు వచ్చిన వారిని మర్చిపోతుంటారు. రిటైర్మెంట్ లాంటి ముఖ్యమైన ఆర్థిక లక్ష్యానికి ఈ రంగాలు సరిపడవు.
వీడియో క్యాప్షన్, రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేసే మార్గాలివి
  • ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ద్వారా మదుపు చేసే అవకాశాన్ని పూర్తిగా వాడుకోవాలి. మనకు వచ్చే లాభాల మీద ఎలాంటి పన్ను లేని అతికొద్ది మదుపు మార్గాలలో ఈపీఎఫ్ ఒకటి. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ మొత్తం అందులో మదుపు చేయాలి.
  • నేషనల్ పెన్షన్ స్కీం లాంటి ప్రభుత్వ మద్దతు ఉండే పథకాలలో మదుపు చేయడం ఉపయోగకరం. ఈ పథకం ద్వారా మదుపు చేయడం వల్ల పన్ను రాయితీ కూడా లభిస్తుంది.
  • ఆన్యుటీ ఇచ్చే బీమా పథకాలను పరిశీలించాలి. కానీ ఆన్యుటీ ద్వారా వచ్చే ఆదాయం మామూలు ఆదాయం లాగే పరిగణించి ఆదాయపు పన్ను కట్టాలనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ పథకాలలో మదుపు చేశాక టాక్స్ తర్వాత వచ్చే ఆదాయం ఎంత అనేది చూసుకోవాలి.
  • ఆన్యుటీ పథకాలను ఉపయోగించుకోవాలంటే అందులో అత్యవసర పరిస్థితులకు ఎంత వరకూ వెనక్కు తీసుకోవచ్చో అర్థం చేసుకోవాలి. పైన చెప్పినట్టు అత్యవసర పరిస్థులను సమర్థవంతంగా ఎదుర్కోవడం రిటైర్మెంట్ ప్లానింగ్ విషయంలో చాలా కీలకమైన అంశం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)