ఝార్ఖండ్: ప్రేమించలేదని నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు, కాలిన గాయాలతో యువతి మృతి

ఝార్ఖండ్‌లో ఒక వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో పాఠశాల విద్యార్థిని మరణించిన ఘటన అక్కడ నిరసనలకు దారి తీసింది.
ఈ ఘటన ఎలా జరిగింది? తదనంతర పరిణామాలను బీబీసీ హిందీ ప్రతినిధి రవి ప్రకాశ్ అక్కడికి వెళ్లి తెలుసుకున్నారు.
రాంచీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అంకితా సింగ్, ఆదివారం ఉదయం కన్నుమూశారు. మంటల్లో తీవ్రంగా గాయపడటంతో అంకితను రాంచీలోని ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం ఆమె వయస్సు 19 ఏళ్లు.
ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధాన నిందితుడు షారూఖ్. అతను కొంత కాలంగా ఫోన్‌లో అంకితను వేధిస్తున్నారు. అంకితపై దాడి కోసం పెట్రోల్‌ను సమకూర్చి షారూఖ్‌కు సహాయం చేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
భారత్‌లో ఏటా వేల సంఖ్యలో ఇలాంటి వేధింపుల కేసులు నమోదవుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
అయితే, ఈ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హక్కుల కార్యకర్తలు అంటున్నారు. భయం కారణంగా బాధితులు ఇలాంటి ఘటనల గురించి ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావట్లేదని చెబుతున్నారు.
కొన్నేళ్లుగా అక్కడ ప్రేమను తిరస్కరించిన అమ్మాయిలపై దాడులు, యాసిడ్ పోయడానికి సంబంధించిన పలు కేసులు నమోదయ్యాయి.

అంకిత మృతి వార్త దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. నిరసనలకు కారణమైంది.
అంకిత మరణంతో ఆమె కుటుంబం విషాదంలో మునిగింది. అంకిత కుటుంబాన్ని ఎంతో ప్రేమించేదని, బాగా చదువుకోవాలని ఆశపడిందని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు.
''కుటుంబానికి అండగా నిలిచేందుకు, తన తండ్రికి సహాయంగా ఉండేందుకు అంకిత ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అని అనుకుంది'' అని ఆమె నాన్నమ్మ విమలా దేవి తెలిపారు.
ఏడాదిన్నర క్రితం క్యాన్సర్‌తో అంకిత తల్లి చనిపోయారు. తన తండ్రి, తమ్ముడు, నాన్నమ్మ, తాతయ్యతో అంకిత ఉంటున్నారు.
''తల్లి చనిపోయాక తన తమ్ముడిని అంకిత చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఆమె చాలా సున్నిత మనస్కురాలు'' అని విమలాదేవి చెప్పారు.
ఫోన్ చేసి షారూఖ్ వేధిస్తున్నాడని అంకిత తనకు చెప్పినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అంకిత తండ్రి సంజీవ్ సింగ్ పేర్కొన్నారు. మొదట దీన్ని తాను సీరియస్‌గా తీసుకోలేదని... కానీ, మరుసటి ఉదయమే షారూఖ్‌తో, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడాలని తాను అనుకున్నట్లు సంజీవ్ సింగ్ చెప్పారు.
డుమ్కాలో షారూఖ్ తమ పొరుగునే నివసిస్తారని తెలిపారు.
అంకిత మరణానికి కొన్ని గంటల ముందు షారూఖ్ ఆమెకు ఫోన్ చేశారు. తనను కలవకపోతే, చంపేస్తానంటూ ఫోన్‌లో బెదిరించారు.
ఇంట్లోని ఒక కిటికీ సమీపంలో అంకిత నిద్రిస్తుండగా.. దాదాపు ఉదయం 4 గంటల సమయంలో ఆమెపై పెట్రోల్ పోసిన షారుఖ్ నిప్పు విసిరేశారు.
అంకిత మృతికి నిరసనగా హిందూ రైట్ వింగ్ ఆర్గనైజేషన్లు నిరసనలు చేస్తున్నాయి. అంకితను ఇస్లాంలోకి మార్చి షారూఖ్ 'లవ్ జిహాద్'కు పాల్పడాలని అనుకున్నాడని ఈ సంస్థలు ఆరోపిస్తున్నాయి.
'లవ్ జిహాద్' అనే వివాదాస్పద పదాన్ని రాడికల్ హిందూ గ్రూపులు వాడతాయి. వివాహం ద్వారా హిందు మహిళలను ఇస్లాంలోకి మార్చేందుకు ముస్లిం పురుషులు ప్రయత్నిస్తారని ఈ గ్రూపులు ఆరోపిస్తాయి.

ఈ కేసు గురించి డుమ్కా నగర పోలీస్ సూపరింటెండెంట్ అంబర్ లక్రా, బీబీసీ హిందీతో మాట్లాడారు.
''ఈ నేరం మతపరమైనది కాదు. గత కొన్ని రోజులుగా షారూఖ్, అంకితకు ఫోన్ చేసి వేధిస్తున్నారు. వీరిద్దరు విభిన్న మతాలకు చెందిన వారు కావడంతో మేం ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించాం'' అని ఆయన చెప్పారు.
ఝార్ఖండ్‌లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఈ కేసు విషయంలో ప్రభుత్వాన్ని నిందిస్తోంది. ప్రభుత్వం తగినంత వేగంగా చర్యలు తీసుకోవడం లేదని, అక్కడ నెలకొన్న రాజకీయ వివాదం వైపే మొగ్గు చూపుతోందని బీజేపీ ఆరోపిస్తోంది.
ఝార్ఖండ్ ముక్తి మోర్చా నాయకత్వంలోని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును పర్యవేక్షించేందుకు సీనియర్ పోలీస్ అధికారులను డుమ్కాకు పంపించింది. అంకిత కుటుంబానికి నష్టపరిహారాన్ని ప్రకటించింది. దోషులను త్వరగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది.
ఝార్ఖండ్ హైకోర్టు, ఈ హత్యకు సంబంధించిన పూర్తి నివేదికను ఇవ్వాలని పోలీసులకు కోరింది. బాధిత కుటుంబానికి భద్రత కల్పించాలని ఆదేశించింది.
అంకిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెండు వీడియాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక వీడియోలో ఆమె డుమ్కా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌కు తనపై షారూఖ్ కిటికీ నుంచి పెట్రోల్ పోశాడని చెప్పడం కనబడుతుంది.
అంకిత శరీరంపై 45 శాతం కాలిన గాయాలు అయ్యాయని బీబీసీతో రాంచీ ఆసుపత్రికి చెందిన ఒక డాక్టర్ చెప్పారు.
''ఆమె ముఖానికి ఏమీ కాలేదు. కానీ, శరీరం బాగా కాలిపోయింది'' అని ఆయన తెలిపారు. తన వివరాలను చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు.
డుమ్కాలో అంకిత కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
''ఆమె లేకుండా ఇంట్లో వెలితిగా ఉంది. కేవలం ఇప్పుడు ఆమె జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి'' అని ఆమె నాన్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు మహిళలు మృతి, అసలేం జరిగింది?
- భారత్ ఉత్పత్తులపై నిషేధాన్ని పాకిస్తాన్ ఎత్తివేయక తప్పదా?
- మిఖాయిల్ గోర్బచెవ్: సోవియెట్ యూనియన్ చివరి అధినేత మృతి
- అమెరికా డ్రోన్లు పాకిస్తాన్ గగనతలం నుంచి అఫ్గానిస్తాన్‌లోకి ప్రవేశిస్తున్నాయా?
- గోర్బచెవ్ కథ ఎలా ముగిసింది, అమెరికాను సవాలు చేసిన అత్యంత శక్తిమంతమైన దేశం ఎలా పతనమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











