బిల్కిస్ బానో గ్రామం రంథిక్ పూర్ నుంచి ముస్లిం కుటుంబాలు ఎందుకు వెళ్లిపోతున్నాయి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, Pavan Jaishwal
- రచయిత, తేజస్ వైద్య
- హోదా, బీబీసీ గుజరాతీ

- బిల్కిస్ బానో మీద సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. వీరి విడుదల తర్వాత బిల్కిస్ బానో స్వగ్రామానికి చెందిన సుమారు 500 మంది ముస్లింలు రంథిక్ పూర్ గ్రామం విడిచి వెళ్లిపోతున్నారు.
- దోషులను క్షమాభిక్షతో విడుదల చేయడంపై మాట్లాడేందుకు వారు సిద్ధంగా లేరు.
- ఈ 11 మంది దోషుల్లో చాలా మంది సింగ్ వాడ్ గ్రామానికి చెందిన వారు. ఈ గ్రామం రంథిక్ పూర్ పక్కనే ఉంది.
- బీబీసీ ఈ గ్రామాన్ని సందర్శించే సమయానికి గ్రామంలో చాలా ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. ఆగస్టు 22న బీబీసీ ఈ గ్రామానికి వెళ్ళింది.
- ఒక ఇంటిపై స్వాతంత్ర్య దినోత్సవానికి ఎగరేసిన జెండా ఎగురుతోంది.
- 2002 గోద్రా ఘటన తర్వాత రంథిక్ పూర్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ, అక్కడ నివసించే హిందూ ముస్లిం జనాభా మాత్రం ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కోల్పోయారు.

"మొదట్లో కొంత భయం ఉండేది. కానీ, బిల్కిస్ బానో అత్యాచార కేసులో శిక్ష అనుభవించిన 11 మంది దోషులను ప్రస్తుతం విడుదల చేశారు. వీళ్ళను విడుదల చేసిన తర్వాత మా ఊరి నుంచి సుమారు 500 మంది బయటకు వెళ్లిపోయారు" అని రంథిక్ పూర్ గ్రామానికి చెందిన ఇమ్రాన్ చెప్పారు. ఈయన బిల్కిస్ బంధువు.
రంథిక్ పూర్ దాహోద్ జిల్లాలో గోద్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2002 ఫిబ్రవరి 27న గోద్రా అల్లర్లు చెలరేగిన సమయంలో బిల్కిస్ బానో రంథిక్ పూర్‌లో ఉన్నారు.
ఈ అల్లర్ల నుంచి బయటపడేందుకు ఆమె కుటుంబం తప్పించుకుని పారిపోతుండగా, ఆ కుటుంబాన్ని చపర్వాడ్ గ్రామం దగ్గర అడ్డుకుని ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. బిల్కిస్ బానో కుటుంబ సభ్యులను హతమార్చారు.
ప్రస్తుతం ఈ కేసులో దోషులను విడుదల చేయడం పట్ల రంథిక్ పూర్ గ్రామస్తులెవరూ మాట్లాడేందుకు సిద్ధంగా లేరు. కొంత మంది ముస్లింలు మాత్రం గొంతు విప్పారు.
బిల్కిస్ తండ్రి ఇక్బాల్ మొహమ్మద్ రంథిక్ పూర్‌లో ఉన్న ముస్లిం వీధిలో ఉంటారు. "ఈ దేశంలో అమ్మాయిలందరూ తన సొంత కూతుర్లలాంటి వారని మోదీ అన్నారు. అలా అయితే, బిల్కిస్ కూడా ఆయన కూతురే కదా. ఆయన బిల్కిస్‌కు న్యాయం చేయలేరా?'' అని ఇక్బాల్ మొహమ్మద్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం క్షమాభిక్ష పెట్టిన 11 మంది దోషులు చిన్న నేరస్థులు కాదు. వారు చాలా హేయమైన నేరానికి పాల్పడ్డారు. అటువంటి వారికి క్షమాభిక్షను ప్రసాదించమని ఈ దేశ రాజ్యాంగం చెబుతుందా?'' అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Pavan Jaishwal
ఈ కేసులో దోషుల ఇళ్ళు బిల్కిస్ బానో నివాసం ఉన్న ఇంటికి అర కిలోమీటర్ దూరంలోనే ఉంటాయి.
రంథిక్ పూర్‌లోని ముస్లింలు నివాసముండే ప్రాంతాల నుంచి ఇప్పటికే చాలా మంది ముస్లింలు ఇళ్ళు ఖాళీ చేసి వలస వెళ్ళిపోతున్నట్లు కొంత మంది స్థానికులు చెప్పారు.
బీబీసీ బృందం ఆ గ్రామానికి చేరేసరికి చాలా ఇళ్లకు తాళాలు పెట్టి ఉన్నాయి. కొంత మంది తమ సామాన్లను సర్దుకుంటూ కనిపించారు.
పోలీసు స్టేషన్ పక్కనే ఉన్నప్పటికీ అక్కడ నుంచి ఖాళీ చేసి బయటకు వెళుతున్నారు.
2002 అల్లర్ల తర్వాత ముస్లింలు ఊరు ఖాళీ చేసి వెళ్లడం ఇది రెండో సారి.
ఆగస్టు 23న బీబీసీ బృందం తిరిగి ఊర్లోకి వెళ్లేసరికి ఒక్క ముస్లిం కుటుంబం కూడా ఊర్లో లేదు. అన్ని ఇళ్లకు తాళాలు పెట్టి ఉన్నాయి.
ఖాళీ అయిపోయిన వీధుల్లో మేకలు, కోళ్ల అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి.
కొంత మంది యువత మాత్రం ఊర్లో ఉండిపోయారు. ఇలా ఉన్న వారిలో బిల్కిస్ బంధువు ఆయూబ్ భాయ్, ఆయన కొడుకు ఇమ్రాన్ ఉన్నారు.
వీళ్ళు కూడా మరో రెండు రోజుల్లో వెళ్లిపోతామని చెప్పారు.

ఇంటి మీద త్రివర్ణ పతాకం
బీబీసీ బృందం అమీనా బానో ఇంటికి వెళ్లేసరికి వారు సామాన్లన్నీ సర్దేసుకున్నారు. ఆమె ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగురుతోంది.
"ఈ 11 మంది దోషులను విడుదల చేయడంతో మాకు చాలా భయంగా ఉంది. నా కొడుకును 2002 అల్లర్లలో చంపేశారు. మేము ఆకలి, దప్పులతో అడవుల్లో అలమటించాం. మాకు మళ్ళీ భయం మొదలయింది. తిరిగి అల్లర్లు చెలరేగుతాయేమోనని భయంగా ఉంది'' అని ఆమె బీబీసీతో చెప్పారు.
ఆమె పొరుగింట్లో ఉండే మదీనా బానో కూడా లగేజీ ప్యాక్ చేసుకున్నారు.
"ఊరంతా వెళ్లిపోతుంటే మేమొక్కరిమే ఎలా ఉండగలం? నాకు వయసులో ఉన్న కూతుర్లు ఉన్నారు. మా కుటుంబం మొత్తం ఊరు వదిలి వెళుతున్నాం" అని చెప్పారామె.

ఫొటో సోర్స్, Pavan Jaishwal
"ఎవరిని నమ్మాలి?"
రంథిక్ పూర్ ముస్లింలు జిల్లా మేజిస్ట్రేట్‌కు దరఖాస్తు సమర్పించారు.
"వారిచ్చిన దరఖాస్తు అందింది. వాళ్ళు భయపడేందుకు ఏమి లేదని భరోసా ఇవ్వాలనుకున్నాను. మీకేమైనా బెదిరింపులు వచ్చాయా అని కూడా అడిగాను. వారికెటువంటి బెదిరింపులు రాలేదని చెప్పారు. కానీ, వాళ్ళు భయపడుతున్నారు. ఎవరైనా బెదిరింపు చర్యలకు పాల్పడితే వారి పై చర్యలు తీసుకుంటాం. ఈ అంశం గురించి మేం ఎస్‌పీతో చర్చించాం" అని జిల్లా మేజిస్ట్రేట్ హర్షిత్ గోసావి చెప్పారు.
ఇక్కడ రాత్రి పూట పోలీసులను గస్తీకి నియమించినట్లు కనిపిస్తోంది. కానీ, ''2002లో పోలీసులు ఉన్నప్పటికీ, మా ఇళ్లను కాల్చారు. మేమెవరిని నమ్మాలి?" అని అయూబ్ భాయ్ అడిగారు.

దోషులను విడుదల చేయడం గురించి మాట్లాడుతూ, "స్వతంత్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తయినందుకు ఈ దేశం అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో, హేయమైన అత్యాచార నేరానికి పాల్పడిన నేరస్థులను విడుదల చేశారు" అని ఇక్బాల్ మొహమ్మద్ అన్నారు.
"వాళ్ళు జైలు నుంచి విడుదలైన తర్వాత గ్రామంలో బాణాసంచా కాల్చారు. దీంతో, మాకు మరింత భయంగా ఉంది. దేశంలోని చాలా జైళ్లలో 20 - 30 ఏళ్లుగా జైలు శిక్షను అనుభవిస్తున్నవారు ఉన్నారు. కానీ, ఇలాంటి అరుదైన కేసులో మాత్రమే దోషులకు క్షమాభిక్ష ఎందుకు పెట్టారు?" అని ప్రశ్నించారు.
రంథిక్ పూర్‌లో మెడికల్ షాపు నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని దోషుల విడుదల గురించి ప్రశ్నించినప్పుడు, "నేనీ షాపులో పని చేస్తున్నాను. మీరు మా యజమానిని అడగండి. నాకేమి తెలియదు" అని సమాధానమిచ్చారు.
"2002లో నేను చాలా చిన్నవాడిని. నాకేమి తెలియదు" అని మరొక కిళ్లీ కొట్టు నడుపుతున్న వ్యక్తి చెప్పారు.
2002 అల్లర్ల తర్వాత ఆ గ్రామంలో హిందూ ముస్లిం జనాభా ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కోల్పోయారు.

ఫొటో సోర్స్, TEJAS VAIDYA
వారు ఒకరితో ఒకరు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తారు, పక్క పక్కనే నివసిస్తారు. కానీ, వారి మధ్య ఎటువంటి బంధం కనిపించదు.
రంథిక్ పూర్‌లో కొంత మంది మాత్రం దోషుల్లో కొంత మంది అమాయకులని అంటారు.
ఈ దోషులకు ఘనంగా స్వాగతం పలకడం ఎంత వరకు సబబని ప్రశ్నించినప్పుడు, "అందులో తప్పేముంది?" అని టీనా బెహన్ దర్జీ అనే వ్యక్తి వ్యాఖ్యానించారు.
"దోషుల్లో కొంత మంది ఎటువంటి తప్పు చేయలేదు. అటువంటి వారికి స్వాగతం పలకడంలో తప్పేమి లేదు" అని మరొక వ్యక్తి కూడా సమర్ధించారు.
గ్రామ మహిళా సర్పంచ్ ఈ విషయం గురించి మాట్లాడేందుకు సుముఖత చూపించలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం, రంథిక్ పూర్‌లో 3,177 మంది జనాభా ఉన్నారు. ఇప్పుడు ఈ జనాభా పెరిగి ఉండొచ్చు.
రంధిక్ పూర్, సింగ్ వాడ్ గ్రామాల్లో ప్రధానంగా కోలి గిరిజన తెగ సముదాయం, ముస్లింలు ఉంటారు. జనం వ్యవసాయం, వ్యవసాయ కూలి పనుల చేస్తుంటారు. దుకాణాలు, చిన్న వ్యాపారాల్లో కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బిల్కిస్ బానో ఇల్లు
బిల్కిస్ బానో తండ్రి ఇల్లు చుందాడి రోడ్డు దగ్గర ఉంది. ఆ ప్రాంతాన్ని 2002 అల్లర్లలో ధ్వంసం చేశారు. ఇప్పుడు అక్కడ శుభాష్‌భాయ్ అనే వ్యక్తి రెడీమేడ్ దుస్తుల దుకాణం నడుపుతున్నారు. ఆయన రాజస్థాన్ నుంచి వచ్చారు.
మేం దుకాణానికి వెళ్లినపుడు టీ తాగాలని, అల్పాహారం తినాలని ఆయన పట్టుపట్టారు.
''మేం 2003-04 నుంచి ఈ షాపును అద్దెకు తీసుకుని నడుపుతున్నాం. మా దగ్గర దుస్తులు కొనటానికి హిందువులు, ముస్లింలు ఇరువురూ వస్తుంటారు'' అని శుభాష్‌భాయ్ చెప్పారు.
ఆయన వ్యాపారం బాగానే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. రోడ్డుకు అవతల కూడా ఆయనకు మరొక దుకాణం ఉంది.

ఫొటో సోర్స్, TEJAS VAIDYA
దోషుల ఆలయాల సందర్శన
జైలు నుంచి విడుదల చేసిన కొందరు దోషులతో మాట్లాడటానికి మేం ప్రయత్నించాం. కానీ వారు మాట్లాడటానికి తిరస్కరించారు.
స్థానిక జర్నలిస్టు ఒకరి సాయంతో రాధేశ్యామ్ షాతో మేం ఫోన్‌లో మాట్లాడాం. ''ఈ కేసు గురించి నేను ఇప్పుడు ఏమీ మాట్లాడను. నేనిప్పుడు రాజస్థాన్‌లో ఉన్నాను. ఇక్కడే ఉండాలనుకుంటున్నాను'' అని ఆయన చెప్పారు.
''నేను నా జీవితంలో ఎన్నడూ పనివెల ప్రాంతంలోని కొండల మీదకు (బిల్కిస్ బానో మీద సామూహిక అత్యాచారం జరిగిన ప్రాంతం) వెళ్లలేదు. నేను నిర్దోషిననే చెప్తాను'' అన్నారాయన.
మరో దోషి గోవింద్ రావల్ ఇంటికి మేం చేరుకున్నపుడు.. ''ఆయన ఇంట్లో లేరు'' అని మాకు సమాధానం లభించింది.
''ఆయన కోరిక నెరవేరింది. వివిధ గుళ్లను సందర్శించటానికి ఆయన వెళ్లారు'' అని ఆయన కుటుంబ సభ్యులు ఒకరు చెప్పారు.
ఈ కేసులో క్షమాభిక్ష గురించి మాట్లాడటానికి సదరు కుటుంబ సభ్యులు నిరాకరించారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ - బూరుగు: ఆ గిరిజన గ్రామాల్లో రోజంటే 12 గంటలే
- వీర్యం లేదు, అండం లేదు, కృత్రిమ పిండం తయారైంది.. పైగా గుండె కొట్టుకుంటోంది
- మనుస్మృతి ఏం చెబుతోంది... 2,000 ఏళ్ల నాటి ఈ హిందూ నియమావళిని నేటి భారత మహిళలు పాటించాలా?
- కాళీమాతను మాంసాహారం, మద్యం తీసుకునే దేవతగా ఊహించుకునే హక్కు నాకుంది - తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా
- హిందుత్వ జెండాను మోస్తున్నవారు ఎవరు, హిందూ దేశ నిర్మాణానికి సైనికులు సిద్ధమవుతున్నారా
- ఇండియా హిందూ దేశంగా మారుతోందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














