‘‘హిందూ దేశం’’: భారతీయ ముస్లింలలో ఎలా భయాన్ని పుట్టిస్తున్నారు, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, మారేందుకు ఏం చేయాలి

- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఈ మధ్య కాలంలో, అధికారంలో ఉన్న వ్యక్తులు, ప్రజా ప్రతినిధులు తరచూ టీవీ ఛానళ్లలో కనిపిస్తున్నారు. అనేక రకాల విషయాలపై మాట్లాడుతున్నారు, ప్రకటనలు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఈ విషయాలను ప్రజలు తమ వ్యక్తిగత సంభాషణల్లోకి కూడా రానిచ్చేవారు కాదు.
వారు మాట్లాడే మాటల్లో ముస్లింలు, వారి ఆహారం, జీవనశైలి, మతపరమైన కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
దుస్తుల ద్వారా అల్లరి మూకలను గుర్తించడం , ***ను కాల్చండి అనడం, హైవేపై నమాజు చేసేవారి ప్రస్తావన తీసుకురావడం, ఇంతకు ముందు పేదలకు ఇచ్చే రేషన్ అంతా అబ్బాజాన్ (ముస్లింలు అని చెప్పడానికి ఉపయోగించే పదం) లు తీసుకెళ్లేవారు....ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇలాంటి ప్రకటనలు మరింత వెల్లువెత్తుతాయి. అయితే ఈ హంగామా ఆగేది కాదు.
భారతదేశంలో స్వతంత్రానికి పూర్వమే హిందూ, ముస్లింల మధ్య విభేదాలు ఉండేవి. అప్పుడప్పుడూ అల్లర్లు, ఘర్షణలు చెలరేగేవి కూడా.
కానీ, ఇటీవల కాలంలో రాంచీ (1967), మేరఠ్ (1987), భాగల్పూర్ (1989), కాన్పూర్-ముంబయి (1992), అహ్మదాబాద్ (2002) వంటి భయంకరమైన అల్లర్లు జరగలేదన్నది కూడా నిజం. ఒక్క 2022 దిల్లీ అల్లర్లు తప్ప.
అయితే, ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు మునుపటి కంటే ముదురుతున్నట్లు కనిపిస్తోంది. దీని వెనుక, దేశంలో ముస్లింలకు సంబంధించిన అంశాలు రోజూ వార్తల్లోకి రావడమే కారణం కావచ్చు. అంతరాన్ని తగ్గించే బదులు, దానిని మరింతగా పెంచే ఆ అంశాలేంటో ఈ కథనంలో చూద్దాం.

హిందూ-ముస్లిం వివాదానికి సంబంధించిన అంశాలు రాజకీయ వర్గం నుంచి మాత్రమే వస్తున్నాయని కాదు. సమాజంలోని ప్రతి వర్గం నుంచి, సోషల్ మీడియాలో, పార్టీల ప్రతినిధుల నుంచి వాట్సాప్ గ్రూపులో బంధువుల వరకు ఈ అంశాలపై చర్చలు, వివాదాలు జరుగుతూనే ఉన్నాయి.
కొన్నిసార్లు మత పరిరక్షణ పేరుతో, కొన్నిసార్లు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ, కొన్నిసార్లు మాంసం దుకాణాల గురించి, మరి కొన్నిసార్లు పార్కులు, మాల్స్‌లో ప్రార్థనల గురించి, హిజాబ్ ధరించడం గురించి, మైకుల్లో వినిపించే ఆజాన్ గురించి వివాదం సృష్టించడం..ఇలా ఏదో ఒక రూపంలో మతపరమైన అంశాలను తెరపైకి తెస్తూనే ఉన్నారు.
నిశితంగా పరిశీలిస్తే, వీటన్నిటి వెనుక భారతదేశం హిందూ దేశమని, ఇక్కడ ప్రతీది వారి ఇష్టాయిష్టాల ప్రకారమే జరగాలని నమ్మే వారే ఎక్కువగా కనిపిస్తారు.
వీళ్లే కొన్నాళ్ల క్రితం కొన్ని నినాదాలు చేశారు. భారతదేశంలో నివసించాలంటే 'వందేమాతరం చెప్పాలి ', 'జై శ్రీరాం అనాలి ' వంటి నినాదాలు రాజస్థాన్‌లోని ఉదయపూర్, కరౌలీ నుంచి కర్ణాటకలోని హుబ్లీ వరకు వినిపించాయి.
ఈ మొత్తం వ్యవహారంలో భారతదేశాన్ని కేవలం హిందూ దేశంగా చూసేవారు ఒకవైపు, దేశంలోని ముస్లిం పౌరులు మరొకవైపు ఉన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 80 శాతం వర్సెస్ 20 శాతం పోరు గురించి మాట్లాడిన విషయాన్ని గుర్తుతెచ్చుకోండి.
అయితే తాను 80-20 అన్నది హిందూ, ముస్లింల గురించి కాదని, దేశభక్తులు, దేశ విరోధుల గురించి ఉద్దేశించి అన్నమాటలని యోగి వివరణ ఇచ్చారు.
ఏది ఏమైనప్పటికీ, కావాలనే ఇలాంటి అంశాలను లేవనెత్తుతూ, 80 శాతం హిందువులకు భరోసా, 20 శాతం ముస్లిలకు భయం రేకెత్తిస్తున్నట్టు అనిపిస్తోంది.

ఫొటో సోర్స్, SOPA Images
హిందూ దేశం
హిందూ మతాన్ని రాజకీయాల్లో కేంద్రంగా చేసేందుకు వినాయక్ దామోదర్ సావర్కర్ హిందుత్వ అనే పదాన్ని ప్రయోగించారు. తొలిసారిగా 1923లో ఆయన రాసిన పుస్తకం 'ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ'లో ద్విజాతీయవాదం వాదనను ముందుకు తీసుకొచ్చారు. ప్రాథమికంగా హిందువులు, ముస్లింలు వేరు వేరని నిరూపించడానికి ఆయన ప్రయత్నించారు.
భారతదేశం హిందువులకు మాతృభూమి, పవిత్ర భూమి అని సావర్కర్ పేర్కొన్నారు. ముస్లిలకు, క్రైస్తవులకు ఇది పుణ్యభూమి కాదని, వారి తీర్థ స్థలాలు దేశం వెలుపల ఉన్నాయని ఆయన అన్నారు.
అయితే, హిందుత్వ పదాన్ని సావర్కర్ సృష్టించలేదని, కాకపోతే ఆయన దాన్ని విస్తృతంగా వాడారని కొందరు నమ్ముతారు.
ఆర్ఎస్ఎస్ దృష్టిలోని హిందూ దేశం, సావర్కర్ కోరుకున్న 'హిందూ దేశం’ ఒకటి కాదని కొందరు చరిత్రకారులు భావిస్తారు.
ఆర్ఎస్ఎస్ దృష్టిలో హిందూ దేశం నిర్వచనం, దాని వెనకున్న ఆలోచనల వివరాలు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ జీవిత చరిత్రలో ఉన్నాయి. 1925లో విజయదశమి రోజున నాగ్‌పుర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను స్థాపించారు. అయితే, దీనికి గ్రౌండ్ వర్క్ అంతకు కొన్నేళ్ల క్రితమే ప్రారంభమైంది.
1925కు మూడు నాలుగు సంవత్సరాల ముందు నుంచే నాగపుర్‌లో హిందూ, ముస్లిం విభేదాలు సాధారణం అయ్యాయి. ఆర్ఎస్ఎస్ వెబ్‌సైట్‌లో ఉన్న 'నాగ్‌పుర్ అల్లర్ల కథనం'లో ఈ విషయాలన్నీ రాశారు.
క్లుప్తంగా చెప్పాలంటే, హిందువులలో ఉన్న న్యూనతా భావాన్ని తొలగించి, హిందువులుగా 'గర్వపడే’ స్థాయికి తీసుకెళ్లడమే 'హిందూ దేశం' వెనుక ఉద్దేశమని హెడ్గేవార్ పేర్కొన్నారు. ముస్లింల కంటే హిందువులు బలవంతులు అనే భావన పెంపొందించడమే దీని లక్ష్యం. ఆర్ఎస్ఎస్ ‘హిందూ దేశం’ దార్శనికత కూడా ఇదే.

ఫొటో సోర్స్, PTI
ముస్లింలలో భయం
నేడు భారత దేశంలో హిందువుల జనాభా 95 కోట్లకు పైనే ఉంది. ఒకప్పుడు హెడ్గేవార్ హిందువుల్లో ఉన్న ఏ భయం గురించి మాట్లాడారో, ఇప్పుడు ముస్లింలలో అదే భయం చోటుచేసుకుంటోంది. దాని గురించి వారు ఫిర్యాదు చేస్తున్నారు కూడా.
గత కొన్నేళ్లుగా భారతదేశంలోని ముస్లింలలో 'భయం' గూడుకట్టుకోవడం ప్రారంభమైంది. ఈ భయం రూపాలు అనేకం.
కర్ణాటకలో హిజాబ్ వివాదంతో చర్చల్లోకి వచ్చిన ముస్కాన్ కూడా ఈ భయాన్ని బీబీసీతో సంభాషణలో ప్రస్తావించారు.
"నేను హిజాబ్ వేసుకుని కాలేజీకి వెళ్లాను. దాన్ని తొలగించమని వాళ్లు నన్ను బెదిరించారు. నా కంటే ముందే నలుగురు అమ్మాయిలను వాళ్లు అడ్డుకున్నారు. నాకు భయమేస్తే అల్లా పేరు తలుచుకుంటాను" అని ముస్కాన్ చెప్పారు.
దిల్లీలోని జహంగీర్‌పురి ముస్లింలలో కూడా ఇలాంటి భయం కనిపిస్తోంది. జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి రోజు ఊరేగింపులో హింస చోటుచేసుకున్న ఘటన తరువాత ఒక ఇంటికి తాళం పడింది. ఆ ఇంట్లో నివసిస్తున్న ముస్లిం వ్యక్తి గురించి గత రెండు మూడు నెలలుగా ఎలాంటి సమాచారం లేదు.
ఎక్కడికి వెళ్లారో, ఎప్పుడు తిరిగి వస్తారో ఎవరికీ తెలియదు. ఆయన గురించి పక్కింటివాళ్లు చెప్పిన విషయాలు మాత్రమే ఇప్పటికి తెలుసు.
"అతడు ఇక్కడ అద్దెకు ఉంటాడు. చికెన్ సూప్ అమ్ముతుండేవాడు. కానీ, భయంతో పారిపోయాడు" ఇవే వాళ్లు చెప్పిన విషయాలు.
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో రామనవమి ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనల తరువాత, అనేక మంది ఇళ్లు, దుకాణాలను బుల్డోజర్లతో తొక్కించారు. ఖర్గోన్‌లోని ఖస్‌ఖస్ వాడీలో కూల్చివేసిన హసీనా ఫక్రూ ఇల్లు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఆమెకు ఇచ్చినది.
"ప్రభుత్వం ఇల్లు మాత్రమే ఎందుకు కూల్చింది. మమ్మల్ని కూడా చంపేయాల్సింది" అని ఆమె భయం, కోపంతో అన్నారు.

నవరాత్రుల సమయంలో మాంసం దుకాణాలను బలవంతంగా మూసివేయడంపై వ్యాపారులు అదే 'భయం' వ్యక్తం చేశారు. జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం ఉందన్న ఆరోపణలపై దర్యాప్తు తరువాత వారణాసిలో శుక్రవారం ప్రార్థనలు చేసేవారు కూడా అదే భయాన్ని వ్యక్తం చేశారు.
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మ ప్రకటన తర్వాత, భారతదేశంలోని వివిధ నగరాల్లో వివాదం చెలరేగింది. జూన్ 11, శుక్రవారం ప్రార్థనల తరువాత పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ తరువాత ఉత్తర్ ప్రదేశ్‌లోని అనేక నగరాల్లో ప్రజల ఇళ్లపైకి బుల్డోజర్లు లేచాయి.
ప్రయాగ్‌రాజ్ హింసాకాండలో ప్రధాన సూత్రధారిగా చెబుతున్న జావెద్ ఇంటిని కూడా బుల్డోజర్లతో కూల్చివేశారు. జావెద్ కుటుంబ సభ్యులు కూడా ఇదే 'భయాన్ని’ వ్యక్తం చేశారు.
ఈ పేర్లన్నింటినీ పరిశీలిస్తే కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇలా 'భయపడిన' వారందరూ ముస్లింలు. చాలా సందర్భాల్లో ఈ భయం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనిపిస్తోంది.
అయితే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, మహారాష్ట్ర వంటి బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ భయ వాతావరణం ఉందనేది వాస్తవమే.
మరో నిజం ఏంటంటే, ముస్లింల ఇళ్లను మాత్రమే కాకుండా చాలా మంది హిందువుల ఇళ్లు, దుకాణాలను కూడా బుల్డోజర్‌లతో ధ్వంసం చేశారు.
ఈ కేసులన్నింటిలో సామాన్యంగా ఉన్న అంశం మతం. వీటిలో చాలావరకు కేసులు స్థానిక కోర్టుల నుంచి సుప్రీం కోర్టుకు చేరాయి. అక్కడ పిటిషనర్లకు (చాలావరకు ముస్లింలు) అనుకూలంగా తీర్పులు రాలేదు.
కశ్మీర్, సావర్కర్‌లపై పుస్తకాలు రాసిన అశోక్ కుమార్ పాండే ఈ అంశంపై మాట్లాడారు.
"హిందూ దేశం భావన మొత్తం 'ముస్లిం ద్వేషం'పై ఆధారపడి ఉంది. ఆర్ఎస్ఎస్ తనకు ఇద్దరు శత్రువులు అని ఎల్లప్పుడూ చెబుతూనే ఉంది. ఒకరు ముస్లింలు, రెండోది కమ్యూనిస్టులు. కమ్యూనిస్టులను పెద్దగా చేసేదేమీ లేదు. ముస్లింలు అత్యంత సులభమైన లక్ష్యాలుగా కనిపిస్తున్నారు. వారిని సులభంగా గుర్తించవచ్చు’’అని ఆయన అన్నారు.
ఈ భయం కారణంగానే ఒకవైపు ముస్లిం సమాజం ఏకమవుతోంది. మరోవైపు హిందూ ఐక్యత గురించి చర్చ జరుగుతోంది. ఇది వాస్తవానికి ఓటు బ్యాంకు. దీన్ని వల్ల ఎన్నికల్లో ప్రయోజనాలు పొందుతున్నారు. మతపరమైన విషయాల్లో ముస్లింలే లక్ష్యంగా ఉన్నారు. ప్రజలకు, ప్రజలకు మధ్య యుద్ధం ఎగదోశారు. హిందువుల్లో ప్రతీకారం భావనతో రగిలిపోతున్న కొందరికి ఇది సంతోషాన్నిస్తుంది.
ముస్లింల పట్ల ద్వేషం, లేదా రాజకీయ దోపిడీ ఆర్ఎస్ఎస్ స్థాపనకు ముందు నుంచే ఉంది. కానీ, దీన్ని ప్రణాళికాబద్ధంగా చేయాలంటే అధికారంలో ఉండడం అవసరం. అధికారంలో లేకుండా ఇలాంటివి ఎలా చేయగలరు? బుల్డోజర్లు ఎలా నడిపించగలరు? అధికారంలో వేరేవారు ఉంటే ఇలాంటివి అడ్డుకుంటారు. అందుకే అధికారంలో ఉండడం ముఖ్యం. అప్పుడే ఇవన్నీ అమలుచేయగలరు.
హిందువునని బహిరంగంగా, గర్వంగా చెప్పుకోవడం
ఈ ఘటనలన్నింటికీ ఒక కోణం 'భయం ' అయితే మరో కోణం 'గర్వం '. నేడు భారతదేశంలోని హిందువుల్లో ఒక వర్గం తాము హిందువులమని గర్వంగా చెప్పుకుంటున్నారు. దానిని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. అయితే, ఇదేం కొత్త కాదు. 1990ల ప్రారంభంలో విశ్వహిందూ పరిషత్ ఇలాంటిదే ఒక నినాదం ఇచ్చింది "మేం హిందువులం అని గర్వంగా చెప్పండి" అని పిలుపునిచ్చింది.
ధర్మ సంసద్ లేదా అన్ని పండుగలకూ ఊరేగింపులు ఏర్పాటు చేయడం, ఆహారంపైనా, హిజాబ్ పైనా వివాదాలు, చరిత్రను మార్చడం లేదా గుడి-మసీదు వివాదం.. ఇలా ఈ జాబితా చాలా పెద్దది.
'హిందూ దేశం' భావన వలనే ఇదంతా జరుగుతోందా?
ఈ అంశంపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్‌తో బీబీసీ మాట్లాడింది.
"హిందూ దేశం అన్న భావన సాంస్కృతికమైనది. ఇది ఏ రాష్ట్రానికి చెందినది కాదు. భారతదేశం హిందూదేశంగా మారాలనిగానీ, భారతదేశంలోని ముస్లింలు, క్రైస్తవుల పౌర హక్కులను తగ్గించాలనిగానీ వీహెచ్‌పీ కోరుకోవడం లేదు. భారతదేశ సంప్రదాయం, ఆలోచన, చరిత్ర మొదలైన వాటి నుంచి ఉద్భవించిన విశిష్టమైన భావనే హిందూ. ఇది అందరినీ కలుపుకుంటుంది. ఎవరినీ విడిచిపెట్టదు, వేరుచేయదు. ఈ విధంగా భారతదేశం ఎప్పుడూ ఒక హిందూ దేశంగానే ఉంది, ఇకపై కూడా ఉంటుంది" అని ఆయన చెప్పారు.
అయితే, అలోక్ కుమార్ చెబుతున్న 'సర్వ మానవ సౌభ్రాతృత్వం'లో కర్ణాటకకు చెందిన ముస్కాన్, ఖర్గోన్‌కు చెందిన హసీనా ఫక్రూ, జహంగీర్‌పురికి చెందిన సాహిబా, ప్రయాగ్‌రాజ్‌కు చెందిన జావెద్ కుమార్తె స్థానం ఎక్కడ ? వారి భయాలకు సమాధానం ఏది?
బుల్డోజర్ల వాడకం, గుడి-మసీదు వివాదం, హిజాబ్‌పై ప్రశ్నలు, నవరాత్రులలో మాంసంపై నిషేధం, ఊరేగింపులలో హింస.. వీటన్నింటినీ ఎలా వివరించగలరు?
గత ఏడాది నుంచీ వార్తలన్నీ ఇలాంటి ఘటనలతోనే నిండిపోయాయి.
డిసెంబరులో హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్, ఫిబ్రవరిలో కర్ణాటకలో హిజాబ్ గొడవ, మార్చిలో ఉత్తర్ ప్రదేశ్‌లో బుల్డోజర్ల ప్రయోగం, యోగి ఆదిత్యనాథ్ చరిత్రాత్మక విజయం పై సంబరాలు, ఏప్రిల్‌లో దిల్లీలో మాంసంపై నిషేధం, మేలో లౌడ్ స్పీకర్ వివాదం, రామ నవమి, హనుమాన్ జయంతి, ఈద్ ఊరేగింపులలో రచ్చ, నూపుర్ శర్మ వివాదం, జూన్‌లో జ్ఞాన్‌వాపి మసీదు సర్వే, ఫౌంటెన్-శివలింగం వివాదం, శుక్రవారం నమాజు తరువాత హింస, నిరసనకారులపై బుల్డోజర్లు పంపడం, జులైలో ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ గొంతు కోసిన ఘటన, కాళికాదేవి పోస్టర్‌పై వివాదం..
ఏడాది కాలంగా ప్రతి నెలా భారతదేశంలో ఏదో ఒక రాష్ట్రం లేదా పట్టణం నుంచి ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ సంఘటనలన్నింటికీ ఫలితం ఒక్కటే.. హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు పెరగడం.
ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ. వీహెచ్‌పీ దానికి అనుబంధ సంస్థ. భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో అనేకమంది మంత్రులు, అధికారులు ఆర్ఎస్ఎస్‌తో సంబంధం ఉన్నవారే.
అందువల్ల, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఈ రెండూ హిందూ సంస్థల ఆశయాలను రాజకీయ మార్గంలో కొనసాగిస్తోందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది.
ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ వీహెచ్‌పీ రెండూ అంగీకరిస్తాయి కూడా. 'హిందూ దేశం', హిందూ గుర్తింపు' పేరుతో నేడు దేశంలో జరుగుతున్న వాటన్నింటికీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ అండదండలు ఉంటాయని చాలామంది విశ్వాసం.
"ప్రస్తుతం భారత ప్రభుత్వానికి మనసులో హిందుత్వ పట్ల ప్రేమ ఉంది" అని వీహెచ్‌పీకి అలోక్ కుమార్ అన్నారు. అయితే, ముస్లింల పట్ల అఘాయిత్యాలకు ఈ హిందుత్వ భావనే కారణమని రాహుల్ గాంధీ, ఒవైసీ లాంటి వారు ఆరోపిస్తున్నారు.
మరి, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీలు చెబుతున్న 'హిందూ దేశం' నిర్వచనంలో ముస్లింల స్థానం ఎక్కడ అనే ప్రశ్న కలుగకమానదు.
"ముస్లింలు, క్రైస్తవులు ఎక్కడికి వెళ్లినా, ఆ ప్రాంత స్వభావాన్ని బట్టి కొంత మారతారు. అందుకే ప్రపంచంలో అందరూ క్రైస్తవులూ ఒకేలా ఉండరు. భారతదేశంలో కూడా ఈ రెండు మతాలవారు అదే పద్ధతి పాటించాలని మేం నమ్ముతాం. అందరి అభిప్రాయాలను స్వీకరించాలి. ఎవరి మీదా ఎటువంటి అభిప్రాయాలను రుద్దకూడదు. ఈ 'మార్పులు ' చేసుకుంటే ముస్లింలు, క్రైస్తవులు భారతదేశంలో సమాన హక్కులు పొందుతారు. ఇది భారత రాజ్యాంగంలో ఉంది. మా మనసులో ఉంది. దీనికి సమ్మతం కూడా ఉంది" అని అలోక్ కుమార్ అన్నారు.
అయితే, ఈ మార్పులు తీసుకురావడానికి మత పరిరక్షణ, రెచ్చగొట్తే ప్రసంగాలు అవసరమా? ముస్లింల ఇళ్లు బుల్డోజర్లతో కూల్చివేసి ఈ మార్పులు తీసుకురావచ్చా? లేదా ఆహర వ్యవహారాలపై నిషేధం విధిస్తే మార్పు వస్తుందా?

ఫొటో సోర్స్, Hindustan Times
గత సంవత్సరంలో జరిగిన ఘటనలను ఒక్కొక్కటిగా చూద్దాం.
ధర్మ సంసద్
గత ఏడాది డిసెంబర్‌లో హరిద్వార్‌లో ధర్మ సంసద్ నిర్వహించి ముస్లింలపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. ఈ ఏడాది దిల్లీ, రాయ్‌పూర్, రూర్కీలలో కూడా ఇలాంటివే ధర్మ సంసద్‌లు నిర్వహించి ఇతర మతాలపై విషం చిమ్మారు.
హరిద్వార్ ధర్మ సంసద్‌లో, మతాన్ని రక్షించడానికి ఆయుధాలు చేపట్టాలని, ఎప్పటికీ ఒక ముస్లిం ప్రధానమంత్రి కాకుడదని, ముస్లిం జనాభా పెరగకుండా చూసుకోవాలంటూ వివాదాస్పద ప్రసంగాలు చేశారు. ఇవన్నీ వీడియో రూపంలో బయటికొచ్చాయి.
అక్కడి ధర్మ సంసద్ స్థానిక నిర్వాహకుడు, పరశురామ్ అఖాడా అధ్యక్షుడు పండిట్ అధీర్ కౌశిక్ మాట్లాడుతూ, గత ఏడేళ్లుగా ఈ తరహా ధర్మ సంసద్ నిర్వహిస్తున్నామన్నారు. "గతంలో దిల్లీ, గాజియాబాద్‌లో కూడా ఇలాంటి ధర్మ సంసద్‌లు జరిగాయి. దీని లక్ష్యం 'హిందూ దేశం' ఏర్పాటుకు సిద్ధం కావడం. అందుకోసం ఆయుధాలు చేపట్టాల్సి వస్తే, అలాగే చేస్తాం" అని ఆయన అన్నారు.
భారతదేశంలో ధర్మ సంసద్‌లను ప్రారంభంచిన ఘనత వీహెచ్‌పీకి దక్కుతుంది. హిందూ సమాజాన్ని సంఘటితపరచడం, హిందూ మతాన్ని రక్షించడం, సమాజానికి సేవ చేయడం ధర్మ సంసద్ ఉద్దేశమని వీహెచ్‌పీ చెబుతోంది.
"ధర్మసంసద్ చరిత్రను పరిశీలిస్తే, 1981లో తొలిసారి దీని ప్రస్తావన వచ్చింది" అరి నీలాంజన్ ముఖోపాధ్యాయ రాసిన ‘డిమోలిషన్ అండ్ ది వర్డిక్ట్' పుస్తకంలో ఉంది.
1981 ఫిబ్రవరిలో తమిళనాడులోని మీనాక్షిపురానికి చెందిన 200 దళిత కుటుంబాలు సామూహికంగా ఇస్లాంలోకి మారాయి. అదే సంవత్సరం విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఒక కేంద్రీయ మార్గదర్శక మండలిని ఏర్పాటు చేశారు. తొలుత ఇందులో 39 మంది మత పెద్దలు ఉండేవారు. తరువాత వీహెచ్‌పీ దీన్ని విస్తరించింది. ఈ మండలి మొదటి సభ అది ఏర్పాటు చేసిన రెండు సంవత్సరాల తరువాత జరిగింది. ఆ సభకు ‘ధర్మ సంసద్’ అని పేరు పెట్టారు.
1983లో అయోధ్య ఉద్యమ పగ్గాలను వీహెచ్‌పీ తన చేతుల్లోకి తీసుకుంది. 1984 నాటికి మార్గదర్శక మండలి సభ్యుల సంఖ్య 200 పైకి చేరుకుంది. ఏప్రిల్‌లో దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో వారి మొదటి సమావేశం జరిగింది. ఇది చారిత్రాత్మక సమావేశం. రామ జన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభించాలని ఇందులోనే నిర్ణయించారు.
1985 అక్టోబర్ 31 నుంచి నవంబర్ 1 వరకు ఉడిపిలో రెండవ ధర్మ సంసద్ నిర్వహించారు. ఈసారి రామజన్మభూమి, కృష్ణ జన్మస్థాన్, కాశీ విశ్వనాథ్ కాంప్లెక్స్‌లను వెంటనే హిందూ సమాజానికి అప్పగించాలనే డిమాండ్ తీసుకొచ్చారు.
2007 వరకు 11 ధర్మ సంసద్‌లను నిర్వహించారు. ఆ తరువాత ధర్మ సంసద్ సందడి కాస్త తగ్గింది. మళ్లీ 2019 ఫిబ్రవరిలో ధర్మ సంసద్ అనే పదం గట్టిగా వినిపించింది. వీహెచ్‌పీ చివరిసారిగా నిర్వహించిన ధర్మ సంసద్ అదే. దీనికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ హాజరయ్యారు. రామమందిర నిర్మాణంపై మాట్లాడారు.
2019లోనే అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఆలయ నిర్మాణానికి మార్గాలు తెరుచుకున్నాయి.
"ఏదైనా ముఖ్యమైన అంశం సమాజం ముందుకు వస్తే. మేం ధర్మ సంసద్ నిర్వహించడానికి పిలుపునిస్తాం. లేదంటే మార్గదర్శక మండలి సంవత్సరంలో రెండుసార్లు సమావేశమవుతుంది. నిర్ణయాలు తీసుకుంటుంది" అని అలోక్ కుమార్ చెప్పారు.

యాత్రల్లో...
చాలాసార్లు ధర్మ సంసద్‌లతోపాటు ఇలాంటి మరికొన్ని వేదికలపైనా, మతపరమైన కార్యక్రమాల్లోనూ పరిస్థితులు చేయిదాటుతున్నాయి. ఉదాహరణకు భారత్‌లోని చాలా ప్రాంతాల్లో రామ నవమి యాత్రలు, హనుమాన్ జయంతి యాత్రలతోపాటు గత ఏడాది ఏప్రిల్‌లో ఈద్ నాడు కూడా ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
రామ నవమి, హనుమాన్ జయంతి వేడుకల సమయంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనల వెనుక ముస్లింలే లక్ష్యంగా కుట్ర జరిగిందని కొన్ని విపక్షాల నాయకులు చెబుతున్నారు. మరోవైపు ఇది ముస్లింల కుట్ర అని వీహెచ్‌పీ చెబుతోంది.
ఈ అంశంపై వీహెచ్‌పీకి చెందిన అలోక్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రామ నవమి రోజు దేశంలోని చాలా ప్రాంతాల్లో జరుగుతున్నట్లే దాడులు చేశారు. దీని వెనుక ఒక ప్యాటర్న్ కనిపిస్తోంది. ఎందుకంటే ఇటుకలు, రాళ్లు, బాటిళ్లు, ఆయుధాలు లాంటివి మసీదుల్లో ముందే సేకరించి పెట్టారు. వారికి సమీపంలోకి యాత్ర వచ్చే వరకు ఎదురుచూసి దాడి చేశారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం శోచనీయం’’అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, ఈ ఆరోపణలను జహంగీర్‌పురీలోని ముస్లింలు ఖండిస్తున్నారు. ఆ రోజు మసీదు ముందు కావాలనే పదేపదే యాత్ర నిర్వహించారు, అభ్యంతరకర నినాదాలు మళ్లీమళ్లీ చేశారని వారు చెబుతున్నారు.
దిల్లీలోని జహంగీర్‌పురీలో హనుమాన్ జయంతి యాత్రను వీహెచ్‌పీ నిర్వహించింది.
మన దేశంలో యాత్రల్లో ఇలా అపశ్రుతి చోటుచేసుకోవడం 1920ల నుంచి కనిపిస్తోంది. నాగ్‌పుర్‌లో అప్పట్లో ఒక మసీదు ముందు నుంచి వెళ్తూ ఇలా పదేపదే నినాదాలు చేశారు. మొదట్లో యాత్రల్లో కర్రలను కూడా తీసుకెళ్లేవారు. ఇప్పుడు కర్రలతోపాటు కత్తులు కూడా వచ్చి చేరాయి.
యాత్రల్లో హింస అనేది మతపరమైన రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్‌గా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/RSS
ఆజాన్‌తో పోటీగా హనుమాన్ చాలీసా
‘‘ప్రస్తుతం నిర్వహిస్తున్న శోభా యాత్రలు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ భక్తిని అందరికీ తెలిసేలా గట్టిగా పైకి చేప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజంగా మీకు భక్తి ఉంటే మీరు గట్టిగా పైకి చెప్పాల్సిన పనిలేదు. దేవుడికి భక్తుడికి ఉండే సంబంధం చాలా వ్యక్తిగతమైనది. దీనిలో బహిరంగంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు’’అని వారణాసిలోని సంకట్ మోచన్ దేవాలయ మహంత్ డాక్టర్ విశ్వంభర నాథ్ మిశ్ర చెప్పారు.
అయితే, ఇది కేవలం హిందువుల్లో మాత్రమే ఉందనుకోవడానికి వీల్లేదు. ఈద్ సమయంలోనూ ఇలాంటివి చోటుచేసుకున్నాయి.
రాజస్థాన్‌లోని కరౌలీలోనూ ఈద్ సందర్భంగా హింస చోటుచేసుకుంది. ఒకప్పుడు రాజస్థాన్ చాలా ప్రశాంతంగా ఉండేది. 1992లో దేశంలోని చాలా ప్రాంతాల్లో మత ఘర్షణలు చోటుచేసుకున్నప్పుడు.. జోధ్‌పుర్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కనిపించలేదు. కానీ, ఈద్ సందర్భంగా జెండాలు కట్టేటప్పుడు మొదలైన వివాదం మత ఘర్షణలుగా మారింది. చివరికి ఇక్కడ కర్ఫ్యూ కూడా విధించారు.
ఆ తర్వాత వారణాసిలోని శ్రీ కాశీ జ్ఞాన్‌వాపీ ముక్తి ఆందోళన్ మొదటగా రోజులో ఐదుసార్లు మైక్‌లో హనుమాన్ చాలీసా వినిపిస్తామని ప్రకటించింది.
మరోవైపు ఈద్ సందర్భంగా మహారాష్ట్రలోనూ ఇలాంటి వివాదమే రాజుకుంది. మసీదుల దగ్గర లౌడ్ స్పీకర్లలో వినిపించే ఆజాన్‌పై మొదట అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో కొన్నిచోట్ల జరిగినట్లే.. మహారాష్ట్రలోని మసీదుల దగ్గర లౌడ్ స్పీకర్లను తొలగించాలని డిమాండ్లు వచ్చాయి.
ఈ లౌడ్ స్పీకర్ల వివాదం హనుమాన్ చాలీసా వరకు వెళ్లింది. మహారాష్ట్రలో ఒక ఎంపీ ఈ వివాదంలో జైలుకు కూడా వెళ్లారు.
ఈ అంశంపై నిలాంజన్ ముఖోపాధ్యాయ్ మాట్లాడుతూ.. ‘‘ఈ వివాదాలను మనం జాగ్రత్తగా పరిశీలించి విశ్లేషిస్తే.. వీటన్నింటికీ రామజన్మభూమి ఉద్యమంలో మూలాలు ఉన్నట్లు కనిపిస్తాయి. ముస్లింలు ఈ దేశానికి చెందినవారు కాదని, ఇది వారి దేశం కాదని బలంగా చెబుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ వారు భారత్‌లో జీవించాలని చూస్తే, హిందువుల్లానే బతకాలని చెబుతున్నారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
రామజన్మభూమి ఉద్యమంలో మొదట్నుంచీ ఆర్‌ఎస్ఎస్, వీహెచ్‌పీ క్రియాశీల పాత్ర పోషించాయి. ఈ విషయంలో రెండు సంస్థలూ చాలా గర్వంగా ఉన్నట్లు చాలా వేదికలపై ప్రకటించాయి.

బుల్డోజర్లు..
ఈ వివాదాల వెనుక సింబల్స్, అవి ఇచ్చే సందేశాల గురించి నీలాంజన్ బీబీసీతో మాట్లాడారు.
‘‘ఇక్కడ కొన్ని వర్గాల హిందువుల కోసం కొత్త సింబల్స్ తెరపైకి తీసుకొస్తున్నారు. ముస్లింలు మనకు వ్యతిరేకులని వీటి సాయంతో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆవులు, వందే మాతరం, దేవాలయాలు, హనుమాన్ చాలీసా, లౌడ్ స్పీకర్లు.. ఈ సింబల్స్‌లో ఉన్నాయి’’అని ఆయన చెప్పారు.
మరోవైపు బుల్డోజర్లు కూడా బలానికి ప్రతీకగా మారుతున్నాయి. ఇప్పుడు మా చేతిలో అధికారం ఉంది.. అని చాటి చెప్పేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు.
భారత రాజకీయాల్లో ప్రస్తుతం బుల్డోజర్ల పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే, రెండో ప్రపంచ యుద్ధంలోనూ వీటిని ఆయుధాలుగా ఉపయోగించారు.
‘‘బుల్డోజర్ ఏన్ అప్రీషియేషన్’’ పేరుతో అమెరికా సైన్యాధికారి కల్నల్ కేఎస్ ఆండర్సన్ ఒక కథనం రాశారు. రెండో ప్రపంచ యుద్ధంలో బుల్డోజర్ల వాడకాన్ని ఆయన ఖండిస్తూ.. ‘‘ఆనాడు ఉపయోగించిన ఆయుధాల్లో బుల్డోజర్లు మొదటి వరుసలో ఉండేవి’’అని ఆయన చెప్పారు.
నేటి రోజుల్లో కూడా బుల్డోజర్‌ను యుద్ధాల్లో ఉపయోగించినట్లే ఉపయోగిస్తున్నారు. ఇక్కడ కేవలం శత్రువులు మాత్రమే మారారు.
భారత్‌లో బుల్డోజర్ల వాడకంపై సీనియర్ జర్నలిస్టు ఆశుతోష్ భరద్వాజ్ ఇటీవల ‘‘అవుట్‌లుక్’’ మ్యాగజైన్‌కు ఒక ఆర్టికల్ రాశారు. మొత్తంగా 58 ర్యాలీల్లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్‌ను ఉపయోగించినట్లు గర్వంగా చెప్పుకున్నారని తెలిపారు.
ఇళ్లను బుల్డోజర్‌తో కూలదోసినట్లు వచ్చిన వార్తలపై కొంతమంది నాయకుల్లో విపరీతమైన ఉత్సాహం కనిపించింది. ఎన్నికల విజయోత్సవ ర్యాలీల్లోనూ వారు బుల్డోజర్‌ను ఉపయోగించారు. మరోవైపు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ‘‘బుల్డోజర్ బాబా’’గా అభివర్ణించారు.
శక్తిమంతమైన రాజకీయాలకు నేడు బుల్డోజర్ సింబల్‌గా మారిపోయిందని నీలాంజన్ ముఖోపాధ్యాయ్ అన్నారు. దీనికి ఏ కోర్టు ఆదేశంతోనూ పనిలేదని ఆయన వ్యాఖ్యానించారు.

హిజాబ్ వివాదం..
ఈ సింబల్స్ ప్రతీకగా మారిన కొన్ని వివాదాలు కోర్టుల వరకు కూడా వెళ్లాయి.
ఈ అంశంపై అలోక్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘హిజాబ్ కేసులో కోర్టుకు ఎవరు వెళ్లారు. ముస్లింలే వెళ్లారు. మాకు అనుకూలంగా తీర్పు వస్తేనే మేం కోర్టులను నమ్ముతాం. లేకపోతే లేదు అనుకోవడం పొరపాటు’’అని ఆయన అన్నారు.
జ్ఞాన్‌వాపి మసీదు వివాదంలో ఏమైంది? సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు. వెంటనే మేనేజ్‌మెంట్ కమిటీ హైకోర్టును ఆశ్రయించింది. కానీ, ఫలితం లేకపోయింది.
మరోవైపు ధర్మ సంసద్ విద్వేష వ్యాఖ్యల కేసు కూడా కోర్టుకు వెళ్లింది. ‘‘నేను విద్వేష వ్యాఖ్యలకు వ్యతిరేకం. సంసద్‌లో వ్యాఖ్యలు చేసిన రిజ్వికి బెయిలు రావడానికి మూడు నెలలు పట్టింది. ఇక్కడ అన్ని చట్ట ప్రకారమే జరుగుతాయి. ఒకవేళ నూపుర్ శర్మ కూడా నేరం చేస్తే.. దానికి అనుగుణంగా శిక్ష పడుతుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’అని అలోక్ చెప్పారు.
అయితే, ఇక్కడ ప్రతి వివాదంలో ముస్లింలు వాదన భిన్నంగా ఉంది.
జ్ఞాన్‌వాపీ మసీదులో శివలింగం లాంటి నిర్మాణం బయటపడినట్లు వచ్చిన వార్తలపై అంజుమాన్ ఇంతెజామియా మసీదు కమిటీ న్యాయవాది రయీస్ అహ్మద్ మాట్లాడుతూ.. ‘‘వారు శివలింగంగా చెబుతున్నది ఒక ఫౌంటెయిన్. పైన సన్నగా కింద పెద్దగా అది ఉంది. దాన్నే శివ లింగం అని అంటున్నారు’’అని ఆయన చెప్పారు.
హిజాబ్ వివాదంలో ఇది తమకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కని అమ్మాయిలు చెబుతున్నారు. సుప్రీం కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ముస్లిం ప్రతినిధులు భావిస్తున్నారు.
హరిద్వార్ ధర్మ సంసద్‌లో విద్వేష వ్యాఖ్యలపై జమియాత్ ఉలేమా ఉత్తరాఖండ్ ప్రెసిడెంట్ మౌల్వి మొహమ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ.. ‘‘సీత లేదా రాముడి గురించి ముస్లింలు ఎవరూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయరు. కానీ, మా మీద మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం’’అని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు నేషనల్ కాన్ఫెరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా కూడా నవరాత్రి పర్వదినాల్లో మాంసం అమ్మకాలను నిషేధంపై ఇలానే స్పందించారు.

ఫొటో సోర్స్, SOPA Images
మాంసం అమ్మకాలపై నిషేధం..
భారత్‌లో ఇప్పటివరకు ఆహారం విషయంలో వివాదం ప్రధానంగా గోమాంసం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హిందువులు ఆవును పవిత్రంగా భావిస్తారు.. దీంతో చాలా రాష్ట్రాల్లో గోవధపై నిషేధం విధించారు.
భారత్‌లో 80 శాతం జనాభా హిందువులు. వీరిలో చాలా మంది ఆవులను పవిత్రంగా భావిస్తారు. అయితే, అదే సమయంలో ఇక్కడ శతాబ్దాల నుంచీ గోమాంసం తినే మాట కూడా వాస్తవమే.
గోమాంసంపై నిషేధం అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేదు. కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో గోమాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆర్‌ఎస్‌ఎస్ ఈ విషయాన్ని ప్రస్తావించదు. ఎందుకంటే స్థానిక సంస్కృతిలో ఇది భాగం కాబట్టి.
ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రజలు గోమాంసం మానేయాలని తాము ఆశిస్తున్నట్లు ఆర్‌ఎస్ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మిగతా వివాదాలతో పోల్చినప్పుడు అంత బలమైన వ్యతిరేకత సంస్థ నుంచి వ్యక్తం కాదు.
కానీ హిందూ బెల్టులో ఈ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. చాలా రాష్ట్రాల్లో గోమాంసం దుకాణాలను మూసివేయించేస్తున్నారు. మరోవైపు ఆవులను తీసుకెళ్లేవారిని వాటికి అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలపై కొన్ని సంస్థలు దాడులు కూడా చేశాయి.
అయితే, 1955లోనే, అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వానికి దశాబ్దాలకు ముందే, 24 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూడా గోవధపై నిషేధం విధించింది. అయితే, గత ఏడాది మాంసం దుకాణాలకు వ్యతిరేకంగా గుజరాత్‌లోని కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లు బహిరంగంగానే ప్రచారాలు నిర్వహించాయి.
మరోవైపు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలకు గుడ్లు ఇవ్వాలా వద్దా? అనే విషయంలోనూ వివాదముంది. బీజేపీ ప్రభుత్వ హయాంలో మధ్య ప్రదేశ్‌లో పిల్లలకు గుడ్లు ఇవ్వడాన్ని నిలిపివేశారు.
మొదట్లో గోమాంసం వరకు పరిమితమైన ఈ వివాదం తాజాగా ఇతర మాంసాలపై నిషేధం వరకు వెళ్లింది. 2022లో చైత్ర నవరాత్రి, రంజాన్ మాసాలు కలిసివచ్చినప్పుడు ఈ వివాదం స్పష్టంగా కనిపించింది.
నవరాత్రి తొమ్మిది రోజుల్లో దేశ వ్యాప్తంగా మాంసం దుకాణాలు మూసివేయాలని దిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ప్రతిపాదించారు. ఆ తర్వాత తూర్పు, దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు ఈ నిషేధాన్ని అమలు చేశాయి. దీంతో వివాదం రాజుకొంది.
జమ్మూకశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంపీలు, నాయకులు వీటిపై అభ్యంతరం వ్యక్తంచేశారు. మరోవైపు వ్యాపారులు కూడా దీని వల్ల చాలా నష్టాన్ని చవిచూశారు. షాపులు మూసివేయాలని ఆదేశాలు లేనప్పటికీ, దాడులు చేస్తారనే భయంతో చాలా మంది దుకాణాలను తెరవడం మానేశారు.
మరోవైపు హలాల్ విషయంలోనూ ఇలాంటి వివాదమే రాజుకొంది. హిందువులు, సిక్కులు దీన్ని తినకూడదని కొందరు అభ్యర్థించారు. ‘‘భారతీయుల భోజనాల్లో మాంసం కూడా ప్రధాన పోషిస్తుంది’’అని భారతీయ భోజన సంప్రదాయాలపై ఏళ్ల నుంచి పరిశోధన చేపడుతున్న డాక్టర్ మనోషి భట్టాచార్య తెలిపారు.
‘‘భారత్‌లో మాంసం తినే విధానాలను మొఘల్ పాలకులు తీసుకొచ్చారని చెప్పడం సరికాదు. కొత్త రాజ్యాలు వచ్చినప్పుడు వ్యాపారం, వ్యవసాయం, భోజన పద్ధతులు ఇలా అన్ని మారుతాయి. ఇలానే మొదట గోమాంసం, ఆ తర్వాత ఇతర మాంసాలు చాలా మంది భోజనం ప్లేట్ల నుంచి దూరం అయ్యాయి. అయితే, దీనికి మతం కారణం కాదు’’అని ఆమె చెప్పారు.
‘‘కశ్మీర్ నుంచి బెంగాల్ వరకు కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు కూడా మాంసాన్ని ఆహారంలో భాగంగా తీసుకుంటాయి. కశ్మీరీ పండిట్లుకు కూడా రోగన్ జోష్ తినే అలవాటు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. అలానే పశ్చిమ బెంగాల్‌లోనూ చాలా మంది బ్రాహ్మణులు మాంసం తింటారు’’అని భట్టాచార్య చెప్పారు.
జాతీయ కుటుంబ సర్వే సమాచారం ప్రకారం....16 రాష్ట్రాల్లో 90 శాతం మంది మాంసం, చేపలు తింటారు. నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది 75 నుంచి 90 శాతం వరకు ఉంది.
ప్యూ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సర్వే ప్రకారం.. భారత్‌లోని హిందువుల్లో 44 శాతం మంది శాఖాహారం తీసుకుంటారు. మిగతా 56 శాతం మంది మాంసాహారం తీసుకుంటారు. మరోవైపు ముస్లింలలోనూ ఎనిమిది శాతం మంది కొన్ని కారణాల వల్ల మాంసం తీసుకోని వారున్నారు.
ఇక్కడ మాంసం తినే ముస్లింలు 92 శాతం మంది ఉంటే.. మాంసం తినని హిందువులు 44 శాతం మంది ఉన్నారు. అయితే, ఈ 44 శాతం మంది కూడా మాంసాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారా?
భారత్‌లో మైనారిటీ వ్యవహారాలపై నజీమా ప్రవీణ్ ఏళ్ల నుంచీ పరిశోధన చేపడుతున్నారు. ‘‘మాంసంపై నిషేధంతో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. వీటిలో రాజకీయ కోణం కూడా ఒకటి. ఆ తర్వాత సాంస్కృతిక జాతీయవాదం, ఆ తర్వాత ఆర్థిక అంశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు రాజకీయ లక్ష్యాలు స్పష్టంగా కనపడుతుంటాయి’’అని ఆమె చెప్పారు.
‘‘ఆర్థిక అంశాల విషయానికి వస్తే, మాంసం అమ్మే ముస్లింలలో చాలా మంది ఖురేషి వర్గానికి చెందినవారే. 2017కు ముందు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అక్రమ మాంసం దుకాణాల పేరుతో చాలా దుకాణాలను మూసివేయించింది. దీంతో చాలా ఖురేషి కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. చాలా మంది ఈ బిజినెస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత పెద్దపెద్ద ప్రైవేటు సంస్థల నుంచి కొందరు మాంసాన్ని కొనుగోలు చేస్తూ విక్రయాలు మొదలుపెట్టారు. ఇలా వ్యాపారాలు మొదలుపెట్టిన వారిలో హిందువులు కూడా ఉన్నారు’’అని ఆమె వివరించారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో కొందరు ప్రభుత్వ చర్యలను కోర్టులో సవాల్ చేశారు. అయితే, దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.
మరోవైపు కన్వర్ యాత్ర మార్గంలోనూ యాత్ర జరిగేటప్పుడు మాంసం దుకాణాలు తెరవకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
అయితే, మాంసం అమ్మకాల వివాదంపై విశ్వహిందూ పరిషత్‌కు చెందిన అలోక్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘కశ్మీర్‌లో కొందరు హిందువులతోపాటు దేశంలో చాలా మంది మాంసం తినే విషయం అందరికీ తెలిసిందే’’అని అన్నారు.
‘‘గతంలోనూ కొంతమంది హిందువుల మనసుల్లో ముస్లింలపై వివక్ష ఉండేది. కానీ, అది బయటపెట్టడం సరికాదని నాయకులు భావించేవారు. కానీ, ఇప్పుడు అది సరైనదే అనే భావన ప్రజల్లోకి వెళ్తోంది. అంతేకాదు దీనిపై వేదికల మీద నుంచి ప్రసంగిస్తున్నారు’’అని నీలాంజన్ వ్యాఖ్యానించారు.
‘‘నూపుర్ శర్మ 2008-09లో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే, అంతకుముందు నుంచే అబ్బాజాన్, మియాన్ ముషారఫ్ లాంటి పదాలను కొందరు నాయకులు వాడటం మొదలుపెట్టారు’’అని ఆయన చెప్పారు.
ఇక్కడ మనం కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకోవాలి.
30 అక్టోబరు 2021లో ఉత్తరాఖండ్‌లో ఒక బహిరంగ సభను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించారు.
‘‘నేను వస్తున్నప్పుడు నిన్న నా వాహనాలను ఆపారు. ఏమైందని నేను అడిగాను. ఈ రోజు శుక్రవారం మీకు తెలియదా సర్ అని అన్నారు. శుక్రవారం అయితే, ఏమవుతుందని చెప్పారు. అప్పుడు శుక్రవారం ప్రార్థనలు చేస్తారని, దీంతో జాతీయ రహదారి బ్లాక్ అవుతుందని సమాధానం ఇచ్చారు’’అని ఆయన చెప్పారు. ఆ తర్వాత కథ మొత్తం చెబుతూ చివరలో ఒక వర్గాన్ని బుజ్జగించే రాజకీయాలు చేసేవారు దేవభూమికి మంచి చేయలేరని వ్యాఖ్యానించారు.
హిందువులని గర్వకారణంతో చెప్పుకోవడం లేదా ముస్లింలను భయపెట్టడంతో ఇక్కడి రాజకీయాలు ఆగడం లేదు.
‘‘బోర్న్ ఎ ముస్లిం’’ పేరుతో గజాలా వహబ్ ఒక పుస్తకం రాశారు. ఆమె బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘రాజ్యాంగాన్ని రాసేటప్పుడు భారత్‌ను హిందూ దేశంగా భావించలేదు. అయితే క్రమంగా ఇది హిందువుల దేశంగా మారుతోంది. హిందూయిజం అనేది మతం కాదు. ఒక జీవన విధానమని కోర్టు చెప్పడాన్ని దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు’’అని ఆమె చెప్పారు.
జీవిత విధానాన్ని హిందూత్వంతో ముడిపెట్టడం 1994లోనే జస్టిస్ ఎస్‌పీ భారుచ్ తీర్పులో కనిపిస్తుందని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఒక కథనాన్ని ప్రచురించింది. 1996లో జస్టిస్ జేఎస్ వర్మ తీర్పులోనూ దాన్ని ప్రస్తావించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనల్లోనూ దీని గురించి ప్రస్తావించారు.
‘‘భారత్‌ను ‘మాతా‘, ‘దేవి’.. అని పిలిచేటప్పుడు దేశాన్ని హిందూమతంతో ముడిపెట్టడమే. దేశాన్ని మాతలా పూజించాలని చెప్పడం నుంచే హిందూ, ముస్లింల మధ్య విభేదాలు మొదలయ్యాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇస్లాంలో కేవలం దేవుడిని మాత్రమే పూజించాలి. ఇతరులను పూజించేవారిని ఇస్లాంలో విద్రోహులుగా భావిస్తారు. మొదట్లో ఈ విభేదాలు అంతలా బయటపడేవి కాదు. కానీ, గత ఎనిమిదేళ్లలో దేశ భక్తిని చాటుకోవడం చాలా ఎక్కువైంది. అతి అనేది ప్రధాన స్రవంతిలో కలిసిపోయింది. ధర్మ సంసద్ దానికి ఉదాహరణ.. అలాంటి విద్వేష వ్యాఖ్యలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు’’అని గజాలా చెప్పారు.
‘‘ప్రతి ముస్లింకీ ఈ విద్వేష సెగ ఎలా తాకుతుందో కథలుగా చెబుతూ నవ్వుకుంటున్నారు’’అని ఆమె చెప్పారు.
‘‘నేను ఒక పని మీద వారణాసి వెళ్లాను. నేను ముస్లింనని నా ట్యాక్సీ డ్రైవర్‌కు తెలియదు. నేను ధర్మ సంసద్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల వీడియో చూస్తున్నాను. దీంతో అసలు మా డ్రైవర్ ఇప్పుడు ఏం అనుకుంటున్నాడు? నేను ముస్లింనని తెలిస్తే నాతో ఎలా ప్రవర్తిస్తాడు? అసలు నాకు చాలా భయం అనిపించింది. ఎందుకంటే తర్వాత రెండు రోజులు నేను అతడితోనే బయటకు వెళ్లాలి. ఎందుకంటే ముస్లింలకు వ్యతిరేకంగా అంత దారుణమైన వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి’’అని ఆమె చెప్పారు.
‘‘అలాంటి వీడియో క్లిప్పుల వల్ల కొందరు హింసా మార్గాన్ని ఎంచుకుంటున్నారన్నది సుస్పష్టం. ఇదివరకు పరిస్థితులు ఇలా ఉండేవి కాదు. నేడు ప్రతిరోజూ ముస్లింలను అణగదొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’’అని ఆమె వివరించారు.
ఒకవేళ భారత్.. హిందూ దేశం కాకపోతే.. మతం ఆధారంగా ఏర్పాటుకాకపోతే.. ముస్కాన్, హసీనా, జావెద్‌లు తాము సురక్షితంగా ఉన్నామనే భావించేందుకు ఈ దేశంలోని హిందువులు ఏం చేయాలి?
‘‘అయితే, ఈ దేశంలోని ముస్లింలంతా సురక్షితంగా ఉన్నారు’’అని వీహెచ్‌పీకి చెందిన అలోక్ వర్మ అంటున్నారు. ‘‘ముస్లింలను ఓటు బ్యాంకుగా బావించే కొందరు మాత్రమే వారు సురక్షితంగా లేరని చెబుతుంటారు. ఎప్పుడైతే ఎన్నికలతో మతానికి సంబంధం పూర్తిగా తెగిపోతుందో అప్పుడు హిందువుల ఓటు బ్యాంకు కూడా అసంఘటితం అవుతుంది. ముస్లింలు ఓటు బ్యాంకుగా మారడం వల్లే హిందూ ఓటు బ్యాంకు ఏర్పడుతోంది’’అని ఆయన అన్నారు.
అయితే, ఈ రాజకీయాలకు ఎప్పుడు ముగింపు పడుతుంది? ఎవరు ముగింపు పలుకుతారు? అనేవే అసలు ప్రశ్నలు.
ఇవి కూడా చదవండి:
- విశాఖపట్నం: లైట్ హౌస్‌లు ఎలా పనిచేస్తాయి, వీటిని ఎందుకు ఏర్పాటు చేశారు
- పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తగా ఆయన పేరు ‘అధికారికంగా’ కనిపించదు.. ఎందుకు?
- పాకిస్తాన్: ‘‘రోజుకు ఒక పూటే భోజనం, పిల్లలు రెండో పూట ఆకలితో పడుకుంటున్నారు’’
- మంకీపాక్స్ వైరస్‌తో భారత్‌లో తొలి మరణం... 20 మందికి ఐసోలేషన్
- ప్రొఫెసర్ శాంతమ్మ: 94 ఏళ్ల వయసులో 130 కిలోమీటర్లు ప్రయాణించి ఫిజిక్స్ పాఠాలు చెబుతున్న బామ్మ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



















