బ్రహ్మచర్యం ఎలా ప్రారంభమైంది? దీని పుట్టుకకు అసలు కారణాలు ఇవేనా..?

బౌద్ధం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రుత్ మేస్, అల్బెర్టో మిచెలెటీ
    • హోదా, ది కాన్వర్జేషన్

కుటుంబ జీవితాన్ని విడిచిపెట్టి ఎవరైనా బ్రహ్మచర్యాన్ని ఎందుకు చేపడతారు? మానవ పరిణామక్రమానికి ప్రత్యుత్పత్తి గుండెకాయలాంటిది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా మతాలన్నీ శీలం, పవిత్రత లాంటి వాటికి పెద్దపీట వేస్తాయి.

సంతానోత్పత్తి వలనే మానవ సమాజం ముందుకు కదులుతున్నా, బ్రహ్మచర్యం అనే వ్యవస్థ పుట్టుకురావడం ఆంత్రోపాలజిస్టులను ఆశ్చర్యపరిచింది.

ఇంతకీ బ్రహ్మచర్యం ఎలా ప్రారంభమైంది? దీనిపై పలు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి.

మానవ పరిణామానికి 'సహకారం' అనేది మరొక మూలస్తంభం కాబట్టి, ఒక సమూహానికి ప్రయోజనం చేకూరుస్తుందనుకుంటే ఎలాంటివాటినైనా గుడ్డిగా ఆచరించే సంప్రదాయం బయలుదేరి ఉంటుందని కొందరు సూచిస్తున్నారు. అయితే, ఇది మానవ సమాజంపై పెనుభారం మోపుతుందని, ఎప్పటికీ పిల్లలు వద్దనుకోవడం భారమేనని అంటున్నారు.

మనుషులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం లేదా కుటుంబ ప్రయోజనాల కోసం మతపరమైన (లేదా ఇతర) సంస్థలను సృష్టించారని, వీటిల్లో పాలుపంచుకోనివారిని తిరస్కరించారాని మరికొందరు వాదిస్తున్నారు.

తాజాగా 'రాయల్ సొసైటీ ప్రొసీడింగ్స్ బీ'లో బ్రహ్మచర్యం గురించి ఓ కొత్త అధ్యయనం ప్రచురితమైంది. పశ్చిమ చైనాలోని టిబెటన్ బౌద్ధ ఆరామాలలో జీవితకాల బ్రహ్మచర్యం పాటిస్తున్నవారిని లోతుగా అధ్యయనం చేసి, బ్రహ్మచర్యం ఎలా మొదలైంది అనే ఈ మౌలికమైన ప్రశ్నకు జవాబు చెప్పే ప్రయత్నం చేశారు.

ఈమధ్యకాలం వరకు కొన్ని టిబెటన్ కుటుంబాలలో తమ కొడుకుల్లో చిన్నవాడిని బౌద్ధారామాలలో శాశ్వత బ్రహ్మచర్యానికి పంపే సంప్రదాయం సర్వసాధారణంగా ఉండేది.

చారిత్రకంగా, ప్రతి ఏడుగురు మగపిల్లల్లో ఒకరు బౌద్ధ సన్యాసం స్వీకరించేవారని రికార్డులు చెబుతున్నాయి. దీనికి వారి కుటుంబాలు మతపరమైన కారణాలు చెబుతాయి.

అయితే, బ్రహ్మచర్యం వెనుక ఆర్థిక కారణాలు, ప్రత్యుత్పత్తి ప్రయోజనాలు ఉన్నాయా?

బ్రహ్మచర్యం

ఫొటో సోర్స్, Getty Images

పితృస్వామ్య కుటుంబాలు

తాజా అధ్యయనం కోసం, చైనాలోని లాన్‌జౌ యూనివర్సిటీ సహకారంతో, గన్సు ప్రావిన్స్‌లోని తూర్పు టిబెటన్ పీఠభూమిలో ఉన్న 21 గ్రామాల్లోని 530 కుటుంబాలను ఇంటర్వ్యూ చేశారు.

కుటుంబ వంశవృక్షాలను తిరగేశారు. ప్రతి వ్యక్తి కుటుంబ చరిత్ర, వారి బంధువులలో సన్యాసం పుచ్చుకున్నవారి సమాచారాన్ని సేకరించారు.

ఈ గ్రామాలలో పితృస్వామ్యం పాటించే అమ్డో టిబెటన్లు నివసిస్తున్నారు. వీరు మేకలు, జడలబర్రెలను (యాక్) పెంచుతారు. చిన్న చిన్న భూముల్లో వ్యవసాయం చేస్తారు. వీరి సమాజంలో తండ్రి నుంచి కొడుకులకు ఆస్తి అందుతుంది.

అన్నదమ్ముల్లో ఒకరు సన్యాసం పుచ్చుకుంటే, మిగిలిన సోదరులు ధనికులుగా మారినట్టు గమనించారు. వారి వద్ద ఎక్కువ జడలబర్రెలు ఉండేవి. తండ్రి నుంచి వచ్చిన ఆస్తికి కొంత పోటీ తగ్గుతుంది కాబట్టి మిగులిన పిల్లలకు ఎక్కువ వాటా దక్కి ధనికులు అయ్యేవారు.

సన్యాసం పుచ్చుకున్నవారు ఆస్తులను వదిలేసుకోవాలి. కొడుకుల మధ్య గొడవలు రాకుండా ఉండడానికి తల్లిదండ్రులు, వారిలో ఒకరిని ఆశ్రమాలకు పంపేవారు. సాధారణంగా తండ్రి ఆస్తి పెద్ద కొడుక్కి వస్తుంది. రెండోవాడు లేదా మూడోవాడిని ఆశ్రమానికి పంపేవారు.

అయితే, ఆశ్చర్యకరంగా బ్రహ్మచారి సోదరుడు ఉన్న పురుషులు ఎక్కువమంది బిడ్డలకు జన్మనిచ్చారని తేలింది. అంతే కాకుండా, తొందరగా పిల్లల్ని కన్నారు.

కాబట్టి, కొడుకుల్లో ఒకరిని బ్రహ్మచర్యానికి పంపడం ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చడమే కాకుండా, ప్రత్యుత్పత్తి ప్రయోజనాలనూ అందిస్తుందని తేలింది.

వీడియో క్యాప్షన్, క్షమా బిందు: పెళ్లి కొడుకు లేకుండానే పెళ్లికి, హనీమూన్‌ కూడా.. ఏంటీ సోలోగమి?

బ్రహ్మచర్యం మేథమెటికల్ మోడల్

బ్రహ్మచర్యం పుట్టుకను అర్థం చేసుకోవడానికి ఒక గణిత నమూనాను తయారుచేశారు. దీని ద్వారా అన్నదమ్ముల్లో ఒకరు బ్రహ్మచర్యం పుచ్చుకుంటే, మిగిలినవారికి కలిగే ప్రయోజనాలను పరిశీలించారు.

మొదటగా, కొందరు సన్యాసం పుచ్చుకోవడం వల్ల గ్రామంలో ఆడపిల్లలను పెళ్లిచేసుకోవడానికి పోటీ తగ్గుతుంది.

అయితే, బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఆ వ్యక్తికి ఎలాంటి ప్రయోజనాలూ చేకూరవు. చుట్టూ ఉన్న సమాజానికి లాభమే కానీ, ఆ వ్యక్తికి లాభం కలుగదు. మరి అలాంటప్పుడు, బ్రహ్మచర్యం వర్ధిల్లే అవకాశాలు ఉండకూడదు.

కానీ, బ్రహ్మచారి ఇతర సోదరులు ధనవంతులు అవుతారు. మ్యారెజ్ మార్కెట్‌లో వారి విలువ పెరుగుతుంది.

ఇక్కడే మతం, నమ్మకాలు పనిచేస్తాయి. మతపరమైన బ్రహ్మచర్యం ముఖ్య పాత్ర పోషిస్తుంది. బ్రహ్మచర్యం పుచ్చుకున్నవారికి సంతానం లేకపోయినా అతడి సోదరులకు ఎక్కువమంది సంతానం కలుగుతుంది. ఇది మానవ పరిణామక్రమానికి ఉపయోగమే.

బ్రహ్మచర్యం

ఫొటో సోర్స్, Getty Images

అయితే, సన్యాసం పుచ్చుకోవాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయం అయితే, ఎక్కువమంది సన్యాసం పుచ్చుకోరు. వ్యక్తిగతంగా బ్రహ్మచర్యం చేకూర్చే ప్రయోజనాలు తక్కువ.

అది తల్లిదండ్రుల చేతిలో నిర్ణయమైతేనే ఈ పద్ధతి కొనసాగుతుంది. ఈ అంశాలన్నింటినీ గణిత నమూనాలో పొందుపరిచారు.

తల్లిదండ్రులు పిల్లల సామూహిక అభివృద్దిని చూస్తారు. ఒకడు బ్రహ్మచర్యం పుచ్చుకున్నా, మిగిలినవారంతా బాగా స్థిరపడతారు కాబట్టి తల్లిదండ్రులకు ఇబ్బంది ఉండదు.

చిన్నవయసులోనే బ్రహ్మచర్యానికి పంపించడం, అదొక వేడుకలాగ నిర్వహించడం, పెద్దయ్యాక వాళ్లు బ్రహ్మచర్యాన్ని వీడి వచ్చేస్తే, చిన్నచూపు చూడడం.. ఇదంతా తల్లిదండ్రులు సొంత ఆసక్తితో సృష్టించిన సంప్రదాయంగా కనిపిస్తుంది.

ఇతర సమాజాల్లో శిశుహత్యల్లంటి వాటికి తల్లిదండ్రులు ఎందుకు పూనుకుంటారు, వారికి కలిగే ప్రయోజనాలేంటి మొదలైన అంశాలపై కూడా ఈ మోడల్ వెలుగు సారిస్తుంది.

ఇదే ఫ్రేమ్‌వర్క్, పితృస్వామ్య వ్యవస్థలో బ్రహ్మచర్యం పుచ్చుకునే ఆడవాళ్లు ఎందుకు తక్కువగా ఉంటారన్న అంశాన్నీ వివరిస్తుంది.

అయితే, ఆడపిల్లలకు ఆస్తి హక్కు ఉన్న సమాజాలలో (యూరోప్‌లోని కొన్ని దేశాలు) బ్రహ్మచర్యం పుచ్చుకునే మహిళలు ఎక్కువ ఉండవచ్చు.

కొన్నిసార్లు సహేతుకమైనవి కాకపోయినా కొత్త ఆలోచనలు కొత్త వ్యవస్థలను సృష్టిస్తాయి. మనుషులు క్రమంగా ఈ కొత్త పద్ధతులకు అలవాటుపడతారు.

అయితే, వీటి వెనుక ఆర్థిక కారణాలు, పరిణామక్రమానికి సంబంధిచిన అంశాలూ ఉండవచ్చు.

*రుత్ మేస్ యూసీఎల్‌లో ఆత్రపాలజీ ప్రొఫెసర్. అల్బెర్టో మిచెలెటీ యూసీల్‌లో రిసెర్చ్ ఫెల్లో. ఈ కథనం తొలుత ది కాన్వర్జేషన్‌లో పబ్లిష్ అయింది.

వీడియో క్యాప్షన్, 2000 ఏళ్ల నాటి కట్టడం ఇది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)