Kuldhara Tourism: ‘ఒక అమ్మాయి పరువు కోసం’ 200 ఏళ్లుగా నిర్మానుష్యంగా ఉంటున్న ఎడారి గ్రామం.. ఏం జరిగిందంటే..

- రచయిత, షకీల్ అఖ్తర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
'ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేస్తారా? చేయరా? కొద్ది రోజులు ఆలోచించుకొని మీ నిర్ణయం చెప్పండి.' అంటూ కుల్ధర గ్రామస్థులను ఆదేశించాడు జైసల్మేర్ సంస్థానపు దివాన్ సలీం సింగ్.
'మన అమ్మాయిని ఇవ్వాల్సిందేనా లేకుంటే మారణహోమం తప్పదా?'
ఎడారి గ్రామంలో దేవాలయం వద్ద కూర్చొని ఉన్న గ్రామస్థుల మదిలో మెదులుతున్న ప్రశ్న అది.
'సలీం సింగ్ క్రూరుడు. అమ్మాయిని ఇస్తే అది ఊరికే అవమానం. ఇవ్వకపోతే జరిగేది నరమేధం. మన వాళ్లు బతికి బట్టకట్టాలంటే ఈ ఊరు విడిచి పోవాల్సిందే.'
ఆ రోజు రాత్రికే మూటముళ్లు సర్దుకుని, గొడ్డుగోదా తీసుకుని ఎడారి ఇసుకలో చడీ చప్పుడు లేకుండా అందరూ ఊరు విడిచి పోయారు.
రాత్రికి రాత్రే ఊరు నిర్మానుష్యంగా మారిపోయింది.
ఇది ఒక జానపద కథ. ఈ కథలోని గ్రామమే కుల్ధర.

రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఎడారి ప్రాంతంలో ఉంటుంది. ఈ పట్టణానికి చుట్టుపక్కల వందల కిలోమీటర్లు పొడవున ఉండే ఎడారిలో ఇసుక దిబ్బలు కనువిందు చేస్తూ ఉంటాయి.
జైసల్మేర్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అందమైన కుల్ధర గ్రామం. నేటికీ ఇక్కడ ఎవరూ నివసించడం లేదు.
సుమారు 200 ఏళ్ల కిందట రాత్రికి రాత్రే కుల్ధర విడిచి వెళ్లిపోయిన గ్రామస్థులు ఇక ఎప్పటికీ తిరిగి రాలేదు. కుల్ధర గ్రామం ఇప్పుడు పురావస్తుశాఖ అధీనంలో ఉంది.
ఒకనాటి జైసల్మేర్ సంస్థానంలో ఉండే కుల్ధర, ఒక సుసంపన్నమైన గ్రామమని స్థానిక కథనాలు, జానపద కథలు చెబుతున్నాయి. కుల్ధర నుంచే సంస్థానానికి ఎక్కువ ఆదాయం వచ్చేదంట.

ఇంతకు ముందు చెప్పిన జానపద కథ ప్రకారం...
పాలివాల్ బ్రాహ్మణులు కుల్ధర గ్రామంలో నివసించేవారు. ఆ వర్గానికి చెందిన ఒక అమ్మాయి చాలా అందగత్తె.
జైసల్మేర్ దివాన్ అయిన సలీం సింగ్ చూపు ఆ అమ్మాయి మీద పడింది. ఆ అమ్మాయి అందానికి ముగ్ధుడైన ఆయన, ఎలాగైనా తనను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ సలీం సింగ్ క్రూరుడు. ఆయన ఆకృత్యాల గురించి కథలు కథలుగా చెప్పుకొనేవారు. అందువల్ల ఆయనకు అమ్మాయిని ఇవ్వడానికి కుల్ధర గ్రామస్థులు నిరాకరించారు.
సలీం సింగ్ క్రూరుడు కాబట్టి, పిల్లను ఇవ్వకపోతే ఎవరిని బతకనివ్వడని వారంతా ఊరు విడిచి వెళ్లిపోయారు. జైసల్మేర్‌లో ఇప్పటికీ సలీం సింగ్ నివసించిన కోట ఉంది. కానీ అక్కడికి ఎవరూ వెళ్లరు.

కుల్ధరలోని ఇళ్లను ఇసుక రాతితో నిర్మించారు. ఇవి క్రమంగా శిథిలమవుతున్నాయి. కానీ ఆ భవనాలు, ఇళ్లను చూస్తుంటే ఒకనాడు ఈ గ్రామం ఎంత గొప్పగా ఉండేదో అంచనా వేయొచ్చు.
ఇక్కడ ఇళ్లలో కనిపించే పొయ్యి, అరుగు వంటి వాటిని చూస్తే ఆ ఇళ్లను ఇటీవలే మనుషులు ఖాళీ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇళ్ల గోడలు విషాద గీతాన్ని ఆలపిస్తున్నట్లుగా తోస్తుంది. విశాలమైన ఎడారిలో ఒంటరిగా ఉండే ఈ గ్రామంలో రాత్రుళ్లు గాలులు చేసే సవ్వడులు తప్ప మరేమీ వినపడదు.

నిశ్శబ్ద రాత్రుల్లో కుల్ధర శిథిలాల మీద నడిచే తమ పూర్వీకుల అడుగుల సవ్వడులు వినిపిస్తూ ఉంటాయని చుట్టుపక్కల ప్రజలు చెబుతుంటారు. కుల్ధర ప్రజల ఆత్మలు ఇక్కడ సంచరిస్తూ ఉంటాయని చాలా మంది నమ్ముతుంటారు.

పర్యాటకులను ఆకర్షించేందుకు కుల్ధరలోని కొన్ని ఇళ్లను రాజస్థాన్ ప్రభుత్వం పునరుద్ధరించింది. నాటి చరిత్రకు సాక్ష్యమా అనిపిస్తూ ఇప్పటికీ కుల్ధరలో దేవాలయం నిలిచే ఉంది. ప్రతి ఏడాది వేలాది మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని చూడటానికి వస్తారు.

వందల ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కుల్ధరలో ప్రజలు నివసించకపోవడానికి కారణం, ఈ గ్రామంలో ఎవరూ నివసించకూడదంటూ నాడు కుల్ధరను వీడుతూ పాలివాల్ బ్రాహ్మణులు శపించారనే కథనం కూడా ప్రచారంలో ఉంది.

ఇవి కూడా చదవండి:
- ఆసియా దేశాలు ఆహార ఎగుమతులను ఎందుకు నిలిపేస్తున్నాయి? దీనిని ఫుడ్ నేషనలిజం అంటారా?
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ‘కింగ్’ కాకుండా ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించగలరా? పొత్తుల కోసం పవన్ కల్యాణ్‌కు ‘పట్టం’ కట్టగలరా?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- 33 మంది ఖైదీల కళ్లలో యాసిడ్ పోసిన పోలీసులు, 40 ఏళ్ల కిందటి ఘటన బాధితులు ఇప్పుడెలా ఉన్నారు
- బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారు? దీనికి అంత ప్రత్యేకత ఎందుకు?
- దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











