ఆరు వేల ఏళ్ల కిందటి శిలాయుగపు మహిళ.. ప్రాచీన డీఎన్ఏ ద్వారా రూపురేఖల నిర్మాణం

ఫొటో సోర్స్, TOM BJÖRKLUND
- రచయిత, హెలెన్ బ్రిగ్స్
- హోదా, బీబీసీ న్యూస్
భూమి మీద 6,000 సంవత్సరాల కిందట స్కాండినేవియాలో నివసించిన ఒక మహిళ ముఖాకృతి ఇది.
ప్రాచీన కాలపు 'చూయింగ్ గమ్' మీద ఉన్న ఈమె పంటి గాట్ల నుంచి శాస్త్రవేత్తలు డీఎన్ఏను సేకరించగలిగారు. ఆ డీఎన్‌ఏను ఉపయోగించుకుని ఆమె జన్యుపటాన్ని నిర్మించారు.
మానవ ఎముక నుంచి కాకుండా మరో భాగం నుంచి సేకరించిన డీఎన్ఏ ద్వారా ఒక ప్రాచీన మానవ జన్యుపటాన్ని నిర్మించటం ఇదే మొదటిసారి అని పరిశోధకులు చెప్పారు.
ఈ ప్రాచీన మహిళకు నల్లని చర్మం, ముదురు గోధుమ రంగు జుట్టు, నీలి రంగు కళ్లు ఉండి ఉండవచ్చు.
శాస్త్రవేత్తలకు లభించిన ప్రాచీన 'చూయింగ్ గమ్' - వాస్తవానికి ఒక చెట్టుకు చెందిన తారు - ప్రాచీన డీఎన్‌ఏకు సంబంధించి చాలా విలువైన వనరు అని.. ప్రత్యేకించి మానవ అవశేషాలు అందుబాటులో లేని కాలాలకు సంబంధించిన మానవ డీఎన్‌ఏకు చాలా ముఖ్యమైన వనరు అని యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగెన్‌కు చెందిన డాక్టర్ హాన్స్ ష్రోడర్ పేర్కొన్నారు.
ఈ ప్రాచీన మహిళ గురించి మనకు తెలిసిన వివరాలు ఏమిటి?
ఈ మహిళ పూర్తి జన్యుపటాన్ని డీకోడ్ చేసి.. ఆమె రూపురేఖలు ఎలా ఉండివుంటాయనేది ఊహించారు. ఆ కాలంలో యూరప్ ప్రధాన భూభాగంలోనూ, మధ్య స్కాండినేవియాలోనూ నివసించిన.. వేట, ఆహార సేకరణ ప్రధానంగా జీవించిన జనానికి ఈ మహిళ జన్యుపరంగా చాలా సన్నిహితంగా ఉంది. వారికి లాగే ఆమెకు కూడా నల్లని చర్మం, ముదురు గోధుమ రంగు జుట్టు, నీలి రంగు కళ్లు ఉన్నాయి.
హిమానీనదాలు ఇంకిపోయి వెనక్కు జరిగిన తర్వాత పశ్చిమ యూరప్ నుంచి ఎగువకు వలస వచ్చిన ప్రజలకు ఈ మహిళ వారసురాలు కావచ్చు.
ఆమె ఎలా జీవించింది?
బాల్టిక్ సముద్రంలో గల డెన్మార్క్‌కు చెందిన ఒక దీవి లోలాండ్. దాని మీద సిల్తోమ్ అనే ప్రాంతంలో జీవనానికి సంబంధించిన ఆధారాలు ఇతర డీఎన్ఏ నమూనాల ద్వారా లభించాయి. హేజెల్ నట్ (వక్క వంటి గింజ), అడవి బాతుల డీఎన్ఏ ఆనవాళ్లను గుర్తించారు. దీనినిబట్టి ఆ కాలంలో ప్రజల ఆహారంలో ఇవి భాగంగా ఉన్నాయని తెలుస్తోంది.
''అది డెన్మార్క్‌లో అతిపెద్ద శిలాయుగపు స్థలం. పురాతవ్వకాల్లో గుర్తించిన అంశాలు.. ఈ ప్రాంతంలో నివసించిన జనం అటవీ వనరులను భారీగా ఉపయోగించుకున్నట్లు చెప్తున్నాయి. దక్షిణ స్కాండినేవియాలో వ్యవసాయం, జంతువులను మచ్చిక చేసుకోవటం మొదలైన కొత్త రాతియుగం వరకూ కూడా ఇదే విధమైన జీవనం కొనసాగినట్లు కనిపిస్తోంది'' అని యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగెన్‌కు చెందిన థీస్ జెన్సన్ పేర్కొన్నారు.
నాటి 'చూయింగ్ గమ్'లో చిక్కుకుపోయిన సూక్ష్మజీవుల డీఎన్‌ఏలను కూడా పరిశోధకులు సేకరించారు. మాంసగ్రంథి జ్వరం, ఊపిరితిత్తుల వాపు (న్యుమోనియా) వ్యాధి కారకాలను గుర్తించారు. అలాగే సహజంగా నోటిలో ఉంటూనే ఎటువంటి వ్యాధులనూ కలిగించని అనేక రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలను కూడా గుర్తించారు.

ఫొటో సోర్స్, THEIS JENSEN
ఈ డీఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చింది?
ఆ కాలంలో రాతి పనిముట్లను అతికించటం కోసం.. బిర్చ్ (కొండరావి వంటి చెట్టు) బెరడును వేడిచేయటం ద్వారా తయారు చేసిన బిర్చ్ తారు ముద్దలో ఈ డీఎన్‌ఏ చిక్కుకుంది.
నలుపు-గోధుమ రంగులో ఉన్న ఆ తారు ముద్ద మీద పంటి గాట్లు ఉండటాన్ని బట్టి.. బహుశా దానిని మరింత మెత్తగా చేయటానికి గానీ, పంటి నొప్పి లేదా ఇతర రోగాల నుంచి ఉపశమనం కోసం కానీ దానిని నమిలినట్లు తెలుస్తోంది.
ఈ సమాచారం మనకు ఏం చెప్తోంది?
ఈ రకంగా నిక్షిప్తమైన సమాచారం.. నాటి ప్రజల జీవితాలకు సంబంధించిన ఒక చిత్రాన్ని అందిస్తుందని.. వారసత్వం, జీవనోపాధి, ఆరోగ్యం వంటి వివరాలు లభిస్తాయని పరిశోధకులు చెప్పారు.
ఈ చూయింగ్ గమ్ నుంచి సేకరించిన డీఎన్ఏ.. మానవ రోగకారకాలు ఇన్నేళ్లలో ఎలా పరిణామం చెందాయనేది తెలుసుకోవటానికి కూడా దోహదపడుతుంది.
''ఇటువంటి పదార్థాల నుంచి ఈ తరహా ప్రాచీన రోకకారకాల జన్యుపటాలను సేకరించగలగటం చాలా ఉత్తేజకరం. ఎందుకంటే.. అవి ఎలా పరిణామం చెందాయి, ఇప్పుడున్న వాటికన్నా ఎలా భిన్నంగా ఉన్నాయి అనేది మనం అధ్యయనం చేయగలం. తద్వారా అవి ఎలా విస్తరించాయి, ఎలా పరిణామం చెందాయి అనే దాని గురించి ఎంతోకొంత తెలుస్తుంది'' అని డాక్టర్ ష్రోడర్ బీబీసీకి చెప్పారు.
ఈ పరిశోధనను నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించారు.
ఇవి కూడా చదవండి:
- ఓ గుహలో దొరికిన 44 వేల ఏళ్ళ నాటి అతి పురాతన పెయింటింగ్ ఏం చెబుతోంది...
- ‘నా శరీరం కోసమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు’ :దిల్లీలో ఆఫ్రికా యువతులతో సెక్స్ కుంభకోణంపై బీబీసీ పరిశోధన
- పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్‌కు మరణశిక్ష
- పేద దేశాల్లో ప్రజలకు ఊబకాయం ఎందుకు వస్తోంది...
- ఉల్లి మన ఆహారంలో ఎలా భాగమైంది? దాని చరిత్ర ఏంటి...
- యూఎస్బీ కండోమ్ అంటే ఏమిటో తెలుసా?
- సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే తేయాకు కథ: చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- నలుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు పెళ్లి కొడుకులు, ఒకే రోజు పెళ్లి
- ఉరి తాడు ఒక్క బక్సర్ జైల్లోనే ఎందుకు తయారవుతోంది?
- భూమి మీద అత్యంత లోతైన ప్రదేశం... ఈ లోయ లోతు 11,500 అడుగులు
- దేశంలో ముస్లింల భయాందోళనల గురించి మోదీ ప్రభుత్వంలో మంత్రి నఖ్వీ ఏం చెప్పారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








