‘పుతిన్‌కు క్యాన్సర్’ పుకారేనా? ఆయన అనారోగ్యంపై రష్యా ఏమంటోంది?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, పాట్రిక్ జాక్సన్, రాబర్ట్ గ్రీనల్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనారోగ్యానికి గురయ్యారని వస్తున్న వదంతులను ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఖండించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిరోజూ బహిరంగంగా కనిపిస్తున్నారని, తెలివిగల వాళ్లు ఎవరికీ ఆయన అనారోగ్యానికి గురయ్యారనే సంకేతాలు కనిపించవని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు.
ఫ్రెంచ్ టీవీ టీఎఫ్1 ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పుతిన్ ఈ ఏడాదితో 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. గతకొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, బహుశా ఆయనకు క్యాన్సర్ సోకి ఉండొచ్చని పలు నిరాధార మీడియా వార్తలు వెలువడుతున్నాయి.
యుక్రెయిన్‌లోని డోన్బాస్ ప్రాంతంలో రష్యా సేనల ఆధిపత్యం కొనసాగుతున్న సమయంలో ఈ ఇంటర్వ్యూ ప్రసారమైంది.
(యుక్రెయిన్) ఈశాన్య ప్రాంతానికి 'విమోచన' రష్యాకు ప్రథమ ప్రాధాన్యమని, ఇందులో ఎలాంటి షరతులూ లేవని లావ్రోవ్ అన్నారు.
ఈశాన్య ప్రాంతంలో 'నియో నాజీ పాలన'కు వ్యతిరేకంగా రష్యా పోరాడుతోందని లావ్రోవ్ పునరుద్ఘాటించారు.
''ఆయనలో అనారోగ్య సంకేతాలు తెలివిగల వ్యక్తులకు కనిపిస్తాయని నేను అనుకోవట్లేదు. ఆయన టీవీల్లో కనిపిస్తున్నారు. తన ప్రసంగాలు చదువుతున్నారు. వింటున్నారు'' అని లావ్రోవ్ అన్నారు.
''ఎవరైనా రోజూ ఎలా కనిపిస్తున్నారు అనేది పరిశీలించేందుకు ప్రతిరోజూ అవకాశం లభిస్తున్నప్పటికీ ఇలాంటి రూమర్లను ప్రచారం చేస్తున్నవారి మనస్సాక్షికే వదిలేస్తున్నాను'' అని ఆయన చెప్పారు.
ఈ ఇంటర్వ్యూలో లావ్రోవ్ చేసిన వ్యాఖ్యలను రష్యా విదేశాంగ శాఖ మీడియాకు విడుదల చేసింది.
పుతిన్ తీవ్రంగా జబ్బు పడ్డారని గతవారం బ్రిటిష్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినట్లు పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి.
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించే, క్రీడలను ప్రేమించే పుతిన్ ఆరోగ్యంపై ఎన్నో సంవత్సరాలుగా తరచూ పుకార్లు వెలువడుతూనే ఉన్నాయి.
కాగా, యుక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో పట్టణ ప్రాంతాలపై రష్యా విధ్వంసకర ఆయుధాలను, రాకెట్ దాడులను చేస్తుండటంపై ప్రశ్నించగా లావ్రోవ్ స్పందిస్తూ.. పౌర మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడులు చేయొద్దని రష్యా సైన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.
ఫిబ్రవరి 24వ తేదీన రష్యా దండయాత్ర మొదలైంది. ఇప్పటికి 4031 మంది పౌరులు చనిపోయారని, 4735 మంది సామాన్యులు గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. సైనిక దళాలకు సంబంధించి చాలామంది చనిపోయారని, మరెందరో గాయపడ్డారని వెల్లడించింది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ 1.40 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలిపెట్టాల్సి వచ్చింది. ఎన్నో నగరాలు, పట్టణాలు నేలమట్టమయ్యాయి.
ప్రస్తుతం ఈ యుద్ధం యుక్రెయిన్ ఈశాన్య ప్రాంతంలోని మైనింగ్ ప్రాంతమైన డోన్బాస్‌కు పరిమితమైంది. ఈ ప్రాంతంలోనే డొనెట్స్క్, లుహాన్స్క్ కూడా ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లోని వేర్పాటు వాదులకు చారిత్రాత్మకంగా రష్యాతో బలమైన సంబంధాలు ఉన్నాయి. 2014లో ఈ రెండు ప్రాంతాలూ యుక్రెయిన్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించుకున్నాయి. ఇప్పుడు పూర్తి నియంత్రణ కోసం రష్యా సేనలతో కలసి యుక్రెయిన్‌పై పోరాడుతున్నారు ఇక్కడి వేర్పాటు వాదులు.
ఈ రెండు ప్రాంతాలనూ రష్యా స్వతంత్ర రాజ్యాలుగా గుర్తించిందని, కాబట్టి ఇక్కడ గెలుపు రష్యాకు ఎలాంటి షరతుల్లేని ప్రాధాన్యం అని లోవ్రోవ్ చెప్పారు.
రస్సోఫోబిక్ (రష్యా అంటే ఇష్టం లేని, రష్యా అంటే భయపడే) నియో నాజీ ప్రభుత్వ పాలనలో ఉండటాన్ని సంతోషంగా భావిస్తారో, లేదో యుక్రెయిన్‌లోని మిగతా ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు.
యుక్రెయిన్ సైన్యం ప్రతిఘటన తర్వాత రాజధాని కీయెవ్‌ను చుట్టుముట్టాలన్న ప్రయత్నాలను విరమించుకున్న రష్యా సైన్యం ఇప్పటికే అక్కడి నుంచి వెనుదిరిగింది.
అలాగే యుక్రెయిన్‌లోని రెండో పెద్ద నగరం ఖార్కియెవ్ నుంచి కూడా రష్యా సైన్యం వెనుదిరిగింది.
యుక్రెయిన్ సైన్యం మనోధైర్యాన్ని పెంచేందుకు ఆదివారం ఖార్కియెవ్ నగరంలో యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ పర్యటించారు.
''చివరి మనిషి వరకూ మేం పోరాడుతాం. వాళ్ల(రష్యన్ల)కు అవకాశమే లేదు. మేం పోరాడుతాం. మేం తప్పకుండా గెలుస్తాం. మా భూమిని మా సైనికులు కాపాడుకుంటారు'' అని ఈ సందర్భంగా జెలియెన్‌స్కీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- Service Charge: హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీ అంటే ఏంటి? బలవంతంగా వసూలు చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?
- చికెన్‌ను షాపు నుంచి తెచ్చాక కడగకూడదా? వాష్ చేస్తే ప్రమాదమా? మరి ఎలా వండాలి?
- బంగారం కొంటున్నారా? మోసపోకుండా ఉండేందుకు మీరు తెలుసుకోవాల్సిన 8 అంశాలివే...
- ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావాలనే బీజేపీ డిమాండ్, హిందువులకే చేటు చేస్తుందా?
- అంబేడ్కర్ పుట్టిన గడ్డపై ఒక యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టినప్పుడు ఎందుకంత హింస చెలరేగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















