Service Charge: హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీ అంటే ఏంటి? బలవంతంగా వసూలు చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సురేఖ అబ్బూరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
సెలబ్రేషన్స్ అంటే మనమంతా తరచూ వెళ్లేది హోటల్‌కే. మనం కట్టే బిల్లులో మనకు తెలియకుండానే చాలాసార్లు సర్వీస్ చార్జ్ కూడా కడుతూ ఉంటాం. ఆపై బిల్ తో పాటు టిప్స్ కూడా ఇచ్చి వస్తాం.
కానీ మనలో చాలామందికి సర్వీస్ చార్జ్ చెల్లించడం తప్పనిసరి కాదు అని తెలిసినా, చుట్టూ పక్కలవారు ఏమనుకుంటారో అన్న మొహమాటంతోనో, ఇది పెద్ద మొత్తం కాదన్న భావనతోనో డబ్బు కట్టేసి బైటికి వస్తుంటాం.
అదే చాలా రెస్టారెంట్ల వారికి అధిక ఆదాయంగా మారింది .
అయితే, సర్వీస్ చార్జ్ నేను కట్టను అంటే ఏం జరుగుతుంది? ఇలాంటి ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
అడ్వోకేట్ రాజశేఖర్ కనకటి జూబ్లీహిల్స్ లోని ఆన్ తే రా రెస్టారెంట్ అండ్ బార్ కి 27-08-2021న తన స్నేహితులతో కలిసి వెళ్లారు. అక్కడ బిల్ రూ.3,543 అయ్యింది. ఇందులో రూ.164.95ను సర్వీస్ చార్జ్ గా పేర్కొన్నారు.
''నేను ఈ రెస్టారెంట్ కంటే ముందే 3-4 రెస్టారెంట్లకు వెళ్లాను. అక్కడ కూడా ఇలాగే సర్వీసు చార్జ్ వేశారు. నేను కట్టను అంటే కొందరు దాన్ని తీసేశారు. కానీ, ఈ రెస్టారెంట్ అందుకు ఒప్పుకోలేదు. వాస్తవానికి సర్వీస్ చార్జ్ వసూలు చేసే హక్కు రెస్టారెంట్ కు లేదు'' అని రాజశేఖర్ బీబీసీతో అన్నారు.
''ఇక్కడ డబ్బులు ఎంత అన్నది సమస్య కాదు. ఇది నా హక్కు అన్నది అర్థం చేసుకోవడం ముఖ్యం. నేను వారు ఇచ్చిన సర్వీస్ కి సంతృప్తి చెందితే, దానిని టిప్ రూపం లో ఇవ్వాలనుకుంటున్నాను. కానీ వారు దానిని బలవంతంగా 5 % సర్వీస్ చార్జీ రూపంలో ఇవ్వాల్సిందే అన్నారు. అందుకే నేను కన్స్యూమర్ కోర్ట్ కి వెళ్లాల్సి వచ్చింది'' అని రాజశేఖర్ వివరించారు.
హోటల్ యాజమాన్యం రాజశేఖర్ దగ్గర వసూలు చేసిన సర్వీస్ చార్జ్ తిరిగి ఇవ్వడమే కాకుండా, అదనంగా రూ.3000 చెల్లాంచాల్సి వచ్చింది.
అసలు రెస్టారెంట్ వాళ్లు సర్వీసు చార్జ్ ఎందుకు వేస్తారు? సర్వీస్ చార్జ్ అంటే ఏంటి? ఇంకా వాళ్లు ఏమేం చార్జ్ లు వేస్తారు, బలవంతంగా వసూలు చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎలా ఫిర్యాదు చేయాలి అన్న విషయాలు చాలామందికి తెలియవు.

ఫొటో సోర్స్, Getty Images
హోటళ్లు విధించే వివిధ రకాల టాక్సులు, చార్జీలు ఏంటి?
ఒకప్పుడు ఎన్నోరకాల టాక్సులు విధించే రెస్టారెంట్లు, హోటళ్లు ఇప్పుడు కేవలం 5% జీఎస్టీ మాత్రమే తీసుకోవాలి.( స్టేట్ టాక్స్ 2.5% +సెంట్రల్ టాక్స్ 2.5%). దీనికి అదనంగా కస్టమర్లు వేరే టాక్స్ ఏమి కట్టనక్కర్లేదు.
ఒకవేళ హోమ్ డెలివరీ ఆర్డర్ చేస్తే మాత్రం, అది సర్వీస్ కాబట్టి సర్వీస్ చార్జిగా ఇవ్వాల్సి ఉంటుంది .
జీఎస్టీతో తగ్గిన రెస్టారెంట్ పన్నులు
జీఎస్టీ ప్రారంభమైన కొత్తల్లో నాన్ ఏసీ రెస్టారెంటుకి 12 శాతం, ఏసీ రెస్టారెంటుకు 18 శాతం, స్టార్ హోటళ్లకు 28 శాతం పన్ను ఉండేది. తరువాత అది తీసేశారు. ఇప్పుడు ఏసీ-నాన్ ఏసీ తేడా లేకుండా 5 శాతానికి తగ్గించారు.
జీఎస్టీ వచ్చాక మిగతా వాటి ధరలు ఎలా ఉన్నా, రెస్టారెంట్లలో తినే వాటిపై పన్ను మాత్రం తగ్గింది.
అంతకు ముందు వ్యాట్ (రాష్ట్రాన్నిబట్టి మారేది - ఆంధ్రా, తెలంగాణల్లో 14.5 శాతం), సర్వీస్ టాక్స్ (6 శాతం), అరశాతం కృషి కళ్యాణ్ సెస్, అర శాతం స్వచ్ఛ భారత్ సెస్ - ఇవన్నీ కలుపుకుని తిన్నదానిపై కట్టే పన్ను మొత్తం సుమారు 20 శాతం దాటేది. ఇప్పుడది 5 శాతానికి పడిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇక కాంపోజిట్ స్కీము ఉన్న రెస్టారెంట్లు మాత్రం అసలు పన్ను వసూలు చేయకూడదు. వారు ఒక్కో బిల్లుపై పన్ను వసూలు చేయకుండా మొత్తం టర్నోవరుపై జీఎస్టీ కడతారు. తాము కాంపోజిట్ స్కీములో ఉన్నామనీ, పన్ను వసూలు చేయమని ఇలాంటి హోటల్స్ వారు బోర్డులు పెట్టాలి.
రెస్టారెంట్ లో మద్యంపై టాక్సులు ఎలా ఉంటాయి?
ప్రస్తుతానికి మద్యంపై జీఎస్టీ లేదు. పాత పద్ధతిలో వ్యాట్ కొనసాగుతోంది. కాబట్టి బార్లో మద్యం సేవించినప్పుడు లిక్కరుపై పన్ను విడిగా, ఆహార పదార్ధాలపై పన్ను విడిగా చూపించాలి.
లిక్కరు పన్ను రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. ఆహారంపై మాత్రం ముందు చెప్పుకున్న నిబంధనల ప్రకారమే 5 శాతం పన్ను ఉంటుంది.

ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే...
ఫుడ్ ఆన్ లైన్ లో కొన్నా జీఎస్టీ యధావిధిగా ఉంటుంది. మీరు స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్ లేదా ఫుడ్ పాండా వంటి యాప్స్ లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చారనుకుందాం. అందులో మీకు మూడు విషయాలు కనిపిస్తాయి. మీ భోజనం బిల్లు, దానిపై జీఎస్టీ, ఆన్ లైన్ సంస్థ వసూలు చేసే డెలివరీ చార్జ్ ఉంటాయి.
మీరు వంద రూపాయల భోజనం ఆర్డర్ చేస్తే 5 రూపాయల జీఎస్టీ, 25 రూపాయల డెలివరీ చార్జ్ ఉంటుంది. ఇందులో భోజనం ధర వంద రూపాయలు హోటల్ వారికీ, పన్ను 5 రూపాయలు హోటల్ వారి ద్వారా ప్రభుత్వానికీ వెళ్తాయి.
కానీ, డెలివరీ అనేది ఒక సర్వీసు కాబట్టి దానికి కూడా జీఎస్టీ ఉంది. ఆ సర్వీసు పొందినందుకు 18 శాతం పన్ను కట్టాలి. మనం ఆ యాప్ కి చెల్లించే డెలివరీ చార్జీలో ఈ పన్ను కలిసే ఉంటుంది. కాకపోతే పేమెంట్ చేసేప్పుడు అంత స్పష్టంగా కనపడదు.
మీరు యాప్ లో నుంచి ఇన్వాయిస్ (బిల్లు) డౌన్ లోడ్ చేసి చూస్తే ఈ వివరాలు ఉంటాయి. సాధారణంగా డెలివరీ యాప్ కంపెనీలు ఈ జీఎస్టీని కలిపేసి రౌండ్ ఫిగర్ చేస్తుంటాయి. ఉదాహరణకు 21.19 డెలివరీ చార్జి అయితే దానిపై 18 శాతం అంటే, 3.81 జీఎస్టీ. మొత్తం కలిపితే రూ.25 వసూలు చేస్తారు.

ఫొటో సోర్స్, TWITTER/RAHULBOSE1
ఈ సర్వీస్ ఛార్జీలు తప్పనిసరి కానప్పుడు వీటిని ఎందుకు తీసివేయరు?
ఇప్పుడు ఇదే ప్రశ్న వినియోగదారుల హక్కుల కోసం పోరాడే వారు అడుగుతున్నారు. అన్నీ టాక్సులు ఎత్తి వేసిన ప్రభుత్వాలు ''ఇష్టమైతే వినియోగదారులు కట్టవచ్చు'' అంటూ ఎందుకు కొనసాగిస్తున్నాయి?
''ప్రభుత్వాలు అలాగే కన్స్యూమర్ కోర్టులు వీరి పై కఠినంగా వ్యవహరించడం లేదు. వీరికి రూ.3000 జరిమానా విధిస్తే సరిపోదు. ఎందుకంటే లక్షలలో దండుకునే వీరికి ఈ జరిమానా పెద్ద విషయం కాకపోవచ్చు. అది కూడా ఎప్పుడో ఒకరో ఇద్దరో వీరిపై ఫిర్యాదు చేస్తారు. అందుకే రెస్టారెంట్ వాళ్లు ఇలాంటి వాటిని కొనసాగిస్తున్నారు. కన్స్యూమర్ కోర్టులు వీరిపై రూ.5లక్షల నుంచి 10 లక్షల దాక జరిమానా విధించాలి'' అని వినియోగదారుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న విజయ్ గోపాల్ అన్నారు .

మీ హక్కు కోసం ఎలా పోరాడాలి?
''సర్వీస్ చార్జ్ పన్ను కాదు. అది హోటల్ వారు వసూలు చేసుకునేది. దీనికీ, ప్రభుత్వానికీ సంబంధం లేదు. మీకిష్టమైతే వారు అడిగే సర్వీస్ చార్జి మీరు కట్టవచ్చు. లేకుంటే టిప్ రూపంలో ఇవ్వవచ్చు. కానీ, ఏదీ తప్పనిసరి కాదు.
అలాంటప్పుడు మొహమాట పడకుండా, కుటుంబ సభ్యులతో, బంధువులతో ఉన్నామనో, స్నేహితులు ఏమనుకుంటారోననో ఇలాంటి చార్జ్ ల మీద నిలదీయకుండా వదిలేయవద్దని వినియోగదారుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నవారు కోరుతున్నారు.
"కన్స్యూమర్ కోర్టులో మీరు కేసు వేయడం చాలా సులువు. కోర్టుకు వెళ్లి మీరు బాధితులు అయితే మీ పేరున ఒక కాపీ తో పాటు మరో 3 ఫిర్యాదు కాపీలు ఇస్తే చాలు. వారే 15 రోజులలో రెస్టారెంట్ వారికి నోటీసులు పంపుతారు.
మీరు దీనికి రుసుము కట్టాల్సిన పని లేదు. కాకపొతే మీరు ఒక న్యాయవాదిని పెట్టుకోవాలనుకుంటే వారికి మీరు ఇచ్చే రూ.2 వేలో, రూ.3 వేలో కోర్ట్ ఆర్డర్ తరువాత మీకు తిరిగి వచ్చేస్తుంది. అలా కాకుండా మీరే కోర్టులో మీ వాదన చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఉండదు.
ఇవి కూడా చదవండి:
- జ్ఞాన్వాపి మసీదును శివాలయంగా మార్చవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
- మంకీపాక్స్ ఎలా సోకుతుంది, లక్షణాలేమిటి? స్వలింగ సంపర్కులకు ఎక్కువగా సోకుతుందా
- ‘మంటలు ఆర్పడానికి వెళ్తే మా అగ్నిమాపక వాహనాలనూ తగలబెడతామని బెదిరించారు’
- ఆంధ్రప్రదేశ్: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు వద్దంటూ ఎందుకీ నిరసనలు... అసలేం జరుగుతోంది?
- టెక్సస్ కాల్పులు: ప్రైమరీ స్కూల్‌పై జరిగిన దాడిలో 19 మంది పిల్లలు, ఒక టీచరు మృతి
- పెళ్లి గిఫ్ట్‌గా టెడ్డీబేర్ పంపిన పెళ్లికూతురి అక్క మాజీ ప్రియుడు.. అందులోని బాంబ్ పేలి కళ్లు, చేతులు కోల్పోయిన పెళ్లి కొడుకు
- సెక్స్, అధికారం, భయం... ఇవే మన పురాణాలకు మూలాధారమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











