అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీల లాభాలపై కనీసం 15 శాతం పన్ను.. భారత్‌కు లాభమా? నష్టమా? మీరు తెలుసుకోవాల్సిన 9 అంశాలు

మైక్రోసాఫ్ట్, అమెజాన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సతీశ్ ఊరుగొండ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్‌ లాంటి బహుళ జాతి సంస్థల లాభాలపై కనీసం 15 శాతం పన్ను విధించాలన్న ప్రపంచ ఒప్పందానికి అంగీకారం తెలిపింది భారత్.

మొదట్లో కాస్త అభ్యంతరం వ్యక్తం చేసినా ఈ ఒప్పందానికి పారిస్‌లో ఆమోదం తెలిపింది. అయితే, పాకిస్తాన్, శ్రీలంక, కెన్యా, నైజీరియా మాత్రం ఈ ఒప్పందానికి దూరంగా ఉన్నాయి.

అసలు ఈ గ్లోబల్ మినిమమ్ కార్పొరేట్ ట్యాక్స్ రేటు అంటే ఏమిటి? దీన్ని ఇప్పుడే ఎందుకు తీసుకొస్తున్నారు? ఇదెలా పని చేస్తుంది? దీని వల్ల భారత్‌కు లాభమా నష్టమా? ఇలాంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అక్టోబర్ చివరి వారంలో రోమ్‌లో జరిగిన జీ20 సదస్సులో ప్రపంచంలోని 20 ప్రధాన ఆర్థిక వ్యవస్థల అధినేతలు దీనికి ఆమోదం తెలిపారు. 2023 నాటికి ఇది అమల్లోకి రానుంది.

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, జీ20 సదస్సులో ప్రపంచంలోని 20 ప్రధాన ఆర్థిక వ్యవస్థల అధినేతలు ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపారు.

1. ఇప్పటి వరకు ఏం జరిగింది?

అమెరికా ప్రతిపాదించిన గ్లోబల్ మినిమమ్ కార్పొరేట్ ట్యాక్స్ రేటు ఒప్పందానికి భారత్ సహా 136 దేశాలు అంగీకారం తెలిపాయి.

బహుళ జాతి సంస్థల లాభాలపై కనీసం 15 శాతం పన్ను విధించడం, అంతర్జాతీయ పన్ను వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యం. ఒకరకంగా బహుళజాతి సంస్థలు పన్ను ఎగ్గొట్టకుండా చూసేందుకు దీన్ని తీసుకొస్తున్నారు.

ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ - OECD సమావేశంలో ఈ ఒప్పందానికి అంగీకారం తెలిపారు. అక్టోబర్ చివరి వారంలో రోమ్‌లో జరిగిన జీ20 సదస్సులో ప్రపంచంలోని 20 ప్రధాన ఆర్థిక వ్యవస్థల అధినేతలు దీనికి ఆమోదం తెలిపారు. 2023 నాటికి ఇది అమల్లోకి రానుంది.

గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

2. బహుళజాతి కంపెనీల లాభాలపై కనీసం 15 శాతం పన్ను ఎందుకు?

సాధారణంగా పెద్ద పెద్ద బహుళ జాతి కంపెనీలు ఏ దేశంలో ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని, అక్కడి నుంచి తమ లాభాలను ప్రకటిస్తాయో అక్కడే వాటిపై పన్ను విధిస్తారు.

అంటే ఒక సంస్థ ఏ దేశంలో బిజినెస్ చేసిందన్న అంశంతో సంబంధం లేకుండా, ఏ దేశం నుంచైతే లాభాలను ప్రకటిస్తుందో ఆ దేశంలోని చట్టాల ప్రకారమే ఆ సంస్థ లాభాలపై పన్నుపై విధిస్తారు.

అధిక పన్నులు చెల్లించకుండా బడా కంపెనీలు తప్పించుకునే అవకాశాన్ని ఈ విధానం కల్పిస్తోంది.

అంటే వ్యాపారం చేసే దేశంలో పన్ను రేటు ఎక్కువగా ఉంటే.. అక్కడి తమ లాభాలను తక్కువ పన్ను రేటు ఉన్న దేశంలోని తమ అనుబంధ సంస్థకు కంపెనీలు తరలించే అవకాశం ఉంది. పేటెంట్ హక్కులు, ట్రేడ్ మార్క్‌ల వల్ల ఆ లాభం వచ్చిందని చూపించే అవకాశం ఉంది.

ఉదాహరణకు అమెరికాలో వ్యాపారం చేసే యాపిల్ సంస్థ, తన లాభాలను తక్కువ పన్ను రేటు ఉన్న ఐర్లాండ్‌లోని తన అనుబంధ సంస్థకు చెందినవని ప్రకటించడం ద్వారా అమెరికాలో అధిక పన్ను పోటు నుంచి తప్పించుకోవచ్చు.

కంపెనీలు ఇలా చేయడం వల్ల ప్రభుత్వాలకు ఆదాయం తగ్గిపోతోంది. అందుకే ఇప్పుడు ఈ కొత్త చట్టం తీసుకొచ్చే పనిలో పడ్డాయి.

ముఖ్యంగా అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్ లాంటి దిగ్గజ టెక్నాలజీ మల్టీనేషనల్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని దీన్ని సిద్ధం చేశారు. ఎక్కడైతే విక్రయాలు జరుగుతున్నాయో అక్కడే పన్నులు విధించేందుకు ఈ ఒప్పందంతో అవకాశం ఏర్పడుతుంది. అంటే ప్రధాన కార్యాలయాలు, పేటెంట్ హక్కులు, ట్రేడ్ మార్క్‌లతో పనిలేకుండా.. విక్రయాలు జరిగే చోటే పన్నులు వసూలు చేస్తారు.

రోమ్‌లో జరిగిన జీ20 సదస్సులో పలు దేశాల నాయకులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోమ్‌లో జరిగిన జీ20 సదస్సులో పలు దేశాల నాయకులు

3. ఇప్పుడే ఎందుకు తీసుకొస్తున్నారు?

ఈ కార్పొరేట్ కనీస పన్ను రేటును తీసుకురావడానికి ఎంతోకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

1980ల నుంచి కార్పొరేట్ పన్ను రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. అప్పట్లో సగటున 40శాతం ఉన్న పన్ను రేటు.. 2020 నాటికి సుమారు 25 శాతానికి తగ్గిందని 'ద హిందూ' తన కథనంలో పేర్కొంది.

విదేశీ సంస్థలు, పెట్టుబడులను ఆకర్శించడంలో దేశాల మధ్య పోటీ కారణంగా కార్పొరేట్ పన్ను రేటు తగ్గుతూ వస్తోంది.

కానీ ఎప్పటి నుంచో నానుతున్న ఈ అంశం కోవిడ్ కారణంగా ప్రభుత్వాలకు ఆదాయం పడిపోవడంతో మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పుడు చకచకా ముందుకు సాగుతోంది.

దీన్ని వచ్చే ఏడాదిలో చట్టం చేసి, 2023 నుంచి అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

టాక్స్

ఫొటో సోర్స్, Getty Images

4. కొత్త ఒప్పందంలో ఏముంది?

బహుళ జాతి కంపెనీలు ఏ దేశంలో వ్యాపారం చేసినా, ఏ దేశంలో తన లాభాలను ప్రకటించినప్పటికీ దాని లాభాలపై ప్రపంచవ్యాప్తంగా కనీసం 15శాతం పన్ను వసూలు చేయడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.

అంటే కంపెనీ లాభాలపై పన్ను స్వర్గాలుగా పిలిచే కొన్ని దేశాల్లో పన్ను విధించకపోయినా, తక్కువగా విధించినా.. ఆ లాభాలపై స్వదేశం 'టాప్‌అప్ ట్యాక్స్' విధించొచ్చు. అలా సంస్థ లాభాలపై కనీస పన్ను 15శాతం ఉండేలా చూస్తారు.

ఈ కొత్త ఒప్పందంలో రెండు భాగాలుంటాయి. ఇందులో రెండోది చాలా ముఖ్యమైంది. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ పన్ను రేటు కనీసం 15శాతంగా ఉండేలా ఇదే చూస్తుంది.

విదేశాల్లో తన లాభాలను ప్రకటించి, 15శాతం కంటే తక్కువ పన్ను కట్టే కంపెనీలపై టాప్అప్ ట్యాక్స్ విధించే అధికారాన్ని స్వదేశంలోని ప్రభుత్వాలకు ఇదే కల్పిస్తుంది.

ఉదాహరణకు.. అమెజాన్ సంస్థ తన లాభాలను ఐర్లాండ్‌లోని శాఖకు సంబంధించినవిగా ప్రకటించి అక్కడ కేవలం ఐదు శాతం పన్ను మాత్రమే కట్టిందనుకుందాం. అప్పుడు అమెజాన్ ప్రకటించిన ఆ లాభాలపై మరో 10 శాతం పన్నును అమెరికా ప్రభుత్వం విధించొచ్చు.

సుమారు 64 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న కంపెనీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.

అమెజాన్

ఫొటో సోర్స్, Getty Images

5. పన్ను హక్కులను దేశాల మధ్య ఎలా పంపిణీ చేయాలి?

ఇక అత్యంత లాభదాయకమైన బహుళజాతి కంపెనీలకు సంబంధించిన పన్ను హక్కులు, దాని లాభాలను వివిధ దేశాల మధ్య న్యాయబద్ధంగా ఎలా పంపిణీ జరగాలన్నది ఒప్పందంలోని మొదటి భాగంలో ఉంది.

సాధారణంగా కంపెనీలు ఎక్కడ వ్యాపారం చేశాయన్న దానితో సంబంధం లేకుండా, ఎక్కడ దాని లాభాలను ప్రకటించిందన్న దానిపై ఆధారపడే పన్నులు వసూలు చేస్తుంటారు.

ఈ రోజుల్లో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఎన్నో దేశాల్లో తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీల లాభాల్లో ఆయా దేశాలకు కూడా న్యాయంగా వాటా ఇవ్వాలని మొదటి భాగంలో ఉంది.

అంటే ఒక బహుళజాతి సంస్థ.. ఒక దేశంలో భౌతికంగా ఉన్నా, లేకపోయినా.. ఆ దేశంలో వ్యాపారం చేసి, లాభాలు ఆర్జిస్తే, వాటిపై ఆ దేశానికి పన్ను కట్టాలన్నమాట.

ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల విలువ దాదాపు లక్ష 71వేల కోట్ల రూపాయలు దాటి, 10 శాతం లాభాలు ఉన్న కంపెనీలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ప్రపంచీకరణ వల్ల ఈ కంపెనీలు లబ్ధి పొందిపొందినట్లు పరిగణిస్తారు.

వీడియో క్యాప్షన్, భారతీయ సంపన్నులు ఎందుకు విదేశాలకు వెళ్లిపోతున్నారు?

ఈ ప్రతిపాదనను టెక్ కంపెనీలు స్వాగతించాయి.

''ఈ పన్ను సంస్కరణల విధానం విజయవంతం కావాలని మేం కోరుకుంటున్నాం. వేర్వేరు చోట్ల ఎక్కువ పన్నులు చెల్లించాల్సి వచ్చినా మేం దీన్ని గౌరవిస్తున్నాం'' అని ఫేస్‌బుక్‌ ఉపాధ్యక్షుడు నిక్ క్లెగ్ గతంలో అన్నారు.

అంతర్జాతీయ ట్యాక్స్ వ్యవస్థలో ఈ ఒప్పందంతో సుస్థిరత నెలకొంటుందని ఆశిస్తున్నట్లు అమెజాన్ అధికార ప్రతినిధి చెప్పారు.

''అంతర్జాతీయ పన్ను విధానాలను ఆధునికీకరిస్తూ తీసుకొచ్చిన ఈ ఒప్పందానికి మేం మద్దతు పలుకుతున్నాం. ఈ ఒప్పందానికి తుది రూపు నిచ్చేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేస్తాయని ఆశిస్తున్నాం'' అని గూగుల్ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.

పరిశ్రమ

ఫొటో సోర్స్, Getty Images

6. ఎంఎన్‌సీ కంపెనీలపై డిజిటల్ పన్ను

ఇంటర్నెట్‌ ఆధారంగా భారత్‌లో వ్యాపారం చేసే ఎంఎన్‌సీ కంపెనీలపై కేంద్రం ఆరు శాతం డిజిటల్/ఈక్వలైజేషన్ పన్ను విధిస్తోంది.

2016లో కేంద్రం ఈ పన్నును ప్రవేశపెట్టింది. మరో దేశంలో ఉండి, భారత్‌ ఆన్‌లైన్‌లో వ్యాపార లావాదేవీలు నిర్వహించే బహుళజాతి సంస్థల నుంచి కేంద్రం ఈ డిజిటల్‌ పన్ను వసూలు చేస్తోంది.

ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే టెక్ కంపెనీల వార్షిక ఆదాయం 2 కోట్లు దాటితే ఈ పన్ను పరిధిలోకి వస్తాయి.

అంటే గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, నెట్‌ఫ్లిక్స్ వంటి కంపెనీలన్నీ ఈ డిజిటల్ పన్ను కట్టాల్సి ఉంటుంది.

ఒకవేళ కార్పొరేట్ కనీస పన్ను విధానం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ పన్నును రద్దు చేయాల్సి రావొచ్చు. ఎందుకంటే మల్టీలేటరల్ కన్వెన్షన్‌ (MLC) కోసం డిజిటల్ లేదా ఆ రకమైన పన్నులను అన్ని దేశాలు రద్దు చేయాల్సి ఉంటుందని ఓఈసీడీ చెప్పింది.

అలాగే విదేశాల్లో భౌతిక కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని, భారత్‌లో ఆన్‌లైన్‌ వ్యాపారం చేసే కంపెనీలతో వ్యాపార సంబంధం ఏర్పాటు చేసుకునేందుకు సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రజెన్స్‌ పేరుతో ఐటీ చట్టానికి కూడా కేంద్రం కొన్ని సవరణలు తీసుకొచ్చింది.

7. భారత్‌లో కార్పొరేట్ పన్నులు ఎలా ఉన్నాయి?

2019లో కార్పొరేట్ పన్ను రేటును తగ్గించింది కేంద్ర ప్రభుత్వం.

30 (సర్‌ఛార్జ్, సెస్‌ కలిపితే 34.94) శాతంగా ఉన్న కార్పొరేట్ పన్ను రేటును 22 శాతానికి తగ్గించింది. సర్ చార్జ్, సెస్ కలిపితే ఈ పన్ను రేటు 25.17శాతానికి చేరుతుంది.

అయితే, ఇతర రాయితీలు, ప్రోత్సాహకాలు వద్దనుకునే దేశీయ కంపెనీలకు మాత్రమే ఈ రేటు వర్తిస్తుంది.

2019 అక్టోబర్ 1 తర్వాత తయారీ రంగంలో కొత్తగా ఏర్పాటయ్యే దేశీయ సంస్థలకు రాయితీలు, ప్రోత్సాహకాలు తీసుకోకుంటే 15శాతం కార్పొరేట్ పన్ను రేటు వర్తిస్తుంది. సర్‌ఛార్జ్, సెస్ కలిపితే అది 17.01 శాతం. ఇదివరకు వాటికి 25 శాతం (సర్‌ఛార్జ్, సెస్ కలిపి 29.12 శాతం) కార్పొరేట్ పన్ను రేటు ఉండేది.

ఇలా కార్పొరేట్ పన్ను రేటును తగ్గించడం వల్ల 1, 45, 000 కోట్ల రాబడి కోల్పోయామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

కార్పొరేట్ పన్నును భారత్‌లో వ్యాపారం చేసే దేశీయ, విదేశీ సంస్థలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీస్ యాక్ట్ చట్టం ప్రకారం భారత్‌లో రిజిస్టర్ అయిన సంస్థను దేశీయ కంపెనీగా, నమోదు కాని సంస్థను విదేశీ సంస్థగా పరిగణిస్తారు.

దీనితో పాటు మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ కూడా ఉంటుంది.

డబ్బులు

ఫొటో సోర్స్, Pti

8. భారత్‌‌లో టెక్ కంపెనీల జోరు

2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో ఫేస్‌బుక్ ఆదాయం 43 శాతం పెరిగి, 1277 కోట్ల రూపాయలకు చేరుకుందని బిజినెస్ స్టాండర్డ్ వెబ్‌సైట్ పేర్కొంది. 2020-21లో ఫేస్‌బుక్ ఇండియా గ్రూప్ (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్) ఆదాయం 9000 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

2019-20లో అమెజాన్ ఇండియా యూనిట్ అయిన అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ఆదాయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే 43శాతం పెరిగి 10, 847 కోట్ల రూపాయలకు చేరుకుంది. అయితే, అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ నష్టాలు 5849 కోట్లకు పెరిగాయని మనీకంట్రోల్ వెబ్‌సైట్ పేర్కొంది.

ఇదే ఆర్థిక సంవత్సరంలో గూగుల్ ఇండియా ఆదాయం గతేడాదితో పోలిస్తే 34.8శాతం పెరిగి 5593 కోట్ల రూపాయలకు చేరింది.

భారత మార్కెట్‌పై టెక్ కంపెనీలు భారీ ఆశలు, అంచనాలతో ఉన్నాయి. రాబోయే రోజుల్లో వృద్ధికి మరింత అవకాశం ఉందని భావిస్తున్నాయి.

9. కొత్త ప్రతిపాదన భారత్‌కు లాభమా? నష్టమా?

భారత్‌లో పెట్టుబడులపై ఈ కొత్త ప్రతిపాదన ప్రభావం ఎక్కువగానే ఉంటుంది.

భారత్‌కు పన్ను విధించే అదనపు హక్కులు వస్తాయని, ఇది భారత్‌కు ప్రయోజనం కలిగిస్తుందని, అయితే, అది ఎంత మేరకన్నది ఇప్పుడే చెప్పలేమని కన్సల్టింగ్ సంస్థ ఈవై తన నివేదికలో చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్ వెబ్‌సైట్ పేర్కొంది.

గ్లోబల్ కార్పొరేట్ కనీస పన్ను రేటు ఒప్పందం భారత్‌కు మేలే చేస్తుందని ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్‌నర్ కన్సల్టింగ్ సంస్థకు చెందిన మహేశ్వరీ అన్నారని మింట్ వెబ్‌సైట్ కథనం పేర్కొంది.

అయితే, ప్రత్యేక రాయితీలు, సౌకర్యాలు కల్పించి విదేశీ పెట్టుబడులను ఆకర్శించే తమ సామర్థ్యాన్నిఈ ప్రతిపాదన తగ్గిస్తుందని భారత్, చైనా, పోలాండ్, ఈస్టోనియా వంటి దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.

మరోవైపు, కార్పొరేషన్ పన్ను కనీస పరిమితి(మినిమమ్ కార్పొరేట్ ట్యాక్స్)ను 15 శాతంగా నిర్దేశించడాన్ని చారిటీ సంస్థ ఆక్స్‌ఫామ్ విమర్శించింది. ఇది చాలా తక్కువని, దీని వల్ల పెద్ద తేడా ఏమీ కనిపించదని వ్యాఖ్యానించింది.

''స్విట్జర్లాండ్, సింగపూర్ లాంటి తక్కువ పన్నులు విధించే దేశాల తరహాలో ఈ కనీస పరిమితి ఉంది. ఇదొక వివక్ష పూరిత ఒప్పందం. ఎందుకంటే దీంతో జీ7 దేశాలకు మాత్రమే లాభం జరుగుతుంది. పేద దేశాలకు జరిగేది నష్టమే'' అని ఆక్స్‌ఫామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాబ్రియేలా బుచెర్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)