పెట్రోల్ మీద ఎక్కువ టాక్స్ వసూలు చేస్తోంది కేంద్రమా, రాష్ట్రమా? - BBC FactCheck

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కీర్తీ దూబే
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశంలో చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ లీటరు ధర రూ.100 దాటింది. ప్రతి నెలా ఈ ధర కొత్త రికార్డులు సృష్టిస్తోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల గురించి కాంగ్రెస్, బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. వీటన్నిటి మధ్య సోషల్ మీడియాలో ఒక మెసేజ్ జోరుగా వైరల్ అవుతోంది.
ఆ మెసేజ్‌లో పెట్రోల్ ధర బ్రేకప్ గురించి ఉంది. అందులో పెట్రోల్ ధరలు పెరడానికి మోదీ ప్రభుత్వం కారణం కాదు, దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వాల హస్తం ఉంది అని చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ ధరలపై భారీగా పన్నులు వసూలు చేస్తున్నాయని, అవి కేంద్రం విధించే పన్ను కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని, అందుకే పెట్రోల్ ధరలు సామాన్యులకు భారంగా మారాయని అంటున్నారు.

ఫొటో సోర్స్, Social media
ప్రతి పెట్రోల్ పంప్ దగ్గర ఒక బోర్డు పెట్టాలని, అందులో బేసిక్ ధర రూ.35.50, కేంద్రం టాక్స్ రూ.19, రాష్ట్రాల వ్యాట్ రూ. 41.55, డీలర్ లాభం రూ. 6.5, మొత్తం కలిపి లీటరు పెట్రోల్ ధర రూ.103 అయ్యిందని కూడా ఈ సందేశంలో చెబుతున్నారు.
అందుకే, పెరుగుతున్న పెట్రోల్ ధరలకు అసలు ఎవరు బాధ్యులు అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఈ సందేశంలో పెట్రోల్ ధరలో అత్యధిక భాగం రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నులేనని చెబుతున్నారు.
ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలింది
ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి) వివరాల ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా పెట్రోల్ దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.
దేశంలో ప్రతి రోజూ 30 లక్షల బ్యారళ్ల ముడి చమురు దిగుమతి అవుతుంది. ఆర్థిక కారణాలతో ఈ డిమాండ్ గత ఆరేళ్లలో అతి తక్కువగా ఉంది.
పెట్రోల్‌ను జీఎస్టీ పరిధికి బయట ఉంచారు. అందుకే దీనిపై విధించే పన్నులు వివిధ రాష్ట్రాల్లో వేరు వేరుగా ఉంటాయి.
దీనితోపాటూ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ప్రతి రోజూ పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఫలితంగా రోజూ ధరలు మారుతూ ఉంటాయి.
మనం మొదట చమురు ధరలు నాలుగు స్థాయిల్లో నిర్ణయిస్తారనేది తెలుసుకోవాలి
- అంతర్జాతీయ మార్కెట్ ధర, రీఫైనరీ వరకూ చేర్చడానికి అయ్యే సరకు రవాణా చార్జీలు
- డీలర్ లాభం, పెట్రోల్ పంప్ వరకూ చేర్చడానికి అయ్యే ఖర్చులు
- పెట్రోల్ పంప్‌కు చేరిన తర్వాత, కేంద్రం నిర్ణయించిన ఎక్సైజ్ డ్యూటీ కలుస్తుంది
- తర్వాత రాష్ట్రాలు వసూలు చేసే వాల్యూ యాడెడ్ టాక్స్ (వ్యాట్)ను జోడిస్తారు.

ఫొటో సోర్స్, Indian oil
కేంద్రం ఎంత టాక్స్ తీసుకుంటోంది
ఇక్కడ, కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ పేరుతో పెట్రోల్‌పై ఎంత వసూలు చేస్తోంది అనే ప్రశ్న వస్తుంది.
ప్రస్తుతం కేంద్రం పెట్రోల్‌పై వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ ఒక లీటరుకు రూ. 32.90
2014 నుంచి 2021 మధ్య పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం 300 శాతం వరకూ పెంచింది. ఈ వాస్తవాలను కేంద్రం ఇదే ఏడాది లోక్‌సభలో కూడా చెప్పింది.
2014లో పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ లీటరుకు రూ.9.48 ఉంటే, అది ఇప్పుడు లీటరుకు రూ.32.90కి పెరిగింది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తమ వెబ్‌సైట్‌లో దిల్లీలో ప్రస్తుత పెట్రోల్ ధరల వివరాలు వెల్లడించింది.
ఈ వివరాల ద్వారా సామాన్యులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరు ఎంత పెట్రో ధరల భారం మోపుతున్నారో సులభంగా అర్థమవుతోంది.
2021, జులై 16న జారీ చేసిన ఈ గణాంకాల్లో పెట్రోల్ బేస్ ధర లీటరుకు రూ. 41 ఉంది. ఇందులో ఫ్రయిట్ చార్జీలు లీటరుకు 0.36 పైసలుగా చెప్పారు. లీటరుపై వసూలు చేసే రూ.32.90 ఎక్సైజ్ డ్యూటీ కేంద్రం ఖాతాలోకి వెళ్తే, రూ.3.85 డీలర్ లాభంగా ఉంటోంది. లీటరు పెట్రోల్‌పై దిల్లీ ప్రభుత్వం రూ.23.43 వ్యాట్ విధించింది.
ఇలా మొత్తం కలిపి దిల్లీలో లీటరు పెట్రోల్ ధర 101.54 చేరింది.
దిల్లీ ప్రభుత్వం పెట్రోల్ మీద 30 శాతం వ్యాట్ విధిస్తోంది. దీనిని ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ చార్జ్, సరకు చార్జీలకు అదనంగా వసూలు చేస్తారు.
కానీ, కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్ బేస్ ప్రైస్, డీలర్ లాభం, ఫ్రయిట్ చార్జీలను జోడించడం ద్వారా వసూలు చేస్తారు.
ప్రభుత్వం దీనికి ఒక శాతాన్ని నిర్ణయించదు. బదులుగా ఒక మొత్తంగా నిర్ణయిస్తుంది. ప్రస్తుతం జులై 16న గణాంకాల ప్రకారం అది రూ. 32.90 ఉంది.

ఫొటో సోర్స్, Indian oil
రాష్ట్రం ఎంత వ్యాట్ విధిస్తోంది
జులై 26న కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి లోక్‌సభలో దీనిపై వివరించారు.
పెట్రోల్ మీద మధ్యప్రదేశ్ ప్రభుత్వం అత్యధికంగా లీటరుకు 31.55 వసూలు చేస్తోంది. డీజిల్ మీద రాజస్థాన్ ప్రభుత్వం అత్యధికంగా రూ.21.82 విధించింది.
అంటే రాష్ట్రాలు అత్యధికంగా విధించిన వ్యాట్ కేంద్రం వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ కంటే తక్కువే ఉంది.
మన దేశంలో తి తక్కువ వ్యాట్ అండమాన్ నికోబార్ దీవుల్లో వసూలు చేస్తున్నారు. అక్కడ పెట్రోల్ మీద లీటరుకు రూ.4.82, డీజిల్ మీద రూ. 4.74 వ్యాట్ విధించారు.
రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌తో పాటూ చాలాసార్లు కొన్ని ఇతర పన్నులు కూడా జోడిస్తాయి. వాటికి గ్రీన్ టాక్స్, టౌన్ రేట్ టాక్స్ లాంటి పేర్లు పెడతారు.
పెట్రోల్, డీజిల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ అదాయాన్ని ఆర్జించే అతి ముఖ్యమైన మార్గాలుగా మారాయి.
ప్రస్తుతం చెబుతున్న వాదనలు తప్పని మా ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. కేంద్రం వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాలు వసూలు చేసే వ్యాట్ కంటే ఎక్కువే. ఆ విషయాన్ని పార్లమెంటులో ఇచ్చిన సమాధానంలో కేంద్రం స్వయంగా అంగీకరించింది.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 ఎప్పటికీ అంతం కాకపోవచ్చు, దానితో కలిసి జీవించడం ఎలా?
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








