పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని ప్రశ్నలు, కంపెనీ ఏమంటోంది

ఫొటో సోర్స్, Getty Images
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పెగాసస్ స్పైవేర్ మరోసారి చర్చల్లో నిలుస్తోంది.
ఎంతోమంది జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ప్రభుత్వ అధికారుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూప్‌నకు చెందిన ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారనే ఆరోపణలు ఉన్నాయి.
50వేల నంబర్ల డేటా బేస్ లీకవడంపై ద గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్, ద వైర్, ఫ్రంట్‌లైన్, రేడియో ఫ్రాన్స్ లాంటి 16 మీడియా సంస్థల జర్నలిస్టులు పరిశోధనలు చేశారు.
సాఫ్ట్‌వేర్‌ను వివిధ దేశాల ప్రభుత్వాలకే అమ్ముతామని, నేరస్థులు, తీవ్రవాదులను ట్రాక్ చేసే ఉద్దేశంతో ఆ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశామని ఎన్ఎస్ఓ గ్రూప్ స్పష్టంగా చెప్పింది.
పారిస్‌లోని ఫర్‌బిడెన్ స్టోరీస్ మీడియా సంస్థ, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు 50వేల ఫోన్ నంబర్లకు సంబంధించిన డేటా లభించింది. ఈ రెండు సంస్థలు ప్రపంచంలోని 16 మీడియా సంస్థలతో కలిసి ఈ డేటా బేస్ నంబర్లపై పరిశోధనలు చేయడానికి ఒక రిపోర్టర్ల ఒక గ్రూప్ ఏర్పాటుచేశాయి.

పెగాసస్ ప్రాజెక్ట్
ఈ పరిశోధనకు పెగాసస్ ప్రాజెక్ట్ పేరు పెట్టారు. ఎన్ఎస్ఓ కంపెనీ క్లైంట్స్(చాలా దేశాల ప్రభుత్వాలు) ఈ 50 వేల నంబర్లను పెగాసస్ సిస్టమ్‌కు అందించినట్లు చెబుతున్నారు. ఈ డేటా బేస్ 2016 నుంచి ఇప్పటివరకూ ఉందని అంటున్నారు.
అయితే, లీకయిన 50వేల నంబర్ల డేటాలోని అన్ని నంబర్లనూ పెగాసస్ హ్యాక్ చేసిందా లేదా వాటిపై హ్యాకింగ్ ప్రయత్నాలు జరిగాయా అనేది కచ్చితంగా చెప్పలేం.
ఏదైనా ఒక డివైస్ పెగాసెస్‌కు హ్యాక్ అయ్యిందా లేదా అనే కచ్చితమైన సమాధానం ఫోరెన్సిక్ పరిశోధన తర్వాతే తెలుస్తుంది.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, తన టెక్ లాబ్‌లో 67 డివైస్‌లకు ఫోరెన్సిక్ పరీక్షలు చేసింది. అందులో 37 డివైస్‌లు పెగాసెస్‌కు టార్గెట్ అయ్యాయని గుర్తించింది. వాటిలో పది డివైస్‌లు భారత్‌కు చెందినవి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
ఫర్‌బిడెన్ స్టోరీస్ వాదన
ఫర్‌బిడెన్ స్టోరీస్ వ్యవస్థాపకుడు లారె రిచర్డ్ దీనిపై బీబీసీ ప్రతినిధి శశాంక్ చౌహాన్‌తో ఫోన్లో మాట్లాడారు.
"ఎంతోమంది జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు ఈ నిఘాకు బలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని దీని ద్వారా స్పష్టమవుతోంది" అని ఆయన అన్నారు.
"మాకు ఫోన్ నంబర్ల జాబితా దొరికింది. ఆ జాబితా అసలు ఎక్కడ నుంచి తీసుకున్నారో తెలుసుకోవాలని మేం ప్రయత్నించాం. ఆ లిస్టులో ఫోన్ నంబర్లు ఉన్నంత మాత్రాన, అవన్నీ హ్యాక్ అయ్యాయని చెప్పలేం. అందులోని కొన్ని నంబర్లపై ఎన్ఎస్ఓ (పెగాసెస్ తయారీ కంపెనీ) నిఘా పెడుతోందని మాకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సాయంతో తెలిసింది" అన్నారు.
"పెగాసెస్ స్పైవేర్‌ను వీటిపై ఆయుధంలా ఉపయోగించారు. రాబోయే కొన్ని వారాల్లో చాలా బలమైన రిపోర్టులు, చాలా రకాల పేర్లు వెలుగులోకి వస్తాయి" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, NURPHOTO/GETTY IMAGES
10 దేశాల్లో యూఏఈ, సౌదీ, భారత్
పెగాసస్ ప్రాజెక్టులో ఆ 1571 నంబర్లు ఎవరివని తెలుసుకోడానికి పరిశోధన చేశారని చెబుతున్నారు. అందులో 10 దేశాల ఎన్ఎస్ఓ వినియోగదారులు ఆ సిస్టమ్‌లో ఈ నంబర్లు ఎక్కించినట్లు తేలింది. ఆ దేశాల్లో భారత్, అజర్‌బైజాన్, బహ్రెయిన్, కజకిస్తాన్, మెక్సికో, మొరాకో, రువాండా, సౌదీ అరేబియా, హంగరీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి.
మొత్తం 50 వేల నంబర్ల డేటా బేస్ 45దేశాలకు సంబంధించినది అయ్యుండవచ్చని దీనిపై పరిశోధనలు చేసిన జర్నలిస్టుల బృందం భావిస్తోంది.
పెగాసస్ ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకూ రెండు రిపోర్టులు వెలుగులోకి వచ్చాయి.
వాటి ద్వారా లీకయిన డేటాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఎన్నికల కమిషన్ మాజీ సభ్యుడు అశోక్ లావాసా, వైరాలజిస్ట్ గగనదీప్ కాంగ్, కేంద్ర కొత్త సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సహా కశ్మీర్‌కు చెందిన వేర్పాటువాద నేతలు, సిక్కు కార్యకర్తల నంబర్లు కూడా ఉన్నాయి.
వీరితోపాటూ భారత జర్నలిస్టుల నంబర్లు కూడా లీకయిన ఎన్ఎస్ఓ జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు. వారిలో ఇద్దరు ద వైర్ వ్యవస్థాపకులు, ద వైర్ కంట్రిబ్యూటర్ రోహిణీ సింగ్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జర్నలిస్ట్ సుశాంత్ సింగ్ పేర్లు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్ఎస్ఓ ఏం చెబుతోంది
పెగాసస్ ఉపయోగించడం ద్వారా జరిగిన మానవహక్కుల ఉల్లంఘనపై దర్యాప్తు చేయిస్తామని వాషింగ్టన్ పోస్ట్‌కు ఇచ్చిన ఒక ప్రకటనలో ఎన్ఎస్ఓ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు షెల్వీ ఉలియో చెప్పారు.
కానీ, లీకయిన వేల నంబర్ల జాబితాకు ఎన్ఎస్ఓకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన అన్నారు.
లీకయిన నంబర్లు ఎన్ఎస్ఓ సాఫ్ట్‌వేర్ వినియోగిస్తున్న దేశాలకు సంబంధించినవేనని దీనిపై పరిశోధనలు చేసిన నిపుణులు చెప్పారు.
పరిశోధకులు చేస్తున్న వాదనలు తప్పని, నిరాధారమని ఎన్ఎస్ఓ ఇంతకు ముందు జారీ చేసిన ప్రకటనలో చెప్పింది. కానీ, దానితోపాటు తాము పెగాసస్‌కు సంబంధించిన అన్ని విశ్వసనీయ వాదనలపై దర్యాప్తు జరిపిస్తామని, తగిన చర్యలు తీసుకుంటాని తెలిపారు.
గత 12 నెలల్లో ఇద్దరు వినియోగదారులకు ఇచ్చిన సాఫ్ట్‌వేర్‌ను తాము ఆపివేశామని కూడా ఎన్ఎస్ఓ చెప్పింది.
మా సాఫ్ట్‌వేర్‌ను 40 దేశాల సైన్యాలకు, చట్టం అమలు చేసే ఏజెన్సీలకు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు అమ్ముతామని ఎన్ఎస్ఓ కంపెనీ చెప్పింది. తమ క్లయింట్ దేశాలకు మానవహక్కుల గురించి ఎలాంటి రికార్డులు ఉన్నాయి అనేదానిపై దర్యాప్తు చేస్తామని తెలిపింది. అయితే ఆ 40 దేశాలేవో కంపెనీ పేర్లు చెప్పలేదు.

భారత ప్రభుత్వం పెగాసస్ ఉపయోగిస్తున్నట్టు పూర్తిగా నిరాకరించడం లేదా
ఆదివారం పెగాసస్ ప్రాజెక్ట్ మొదటి లింక్ ప్రచురితమైన తర్వాత సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాయి.
ఈ కేసులో ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రిపోర్ట్ విడుదల చేసిన సమయం గురించి ప్రశ్నలు లేవనెత్తారు.
"ఆదివారం రాత్రి ఒక వెబ్ పోర్టల్ చాలా సంచలనాత్మక స్టోరీ ప్రచురించింది. ఆ స్టోరీలో పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు. వర్షాకాల సమావేశాలకు ఒక రోజు ముందే ప్రెస్‌లో కథనాలు రావడం అంటే, అది యాదృచ్చికం కాకపోవచ్చు. అది భారత ప్రజాస్వామ్యం పరువు మంటగలపాలనే కుట్ర. ఈ నిఘా వ్యవహారంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. డేటాతో నిఘా జరిగిందని నిరూపితం కాదు. నిఘా విషయంలో ప్రభుత్వ ప్రొటోకాల్ చాలా కఠినంగా ఉంటుంది. భారత టెలిగ్రాఫ్ యాక్ట్, ఐటీ యాక్ట్ నిర్దేశిత నిబంధనలను బట్టి చట్టపరమైన ఇంటర్‌సెప్షన్ చేయవచ్చు" అని సభలో ఆయన ఒక ప్రకటన చేశారు.
కేంద్ర మంత్రి వైష్ణవ్ ఈ ప్రకటన చేసిన కాసేపటి తర్వాత ఈ ప్రాజెక్ట్ మరో రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. అందులో, నిఘా పెట్టారని చెబుతున్న నంబర్లలో ఆయన పేరు కూడా ఉంది. ఈ రెండో రిపోర్ట్‌లో నేతలు, మంత్రులు, అధికారులు, రాజకీయాలకు సంబంధించిన వారి పేర్లు ఉన్నాయి.
రాత్రి ఈ అంశంపై కేంద్ర మాజీ ఐటీ మంత్రి, బీజేపీ ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. రిపోర్ట్ వచ్చిన టైమింగ్ గురించి ప్రశ్నలు లేవనెత్తారు. ఈ రిపోర్టును ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలకు సంబంధించిన భారత వ్యతిరేక అజెండాగా చెప్పారు.
సోమవారం సాయంత్రం ఈ ఆరోపణలను కుట్రగా అభివర్ణించారు హోంమంత్రి అమిత్ షా.
విధ్వంస, అవరోధ శక్తులు ఈ కుట్రలతో భారత అభివృద్ధి పథాన్ని అడ్డుకోలేవని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమిత్ షా రాజీనామా కోరిన కాంగ్రెస్
పెగాసస్ నిఘా పెట్టిందని, లేదా ఆ ప్రయత్నాలు జరిగినట్లు చెబుతున్న నంబర్లలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సంబంధించిన రెండు మొబైల్ నంబర్లు కూడా ఉన్నాయి.
అయితే, రాహుల్ గాంధీ తన ఫోన్‌ను ఫోరెన్సిక్ పరిశోధన చేయించలేదు. అలాంటప్పుడు పెగాసస్ ఆయన ఫోన్ మీద నిఘా పెట్టిందా లేక ఆ ప్రయత్నం మాత్రమే చేసిందా అనేది కచ్చితంగా చెప్పలేం.
కానీ రాహుల్ గాంధీ నంబర్‌ను 2018 నుంచి 2019 మధ్య ఈ జాబితాలో చేర్చినట్టు ఆ రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.
ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ దీనిపై ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. హోంమంత్రి అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేసింది.
రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరి, పార్టీ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
"ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలపై నిఘా పెట్టడం, తమ మంత్రులపైనే గూఢచర్యం చేసినట్లు ఆధారాలు లభించాయి. మా నేత రాహుల్ గాంధీపై కూడా నిఘా పెట్టారు. దీనిపై దర్యాప్తు జరిపే ముందు అమిత్ షా రాజీనామా చేయాలి. మోదీపై ఎంక్వైరీ చేయాలి. ప్రజాస్వామ్య విలువలతో ముందుకు సాగాలంటే, మీరు ఇక్కడ ఉండడానికి అర్హులు కారు" అని ఖర్గే అన్నారు.
హోంమంత్రి అమిత్ షాను తప్ప దీనికి వేరే ఎవరినీ బాధ్యులుగా చేయలేమని కాంగ్రెస్ నేతలు అన్నారు. ప్రధానమంత్రి ఆమోదం లేకుండా ఇది జరిగుండదని చెప్పారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
ఇదంతా ఎప్పటినుంచి జరుగుతోంది
తన ఫోన్‌లో పెగాసస్ ఉందని ధ్రువీకరించిన వారిలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఒకరు. గత జులై 14న ప్రశాంత్ కిశోర్ ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్ష చేశారు. ఆ రోజు కూడా ఆయన ఫోన్‌ను హ్యాక్ చేసినట్లు తేలింది.
ప్రశాంత్ కిషోర్ 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో పనిచేశారు. ఈ ఏడాది జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఆయన టీఎంసీ వ్యూహకర్తగా పనిచేశారు. ఏప్రిల్‌లో బెంగాల్ ఎన్నికల్లో పనిచేస్తున్నప్పుడు కూడా ప్రశాంత్ కిశోర్ ఫోన్‌ను హాక్ చేసినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ల్యాబ్‌లో తేలింది.
ఇటీవల ఆయన ఎన్సీపీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీని కూడా కలిశారు.
ప్రధానమంత్రి 2017లో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడంతోపాటే ఎన్ఎస్ఓ సిస్టమ్‌లో భారత నంబర్ల ఎంట్రీ కూడా మొదలైందని ఈ పరిశోధన చెబుతోంది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 3
సమాధానాలు లేని ప్రశ్నలు
- భారత ప్రభుత్వం ఎన్ఎస్ఓ గ్రూప్ క్లయింటా? ఈ ప్రశ్నకు ప్రభుత్వం అవునో, కాదో సమాధానం ఇవ్వలేదు.
- పెగాసస్ ప్రాజెక్టు పరిశోధనలో గుర్తించిన మొత్తం 1571 నంబర్లనూ హాక్ చేశారా? దీనికి సమాధానం దొరకడం లేదు.
- 50 వేల డేటా బేస్‌లో పరిశోధన కోసం 1571 నంబర్లను మాత్రమే ఎందుకు, ఎలా ఎంచుకున్నారు?
- సోమవారం భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆదివారం రాత్రి ఈ రిపోర్ట్ వచ్చింది. ఇది కేవలం యాదృచ్చికమేనా?
- నిఘా పెట్టినట్లు చెబుతున్న నంబర్ల జాబితాలో ఉన్న వ్యక్తుల గురించి ఎలాంటి సమాచారం సేకరిస్తూ వచ్చారు?
- లీకయిన డేటా బేస్ ఎక్కడనుంచి లభించింది అనే దానిపై పక్కా సమాచారం లేదు.
- లీకయిన డేటా బేస్‌లో మొత్తం ఎంతమంది ఉన్నారు అనేదానిపైనా స్పష్టమైన సమాచారం లేదు.
- ఎన్ఎస్ఓ ఏ దర్యాప్తు గురించి చెబుతోందో, అది ఇప్పుడు సాధ్యమేనా?
- ఎన్ఎస్ఓకు ఈ గూఢచర్యం స్పైవేర్ కోసం డబ్బు ఎవరిస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇంకా దొరకాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- పెగాసస్ స్పైవేర్: ‘హోం మంత్రి అమిత్ షాను తొలగించండి’ - కాంగ్రెస్ డిమాండ్
- గోల్డ్‌ఫిష్: చైనాకు చెందిన ఈ అందమైన చేప రాక్షసిలా ఎలా మారుతోంది?
- ‘సెక్స్ గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే నేను వారికి సాయం చేస్తున్నాను’
- ఆంధ్రప్రదేశ్: శ్రీశైలంలో రహస్యంగా డ్రోన్లు ఎందుకు ఎగరేస్తున్నారు ? అనుమతి లేకుండా వీటిని వాడితే ఏం జరుగుతుంది?
- బండ్ల శిరీష: రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్‌లో గుంటూరు అమ్మాయి రోదసి యాత్ర విజయవంతం
- పీవీ సింధు ఈసారి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవడం ఖాయమేనా?
- పెగాసస్: సైబర్ దాడితో భారత ప్రభుత్వంపై ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి
- పెగాసస్ స్పైవేర్: మీకు తెలీకుండానే మీ ఫోన్‌ను ఎలా హ్యాక్ చేస్తుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








