పెగాసస్: కేంద్ర మంత్రులు, జర్నలిస్టులపై ఇజ్రాయెల్ సాఫ్ట్‌వేర్‌తో నిఘా

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రముఖులపై సాఫ్ట్‌వేర్ ‘‘పెగాసస్’’ సాయంతో నిఘా పెట్టారని వార్తలు వస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
వందల మంది జర్నలిస్టులు సహా ప్రముఖులపై ఈ నిఘా పెట్టినట్లు వార్తల్లో పేర్కొన్నారు. ఈ జాబితాలో భారత జర్నలిస్టులు కూడా ఉన్నారు.
ఈ అంశంపై బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి ట్వీట్ చేశారు. వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్ ఈ అంశంపై ఓ కథనం ప్రచురించబోతున్నాయని ఆయన చెప్పారు.
‘‘మోదీ క్యాబినెట్‌లోని మంత్రులు, ఆరెస్సెస్ నాయకులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, జర్నలిస్టులపై పెగాసస్‌తో నిఘా పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్ కథనాలు ప్రచురించబోతున్నాయి’’అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ ట్వీట్‌పై కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ‘‘మోదీ-షా ఒత్తిడి చేయడం వల్ల వారు నిఘా పెట్టలేదని నేను అనుకుంటున్నాను. దేశంలోని ప్రముఖులపై నిఘా పెట్టేందుకు మోదీ-షా కలిసి పెగాసస్‌ను ఉపయోగించుకుంటున్నారని పార్లమెంటులో ప్రస్తావించిన తొలి వ్యక్తిని నేనే’’అని ఆయన వ్యాఖ్యానించారు. 2019లో రాజ్యసభలో ఈ విషయంపై దిగ్విజయ్ స్పందించారు.

ఫొటో సోర్స్, JACK GUEZ/AFP via Getty Images
మరోవైపు ఈ వార్తలను ధ్రువీకరిస్తూ వాషింగ్టన్ పోస్ట్, న్యూస్ వెబ్‌సైట్ ‘‘ద వైర్’’ ఆదివారం రాత్రి ఓ కథనాన్ని ప్రచురించాయి.
ప్రముఖ జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఈ రెండు వార్తా సంస్థలు ఆరోపించాయి. అయితే, ఈ ఆరోపణలను పెగాసస్ మాతృసంస్థ ఎన్‌ఎస్‌వో తోసిపుచ్చింది.
తాము కేవలం గుర్తింపు పొందిన ప్రభుత్వ సంస్థలతోనే కలిసి పనిచేస్తామని, ముఖ్యంగా నేరాలు, ఉగ్రవాదానికి కళ్లెం వేసేందుకు కృషి చేస్తున్నామని ఎన్‌ఎస్‌వో వివరించింది.
''హిందుస్తాన్ టైమ్స్ ఎడిటర్ శిరీష్ గుప్తా; ద హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఇండియా టుడే, నెట్‌వర్క్18ల వ్యవస్థాపకుల పేర్లు జాబితాలో ఉన్నాయి. జర్నలిస్ట్ రోహిణీ సింగ్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ డిప్యూటీ ఎడిటర్ సుశాంత్ సింగ్ పేర్లు కూడా ఉన్నాయి. అమిత్ షా కుమారుడు జయ్ షా వ్యాపార లావాదేవీలపై రోహిణి వార్తలు రాశారు. మరోవైపు రఫేల్ ఒప్పందంపై సుశాంత్ వరుస కథనాలు ప్రచురించారు''అని ద వైర్ పేర్కొంది. మొత్తంగా 40 మంది జర్నలిస్టులపై నిఘా పెట్టినట్లు వివరించింది.

ఫొటో సోర్స్, NurPhoto/Getty Images
కార్యకర్తలే లక్ష్యం
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 మంది ఫోన్ నంబర్లపై పెగాసస్ సాయంతో ఎన్ఎస్‌వో నిఘా పెట్టిందని మీడియా నివేదికలు చెబుతున్నాయి.
ఈ జాబితా ఎక్కడి నుండి వచ్చింది, ఎవరెవరి ఫోన్లు హ్యాక్ అయ్యాయి అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
అయితే, నేరస్థులు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉపయోగించటానికే తాము సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసినట్లు ఎన్ఎస్‌వో తెలిపింది. మానవహక్కుల ఉల్లంఘన అతి తక్కువగా ఉన్న దేశాలకు చెందిన మిలటరీ, లా ఎన్ఫోర్స్మెంట్, ఇంటెలిజెన్స్ సంస్థలకు మాత్రమే సాఫ్ట్‌వేర్‌ను అందించినట్లు వివరించింది.
పారిస్‌కు చెందిన ఫర్‌బిడెన్ స్టోరీస్ అనే స్వచ్ఛంద సంస్థ, మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ జరిపిన ఇన్వెస్టిగేషన్ ఆధారంగానే మీడియాలో కథనాలు వెలువడ్డాయని చెప్పింది. 'ఆ రిపోర్టులో తప్పుడు ఊహాగానాలు, ధ్రువీకరించని థియరీలు ఉన్నాయి' అని ఎన్ఎస్‌వో ఖండించింది.
వాస్తవానికి, ఈ ఆరోపణలు చాలాదూరంగా ఉన్నాయని ఎన్ఎస్‌వో గ్రూపు వ్యాఖ్యానించింది. పరువు నష్టం దావా వేసే ఆలోచనను పరిశీలిస్తున్నామని పేర్కొంది.
''సెక్స్-మాదక ద్రవ్యాల మాఫియాలని విచ్ఛిన్నం చేయడానికి, కిడ్నాప్‌కి గురైన పిల్లలను గుర్తించడానికి, కూలిపోయిన భవనాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి, ప్రమాదకరమైన డ్రోన్‌ల నుంచి గగనతలాలను రక్షించడానికి మా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి రోజు ఉపయోగిస్తున్నారు. సరళంగా చెప్పాలంటే, ఎన్‌ఎస్‌వో గ్రూప్ ప్రాణాలను రక్షించే మిషన్‌లో భాగస్వామ్యమై ఉంది. తప్పుడు ఆరోపణలు చేసినా, సంస్థ ఈ మిషన్‌ను నిర్విరామంగా కొనసాగిస్తుంది. మా సర్వర్‌ల నుండి డేటా లీక్ అయిందనే వాదనలు పూర్తి అబద్ధం, హాస్యాస్పదం. ఎందుకంటే అలాంటి డేటా మా సర్వర్‌లలో ఏదీ లేదు.’’

ఫొటో సోర్స్, Getty Images
14 మీడియా సంస్థలు
పెగాసస్ వినియోగంపై ఆదివారం నాడు వాషింగ్టన్ పోస్ట్, ది గార్డియన్, లే మాండ్తో పాటు మరో 14 అంతర్జాతీయ మీడియా సంస్ధలు కథనాలను వెలువరించాయి.
ఐఫోన్, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌లలో పెగాసస్‌ను చొప్పించవచ్చు. వినియోగదారుడికి తెలియకుండా మెసేజ్‌లు, ఫొటోలు, ఈ మెయిల్స్‌ను ఇది ఆపరేటర్‌కు పంపుతుంది. కాల్స్‌ను కూడా రికార్డు చేస్తుంది. మైక్రోఫోన్‌ను కూడా ఆన్ చేస్తుంది.
జాబితాలోని ఫోన్ నంబర్లలో సగానికిపైగా ఫోన్లలో పెగాసస్ జాడలు ఉన్నట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది.
ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్, సీఎన్ఎన్, ది న్యూయార్క్ టైమ్స్, అల్ జజీరా తదితర వార్తాసంస్థలకు చెందిన 180 మందికి పైగా జర్నలిస్టుల పేర్లు జాబితాలో ఉన్నట్లు సమాచారం.
జాబితాలో హత్యకు గురైన సౌదీ జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీకు సన్నిహితంగా ఉండే ఇద్దరు మహిళలు, కార్ వాష్ దగ్గర హత్యకు గురైన మెక్సికన్ జర్నలిస్టు సిసిలియో పినెడా బిర్టో పేర్లు కూడా ఉన్నాయి.
ఈ లిస్టులో కొన్ని దేశాల అధినేతలు, అరబ్ రాజ కుటుంబీకులు, వ్యాపార దిగ్గజాల పేర్లూ ఉన్నాయి.
21 దేశాలకు చెందిన దాదాపు 200 మంది రిపోర్టర్ల ఫోన్ నంబర్లు లిస్టులో ఉన్నాయి.

ఫొటో సోర్స్, JACK GUEZ/AFP via Getty Images
తెలియాల్సినవి చాలా ఉన్నాయి..
‘‘ఈ ఆరోపణల్లో తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ లిస్టు ఎక్కడి నుంచి వచ్చింది? పెగాసస్‌తో ఎంతమందిని తరచుగా లక్ష్యంగా చేసుకుంటున్నారు? లాంటి అంశాలు తెలియాల్సి ఉంది’’అని బీబీసీ సైబర్ రిపోర్టర్ జో టైడీ విశ్లేషించారు.
‘‘ఈ ఆరోపణలను ఎన్ఎస్‌వో గ్రూపు మరోసారి తోసిపుచ్చినా సంస్థ పేరు, ప్రతిష్టలకు ఇది ఎదురుదెబ్బే.
రెండు వారాల క్రితమే 'పారదర్శకత రిపోర్టు'ను కంపెనీ ప్రచురించింది. అందులో మానవ హక్కుల పాలసీలు, కంపెనీ వాగ్దానాలు ఉన్నాయి. ఈ 32 పేజీల డాక్యుమెంటును ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఓ 'సేల్స్ బ్రోచర్'గా అభివర్ణించింది.
కొత్త ఆరోపణలు ఎన్ఎస్‌వో కంపెనీ పరువు, ప్రతిష్టలను దిగజార్చినా, దానికి ఆర్థికంగా ఎలాంటి హానీ కలిగించలేవు. పెగాసస్‌లాంటి సాఫ్ట్వేర్‌లను ఎన్ఎస్‌వో లాంటి అతి కొద్ది ప్రైవేటు కంపెనీలు మాత్రమే తయారు చేయగలవు. అందుకే వీటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ’’అని టైడీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- గోల్డ్‌ఫిష్: చైనాకు చెందిన ఈ అందమైన చేప రాక్షసిలా ఎలా మారుతోంది?
- తెలంగాణ: కరోనా లాక్డౌన్లో పెరిగిన బాల్య వివాహాలు
- వైఎస్ షర్మిల: కృష్ణా నదిపై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఇప్పుడే తెలివిలోకి వచ్చారా?
- మోదీ కేబినెట్: దళిత, ఓబీసీ మంత్రులు యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించగలరా
- ప్యూ రీసెర్చ్: మతం పట్ల భారతీయుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








