అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

ట్రస్ట్ తాము అన్నీ పరిశీలించిన అయోధ్యలో భూమిని కొన్నామని చెబుతున్నా అందులో అనేక సందేహాలకు సమాధానాలు దొరకడం లేదు.

ఫొటో సోర్స్, BBC/SAMEERATMAJ MISHRA

ఫొటో క్యాప్షన్, రామమందిరం ట్రస్టు కొనుగోలు చేసి భూమి
    • రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
    • హోదా, బీబీసీ కోసం

అయోధ్యలో రామ మందిరం కోసం సేకరిస్తున్న భూమి విషయంలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలతో వివాదం పెరుగుతోంది. ఆలయ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ విషయంపై స్పష్టత ఇవ్వగా, పరువు నష్టం దావా వేస్తామని వీహెచ్‌పీ హెచ్చరించింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమ వాదనలను సమర్ధించుకుంటున్నప్పటికీ ఇందులో సమాధానం దొరకని ప్రశ్నలు కొన్ని మిగిలే ఉన్నాయి.

రూ.2 కోట్ల నుంచి రూ.18.5 కోట్లకు మారిన భూ ఒప్పందం

ఆలయ కోసం కొనుగోలు చేస్తున్న భూమి చుట్టూనే ఆరోపణలు తిరుగున్నాయి. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ 12 వేల చదరపు మీటర్ల భూమిని కొనేందుకు 18.5 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది.

అదే భూమిని అదే రోజు అంతకు కొద్ది సేపటికి ముందు రూ. 2 కోట్లకు కొనేందుకు అమ్మకందారులు అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే, శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి, విశ్వ హిందూ పరిషత్ సీనియర్ నాయకుడు చంపత్ రాయ్ ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు.

భూమి కొనుగోలులో చట్టపరమైన ప్రక్రియను అనుసరించామని, కొనుగోలు చేసే ముందు ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించామని ఆయన చెప్పారు. పైగా ఆ స్థలాన్ని మార్కెట్ ధర కంటే తక్కువకే కొన్నామని కూడా రాయ్‌ తెలిపారు.

"శ్రీ రామ్ జన్మభూమి తీర్త్ క్షేత్ర ట్రస్ట్ కొనుగోలు చేసిన భూమిని మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు కొనుగోలు చేశాం. ఈ భూమిని కొనడానికి, ప్రస్తుత అమ్మకందారులు కొన్ని సంవత్సరాల కిందట అవతలి వ్యక్తులతో కుదుర్చుకున్న ఒప్పందంలోని ధర ప్రకారం వారు ఆ భూమిని కొన్నారు. మార్చి 18, 2021న బైనామా ( యాజమాన్యం మార్పు ప్రక్రియ) జరిగింది. ఆ తరువాత ట్రస్ట్‌ వారితో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ఎలాంటి అవినీతి లేదు'' అన్నారాయన.

అయోధ్యలోని బాగ్ బజేసీ ప్రాంతంలోని సర్వే నంబర్ 243, 244, 246లో సర్కిల్‌ రేటు( ప్రభుత్వ ధర) చదరపు మీటరుకు 4800 రూపాయలు. వీటిని కొనుగోలు చేసిన వారు రూ. 5 కోట్ల 80 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

సుల్తాన్‌ అన్సారీ, రవి మోహన్ తివారీ అనే ఇద్దరు వ్యక్తులు 2021 మార్చి 18 న కుసుమ్ పాఠక్, హరీశ్‌ పాఠక్ అనే వ్యక్తుల నుంచి రూ. 2 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఒప్పందం చేసుకుని, అదే రోజున 18.5 కోట్ల రూపాయలకు రామ జన్మభూమి ట్రస్ట్‌కు అమ్మారు.

ఇందుకోసం రూ.17 కోట్లు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే, ఈ డబ్బు ఎవరి ఖాతాల్లోకి పోయిందో స్పష్టంగా తెలియదు.

ఈ ఒప్పందం గురించి గత కొన్నేళ్లుగా చర్చలు సాగుతున్న మాట వాస్తవమని చంపత్ రాయ్ చెప్పారు. సుల్తాన్ అన్సారీ ఈ భూమిని కుసుమ్ పాఠక్, హరీశ్ పాఠక్‌లకు అమ్మేందుకు 2011లో రూ.2 కోట్లకు ఒప్పందం కుదుర్చు కున్నారు. కానీ, దస్తావేజుల మార్పు మాత్రం 2021 మార్చి 20న జరిగింది.

భూమి కొనుగోళ్లలో సాధారణంగా వ్యక్తుల మధ్య నిర్ణీత మొత్తానికి ఒక ఒప్పందం కుదురుతుంది. నిర్ణీత సమయంలో ఆ అగ్రిమెంట్‌ను పూర్తి చేసుకోవడం లేదంటే, తిరిగి రాసుకోవడం, రద్దు చేసుకోవడంలాంటివి జరుగుతాయి.

ఒప్పందంలో కుదుర్చుకున్న మొత్తాన్ని యజమానికి చెల్లించిన తర్వాత భూ యజమాని పేరు మారుతుంది. ఆ ప్రక్రియను బైనామా అంటారు.

అయోధ్యలో ఒకే భూమి ఒకే రోజు రూ.2 కోట్ల నుంచి రూ.18.5 కోట్లకు చేతులు మారింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రామమందిరం నమూనా

మరి అనుమానాలెక్కడ?

ఒప్పందం జరిగిన తర్వాత చాలా ఏళ్లకు కుసుమ్ పాఠక్, హరీశ్‌ పాఠక్‌లు సుల్తాన్, రవి తివారీలకు అదే రూ.2 కోట్లకు భూమిని ఎందుకు అమ్మారు అన్నది మొదటి సందేహం. ఇటీవలి కాలంలో వారు తమ ఒప్పందాన్ని పునరుద్ధరించుకున్నారు కూడా. కానీ, ధర మారలేదు.

రెండో సందేహం, హరీశ్ పాఠక్, కుసుమ్‌ పాఠక్‌ల నుంచి ట్రస్ట్ నేరుగా భూమిని ఎందుకు కొనుగోలు చేయలేదు? సుల్తాన్ అన్సారీ, రవి తివారీలు మధ్యలో ఎందుకు వచ్చారు?

ఇదే ప్రశ్నను అడుగుతూ ''అయోధ్య ట్రస్ట్ నేరుగా పాఠక్ దంపతుల నుంచి భూమిని కొనుగోలు చేసి ఉంటే, తక్కువ ధరకు పొందేవారు. మధ్యలో సుల్తాన్ అన్సారీ, రవి తివారి రావడం వల్ల భూమి కొనుగోలుకు ట్రస్ట్ పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది.'' అని సమాజ్‌వాదీ పార్టీ నేత తేజ్ నారాయణ్ పాండే అన్నారు.

ట్రస్ట్ కొద్ది నిమిషాల వ్యవధిలోనే సుమారు 16 కోట్ల రూపాయాలు అదనంగా చెల్లించాల్సి వచ్చిందని పాండే విమర్శించారు. సర్కిల్ రేటులో సగం ధరకు ఈ భూమిని ఎలా కొన్నారన్నది మరో సందేహం.

భూమిని మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు కొనుగోలు చేశామని శ్రీ రామ్ జన్మభూమి తీర్త్ క్షేత్ర ట్రస్ట్ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రామాలయాన్ని అలంకరిస్తున్న భక్తుడు

భూ కొనుగోలు వ్యవహారంలో పాల్గొన్న ఆ ఎనిమిది మంది ఎక్కడ?

2021 మార్చి 18కి ముందు, అంటే పాఠక్‌ దంపతులకు భూమి చేరే వరకు ఉన్న లావాదేవీల వ్యవహారం సంక్లిష్టంగా ఉంది. 2011 సంవత్సరంలో ఈ భూ ఒప్పందంలో మెహబూబ్ ఆలం, జావేద్ ఆలం, నూర్ ఆలం, ఫిరోజ్ ఆలం లను అమ్మకందారులుగా, కుసుమ్ పాఠక్, హరీశ్ పాఠక్‌ల పేర్లు కొనుగోలుదారులుగా పేర్కొన్నారు.

అప్పట్లో ఈ ఒప్పందం ఒక కోటి రూపాయలకు జరిగింది. 2014 సంవత్సరంలో వీరు ఈ అగ్రిమెంట్‌ను పునరుద్ధరించుకున్నారు.

ఈ సమయంలో భూమి కోర్టు వివాదంలో ఉండటంతో అది రిజిస్టర్ కాలేదు. కానీ 2017 సంవత్సరంలో దాన్ని రిజిస్టర్ చేశారు. 2019లో కుసుమ్ పాఠక్, హరీశ్‌ పాఠక్, సుల్తాన్ అన్సారీతో సహా 8మంది మధ్య ఈ భూమి అమ్మకానికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. అప్పట్లో ఆ భూమి విలువ రూ. 2 కోట్ల రూపాయలు

ఈ ఒప్పందం అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పుకు కొద్దిసేపటి ముందు జరిగింది. తీర్పు తరువాత ఇక్కడ ఆలయం వస్తుందన్న భరోసాతో చాలామంది ఆలయం పరిసర ప్రాంతాలలో భూమిని కొనడానికి ప్రయత్నించడంతో అయోధ్యలో భూమి ధరలు ఆకాశాన్నంటాయి.

ఈ ఒప్పందం రిజిస్టర్ అయిన సమయంలో అందులో పేర్కొన్న ఎనిమిదిమంది పేర్లు కనిపించకుండా పోయాయి. రవి మోహన్ తివారీ అనే కొత్త పేరు వచ్చి చేరింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఒప్పందంలో రవి మోహన్ తివారీ మొదట సాక్షిగా కనిపించగా, రిజిస్ట్రేషన్ సమయంలో భూమి యజమానిగా, విక్రేతగా కనిపిస్తాడు.

సుల్తాన్ అన్సారీతోపాటు ఈ అగ్రిమెంట్‌లో కనిపించే మరో 8 మంది చిరునామాలు, మొబైల్ నంబర్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కనిపిస్తాయి. కానీ, వారిలో సుల్తాన్ అన్సారీని తప్ప మిగిలిన ఎవరు సంప్రదించడానికి దొరకరు.

వీరికి ఫోన్ చేసినప్పుడు, మొబైల్ నంబర్ పని చేయడం లేదనే సమాధానం వస్తుంది. ఈ ఒప్పందంలో విశ్వ విజయ్ ఉపాధ్యాయ అనే వ్యక్తి పేరు కూడా కనిపిస్తుంది. ఈ భూమిలో అతనికి 15శాతం వాట ఉందని అందులో పేర్కొన్నారు. అతనెవరో తెలుసుకుందామని ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ, ఎవరూ లిఫ్ట్ చేయరు.

ఇదే కాకుండా, కుసుమ్ పాఠక్, హరీశ్ పాఠక్‌లు 2.34 హెక్టార్ల భూమిని కొనుగోలు చేసేందుకు సుల్తాన్ అన్సారీ సహా 9మందితో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కానీ, సుల్తాన్ అన్సారీ, రవి తివారీలకు కేవలం 1.208 హెక్టార్ట భూమి మాత్రమే ఉంది.

తాజాగా కొన్న భూమిని అయోధ్య భూ నిర్వాసితుల కోసం వినియోగిస్తున్నామని ట్రస్ట్ యాజమాన్యం చెబుతోంది.
ఫొటో క్యాప్షన్, చంపత్ రాయ్

హరీశ్ పాఠక్, కుసుమ్ పాఠక్‌లు ఎవరు?

ఈ మొత్తం ఎపిసోడ్‌లో హరీశ్ పాఠక్, ఆయన భార్య కుసుమ్ పాఠక్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా ఆయన బస్తీ జిల్లా నివాసి.

హరీశ్ పాఠక్ పేరుతో పాటు హరిదాస్ పాఠక్ అని కూడా పత్రాలలో నమోదు చేశారు. అయోధ్యలో ఆయన్ను చాలామంది బబ్లూ పాఠక్, బక్రీ వాలే బాబా అని కూడా పిలుస్తుంటారు. కానీ, ఆయన బస్తీ జిల్లాలో ఉంటారని చాలామందికి తెలుసు, కానీ ఆయన కచ్చితమైన చిరునామా ఏంటో తెలియదు.

అయోధ్యకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న బస్తీ జిల్లా, హరయ్య తహసీల్ లోని పాఠక్‌పూర్‌లో ఆయన నివసిస్తున్నారని తెలిసింది. కానీ, ఎంత ప్రయత్నించినా ఆయనను కలవడం సాధ్యం కాలేదు.

హరీశ్ పాఠక్ చాలా సంవత్సరాలుగా భూ కొనుగోళ్లు, అమ్మకాలు సాగిస్తున్నారని అయోధ్య ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ మహేంద్ర త్రిపాఠి చెప్పారు. మహేంద్ర త్రిపాఠి అభిప్రాయం ప్రకారం ఆయన తన వ్యాపారరీత్యా అయోధ్యలోనే ఉంటారు. కానీ, తన గ్రామానికి వెళ్లి వస్తుంటారు.

అయోధ్యలోని కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో హరీశ్ పాఠక్‌పై మోసం, ఫోర్జరీకి సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి. అరెస్టు నుండి తప్పించుకోవడం వల్ల 2018 సంవత్సరంలో అతని ఇంటిని కూడా జప్తు చేశారని, అయినా ఆయన పోలీసులకు దొరకలేదని స్థానిక పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఆ పోలీస్ అధికారి తన పేరు వెల్లడించడానికి ఇష్టపడ లేదు.

అయోధ్య మేయర్ రిషికేశ్ ఉపాధ్యాయ, శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్ ఏరియా ట్రస్టీ డాక్టర్ అనిల్ మిశ్రా 2021 మార్చి 18న బాగ్ బజేసిలో ఉన్న ఈ భూమి కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలకు ప్రధాన సాక్షులు.

అయితే, హరీశ్ పాఠక్ గురించి తమకు పెద్దగా తెలియదని మేయర్ రిషికేశ్ ఉపాధ్యాయ అన్నారు.

రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో పేర్కొన్న పేర్లు ఎవరో ఎక్కడివారో తెలియడం లేదు.

ఫొటో సోర్స్, BBC/SAMEERATMAJ MISHRA

ఫొటో క్యాప్షన్, అయోధ్య భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమంట్

వక్ఫ్ భూమి హరీశ్ పాఠక్ చేతికి ఎలా వచ్చింది?

అయోధ్యలోని రామ జన్మభూమి కాంప్లెక్స్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగ్ బజేసే ప్రాంతంలో ఉన్న ఈ భూమికి హరీశ్ పాఠక్, ఆయన భార్య కుసుమ్ పాఠక్ యాజమాన్య హక్కులు పొందారు. అయితే ఈ భూమి కోర్టు వివాదంలో ఉంది.

2011 సంవత్సరంలో పాఠక్ దంపతులు ఈ భూమిని మహఫూజ్ ఆలం, జావేద్ ఆలం, నూర్ ఆలం, ఫిరోజ్ ఆలం అనే వ్యక్తుల దగ్గర నుంచి ఒక కోటి రూపాయలకు కొనుగోలు చేశారు. కానీ, అంతకు ముందు నుంచే ఈ భూమి కోర్టు వివాదంలో ఉందని, దీనిని అమ్మే హక్కు ఆ నలుగురికి లేదని ఆరోపణలు ఉన్నాయి.

''ఈ ఆస్తిని మా పూర్వీకులు ఒక ధార్మిక (వక్ఫ్) కార్యక్రమం కోసం కేటాయించారు. దీనికి ఒక ముతవల్లీ (సంరక్షకుడు) ని నియమించారు. ముతవల్లీకి ఈ భూమిని అమ్మే హక్కు లేదు. ప్రస్తుత ముతవల్లీ మహఫూజ్ ఆలం తండ్రి మెహబూబ్ ఆలంను ఈ భూమికి యజమానికి మోసపూరితంగా రిజిస్టర్ చేశారు'' అని అయోధ్య ప్రాంతంలో నివసించే వహీద్ మహ్మద్ అన్నారు.

''ఈ భూమిని అతని కుమారుడు కుసుమ్ పాఠక్, హరీశ్ పాఠక్‌లకు అమ్మాడు. ఇవే కాకుండా అతను చాలా భూములను అమ్మేశాడు. మేము 10 ఏప్రిల్ 2018న వక్ఫ్ బోర్డులో ఈ లావాదేవీలపై చర్య తీసుకోవాలంటూ ఫిర్యాదు కూడా చేశాం. రామ జన్మ భూమి పోలీస్‌ స్టేషన్‌లో మహఫూజ్‌ ఆలం, అతని ముగ్గురు సోదరులపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశారు.'' అని వహీద్ వెల్లడించారు.

ఈ వక్ఫ్ ఆస్తి కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని వహీద్ అహ్మద్ తెలిపారు. ''2017 సంవత్సరంలో పాఠక్ దంపతులు సుల్తాన్‌ అన్సారీ, మరికొందరితో కుదుర్చుకున్న ఆస్తి ఒప్పందం 2021 మార్చి వరకు అమలులోకి రాలేదు'' అన్నారు వహీద్.

భూమికి సంబంధించిన పూర్తి వాస్తవాలు ట్రస్ట్ చెప్పకుండా మోసపూరితంగా కొందరు భూమిని అమ్మారని అయోధ్య స్థానికులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, SHAMIM A AARZOO

ఫొటో క్యాప్షన్, రామ మందిరం కోసం సిద్ధంగా ఉన్న శిలా స్తంభాలు

భూమి కొనుగోలు వ్యవహారంలో ట్రస్ట్ మోసపోయిందా?

బాగ్ బజేసి ప్రాంతంలో ఈ భూమి ప్రైమ్ లొకేషన్‌లో ఉందని చెబుతున్నారు. అయోధ్య ప్రాంతంలో ఇప్పుడు భూమి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే, వాస్తవానికి ఈ ప్రాంతంలో అయోధ్యకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక అడవిలాంటి ప్రదేశం. ఇందులో చాలా భాగం ప్రభుత్వ భూమి లేదంటే వక్ఫ్ బోర్డు ఆస్తి.

ట్రస్ట్ కొన్న భూమిలో ఒకవైపు జామతోట, మరోవైపు శ్మశానం ఉన్నాయి. ''అయోధ్యకు చెందిన పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ మొత్తం వ్యవహారంలో పాలుపంచుకున్నారు. భూమికి సంబంధించిన వాస్తవాలను ట్రస్ట్‌కు పూర్తిగా చెప్పలేదు. భూమిని అమ్మడం ద్వారా ట్రస్ట్‌ను మోసం చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించారు'' అని వహీద్ అన్నారు.

అయితే, భూమిని కొనే ముందు దానికి సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అంటున్నారు.

రామ మందిరం కాంప్లెక్స్ కోసం సేకరించిన భూమిలో ఉంటున్న వారికి పునరావాసం కల్పించేందుకు ఈ భూమిని కొన్నామని చంపత్ రాయ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)