అయోధ్య: రామ మందిరం భూమిపూజ ముహూర్తంపై వివాదం ఏమిటి

ఫొటో సోర్స్, THE INDIA TODAY GROUP
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునాదిరాయి వేయనున్నారు.
వెండితో చేసిన ఐదు ఇటుకలను 32 సెకండ్ల వ్యవధిలో ఆలయ పునాదిలో ఉంచాల్సి ఉంటుంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ రేపు అయోధ్యకు వెళ్లి అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
అయితే మందిర నిర్మాణ శంకుస్థాపన ముహూర్తంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
దీన్ని నిర్ణయించింది మరెవరో కాదు, కాశీ రాజకుటుంబానికి చెందిన ఆచార్య రాజేశ్వర్ శాస్త్రి ద్రవిడ్. కాశీలోని సంగ వేద పాఠశాలకు ఆయన గురువు. ఈ పాఠశాల నుంచి వచ్చిన అనేకమంది మాజీ విద్యార్ధులు రాష్ట్రపతి గౌరవాన్ని కూడా పొందారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
భూమిపూజ కార్యక్రమాలు రాఖీ రోజు నుండి ప్రారంభమవుతాయి. పునాది రాయి వేయడానికి మాత్రం ఆగస్టు 5 మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.47 గంటల మధ్య ముహూర్తంగా నిర్ణయించారు.
అయితే ఈ ముహూర్తంపై వివాదం నడుస్తోంది. ఆచార్య రాజేశ్వర్ ద్రవిడ్ నిర్ణయించిన ముహూర్తాన్ని ద్వారకా శారదాపీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్యస్వామి స్వరూపానంద సరస్వతి వ్యతిరేకించారు.
ఆలయ నిర్మాణం సరిగ్గా ఉండాలంటే సరైన ముహూర్తంలో పునాది రాయి వేయడం అవసరమని ఆయన ఓ వార్తా సంస్థతో అన్నారు.
ఇప్పుడు నిర్ణయించిన ముహూర్తం దుర్ముహూర్తమని స్వామీ స్వరూపానంద అన్నారు. అయితే ఈ ముహూర్తంపై తనతో ఎవరైనా చర్చకు రాగలరా అని ఆచార్య రాజేశ్వర్ ద్రావిడ్ సవాలు విసరగా, ఇంత వరకు ఎవరూ ముందుకు రాలేదు.
"ఆచార్య ద్రవిడ్ ఖగోళ శాస్త్రంలో దేశంలోనే సుప్రసిద్ధులు. జ్యోతిష్య శాస్త్ర గణనలు చేయడంలో ఆయనను మించినవారు లేరు. అందుకే చతుర్మాస కాలంలో వీలైనంత తొందరగా ముహూర్తం నిర్ణయించాలని శ్రీరామ జన్మభూమి న్యాస్ ట్రస్ట్ ఆయనను అభ్యర్ధించింది" అని కాశీ యోగా గురువు చక్రవర్తి విజయ్ నవాద్ బీబీసీతో అన్నారు.
వాస్తవానికి హిందూ మత సంప్రదాయాల ప్రకారం చతుర్మాస కాలంలో ఎలాంటి నిర్మాణపు పనులు చేయకూడదు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక క్రతువుల ద్వారా ఆ దోషాన్ని తొలగించుకోవచ్చని ఆయన వెల్లడించారు.
అయితే కేంద్రం, ఉత్తరప్రదేశ్‌లోని అధికార భారతీయ జనతా పార్టీ దీనిని రాజకీయ ప్రయోజనాల ఉపయోగించుకోడానికి ప్రయత్నిస్తున్నాయని పలు రాజకీయపార్టీలు ఆరోపించాయి.
బిహార్‌తోపాటు దేశంలో కొన్నిచోట్ల ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో ఇంత హడావుడిగా ఎందుకు శంకుస్థాపన ఎందుకని ప్రశ్నిస్తున్నాయి.
రాముడి చేతిలో విల్లు బాణానికి బదులుగా రాముడు, సీత, హనుమంతుడి విగ్రహాలను ఉపయోగిస్తే బాగుండేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అన్నారు. రాముడు ఆక్రమణదారుడు కాదని, దయగలవాడని మొయిలీ వ్యాఖ్యానించారు.
మరోవైపు శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని రాజకీయా పార్టీలను ఆహ్వానించాల్సిందని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ అభిప్రాయపడ్డారు.
ముహూర్త సమయం గురించి విని తాను ఆశ్చర్యపోయానని రాష్ట్రీయ జనతాదళ్ నేత మనోజ్ ఝా బీబీసీతో అన్నారు.
"రాముడు దశరథుడి కుమారుడు మాత్రమే కాదు. అందరికీ వాడు. ఆయన ఆలయాన్ని ఎప్పుడైనా నిర్మించవచ్చు. దానికి తొందరపడాల్సిన పని లేదు'' అని వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి, అధికార బీజేపీ అందరికీ ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు. ఒకపక్క దేశంలో కరోనా విజృంభిస్తోంది. కొన్నిరాష్ట్రాల్లో వ్యవస్థలు కుప్పకూలాయి. బీహార్‌లాంటి రాష్ట్రాలలో పేషెంట్లు చికిత్స తీసుకోడానికి బెడ్లు దొరకడం లేదు. ఈ సమయంలో సామాజికదూరం చాలా కీలకం. ప్రదానమంత్రి నరేంద్రమోదీ అందరికీ ఆదర్శంగా నిలవాలి '' అని ఝా వ్యాఖ్యానించారు.
రామమందిరం నిర్మాణాన్ని ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకించడంలేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహప్రాంత సంఘ్‌చాలక్ అలోక్ కుమార్ బీబీసీతో అన్నారు.
ఆయన కాంగ్రెస్ పార్టీ పేరును కూడా ప్రస్తావించారు. శరద్‌పవార్ కూడా కొన్నివ్యాఖ్యలు చేశారని, తర్వాత వాటిని సరిచేసుకుంటున్నట్లు ప్రకటించారని అలోక్ కుమార్ అన్నారు.
పార్టీల అభిప్రాయాలను విన్న అలోక్‌కుమార్, శంకుస్థాపన సమయంలో కేవలం 150మంది మాత్రమే వస్తారని, వారు కూడా సామాజిక దూరం పాటిస్తూ ఇందులో పాల్గొంటారని అన్నారు. కరోనా లేకపోతే కొన్ని లక్షలమంది ఈ కార్యక్రమానికి వచ్చేవారని ఆయన వ్యాఖ్యానించారు. బాణాలతో ఉన్న రాముడి బొమ్మను కేవలం ఆహ్వాన పత్రికల మీదే వాడారని అలోక్ కుమార్ అన్నారు.

ఫొటో సోర్స్, THE INDIA TODAY GROUP
మరోవైపు ఈ కార్యక్రమంపై ఏ పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అలా చేస్తే రాజకీయంగా నష్టపోతామని ఆయా పార్టీలు భావిస్తున్నాయని, అందుకే పెద్దపెద్ద నేతలు కూడా మౌనం వహిస్తున్నారని వారు అంటున్నారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి పార్టీలు దీనిపై రాజకీయాలు చేశాయని, దీనివల్ల సమాజం చాలా నష్టపోయిందని, ప్రజలు సిద్ధాంతం, కులం, మతం ఆధారంగా విభజనకు గురయ్యారని లక్నో కేంద్రంగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ వీరేంద్రనాథ్ భట్ అన్నారు.
అతి పెద్ద పార్టీ కాంగ్రెస్ నుంచి ప్రాంతీయపార్టీల వరకు దీన్ని ఉపయోగించుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
సమాజ్‌వాదీపార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, వామపక్ష పార్టీలను ప్రస్తావిస్తూ మైనారిటీలలో అభద్రతా భావం పెంపొందించడం ద్వారా రాజకీయ ప్రయోజనాలను పొందడానికి ప్రయత్నించాయని వీరేంద్రనాథ్ భట్ అన్నారు.
అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎక్కువగా నష్టపోయింది మాత్రం కాంగ్రెసేనని భట్ వవ్యాఖ్యానించారు. రామసేతు, రామ మందిరంలాంటి వ్యవహారాలు చాలా పెద్ద వ్యవహారాలుగా మారిపోయాయని ఆయన అన్నారు.
మందిర నిర్మాణం తర్వాత దక్షిణాఫ్రికా తరహాలో భారతదేశం కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని, తద్వార మతాలు, కులాల మధ్య విభజనను తొలగించవచ్చని భట్ సూచించారు.
దక్షిణాఫ్రికాలో మూడు దశాబ్దాల కిందట వర్ణ వివక్ష ముగిసిన తర్వాత ప్రజల మధ్య సయోధ్య కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ నల్లజాతి, తెల్లజాతీయుల మధ్య ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించింది.
నెల్సన్ మండేలా చేపట్టిన ఈ చర్యతో దక్షిణాఫ్రికాలో శాంతి నెలకొంది. రెండేళ్ల కిందట అక్కడ లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రతిపక్షాలు ఒక్కటి కూడా మాట్లాడలేదు.
ఇక్కడా భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా అలాంటి చర్యలు చేపట్టాలంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖపట్నం హిందుస్తాన్ షిప్‌యార్డులో కుప్పకూలిన క్రేన్.. 11 మంది మృతి
- రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మృతి
- మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి
- కరోనా విపత్తు బొగ్గు పరిశ్రమను అంతమొందిస్తుందా
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్‌లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- ర్యాట్ హోల్ మైనింగ్: బొగ్గుగనిలో చిక్కుకున్న కార్మికులు.. కాపాడడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








