కరోనావైరస్ లాక్ డౌన్: భారత్‌లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జస్టిన్ రౌలట్
- హోదా, చీఫ్ ఎన్విరాన్‌మెంట్ కరస్పాండెంట్
భారత్‌లో గత నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేనట్లుగా తొలిసారి కర్బన ఉద్గారాలు పూర్తిగా తగ్గాయి.
అయితే, దీనికి కేవలం లాక్‌డౌన్ ఒక్కటే కారణం కాదు. కరోనావైరస్ వల్ల అమలు చేస్తున్న లాక్‌డౌన్ కంటే ముందే శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక ఇంధనాల వినియోగం పెరగడం, విద్యుత్ వినియోగంలో తగ్గుదల దీనికి కారణాలని ‘కార్బన్ బ్రీఫ్’ పర్యావరణ వెబ్‌సైట్ అధ్యయనం వెల్లడించింది.
మార్చిలో దేశవ్యాప్త లాక్‌డౌన్ అమలు మొదలుకావడంతో 37 ఏళ్లుగా పెరుగుతూ వస్తున్న కర్బన ఉద్గారాలు తొలిసారి తగ్గాయి. భారత్‌లో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 15 శాతం తగ్గగా ఏప్రిల్‌లో అది 30 శాతానికి తగ్గుంటుందని ఆ అధ్యయనం అంచనా వేసింది.
ఇండియన్ నేషనల్ గ్రిడ్ గణాంకాల ప్రకారం బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రాలు మార్చిలో 15 శాతం తక్కువగా పనిచేశాయి.
ఏప్రిల్ తొలి మూడు వారాల్లో 31 శాతం తగ్గింది. అయితే, లాక్‌డౌన్‌కు ముందు కూడా భారత్‌లో బొగ్గుకు డిమాండ్ తగ్గింది. 2018-19తో పోల్చితే 2019-2020లో బొగ్గు డిమాండ్ 2 శాతం తగ్గింది.
ఇంతకుముందు దశాబ్దంతో పోల్చినప్పుడు 2010-2020 మధ్య థర్మల్ పవర్ 7.5 శాతం పెరిగింది. అలాంటి తరుణంలో బొగ్గు డిమాండ్ 2019-20లో 2 శాతం తగ్గడం చిన్నదేమీ కాదు.

ఫొటో సోర్స్, Getty Images
ఆయిల్ వినియోగమూ తగ్గింది
లాక్‌డౌన్ కారణంగా రవాణా దాదాపు నిలిచిపోవడంతో ఆయిల్ వినియోగం భారీగా తగ్గింది. గత ఏడాది మార్చితో పోలిస్తే 2020 మార్చి నాటికి ఇది 18 శాతం తగ్గింది.
ఇదే సమయంలో ప్రత్యామ్నాయ ఇంధనాల సరఫరా పెరిగింది. లాక్‌డౌన్ కారణంగా ప్రత్యామ్నాయ ఇంధనాలకూ గిరాకీ తగ్గడమనేది కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచమంతటా ఉంది.
ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఏప్రిల్ చివర్లో వేసిన లెక్కల ప్రకారం ఈ త్రైమాసికం ముగిసేనాటికి ప్రపంచవ్యాప్తంగా బొగ్గు వినియోగం 8 శాతం తగ్గుతుందని అంచనా. ఇదే సమయంలో పవన, సౌర విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతుందని ఐఈఏ పేర్కొంది.

బొగ్గుకు డిమాండ్ తగ్గడానికి మరో కారణమూ ఉంది. పవన, సౌర విద్యుత్ వ్యవస్థలను ఒకసారి ఏర్పాటు చేసుకోవడం వరకే ఖర్చు.. తరువాత రోజువారీ నిర్వహణ వ్యయాలు పెద్దగా ఉండవు.
కానీ, బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రాలలో రోజువారీ నిర్వహణ వ్యయం చాలా ఎక్కువ. దీంతో అంతటా పవన, సౌర విద్యుత్ వైపు మళ్లడం కనిపిస్తోంది. థర్మల్ విద్యుత్కేంద్రాలు నడవాలంటే బొగ్గు, గ్యాస్, చమురు వంటివి కొనుగోలు చేయాలి. కానీ, పవన్, సౌర విద్యుత్కేంద్రాలకు ఆ అవసరం లేదు.

ఫొటో సోర్స్, getty images
మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం
అయితే... కరోనావైరస్ ప్రభావం తగ్గిన తరువాత పరిస్థితులు మళ్లీ మొదటికొస్తాయని విశ్లేషకులు అంటున్నారు. దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను కదిలించడానికి వేగవంతంగా చర్యలు తీసుకుంటాయని.. దానివల్ల కర్బన ఉద్గారాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్న భారతీయ బొగ్గు పరిశ్రమను కరోనావైరస్ మరిన్ని కష్టాల్లోకి నెడుతోందని, భారత ప్రభుత్వం దీనికి భారీ ఉపశమన ప్యాకేజీ ప్రకటించొచ్చని కార్బన్ బ్రీఫ్ విశ్లేషించింది.

ఫొటో సోర్స్, getty images
భారత్‌లో ఇప్పటికే క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం
కానీ, భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు ప్రోత్సాహం అందిస్తున్న విషయం మర్చిపోకూడదు. బొగ్గు ఆధారిత విద్యుత్ కంటే చవగ్గా లభిస్తుండడంతో భారత్‌లో పునరుత్పాదక ఇంధనానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సౌర విద్యుత్ కిలోవాట్ గంట రూ.2.55 ఖర్చవుతుండగా బొగ్గుతో తయారయ్యే విద్యుత్ కిలోవాట్ గంట ఉత్పత్తికి రూ.3.38 ఖర్చవుతందని కార్బన్ బ్రీఫ్ విశ్లేషించింది.
2019లో ప్రారంభించిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా భారత్ ప్రత్యామ్నాయ ఇంధనాలపై పెట్టుబడి పెడుతోంది.
ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో భారతీయులు అనుభవిస్తున్న స్వచ్ఛమైన గాలిని ఇకముందూ అనుభవించడం కోసం వారు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంగా ఉన్నారు... సంతోషంగా ఉందన్న డోనల్డ్ ట్రంప్
- కిమ్ జోంగ్ ఉన్ ఎవరు? ఉత్తర కొరియా పాలకుడు ఎలా అయ్యారు?
- కిమ్ జోంగ్ ఉన్ తరువాత ఉత్తర కొరియాను పాలించేదెవరు?
- బాయ్స్ లాకర్ రూమ్: ఈ గ్రూప్‌లో ఏం జరిగింది? టీనేజ్ అబ్బాయిలు చేస్తున్న అకృత్యాలపై ఎవరేమన్నారు?
- బ్రిటన్ హోమ్ కేర్‌లో మరణించిన 92 ఏళ్ల భారతీయ సెలబ్రిటీ జర్నలిస్ట్ గుల్షన్ ఎవింగ్
- కరోనావైరస్ పుట్టింది ప్రయోగశాలలోనేనా? అమెరికా 'ల్యాబ్ థియరీ'కి చైనా ప్రభుత్వ మీడియా సమాధానం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








