కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంగా ఉన్నారు... సంతోషంగా ఉందన్న డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తిరిగి ప్రజలకు కనిపించడం, ఆరోగ్యంగా ఉండటం సంతోషం కలిగించే విషయమేనని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
"ఆయన తిరిగి వచ్చారు, ఆరోగ్యంగా ఉన్నారు. నాకు సంతోషంగా ఉంది" అని ట్రంప్ ఓ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గత సోమవారం కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై ట్రంప్‌ను ప్రశ్నించగా... కిమ్ ఆరోగ్యానికి సంబంధించిన నా దగ్గర ఓ మంచి ఐడియా ఉందని, కానీ దాని గురించి నేను ఏమీ మాట్లాడలేనని వ్యాఖ్యానించారు.
ఆయన ఆరోగ్యంగా ఉండాలని మాత్రం కోరుకుంటున్నా అని అన్నారు. ట్రంప్-కిమ్‌ల మధ్య ఇటీవల కాలంలో ఓ ప్రత్యేకమైన స్నేహం ఏర్పడింది. 2018 తర్వాత మూడుసార్లు వీరిద్దరూ సమావేశమయ్యారు. అయితే, కొద్ది కాలంగా మాత్రం ఇరుదేశాల మధ్య చర్చలు స్తంభించాయి.

ఫొటో సోర్స్, AFP
మూడు వారాల తర్వాత ప్రజల ముందుకు
20 రోజుల తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ శనివారం ప్రజల ముందుకొచ్చారని ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది.
ఓ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా కిమ్ రిబ్బన్ కట్ చేశారని కేసీఎన్ఏ వార్తా సంస్థ తెలిపింది.
ఆయన కనిపించగానే ఫ్యాక్టరీ దగ్గరున్న ప్రజలంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారని పేర్కొంది.
ఏప్రిల్ 12న ఆయన ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్తంగా వదంతులు వ్యాపించిన తర్వాత కిమ్ బయటకు రావడం ఇదే మొదటిసారి.
అయితే, ఉత్తర కొరియా మీడియాలో వస్తున్న ఈ సమాచారాన్ని బీబీసీ స్వతంత్రంగా నిర్ధరించలేదు.
ఎరువుల ఫ్యాక్టరీకి రిబ్బన్ కట్ చేస్తున్న ఫొటోలను జాతీయ మీడియా విడుదల చేసింది.

ఫొటో సోర్స్, AFP
ఉత్తర కొరియా మీడియా ఏం చెబుతోంది?
కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) ప్రకారం... కిమ్ తన సోదరి కిమ్ యో జోంగ్‌తో సహా కొందరు ఉత్తర కొరియా సీనియర్ అధికారులతో కలిసి ఈ చిత్రాల్లో కనిపించారు.
"ప్యాంగ్‌యాంగ్‌కు ఉత్తరంగా ఉన్న ఓ ప్లాంట్ దగ్గర జరుగుతున్న వేడుకలను కిమ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. దీంతో అక్కడున్న ప్రజలంతా ఆనందంతో 'హుర్రే' అంటూ అరిచారు" అని కేసీఎన్ఏ వెల్లడించింది.
"ఫ్యాక్టరీ ప్రొడక్షన్ సిస్టమ్‌పై తాను సంతృప్తి చెందినట్లు కిమ్ తెలిపారు. దేశంలో రసాయన పరిశ్రమ, ఆహార ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు ఫ్యాక్టరీని ప్రశంసించారు" అని కేసీఎన్ఏ తెలిపింది.

ఫొటో సోర్స్, AFP
కిమ్ ఆరోగ్యంపై వదంతులు
తన తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ సంగ్ జయంతి వేడుకలకు ఏప్రిల్ 15న కిమ్ హాజరు కాలేదు. దీంతో ఆయన అనారోగ్యంతో ఉన్నారంటూ ప్రపంచవ్యాప్తంగా వదంతులు మొదలయ్యాయి.
ఉత్తర కొరియాలో ఈ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో జరుగుతాయి. సాధారణంగా కిమ్ జోంగ్ ఉన్ ఆరోజు తన తాత సమాధిని సందర్శిస్తారు. ఇప్పటివరకూ కిమ్ ఎప్పుడూ ఈ వేడుకలకు హాజరు కాకుండా ఉండలేదు.
దీంతో ఉత్తర కొరియా నుంచి పారిపోయిన వారు కొందరు నిర్వహిస్తున్న ఓ వెబ్ సైట్‌లో కిమ్ అనారోగ్యంతో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.
గత ఆగస్ట్ నుంచి కిమ్ కార్డియోవాస్కులర్ సమస్యలతో కిమ్ బాధపడుతున్నారని, పేక్తూ పర్వతాన్ని మళ్లీ మళ్లీ అధిరోహించడంతో ఆయన ఆరోగ్యం విషమించిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ వ్యక్తి 'డైలీ ఎన్‌కే'కు తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
దీని ఆధారంగా అంతర్జాతీయ మీడియా కిమ్ ఆరోగ్యంపై అనేక కథనాలు ప్రసారం చేసింది.
ఆ తర్వాత ఈ వార్తపై దక్షిణ కొరియా, అమెరికా ఇంటెలిజెన్స్ విభాగాలు దర్యాప్తు చేస్తున్నాయని కొన్ని కథనాలు కూడా వచ్చాయి.
కానీ ఆ తర్వాత మరో విషయం వ్యాప్తిలోకి వచ్చింది. గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత కిమ్ ఆరోగ్యం విషమించిందని అమెరికన్ మీడియాలో వార్తలు వచ్చాయి.
అయితే ఏప్రిల్ 29న వీటిని అమెరికా మంత్రి మైక్ పాంపేయో కొట్టిపారేశారు. అమెరికా అధికారులెవరూ ఇటీవలి కాలంలో కిమ్‌ను చూడలేదని స్పష్టం చేశారు.
అయితే, కిమ్ ఆరోగ్యంపై వస్తున్నవన్నీ వదంతులేనని దక్షిణ కొరియా ప్రభుత్వం, చైనా ఇంటెలిజెన్స్ వర్గాలు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీకి తెలిపాయి.
గతంలో ఎప్పుడైనా కిమ్ కనిపించకపోవడం జరిగిందా?
గతంలో కూడా ఓసారి ఇలానే జరిగింది. 2014 సెప్టెంబర్‌లో ఓ కచేరీకి హాజరైన తర్వాత నుంచి దాదాపు 40 రోజుల పాటు కిమ్ కనిపించలేదు. మళ్లీ అక్టోబర్ నెలలో ఆయన తిరిగి కనిపించారు.
అయితే, ఆయన ఎక్కడకు వెళ్లారనే విషయాన్ని జాతీయ మీడియా వెల్లడించలేదు. కానీ, కిమ్ తన ఎడమ కాలి మడమకు ఆపరేషన్ చేయించుకుని ఉండొచ్చని దక్షిణ కొరియా నిఘా విభాగం తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
ఉత్తర కొరియాలో రిపోర్టింగ్ చాలా కష్టం
బీబీసీ ప్రతినిధి లారా బికర్ విశ్లేషణ
ఉత్తర కొరియాలో రిపోర్టింగ్ చేసే సమయంలో చాలా అప్రమంత్తంగా ఉండాలి. ఎలాంటి ఆధారాలు లేని వదంతులు చాలా సులభంగా ప్రచారంలోకి వస్తాయి. ఇక కిమ్ జోంగ్ ఉన్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా అందరికీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రసార మాధ్యమాల్లో అవి పతాకశీర్షికలవుతాయి.
అత్యంత గోప్యత పాటంచే ఈ దేశంలో వార్తా సేకరణ క్లిష్టమైన ప్రక్రియ. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచదేశాలతో సంబంధాలు తెగిపోయిన ఇలాంటి సమయంలో వాస్తవాలు, వాటికి ఆధారాలను సంపాదించడం మరింత కష్టం. ఉత్తర కొరియాలో ఎలాంటి అసాధారణ కార్యకలాపాలు చోటుచేసుకోవట్లేదని దక్షిణ కొరియా ముందుగానే గుర్తించింది. ప్యాంగ్‌యాంగ్‌కు సంబంధించి సోల్ దగ్గర అత్యుత్తమ నిఘా విభాగం ఉంది. కానీ, గతంలో వారి అంచనాలు కూడా కొన్ని సందర్భాల్లో తప్పని తేలాయి.
మనం మరింత స్పష్టంగా ఉందాం. కిమ్ జోంగ్ ఉన్ జబ్బుపడి ఉండొచ్చు లేదా గత రెండు వారాల్లో ఆయనకు ఏదైనా శస్త్రచికిత్స జరిగి ఉండొచ్చు. లేదంటే తన విలాసవంతమైన నౌకలో విశ్రాంతి తీసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా తనపై వస్తున్న వదంతులను చూసి ఆనందిస్తూ గడిపి ఉండొచ్చు. కానీ, ఏ కారణం లేకుండా మాత్రం ఆయన 20 రోజులు కనిపించకుండా ఉండరు.
ఒకవేళ నిజంగానే ఆయనకు ఏదైనా జరిగితే ఆయన స్థానాన్ని భర్తీ చేసేదెవరు, దీనికి సంబంధించి ఉత్తర కొరియా ముందు ఎలాంటి ప్రణాళికలున్నాయి... ఇవన్నీ ముఖ్యమైన ప్రశ్నలే.
అయితే, వీటన్నింటినీ మించి చూడాల్సిన మరికొన్ని అంశాలున్నాయి. ఉత్తర కొరియా అంటే ఒక్క వ్యక్తి మాత్రమే కాదు. ఆ దేశంలో 2.5 కోట్ల మంది ప్రజలున్నారు. వారిని చాలా సందర్భాల్లో ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడు కిమ్ ఓ ఎరువుల ఫ్యాక్టరీ దగ్గర కనిపించారు. దీంతో మీడియా మొత్తం ఫోకస్ ఆయనపైనే ఉంటుంది. కానీ, నిజంగానే ఈ ఫ్యాక్టరీ దేశం ఎదుర్కొంటున్న ఆహార సంక్షోభాన్ని నివారించగలుగుతుందా అనే దాన్ని ఎవరూ పరిశీలించరు.
ఇవి కూడా చదవండి.
- కిమ్ జోంగ్ ఉన్ తరువాత ఉత్తర కొరియాను పాలించేదెవరు?
- కిమ్ జోంగ్ ఉన్ ఎవరు? ఉత్తర కొరియా పాలకుడు ఎలా అయ్యారు?
- రిషి కపూర్: సీన్ ఓకే అయ్యేసరికి నా బుగ్గలు నల్లగా కమిలిపోయాయి.. కన్నీళ్లు ఆగలేదు
- కరోనావైరస్ సంక్షోభం తర్వాత తయారీ రంగంలో చైనా స్థానాన్ని భారత్ భర్తీ చేస్తుందా?
- కరోనావైరస్: భారత్‌లో మే 17 వరకు లాక్డౌన్ పొడిగింపు... రెడ్ జోన్లలో మరిన్ని ఆంక్షలు
- కరోనావైరస్ లాక్డౌన్: విమాన, రైల్వే ప్రయాణాలకు రంగం సిద్ధం... 'ఈ నెలలోనే సేవలు ప్రారంభం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








