కిమ్ జోంగ్ ఉన్ తరువాత ఉత్తర కొరియాను పాలించేదెవరు?

ఫొటో సోర్స్, kona
- రచయిత, అలిస్టెయిర్ కోల్‌మాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారనే కాదు, మరణించారని కూడా రకరకాల కథనాలు ప్రపంచమంతటా ప్రచారమవుతున్నాయి. అక్కడి ప్రభుత్వ మీడియా మాత్రం తమ దేశంలో అంతా సజావుగా సాగుతున్నట్లు చూపే ప్రయత్నం చేస్తోంది.
కిమ్ జోంగ్ తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ జయంతి సందర్భంగా గత ఏప్రిల్ 15న ఓ కార్యక్రమం జరిగింది. దీనికి కిమ్ హాజరుకాలేదు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం గురించి వదంతులు మొదలయ్యాయి.
కిమ్ జోంగ్ అనారోగ్యంతో ఉన్నట్లుగానీ, మరణించినట్లు గానీ సూచించే అసాధారణ కార్యకలాపాలేవీ తమ దృష్టికి రాలేదని దక్షిణ కొరియా, అమెరికా ప్రభుత్వాలు చెప్పాయి. ఉత్తర కొరియా మీడియా ఓ ప్రకటన చేస్తే గానీ, అసలు విషయం ఏంటన్నది ప్రపంచానికి తెలియదు.
ఒకవేళ కిమ్ జాంగ్ మరణించినట్లు వస్తున్న వార్తలు నిజమే అయితే, ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు?

ఫొటో సోర్స్, Getty Images
కిమ్ యో జాంగ్
కిమ్ జోంగ్ ఉన్‌కు కిమ్ యో జోంగ్ చెల్లెలు. కిమ్ జాంగ్ తర్వాత దేశ పాలనను ఆమె చేపట్టే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని ఉత్తర కొరియా బయట అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కిమ్ యో జోంగ్ వయసు 31 ఏళ్లు. సోదరుడి లాగే ఆమె కూడా విదేశాల్లో చదువుకున్నారు. పోలిట్‌బ్యూరోలో ప్రత్యమ్నాయ సభ్యురాలిగా ఉన్నారు. కీలకమైన ప్రభుత్వ ప్రచార విభాగానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పనిచేస్తున్నారు.
కిమ్ జోంగ్‌కు ‘డైరీ సెక్రటరీ’గా కిమ్ యో జోంగ్ పేరు పొందారు. కిమ్ జోంగ్ రోజువారీ ఎజెండాను నిర్ణయించడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుంటారు. విధానపరమైన నిర్ణయాల్లో సోదరుడికి ఆమె సలహాలు ఇస్తుంటారని విశ్లేషకులు చెబుతుంటారు.
కిమ్ ఇల్ సంగ్ వారసులను ‘బయెకదూ వంశం’గా పిలుస్తుంటారు. యో జోంగ్ కూడా ఈ వంశానికి చెందినవారే. ఉత్తర కొరియా నాయకులు ఈ వంశం వారై ఉండటం చాలా ముఖ్యం.
అప్పుడప్పుడూ యో జోంగ్ తత్తరపాటుకు గురై మీడియాలో కనిపించిన సందర్భాలు ఉన్నాయి.
హనోయిలో కిమ్ జాంగ్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సమావేశమైన సమయంలో ఓ సందర్భంలో ఆమె ఒక మూల నుంచి వారిని తొంగి చూడటం కెమెరాలకు చిక్కింది. కిమ్ యో జోంగ్ దీనికి కాస్త ఇబ్బంది పడ్డారని చెబుతుంటారు.
అయితే, మహిళా పాలకురాలిని అంగీకరించేందుకు ఉత్తర కొరియా సిద్ధంగా ఉన్నదా అన్నది అసలు ప్రశ్న. ఉత్తర కొరియాలో రాజకీయపరంగా, సమాజ నిర్మాణపరంగా మహిళలు ముఖ్యపాత్ర పోషిస్తుంటారు. అయితే, వాళ్లలో అధికారంలో పైకి ఎదిగేవాళ్లు చాలా అరుదు.
కిమ్ కుటుంబం పితృస్వామ్యానికి మంగళం పాడుతుందా అనేది చూడాలి.

ఫొటో సోర్స్, BBC/jnn
కిమ్ జాంగ్ చోల్
కిమ్ జోంగ్ చోల్... కిమ్ జోంగ్ ఉన్ అన్న. వీరి తండ్రి కిమ్ జాంగ్ ఇల్ మొదట జోంగ్-ఉన్‌నే దేశ భావి నాయకుడిగా తెరపైకి తీసుకు వచ్చారు. అయితే, జోంగ్ చోల్ సైన్యం విషయాలపై గానీ, రాజకీయాలపై గానీ అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో జాంగ్ ఇల్ తన తర్వాతి పాలకుడిగా కిమ్ జాంగ్‌ను సిద్ధం చేశారు.
జోంగ్ చోల్ బహిరంగంగా కనిపించడం చాలా అరుదు. 2015లో రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ఎరిక్ క్లాప్టన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
కిమ్ జోంగ్ ఉన్ తర్వాత జాంగ్ చోల్ అధికారం చేపట్టే అవకాశాలు చాలా తక్కువ.

ఫొటో సోర్స్, Polish Presidency
కిమ్ ప్యోంగ్ ఇల్
ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్‌కు రెండో భార్యతో కలిగిన కుమారుడు కిమ్ ప్యోంగ్ ఇల్.
కిమ్ జోంగ్ ఉన్‌కు ప్యోంగ్ ఇల్ చిన్నాన్న అవుతారు.
‘బయెకదూ వంశం’ పరంగా అర్హతలో ప్యోంగ్ మిగతావారి కన్నా ముందుంటారు. కిమ్ జాంగ్ అధికారానికి ముప్పుగా భావించే, ప్యోంగ్ ఇల్‌ను రాయబారిని చేసి నాలుగు దశాబ్దాలు విదేశాల్లోనే ఉంచారని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.
గత ఏడాది పదవీవిరమణ తీసుకుని ప్యోంగ్ ఇల్ ఉత్తర కొరియాకు తిరిగివెళ్లారు.

ఫొటో సోర్స్, Getty Images
చో ర్యోంగ్ హే
కిమ్ జాంగ్ ఉన్‌కు చో ర్యోంగ్ నమ్మిన బంటు. దేశంలోని సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి అధ్యక్షుడు కూడా.
70 ఏళ్ల చో ఉత్తర కొరియాలో చాలానే అధికారం చెలాయిస్తారు. కిమ్ జోంగ్ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు సాయపడ్డందుకు ఆయనకు ప్రతిఫలం బాగానే దక్కింది. కిమ్ జోంగ్ దేశ పాలకుడయ్యాక ఆయన చాలా పదోన్నతులు పొందారు.
ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియాలో కిమ్ కుటుంబం బయట వ్యక్తుల పేర్లు అతితక్కువగా వినిపిస్తుంటాయి. అలాంటివారిలో చో ఒకరు.
వంశం అడ్డంకి లేకపోతే, దేశ పాలక పదవి చేపట్టే అవకాశాలున్నవాళ్లలో చో కూడా ఒకరు. ఇప్పటికీ ఆ అవకాశాలు లేకపోలేదు.

ఫొటో సోర్స్, Korea Central TV
కిమ్ జే ర్యోంగ్
జే ర్యోంగ్ ఉత్తర కొరియా ప్రీమియర్‌గా ఉన్నారు. ఆయన పాలక కిమ్ కుటుంబంలో భాగం కాదు.
కిమ్ అనే పదం ఉత్తర కొరియాలో చాలా మంది పేర్లలో కనిపిస్తూ ఉంటుంది.
2016 వరకూ జే ర్యోంగ్ పాత్ర ప్రావిన్సు రాజకీయాల వరకే పరిమితం. కానీ, ఆ తర్వాత ఆయన చాలా త్వరగా ఎదిగారు.
ఏడాది కన్నా ముందు సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గత నెలలోనే ఒక్కసారిగా ప్రీమియర్ పదవికి ఎంపికయ్యారు. పోలిట్ బ్యూరో, సెంట్రల్ మిలిటరీ కమిషన్‌లోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు.
చో లాగే జే ర్యోంగ్ కూడా కిమ్ కుటుంబం బయటి వ్యక్తే. కిమ్ కుటుంబంలో తగిన వ్యక్తి దొరికేవరకూ తాత్కాలిక పాలకుడి లాంటి పదవిలో ఆయన ఉండొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
తదుపరి పాలకులను ఎలా నిర్ణయిస్తారు?
ఉత్తర కొరియా 1948లో ఏర్పడింది. అప్పటి నుంచీ దేశాన్ని కిమ్ కుటుంబమే పాలిస్తోంది.
తదుపరి దేశాన్ని పాలించే నేత ఎవరన్నదానికి ఆమోదం తెలిపాల్సింది సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ. కానీ, ఇది నిజానికి ఓ రబ్బర్ స్టాంపు పార్లమెంటు లాంటిది. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా, దాని పరోక్ష వ్యక్తులే అందులో కీలకంగా ఉంటారు.
సాధారణంగా దేశాన్ని తదుపరి పాలించేది ఎవరన్నది కొన్ని నెలలు లేదా సంవత్సరాలు ముందుగానే నిర్ణయమవుతుంది.
ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ 1994లో మరణించిన తర్వాత ఆయన కుమారుడు కిమ్ జాంగ్ ఇల్ పాలక పదవిని చేపట్టారు.
ఇల్ సంగ్ తన కుటుంబానికి అధికార కేంద్రంలో సుస్థిర స్థానం సిద్ధం చేసే కాలం చేశారు. కొరియన్ నాగరికతలో పవిత్రంగా భావించే బయెకదూ పర్వతం నుంచి తమ వంశం దిగివచ్చినట్లుగా ప్రజల్లో భ్రమను నింపారు.
ఇల్ సంగ్ తన కుమారుడు కిమ్ జాంగ్ ఇల్‌ను వారసుడిగా నిర్ణయించారు. అనంతరం జాంగ్ ఇల్ తన కుమారుడు కిమ్ జోంగ్ ఉన్‌ను వారసుడిగా నిర్ణయించారు.
కిమ్ జోంగ్ ఉన్ వారసులు ఇంకా చిన్న పిల్లలు. వాళ్లెవరూ బయటకు కనిపించరు. అసలు ఉత్తర కొరియా ప్రజలకే వాళ్ల పేర్లు ఏంటో తెలియదు అధికారం కోసం ఇప్పుడే వారిని సిద్ధం చేసే అవకాశాలు చాలా తక్కువ.
కిమ్ జోంగ్ ఉన్ అకస్మాత్తుగా మరణించి, ఆయన స్థానంలోకి ఎవరూ రాకపోతే, దేశంలో అధికార శూన్యత ఏర్పడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల లాక్డౌన్ సమయంలో తండ్రి అయిన ఒక కొడుకు కథ
- అసలు ఎవరీ కిమ్?ఉత్తర కొరియా పాలకుడెలా అయ్యారు?
- కరోనావైరస్: మూలికా వైద్యానికి వైరస్ లొంగుతుందా? టీ తాగితే రాకుండా ఉంటుందా? BBC Reality Check
- అమెరికా చమురు ధరలు... డిమాండ్ లేక తిరోగమనం
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- మీ ఇంట్లోనే మీకు తెలియని బంగారం వంటి లోహాలను కనిపెట్టడం ఎలా
- ఆంధ్రప్రదేశ్: 'పంట బాగా పండినా, లాక్డౌన్ నాన్నను మాకు దూరం చేసింది'
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి? నిర్థరణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








