అమెరికా చమురు ధరలు... డిమాండ్ లేక తిరోగమనం

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా చమురుధరలు మైనస్‌లోకి దిగజారాయి. ఇలాజరగటం చరిత్రలో మొట్టమొదటిసారి.
దీని అర్థం.. చమురు ఉత్పత్తిదారులు తమ దగ్గర నుంచి సరకు తీసుకెళ్లటానికి కొనుగోలుదార్లకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఎందుకంటే మే నెలలో తమ నిల్వ సామర్థ్యం దాటిపోతుందని వారు భయపడుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ల కారణంగా జనం ఇళ్లకే పరిమితమవటంతో చమురుకు డిమాండ్ పూర్తిగా అడుగంటింది. ఫలితంగా మిగులు సరఫరాలను నిల్వ చేయటానికి చమురు సంస్థలు ట్యాంకర్లను అద్దెకు తీసుకోవాల్సి వస్తోంది. దీంతో అమెరికా చమురు ధరలు మైనస్‌లోకి మళ్లాయి.
అమెరికా చమురుకు ప్రామాణికమైన వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) చమురు ధర.. బ్యారల్‌కు కనిష్టంగా మైనస్ 37.63 డాలర్లకు పడిపోయింది. ''ఇది ఎన్నడూ చూడని పతనం. మనం ఊహించలేనంత స్థాయిలో డిమాండ్ షాక్ ఉంది'' అని సీఎఫ్ఆర్ఏ రీసెర్చ్‌లో ఇంధన షేర్ల విశ్లేషకుడు స్టివార్ట్ గ్లిక్‌మన్ పేర్కొన్నారు.
సోమవారం నాడు ధరలు తీవ్రంగా పతనమవటానికి ప్రపంచ చమురు మార్కెట్‌లో ఒక సాంకేతిక అంశం కూడా కారణం. చమురు వ్యాపారం.. దాని భవిష్యత్ ధరల ప్రకారం జరుగుతుంది. మే నెల ధరలకు మంగళవారం నాడు గడువు ముగుస్తుంది.
వ్యాపారులు తాము కొనిపెట్టుకున్న చమురును డెలివరీ తీసుకుంటే.. నిల్వచేయటానికి చాలా ఖర్చయ్యే పరిస్థితి ఉంది. దీనిని తప్పించుకోవటానికి డెలివరీ తీసుకోకుండానే ఆ నిల్వలను వదిలించుకోవటానికి వారు ఆతృత చూపారు.

డబ్ల్యూటీఐ జూన్ ధరలు కూడా పతనమయ్యాయి కానీ బ్యారెల్ ధర 20 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతోంది.
ఇదిలావుంటే, యూరప్, మిగతా ప్రపంచం ఉపయోగించే ప్రామాణికం 'బ్రెంట్ క్రూడ్' మీద ఇప్పటికే జూన్ కాంట్రాక్టుల ప్రాతిపదికగా వ్యాపారం జరుగుతోంది. దీని ధరలు కూడా బలహీనపడ్డాయి. ప్రస్తుతం 8.9 శాతం పడిపోయి ఒక్కో బ్యారెల్ ధర 26 డాలర్ల కన్నా తగ్గిపోయింది.
చమురు ధరలు మైనస్‌లోకి వెళ్లటం.. చమురు మార్కెట్ ఎదుర్కొంటున్న ఒత్తిడులను మళ్లీ గుర్తుచేస్తోందని గ్లిక్‌మన్ పేర్కొన్నారు. లాక్‌డౌన్ కొనసాగితే జూన్ ధరలు కూడా పడిపోవచ్చునని హెచ్చరించారు.
''చమురు సంస్థలు, చమురు ధరల పరిస్థితి నాకు ఆశాజనకంగా కనిపించటం లేదు'' అని చెప్పారు. అమెరికా మార్కెట్ తీరుతెన్నులు బ్రిటన్ ఉత్పత్తి చేసే బ్రెంట్ మీద నేరుగా ప్రభావం చూపే తీరుతెన్నుల కన్నా చాలా భిన్నమైనవి. కానీ దాని ప్రభావం నుంచి మనం తప్పించుకోలేం'' అని బ్రిటన్ చమురు, సహజవాయు రంగానికి చెందిని వ్యాపార లాబీ ఓజీయూకే అధిపతి డీర్డ్రే మిచీ తెలిపారు.
''మనది కేవలం వ్యాపార మార్కెట్ కాదు. నష్టపోయే ప్రతి పైసా కూడా ఉద్యోగాల అనిశ్చితిని పెంచుతుంది'' అని ఆమె పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చమురు పరిశ్రమ ఒకవైపు పడిపోతున్న డిమాండ్‌తో, మరోవైపు ఉత్పత్తిని తగ్గించటం గురించి ఉత్పత్తిదారుల మధ్య అంతర్గత పోరుతో సతమతమవుతోంది. ఈ నెల ఆరంభంలో ఒపెక్ సభ్యులు, దాని మిత్రులు. ప్రపంచ వ్యాప్త ఉత్పత్తిని 10 శాతం మేర తగ్గించాలని ఒప్పందం చేసుకున్నారు.
ఇంత పెద్ద మొత్తంలో చమురు ఉత్పత్తిని తగ్గించటానికి ఒప్పందం చేసుకోవటం ఇదే మొదటిసారి. కానీ.. ఇంతగా తగ్గించినా అది సరిపోదని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు.
''చమురు మార్కెట్ల సంతులనానికి ఈ ఒపెక్ ప్లస్ ఒప్పందం ప్రస్తుత రూపంలో ఏమాత్రం సరిపోదని మార్కెట్ గుర్తించటానికి పెద్దగా సమయం పట్టలేదు'' అని ఆక్సీకార్ప్‌లో ముఖ్య అతర్జాతీయ మార్కెట్ వ్యూహకర్తగా పనిచేస్తున్న స్టీఫెన్ ఇన్స్ పేర్కొన్నారు.

వాడకం కాదు.. నిల్వ చేయటం అసలు సమస్య
విశ్లేషణ: ఆండ్రూ వాకర్, ఆర్థిక రంగ ప్రతినిధి
ప్రధాన ఎగుమతిదారులైన ఒపెక్, రష్యా వంటి దాని మిత్ర దేశాలు ఉత్పత్తిని రికార్డు స్థాయిలో తగ్గించటానికి ఇప్పటికే అంగీకరించాయి.
అమెరికాలో, ఇతర చోట్ల చమురు ఉత్పత్తి సంస్థలు ఉత్పత్తిని తగ్గించటానికి వాణిజ్యపరమైన నిర్ణయాలు తీసుకున్నాయి. అయినప్పటికీ.. ప్రపంచంలో వినియోగించగల దానికన్నా ఎక్కువ ముడి చమురు నిల్వలున్నాయి.
సమస్య మనం వినియోగించుకోగలమా అనేది మాత్రమే కాదు. చమురు ఉత్పత్తులకు కాస్త అదనంగా డిమాండ్ పుట్టించేంత వీలుగా లాక్‌డౌన్‌లను సడలించే వరకూ ఈ చమురును నిల్వచేసుకోగలమా అనేది సమస్య.
భూమి మీద, సముద్రంలోనూ నిల్వ సామర్థ్యం వేగంగా నిండిపోతోంది. ఈ ప్రక్రియ కొనసాగుతున్న కొద్దీ.. అది ధరల మీద మరింతగా ప్రభావం చూపే అవకాశముంది. మార్కెట్ పుంజుకోవాలంటే డిమాండ్ పునరుద్ధరణ జరగాలి. అది.. ప్రస్తుత ఆరోగ్య సంక్షోభం ఎలా మారుతుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
ధరలు పడిపోతుండటంతో ప్రైవేటు రంగ ఉత్పత్తిదారులు సరఫరాను మరింతగా తగ్గిస్తారు. కానీ.. మార్కెట్ మీద మౌలిక ప్రభావం చూపటానికి సరిపోయేంత స్థాయిలో అది ఉంటుందా అన్నది అనుమానమే. అమెరికాలో చమురు ధరలు ఈ ఏడాది మొదటి నుంచి మూడింట రెండు వంతులు పడిపోయాయి.
కానీ, ఈ ధరల పతనం పెట్రోల్ పంపుల మీద ప్రభావం చూపింది కానీ.. సోమవారం నాటి పతనం స్థాయిలో ప్రభావమైతే లేదు. ''వివిధ కారణాల వల్ల రోడ్ల మీద ప్రయాణం చేయాల్సి వస్తే.. నాలుగు నెలల కిందటి కన్నా తక్కువ ధరకే పెట్రోల్ నింపుకోవచ్చు. సమస్య ఏమిటంటే మనం పెట్రోల్ నింపుకుంటారు సరే.. ఎక్కడికని వెళతారు?'' అంటారు గ్లిక్‌మన్.
దేశ జాతీయ రిజర్వు కోసం తన ప్రభుత్వం చమురు కొనుగోలు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు. కానీ అమెరికాలో నిల్వ కేంద్రాల సామర్థ్యం త్వరగా మించిపోతుందనే ఆందోళన కొనసాగుతోంది.
అమెరికా చమురుకు ప్రధాన డెలివరీ కేంద్రమైన కషింగ్‌లో.. మార్చి ఆరంభం నుంచి నిల్వలు దాదాపు 50 శాతం పెరిగిపోయాయని ఏఎన్‌జడ్ బ్యాంక్ చెప్తోంది.
''కషింగ్ నిల్వ కేంద్రం నిమిష నిమిషానికీ నిండిపోతోంది. దీంతో ఎవరూ, ఏ ఒక్కరూ డెలివరీ తీసకోవటానికి సిద్ధంగా లేరు. ఎలాగైనా సరే చమురును వదిలించుకోవటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు'' అని ఇన్స్ వ్యాఖ్యానించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ప్రపంచ దేశాల మధ్య యుద్ధానికి కారణం అవుతుందా?
- కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్‌లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- కరోనా ఎఫెక్ట్: నారింజ రసం ధరలు పైపైకి
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








