కరోనావైరస్ డాక్టర్లు: "భయపడకుండా ఎలా ఉండగలం?"

ఫ్రాన్స్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్‌లోని ఒక ఎమర్జెన్సీ సెంటర్లో ఆరోగ్య కార్యకర్త
    • రచయిత, అలైస్ కడీ
    • హోదా, బీబీసీ న్యూస్

కరోనావైరస్‌ మహమ్మారిని నియంత్రించటానికి పోరాడుతున్న వైద్య సిబ్బందిని ఈ వైరస్ పెద్ద సంఖ్యలో బలితీసుకుంటోంది.

కనీస అవసరాలైన రక్షణ పరికరాల సరఫరా పరిమితంగా ఉండటంతో తమ ప్రాణాలు గాలిలో దీపాలయ్యాయని వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది భయపడుతూ ఉన్నారు.

రోగులు, సహోద్యోగులు, కుటుంబాలతో ఈ వైద్య సిబ్బంది సంబంధాలను కూడా ఈ మహమ్మారి మార్చేసింది.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

ఈ సంక్షోభ పరిస్థితుల్లో చాలా మంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

ప్రపంచవ్యాప్త లెక్కలేవీ అందుబాటులో లేవు కానీ ఒక్కో దేశంలో కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న ముప్పు ఎంత తీవ్రంగా ఉందో.. ఇటలీ, స్పెయిన్, అమెరికా వంటి దేశాల్లో వేలాది మంది ఆరోగ్యసేవల ఉద్యోగులు ఈ వైరస్ బారిన పడుతున్న గణాంకాలు చాటి చెప్తున్నాయి.

ప్రపంచంలో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన పలు దేశాల్లో ఇటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్న ఐదుగురు వైద్య సిబ్బందితో మేం మాట్లాడాం. ఐదుగురూ మహిళలే. బహిరంగంగా మాట్లాడవద్దని కొందరిని నిషేధించటంతో వారు తమ వివరాలు గోప్యంగా ఉంచాలని కోరారు.

line
line

పీడియాట్రిక్ ఇన్‌టెన్సివ్ కేర్ ఫెలో, లండన్ – బ్రిటన్

‘‘కరోనావైరస్ రాకముందు మా ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోని ప్రతి పడక మీదా మాస్కులు, వ్యక్తిగత రక్షణ పరికరాలు పడి ఉండేవి. ఇప్పుడు వాటిని కప్‌బోర్డులో పెట్టి తాళం వేస్తున్నారు. మేం వెళ్లి తెచ్చుకోవాల్సి ఉంటుంది.

ఇందులో ఉన్న ప్రమాదాల గురంచి నన్ను ఆందోళన చెందుతున్నాను. మామూలుగా అయితే కరోనావైరస్ సోకిన వారితో ఒకసారి కాంటాక్ట్ అయ్యే సాధారణ జనంతో పోలిస్తే మేం అనేక సార్లు వారిని కాంటాక్ట్ అవుతున్నాం.

వ్యక్తిగత రక్షణ పరికరాలు ఉన్నా కూడా.. గాలి తుంపరలను పుట్టించే ప్రక్రియలు నిర్వహిస్తున్నట్లయితే కరోనావైరస్‌కు ఎక్స్‌పోజ్ అయ్యే ముప్పు ఉంటుంది. మాకయితే.. ఆ ముప్పు ఒక్కసారి కాదు అనేక సార్లు ఉంటుంది.

నా భర్త కోవిడ్-పాజిటివ్ వార్డుల్లో పనిచేస్తుంటారు. అంటే.. ఏదో ఒక సమయంలో మా ఇద్దరిలో ఎవరో ఒకరు మరొకరికి ఈ వైరస్‌ను అంటించబోతున్నామనేది నా భయం.

మేం ఇప్పుడు హై-రిస్క్ పనులు చేస్తున్నాం కనుక మానసికంగా చాలా కష్టంగా ఉంటుంది.

మా షిఫ్టులు పెరిగాయి. ఎక్కువగా రాత్రిళ్లు పనిచేస్తున్నాం. వారాంతాల్లో పనిచేస్తున్నాం. మా వార్షిక సెలవులన్నీ రద్దు చేశారు.

ఆస్పత్రిలో పని చేయటం కష్టం. కానీ.. పని తర్వాత స్నేహితులతోనూ, కుటుంబంతోనో గడుపుతూ ఒత్తిడి నుంచి బయటపడే వీలూ లేదు. ఈ పరిస్థితి ఏమీ బాగోలేదు.’’

సారా గెరింగ్

ఫొటో సోర్స్, Sara Gearing

ఫొటో క్యాప్షన్, రక్షణ దుస్తులు ధరించిన సారా జెరింగ్

సారా జెరింగ్ – ఐసీయూ నర్స్, సియాటిల్, అమెరికా

‘‘మొదట కొంతమంది రోగులకు ఎబోలా శైలిలో చికిత్స అందించాం. పెద్ద సంఖ్యలో మాస్కులు పారవేస్తుండేవాళ్లం. ఉన్న మాస్కులన్నీ అయిపోతున్నాయని, కొత్త సరఫరా రావటం లేదని గుర్తించాం. దీంతో చివరికి మిగిలివున్న మాస్కులనే మళ్లీ మళ్లీ వాడటానికి తంటాలు పడుతున్నాం.

ప్రపంచమంతటా వైద్య సిబ్బంది పెద్ద సంఖ్యలో అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి వారి ఆందోళన న్యాయమైనదే.

నా సహోద్యోగుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, అంతర్లీనంగా శ్వాస సమస్యలు ఉన్న వారు ఉన్నారు. వారిని దూరంగా క్షేమంగా ఉంచటానికి మేం ప్రయత్నిస్తున్నాం. అదృష్ట వశాత్తూ నాకు వేరే అనారోగ్య సమస్యలు లేవు.

కానీ.. ఈ వైరస్‌ను ఇంటికి తీసుకెళ్లి నా భర్తకు అంటిస్తానేమోనని భయపడుతుంటాను. నేను పడక గదిని మార్చి, తనకు ఆరడుగుల దూరంలోకి వెళ్లకుండా ఉండాలని ఆలోచించాను. కానీ ఇప్పటివరకూ మామూలుగానే ఉంటున్నాం.

అయినాకానీ.. వ్యక్తిగత రక్షణ పరికరాలు లేకుండా విధుల్లో పరుగులుతీసి త్యాగం చేయబోం. మాస్కులు ఐపోతే ఏం చేస్తామో నాకు తెలీదు. అదో పెద్ద నైతిక సంశయం అవుతుంది. నా వృత్తికి నా నిబద్ధత.. నా ప్రాణాలను త్యాగం చేయాలని చెప్తుందని నేను అనుకోను. నర్సుల క్షేమం కోసం రక్షణ పరికరాలను అందించాల్సిన బాధ్యత నన్ను ఉద్యోగంలో నియమించిన వారికి ఉంటుంది.’’

జర్మనీలో పని చేస్తున్న ఫ్రెంచి డాక్టర్లు

ఫొటో సోర్స్, AFP

మాడ్రిడ్‌లో ఒక నర్సు, స్పెయిన్

‘‘ఇప్పటికైతే నేను అదృష్టవంతురాలిగా భావిస్తున్నా. ఎందుకంటే ప్రతి రోజూ నేను విధుల్లోకి వెళ్లేటపుడు మాస్కు, డిస్పోజబుల్ గౌను ధరించగలుగుతున్నా. డిస్పోజబుల్ గౌన్లను పారేయకుండా ఇప్పుడు మళ్లీ మళ్లీ వాడటం మొదలైంది.

ఇతర యూనిట్లలో, ఇతర హాస్పిటళ్లలో చాలా మంది సహచరులకు ఒక్కోసారి కనీసం ఇవి కూడా ఉండవు. చెత్త బ్యాగులతో గౌన్లు, షూలు ఎలా తయారు చేస్తున్నారో వాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

ఈ వ్యాధి సోకినపుడు తీవ్ర పరిస్థితులను ఆస్పత్రిలో రోగి పడకపక్కనే ఉండి చూస్తుంటాం. భయపడకుండా ఎలా ఉండగలం?

ఆశ్చర్యం ఏమిటంటే.. నేను పని చేస్తున్నపుడు కోవిడ్-19కు సంబంధించిన విషయాలను అసలు ఆలోచించను. ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి నేను సృష్టించుకున్న రక్షణ వ్యవస్థ ఇదని అనుకుంటున్నా. నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవటం మీద దృష్టి కేంద్రీకరిస్తాను.

షిఫ్టు ముగిసిన తర్వాత ఈ రక్షణ వ్యవస్థ ఆగిపోతుంది. ప్రతి రోజూ నాకు పొంచివున్న ప్రమాదాల గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు నేను సేవ చేస్తున్న రోగులు ఉన్న పరిస్థితిలో రేపు నేను కూడా ఉండొచ్చని భయపడతుంటాను.

విధులు పూర్తయ్యాక.. ఆస్పత్రితో కాంటాక్ట్ ఉన్నప్రతి దానినీ తొలగించేసి.. స్నానం చేసి, అన్నిటినీ శుభ్రం చేసుకుంటాను. నేను ఒంటరిగా ఉన్నా. కానీ నా సహచరులు తమ కుటుంబాలకు దూరంగా ఏకాంతంగా నివసిస్తున్నారు. తమ వల్ల తమ కుటుంబాలకు వైరస్ సోకుతుందని భయం.

వార్తలు చూస్తున్నపుడు నాకు కోపం వస్తుంది. కుంగిపోతుంటాను. నిస్పృహకు లోనవుతుంటాను. జనం తమ బాల్కనీల నుంచి చప్పట్లతో అభినందనలు చెప్పటం వినిపిస్తుంది. కొన్నిసార్లు ఏడుపు వస్తుంది. అందుకు కారణం కృతజ్ఞతా? నైరాశ్యమా? తెలీదు. ఇప్పుడు నేను సరిగా నిద్ర పోలేకపోతున్నాను.’’

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

రెసిడెంట్ డాక్టర్ - లాంబార్డీ, ఇటలీ

‘‘మేం చేసే పని చాలా భిన్నమైనది. అంతా చాలా నెమ్మదిగా జరుగుతాయి. ప్రతిసారీ మాస్కులు, గ్లోవ్స్, కళ్లను కప్పుకోవటానికి, శరీరాన్ని కప్పుకోవటానికి సూట్... అన్నీ ధరించాలి.

ఉన్నంతసేపూ వాటిని ధరించే ఉండాలి. తీసివేయలేం. అందుకే మేం ఆరు గంటల పాటు నిరాఘాటంగా పనిచేస్తున్నాం. ప్రతి ఆరు గంటలకు మేం మారాల్సి ఉంటుంది. ఒకసారి పనిలోకి దిగితే చివరి వరకూ పని చేస్తూ ఉండాల్సిందే. మధ్యలో తినటం, తాగటం, టాయిలెట్‌కు వెళ్లటం వంటివేమీ చేయలేం.

రాత్రి భోజనానికి బయటకు వెళ్లలేం. పార్కుకు వెళ్లలేం. ఆస్పత్రిలో సహచరులతో కలిసి కాఫీ, టీలు తాగలేం. అక్కడికి వెళ్లటం, పని చేయటం, మళ్లీ ఇంటికెళ్లటం.. అంతే.

రోగులతో సంబంధం పూర్తిగా మారిపోయింది. రోగులతో బంధం ఏర్పరచుకునే ప్రయత్నంలో భాగంగా కొంచెం ఎక్కువసేపు ఉండి వారితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుండేదానిని. కానీ ఇప్పుడలా చేయలేం. ఆక్సిజన్ శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి రోగికి వినిపంచదు. అంతేకాదు.. ఉండాల్సిన దానికన్నా ఎక్కువ సేపు ఆ గదిలో ఉండాలనీ మనం కోరుకోం.

ఇక ఒంటి మీద ఉన్న ప్లాస్టిక్ సూట్లలో అంతా వేడిగా ఉంటుంది. ఫోన్‌లో కేవలం బంధువులతో మాత్రమే మాట్లాడగలం.

యుద్ధ సమయంలో పనిచేస్తున్న డాక్టర్‌లాగా అనిపిస్తుంది.

మేం పని చేస్తున్నాం. ఆగి ఆలోచించేంత సమయం లేదు. బహుశా.. తర్వాత ఎప్పుడైనా ఆలోచిస్తామేమో. ఎమర్జెన్సీ రూమ్‌లో ఉన్నపుడు ఎప్పుడూ ఇలాగే జరుగుతుంది – మనం ఆలోచించం.. పనిచేస్తామంతే.’’

మిషెల్

ఫొటో సోర్స్, Michelle Au

ఫొటో క్యాప్షన్, అమెరికాలోని అనస్థీషియా నిపుణులు మిషెల్

మిషెల్ అయు – ఎనస్తీషియాలజిస్ట్, అట్లాంటా, అమెరికా

‘‘ఇప్పటివరకూ అయితే.. ఒక రోగిని చూసుకోవాల్సి వచ్చినపుడు నాకు అవసరమైనవన్నీ అందుబాటులో ఉన్నాయి. అయితే వాడిన వాటినే మళ్లీ వాడాల్సి వచ్చిన సందర్భాలున్నాయి. అలాంటపుడు.. అవి కలుషితమై ఉంటాయేమో, వాటిని విప్పి, మళ్లీ ధరించటం వల్ల నన్ను నేను కలుషితం చేసుకుంటున్నానేమో అనే ఆందోళన కలుగుతుంటుంది.

ఈ కణాలను మనం చూడలేం. ఏదో ఎర్రగా కనిపించే రంగులాగా.. ‘నాకు కొంచెం అంటుకుంది’ అన్నట్లుగా ఉండదిది. హెచ్చరించే అలారం ఏదీ లేదు. కనిపించకుండా కలుషితం చేసే ఈ వైరస్ చాలా ఆందోళన కలిగిస్తుంది. మంచి చేసే ప్రయత్నంలో భాగంగా హాని కూడా చేయొచ్చు.

దేశవ్యాప్తంగా చాలామంది వైద్య సిబ్బంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఎందుకంటే.. మేం నిరంతరం ఈ ప్రమాదంలోనే ఉంటాం. అందరూ.. ‘ఒకవేళ మనకు ఈ వ్యాధి సోకితే...’ అని మాట్లాడటం లేదు. ‘మనకు ఈ వ్యాధి సోకినపుడు...’’ అనే మాట్లాడుతున్నారు. మాలో చాలా మందికి ఈ వ్యాధి సోకితీరుతుందనే అంచనాతోనే మేం ప్రవర్తిస్తున్నాం.

నేను నా కుటుంబం నుంచి వేరుగా, దూరంగా ఉండటానికి నేలమాళిగలోకి మకాం మర్చాను. నాకు వేరే పడక గది, వేరే స్నానాల గది. నా వ్యక్తిగత వస్తువులను కూడా అందరికీ దూరంగా ఉంచుతున్నా. నన్ను క్వారంటైన్ చేయాల్సిన పరిస్థితి వస్తే.. అందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసి ఉంచుతున్నా.

మా కుటుంబంలో ఎవరికైనా వైరస్ సోకిందంటే.. అది నేనే కావచ్చు.’’

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)