బిహార్: కొడుకు శవంతో రోడ్డుపై పరుగులు తీసిన తల్లి చిత్రం బిహార్ ఆరోగ్య శాఖ పనితీరును కళ్లకు కట్టిందా

ఫొటో సోర్స్, GAURAV/BBC
- రచయిత, సీటూ తివారీ
- హోదా, బీబీసీ కోసం
బిహార్‌లోని జహానాబాద్ రోడ్డుపై ఒక తల్లి తన మూడేళ్ల కొడుకు శవంతో ఏడుస్తూ పరుగులు తీస్తున్న వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయమైంది.
మనసులను కలచివేసే ఈ వీడియో వైరల్ అయింది. అందులో మహిళ పరిగెడుతూ ఉంటే వెనక ఆమె భర్త బిహార్ ఆరోగ్య శాఖ ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో చెబుతుంటారు.
ఆయన “లేదు... ఇవ్వలేదు.., అంబులెన్స్ దొరకలేదు” అంటుంటారు.
ఈ వీడియో షూట్ చేసిన స్థానిక జర్నలిస్ట్ గౌరవ్ బీబీసీతో ఆ రోజు జరిగిన ఘటన గురించి చెప్పారు.
‘‘ఈ కుటుంబం అరవల్ జిల్లాలోని సహోపూర్ గ్రామంలో నివసిస్తుంది. వారి పిల్లాడికి జలుబు, దగ్గు ఉంది. చికిత్స కోసం తండ్రి గిరిజేష్ అతడిని కుర్థాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. కానీ, అక్కడి డాక్టర్లు అతడిని జహానాబాద్ ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. అక్కడ ఉన్న వారు విషమ పరిస్థితుల్లో ఉన్న బాలుడిని పట్నాకు తీసుకెళ్లమని చెప్పారు. కానీ, వారికి అంబులెన్స్ దొరకలేదు. దాంతో ఆ బాబు చనిపోయాడు” అని చెప్పారు.
వార్తల కోసం తిరుగుతున్న గౌరవ్‌కు హఠాత్తుగా కన్నీళ్లు పెడుతున్న ఆ మహిళ తన బిడ్డ శవాన్ని గుండెకు హత్తుకుని 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి నడిచి వెళ్తుండడం కనిపించింది.
తర్వాత, ఒక సామాజిక కార్యకర్త ఇంటికి వెళ్లడానికి ఆ కుటుంబానికి ఒక వాహనం ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, GARAV/BBC
నాన్-కోవిడ్ రోగులకు కష్టాలు
ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ఈ ఘటనపై “జిల్లా ఆస్పత్రిలో మూడు అంబులెన్సులు ఉన్నాయి. కానీ, వారికి వాటిని ఇవ్వాలనే ఆలోచనే రాలేదు. డీఎం విచారణలో నలుగురు నర్సులు, ఇద్దరు వైద్యులు, హెల్త్ మేనేజర్‌ను దోషులుగా గుర్తించాం. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని ట్వీట్ చేశారు.
దీనిని సిగ్గుపడాల్సిన విషయంగా వర్ణించిన ఆయన “ఇక్కడ వ్యవస్థ కంటే ఎక్కువగా మనస్తత్వంలోనే లోపం ఉంది. మనం ఎలాంటి బిహార్‌ను తయారుచేస్తున్నాం అని మనం ఆలోచించాలి” అన్నారు.
ప్రధాన కార్యదర్శి ప్రశ్న చాలా ముఖ్యమైనది. కానీ, అది బిహార్‌లో దారుణంగా, మందకొడిగా ఉన్న ఆరోగ్య వ్యవస్థకు కూడా అద్దం పడుతుంది.
కరోనా సంక్షోభ సమయంలో నాన్-కోవిడ్ రోగులు అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్(ఎన్‌సీడీ) ఉదాహరణకు డయాబెటిస్, బీపీ, కిడ్నీ సమస్యలు లాంటి వ్యాధులు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మందులు, ఇంజెక్షన్, ఆపరేషన్ల కోసం కష్టాలు
పట్నాలోని గోలా రోడ్‌లో ఉంటున్న 63 ఏళ్ల నీలమ్ పాండే రిటైర్డ్ ప్రభుత్వ అధికారి. ఆమె పట్నా కమిషనర్ కార్యాలయంలో పనిచేశారు. ఫోన్‌లో ఆమె గొంతు చాలా అలసిపోయినట్లు భారంగా అనిపించింది.
గత మూడేళ్లుగా ఆమె మల్టిపుల్ మైలోమా కాన్సర్‌తో బాధపడుతుండడమే దానికి కారణం. ఆమె తరచూ ప్రత్యేక రక్త పరీక్షలు చేయించుకుని, ఆ రిపోర్టులను ముంబయిలోని తన డాక్టర్‌కు పంపించాల్సి ఉంటుంది.
కానీ క్రమం తప్పకండా రక్త పరీక్షలు చేసే సిబ్బంది, వారి గ్రామాల్లో ఇరుక్కుపోవడంతో ఆమె ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు.

ఫొటో సోర్స్, SEETU TIWARI/BBC
నీలమ్ ఒంటరితనం
“మైలోమా క్యాన్సర్‌లో రక్తం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మందులు, ప్రాణాలు నిలబెట్టే ఇంజెక్షన్లను చాలా కష్టపడి సమకూర్చుకున్నాను. కానీ బ్లడ్ టెస్ట్ ఎలా చేసుకోవాలి. ఆ టెస్ట్ చేయకపోతే, తర్వాత వాడే మందులు రాయడం డాక్టరుకు కష్టం అవుతుంది. అంతే కాదు, నేను ఏప్రిల్లో చెకప్ కోసం ముంబయి వెళ్లాలి, కానీ అది ఇప్పుడు సాధ్యం అయ్యేలా లేదు” అన్నారు నీలమ్.
కైమూర్ జిల్లా, దుర్గావతి ప్రాంతానికి చెందిన కన్హయ్య సింగ్ కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. సరుకు రవాణా వ్యాపారం చేసే ఆయనకు కూడా బ్లడ్ క్యాన్సర్ రోగి.ఆయన ముంబయిలో చికిత్స తీసుకుంటున్నారు. మే 5న ఆయన డాక్టర్ చెకప్ కోసం ముంబయి వెళ్లాలి. డాక్టర్ ఇచ్చే ప్రిస్కిప్షన్‌ను బట్టి పట్నాలో ఆయనకు ఉచిత మందులు ఇస్తారు.
బీబీసీతో మాట్లాడిన కన్హయ్య “రైళ్లు నడవడం లేదు. మేం డాక్టర్ చెకప్ కోసం వెళ్లకపోతే, మందులు ఎలా ఇస్తారు. వాటిని పట్నా వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, వాహనాలు ఏవీ వెళ్లడం లేదు. మా వ్యాపారం కూడా నష్టాల్లో ఉంది. కొన్నిరోజులు అయితే డబ్బుకు కూడా కష్టం వస్తుంది” అన్నారు..
అటు సహర్సాలోని సత్తర్‌కటయా ప్రాంతంలోని పురూఖ్‌లో అశోక్ కుమార్ నోటిలో గడ్డ పెరుగుతూనే ఉంది. భార్య లలితా దేవి ఫోన్లో అశోక్‌కు నోటి క్యాన్సర్ ఉందని, ముంబయిలో చికిత్స జరుగుతోందని చెప్పారు. ఆయనకు నాలుగు కీమోలు జరిగాయి, మార్చిలో ముంబయిలో ఆపరేషన్ చేసేవారు. కానీ వెళ్లలేకపోయాం అన్నారు.

ఫొటో సోర్స్, Twitter
“నెల క్రితం ఆయన నోట్లో గడ్డ వాయడం మొదలైంది. లోపల చీము పట్టింది. పట్నా అయినా ముంబయి అయినా వెళ్లడానికి ఏవైనా వాహనాలు ఉంటే కదా” అన్నారు.
పట్నాలోని ఐడీఐఎంఎస్‌కు చెందిన ఒక బృందం కొన్ని నెలల క్రితం ఒకే రోజు నిర్వహించిన వైద్య పరీక్షల్లో 35 మంది నోరు, గొంతు, స్తన క్యాన్సర్ రోగులను గుర్తించింది ఈ సత్తర్‌కటయా ప్రాంతంలోనే.
“మందులు ఉన్నంతవరకూ ఇక్కడివారికి ఎలాంటి సమస్యా రాదు. మందులు అయిపోతే, వీరి పని కూడా అయిపోతుంది. ఎందుకంటే, ఇక్కడ మామూలు రోజుల్లోనే ఎలాంటి సౌకర్యాలూ అందవు. అలాంటిది, బంద్ లాంటి వాతావరణం ఉన్నప్పుడు, అన్నీ ఆగిపోయినట్టే” అని జిల్లా కౌన్సిలర్ ప్రవీణ్ ఆనంద్ అన్నారు.

ఫొటో సోర్స్, SEETU TIWARI/BBC
థలసీమియా హీమోఫీలియా రోగుల ఇబ్బంది
సీతామఢికి చెందిన రంజిత్ కుమార్ కూడా ఇలాంటి ఇబ్బందులే పడుతున్నారు. సీతామఢి పుప్రీ బజార్‌లో చిన్న పశువుల దాణా షాపు నడిపే ఇతడి రెండున్నర ఏళ్ల కొడుకు రాహుల్ కుమార్ థలసీమియా బాధితుడు.
“ప్రతి 15, 20 రోజులకు ఒకసారి రాహుల్‌కు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. కానీ ఈసారీ ఆ సమయం పెరుగుతూ పోతోంది. మేం దర్భంగా మెడికల్ కాలేజీకి వెళ్లి పిల్లాడికి రక్తం ఎక్కిస్తాం. దానికి రెండ్రోజులు పడుతుంది. మా దగ్గర ఎక్కువ డబ్బు కూడా లేదు. ఎలాగోలా పిల్లాడిని తీసుకెళ్దామంటే, ఇప్పుడు బస్సులు, ఆటోలు కూడా నడవడం లేదు. నా దగ్గర బైక్ కూడా లేదు. పిల్లాడిని ఎలా తీసుకెళ్లాలి?” అని రంజిత్ కుమార్ ప్రశ్నించారు.

- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?

హీమోఫీలియా రోగుల పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. రాష్ట్రంలో 1450 హీమోఫీలియా రోగులు, 850 మంది థలసీమియా రోగులు ఉన్నారని బిహార్ హీమోఫీలియా సొసైటీ కార్యదర్శి డాక్టర్ శైలేంద్ర చెప్పారు.
“ఇక్కడ పెద్ద సమస్య రవాణాదే. పట్నా నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని గౌరీచక్ నుంచి రోగిని ప్రభుత్వ అంబులెన్సులో తీసుకురావడానికి ఒప్పుకోలేదు. అలాగే బిహార్ షరీఫ్‌లోని ఒక రోగి 4 వేల రూపాయలు పెట్టుకుని ప్రైవేటు అంబులెన్సులో పట్నా చేరుకున్నాడు. రోగులు పట్నాకు రావడానికి తెలంగాణ లాగే రాష్ట్ర ప్రభుత్వం మాకు అంబులెన్స్ లేదా కారుకు పర్మిషన్ లెటర్ ఇవ్వాలని మేం డిమాండ్ చేస్తున్నాం” అన్నారు.

ఫొటో సోర్స్, SEETU TIWARI/BBC
లోపలికి రానివ్వని డాక్టర్లు
ప్రస్తుతం బిహార్‌లోని కొన్ని ఆస్పత్రులు మినహా చాలా ప్రైవేటు ఆస్పత్రులను మూసివేశారు. సాధారణంగా 80 శాతం రోగులు ప్రైవేట్ ఓపీడీకి వెళ్తారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు మాత్రమే తెరిచి ఉండడంతో జనం వాటివైపే చూస్తున్నారు. కానీ అక్కడ కూడా అవుట్ పేషెంట్ల సంఖ్య చాలా తక్కువ ఉంది.
పట్నా ఆర్ట్స్ కాలేజ్ పూర్వ విద్యార్థి రాకేశ్‌కు కూడా కొన్నిరోజుల క్రితం రాత్రి 11 గంటల సమయంలో కడుపు నొప్పి వచ్చింది. ఆయన్ను బిహార్‌లో అతిపెద్ద ఆస్పత్రి పీఎంసీహెచ్‌కు తీసుకెళ్లారు.
“అక్కడ డాక్టర్ పర్సనల్ ప్రొటెక్షన్ కిట్ వేసుకుని ఉన్నారు. కానీ, వారు నన్ను గది తలుపు దగ్గరే ఉంచేశారు. నేను చెప్పేది పూర్తిగా వినకుండానే మందులు రాసిచ్చారు. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్లీ డాక్టరుకు చూపించుకోవాలి” అన్నారు.

ఫొటో సోర్స్, SEETU TIWARI/BBC
రాజధాని పట్నా పరిస్థితి
ఇక, రాజధాని పట్నా విషయనికి వస్తే ప్రస్తుతానికి అశోక్ రాజ్‌పథ్‌లోని పాలీ క్లినిక్, పాటలీపుత్రలోని రూబన్ ఆస్పత్రులు తెరిచి ఉన్నాయి.
రూబన్ ఆస్పత్రి యజమాని డాక్టర్ సత్యజిత్ బీబీసీతో “ఓపీడీ మూసేశారు. కానీ కిడ్నీ డయాలసిస్ లాంటి సీరియస్ వ్యాదులతో ఆస్పత్రికి వచ్చేవారికి సులభంగా ఉండేలా ఆస్పత్రి మేనేజ్‌మెంట్ వైపు నుంచి పాసులు జారీ చేశాం” అని చెప్పారు.
ఇక పాలీ క్లినిక్‌లో పనిచేస్తున్న డాక్టర్ షకీల్ “రోగులు రావడం చాలా తగ్గిపోయింది. ఎందుకంటే రాకపోకలకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు. అందుకే, పట్నా చుట్టుపక్కల నుంచి వచ్చే రోగులు కూడా రావడం లేదు. ప్రైవేటు ఆస్పత్రులు తెరవాలని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కానీ, ప్రభుత్వం వారికి పీపీఈ అందించగలదా. మనం కొనాలన్నా మార్కెట్లో ఎన్-95 మాస్క్ దొరకడం లేదు. అందుకే, కరోనా వినాశనం ముగిసేసరికే తీవ్రమైన వ్యాధులతో చనిపోయే రోగుల సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే, రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సినవారికి, అది అందడం లేదు” అన్నారు.
నాన్-కోవిడ్ రోగుల చికిత్స గురించి ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెప్పినా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కమిషనర్ వరుసగా ప్రైవేటు ఆస్పత్రుల్లో మందుల షాపులు తెరిచి ఉంచాలనే ఆదేశాలు పదే పదే జారీ చేస్తున్నారు. కానీ అవి ఆదేశాలు వచ్చిన తర్వాత మూడు రోజులు మాత్రమే తెరిచి ఉంటున్నాయి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి? నిర్థరణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- కరోనావైరస్: ఇటలీని దాటేసిన అమెరికా, ప్రపంచంలో అత్యధిక మరణాలు ఇక్కడే
- కరోనా లాక్‌డౌన్: విపరీతంగా బయటపడుతున్న ఎలుకలు.. వీటిని నివారించడం ఎలా#
- వుహాన్‌లో లాక్ డౌన్ ఎత్తేసిన చైనా ప్రభుత్వం.. రైళ్లు, విమానాల్లో మొదలైన ప్రయాణాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








