కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్‌లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు?

కరోనావైరస్.. ముఖానికి మాస్కు వేసుకుంటున్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా సహా ఆసియాలోని చాలా దేశాల్లో మాస్క్‌ల వాడకం విపరీతంగా పెరిగింది
    • రచయిత, టెస్సా వాంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హాంకాంగ్, సియోల్, టోక్యో లాంటి నగరాల్లో ముఖానికి మాస్క్ లేకుండా బయటకు వెళ్తే, అక్కడి జనాలు మనల్ని ఏవగింపుగా చూసే అవకాశం ఉంది.

కరోనావైరస్ వ్యాప్తి మొదలయ్యాక కొన్ని ప్రాంతాల జనాలు అసలు ముఖాలకు మాస్క్‌లు లేకుండా బయటకు రావడం లేదు. అంతే కాదు, మాస్క్ లేకుండా వచ్చినవారిని చిన్నచూపు కూడా చూస్తున్నారు.

అయితే, అన్ని దేశాల్లో ఈ పరిస్థితి లేదు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్... ఇలా చాలా దేశాల్లో ముఖానికి మాస్క్ లేకుండా తిరిగితే ఎవరూ ఏమీ అనుకోరు.

మరి, కొన్ని దేశాల్లోనే ఇలా మాస్క్‌లు ధరించడం ఎందుకు విపరీతంగా ఉంది? ఇంకొన్ని దేశాల్లో ఆ అలవాటు ఎందుకు పెద్దగా లేదు? ప్రభుత్వ మార్గదర్శకాలో, వైద్యుల సూచనలో దీనికి పూర్తి కారణం కాదు. చరిత్ర, సంస్కృతుల పాత్ర కూడా ఇందులో ఉంది.

ఇప్పుడు కరోనావైరస్ మహమ్మారి తీవ్రమవుతోంది. పరిస్థితుల్లో మరిన్ని మార్పులు వస్తాయా?

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

అందరికీ అక్కర్లేదంటున్న డబ్ల్యూహెచ్ఓ

కరోనావైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)స్పష్టంగా రెండు రకాల వ్యక్తులు మాత్రమే మాస్క్‌లు వేసుకోవాలని చెబుతోంది. దాని ప్రకారం అనారోగ్యంతో ఉన్నవారు లేదా అనారోగ్య లక్షణాలు ఉన్నవారు, కరోనావైరస్ బాధితులకు సేవలు, సపర్యలు చేస్తున్నవారికి మాత్రమే మాస్క్‌లు అవసరం.

వేరే ఎవరూ మాస్క్‌లు ధరించాల్సిన పనిలేదు. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.

కరోనావైరస్ గాలి ద్వారా వ్యాపించదు. రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర ద్వారా సోకుతుంది. అందుకే, మాస్క్‌లతో పెద్దగా రక్షణేమీ ఉండదని నిపుణులు అంటున్నారు. చేతులను తరుచూ సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడమే ఉత్తమమని చెబుతున్నారు. మాస్క్‌ను విప్పడం కూడా జాగ్రత్తగా విప్పాలి. లేకపోతే చేతులకు తిరిగి వైరస్‌లు అంటుకునే ప్రమాదం ఉంటుంది. మాస్క్‌లు ధరించినవాళ్లకు తమకు ఏమీ కాదన్న అపనమ్మకం కూడా పెరగొచ్చు.

చైనా, హాంకాంగ్, జపాన్, థాయిలాండ్, తైవాన్ లాంటి చోట్ల మాస్క్‌ల వాడకం విపరీతంగా ఉంది. వైరస్ ఎవరిలోనైనా ఉండొచ్చన్న భయం జనాల్లో ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. కొన్ని చోట్ల ప్రభుత్వాలు అందరినీ మాస్క్‌లు ధరించమని సూచిస్తున్నాయి. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించనివారిని అరెస్టు కూడా చేసేలా నిబంధనలు ఉన్నాయి.

ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లో బయటకు రాని కరోనావైరస్ కేసులు చాలా ఉండొచ్చని జనాల్లో భయం ఉంది. అందుకే ఆయా దేశాల్లోని ప్రధాన నగరాల్లో చాలా మంది జనం మాస్క్‌లు ధరిస్తున్నారు.

కరోనావైరస్ వ్యాప్తి కన్నా ముందు నుంచే మాస్క్‌లు ధరించడం కొన్ని దేశాల్లో సాంస్కృతికంగా భాగమైంది. ఫ్యాషన్ అలవాట్లలో భాగంగా కూడా వీటిని ధరిస్తున్నారు. హాంకాంగ్‌లో అప్పట్లో ‘హెలో కిట్టీ’ ఫేస్ మాస్క్‌లు తెగ అమ్ముడుపోయాయి.

అనారోగ్యంతో ఉన్నప్పుడు గానీ, జ్వరాలు ఎక్కువగా వచ్చే కాలంలో గానీ మాస్క్‌లు ధరించే అలవాటు తూర్పు ఆసియాలో చాలా మందికి ఉంది. బహిరంగంగా తుమ్మడం, దగ్గడాలను వాళ్లు అమర్యాదకరంగా భావిస్తారు.

2003లో సార్స్ వైరస్ వ్యాప్తి చెందడం కూడా ఈ ప్రాంతంలోని దేశాలవారికి మాస్క్‌ల ప్రాధాన్యత తెలిసేలా చేసింది. ముఖ్యంగా హాంకాంగ్‌లో ఆ ప్రభావం బాగా కనిపిస్తుంది. ఆ వైరస్ కారణంగా ఇక్కడ చాలా మంది చనిపోయారు.

పాశ్చాత్య దేశాలకు, తూర్పు ఆసియా దేశాలకు మధ్య కనిపించే ప్రధాన తేడా ఒకటుంది. తూర్పు ఆసియా దేశాలు అంటు వ్యాధులను అనుభవించాయి. ఆ జ్ఞాపకాలు ఇంకా వారి మెదళ్లలో తాజాగా ఉన్నాయి.

ఆగ్నేయాసియా దేశాల్లో, ముఖ్యంగా అక్కడ అధిక జనాభా ఉండే నగరాల్లో చాలా మంది కాలుష్యం నుంచి రక్షణ కోసం మాస్క్‌లు వేసుకుంటుంటారు.

ఆసియా వ్యాప్తంగా ఈ అలవాటైతే లేదు. సింగపూర్‌లో ప్రభుత్వం ప్రజలను మాస్క్‌లు వేసుకోవద్దని కోరుతోంది. వైద్య సిబ్బందికి సరిపడా మాస్క్‌లు ఉండాలనే ఈ అభ్యర్థన చేస్తోంది. సింగపూర్ ప్రభుత్వంపై అక్కడి పౌరులకు గొప్ప విశ్వాసం ఉంది. అందుకే, వాళ్లు ప్రభుత్వ సూచనను వింటున్నారు.

వుహాన్‌లో మాస్క్‌లు ధరించనివారిని అరెస్ట్ చేస్తామని అధికారులు హెచ్చరించారు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, వుహాన్‌లో మాస్క్‌లు ధరించనివారిని అరెస్ట్ చేస్తామని అధికారులు హెచ్చరించారు

ప్రవర్తనలో మార్పు తెచ్చే మార్గం

అంతటా మాస్క్‌లు ధరిస్తూ కనిపించడం, వైరస్ ముప్పును పదేపదే గుర్తు చేసేందుకు ఉపయోగపడుతుందని కొందరు నిపుణులు అంటున్నారు. ఫలితంగా జనాల ప్రవర్తనలో మార్పులు వస్తాయని, వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

‘‘రోజూ బయయటకు వేళ్లే ముందు మాస్క్ వేసుకుంటే, అదొక యూనిఫామ్ ధరించినట్లే. యూనిఫామ్‌కు తగ్గట్లు నడచుకోవాల్సిన బాధ్యత ఉందని మీరు భావిస్తారు. శుభ్రతకు ప్రాధాన్యతనిస్తారు. ముఖాన్ని పదేపదే తాకరు. సామాజిక దూరం పాటిస్తారు’’ అని హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ డోనల్డ్ లో అన్నారు.

వైరస్‌పై ప్రపంచం చేసే యుద్ధంలో ప్రతి చిన్న అంశమూ ముఖ్యమేనన్నది వారి అభిప్రాయం.‘‘ఫేస్ మాస్క్‌ల ప్రభావం ఏమీ ఉండదని మనం అంటాం. మళ్లీ వైద్య సిబ్బందికి వాటిని ఇస్తూ వాటి ప్రభావం ఎంతో కొంత ఉంటుందని మనమే చెబుతాం’’ అని హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన ఎపిడెమాలజిస్ట్ బెంజమిన్ కోలింగ్ అన్నారు.

‘‘జన సమ్మర్థ ప్రాంతాలకు ఎక్కువ మంది మాస్క్‌లు ధరించి వస్తే, వ్యాప్తిని ఎంతో కొంత అడ్డుకోవచ్చు. ప్రస్తుత సమయంలో వ్యాప్తిని అడ్డుకునే చిన్న చర్యైనా, ముఖ్యమే’’ అని అయన వ్యాఖ్యానించారు.

కానీ, మాస్క్‌ల వాడకం పెరగడం వల్ల కొన్ని ఇబ్బందులున్నాయి.

జపాన్, ఇండోనేసియా, థాయిలాండ్‌లు మాస్క్‌ల కొరత ఎదుర్కొంటున్నాయి. దక్షిణ కొరియా మాస్క్‌ల పంపిణీలో రేషన్ పాటిస్తోంది. వాడిన మాస్క్‌లనే జనం తిరిగి వాడొచ్చన్న భయం కూడా ఉంది. అలా వాడితే ప్రమాదమే. మాస్క్‌లను బ్లాక్ మార్కెట్‌లో కొన్నా, ఇంట్లో తయారు చేసుకున్నా నాణ్యత ఉండకపోవచ్చు.

మాస్క్‌లు ధరించే అలవాటు విపరీతంగా ఉన్న ప్రాంతాల్లో వాటిని ధరించనివారు వివక్ష ఎదుర్కోవాల్సి వస్తోంది. మాస్క్‌లు ధరించలేదన్న కారణంతో వ్యక్తులను తమ దుకాణాల్లోకి, భవనాల్లోకి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారు.

హాంకాంగ్‌లో పత్రికలు పాశ్యాత్య దేశాలకు చెందినవారు మాస్క్‌లు ధరించడం లేదని, గుంపులుగా తిరుగుతున్నారని పెద్ద ఫొటోలతో కథనాలు ప్రచురించాయి. పర్యాటకులు సరైన జాగ్రత్తలు పాటించడం లేదంటూ విమర్శించాయి.

అయితే, వివక్ష రెండు వైపులా ఉంది. పాశ్చాత్య దేశాల్లో మాస్క్‌లు వేసుకున్నవారిని అడ్డుకోవడాలు, వారిపై దాడి చేసిన ఘటనలు కూడా జరిగాయి. మాస్క్‌లు వేసుకునేవారిలో ఎక్కువ మంది తూర్పు ఆసియా వాళ్లే ఉంటున్నారు.

అయితే, అందరూ మాస్క్‌లు వేసుకోవాలన్నవారి వాదనలకు బలం పెరుగుతోంది. డబ్ల్యూహెచ్ఓ అధికారిక సలహాను కూడా కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

హాంకాంగ్‌లో రంగురంగుల మాస్క్‌లు దొరుకుతాయి

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, హాంకాంగ్‌లో రంగురంగుల మాస్క్‌లు దొరుకుతాయి

‘సైలెంట్ క్యారియర్స్’

బయటకు ఏ లక్షణాలు లేకుండానే, ఆరోగ్యంగా కనిపిస్తూ వైరస్‌ సంక్రమణకు కారణమయ్యే ‘సైలెంట్ క్యారియర్స్’ ఇదివరకు నిపుణులు ఊహించనదాని కన్నా చాలా ఎక్కువగా ఉండొచ్చనడానికి ఆధారాలు బయటకు వస్తున్నాయి.

చైనాలోని పాజిటివ్ కేసుల్లో మూడింట ఒక వంతు మందిలో బయటకు ఏ లక్షణాలూ కనిపించలేదని చైనా ప్రభుత్వ రహస్య నివేదికలో ఉన్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక పేర్కొంది.

డైమెండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ పడవ ప్రయాణికుల్లో 600కుపైగా మందికి కరోనావైరస్ ఉన్నట్లు తేలితే, అందులో సగం మందిలో బయటకు లక్షణాలు కనిపించలేదు. ఐస్‌ల్యాండ్‌లోనూ ఈ తరహా ఫలితాలే కనిపించాయి.

లక్షణాలు బయటపడని వాళ్లతో వైరస్ ఇంకొకరికి సంక్రమించే అవకాశాలు తక్కువన్న భావన కూడా జనాల్లో ఉంది. కానీ, దీన్ని కొందరు సవాలు చేస్తున్నారు. అందరూ మాస్క్‌లు ధరిస్తే, లక్షణాలు బయటపడనివారితోనూ ముప్పు ఉండదని వాదిస్తున్నారు.

చైనాలోని కరోనావైరస్ కేసులపై ఇటీవల జరిగిన ఓ అధ్యయనం... లక్షణాలు పాక్షికంగా ఉన్నవారు, అసలే లేనివారి నుంచి కూడా వైరస్ సంక్రమణ గణనీయంగా ఉందని, 80 శాతం పాజిటివ్ కేసులకు వారే కారణమై ఉండొచ్చని పేర్కొంది. ఇప్పుడు ఈ విషయాన్ని ఒకే అధ్యయనం చెప్పింది. రాబోయే రోజుల్లో జరిగే అధ్యయనాలు, పరిశోధనలు ఈ విషయంపై మరింత స్పష్టతను తీసుకురావొచ్చు.

అంటు వ్యాధుల అనుభవాలు, సాంస్కృతిక మార్పుల వల్ల ఫేస్ మాస్క్‌ల ధరించే అలవాటు పెరిగి ఉండొచ్చు. ప్రస్తుతం కరోనావైరస్ ప్రబలతున్న తీరును చూస్తుంటే, అధ్యయనాలు చెబుతున్న విషయాలను గమనిస్తుంటే, మిగతావారి ప్రవర్తన కూడా మారే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది.

అదనపు రిపోర్టింగ్ : హెలీర్ చెవాంగ్

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)