ఇండియా లాక్‌డౌన్: ‘‘చివరి చూపూ దక్కించుకోలేకపోయాం’’

- రచయిత, గౌతమి ఖాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
(లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అనేకం. దగ్గరి వారు చనిపోయినా అంత్యక్రియలకు కూడా వెళ్లలేని నిస్సహాయత అందులో ఒకటి. బీబీసీ తెలుగు ప్రతినిధి గౌతమీ ఖాన్ ఎదుర్కొన్న అటువంటి విషాదం ఆమె మాటల్లోనే)
నిజాన్ని నమ్మక తప్పలేదు. నిజమే... ఇక మమ్మీ లేదు. రోజూ ఫోన్ చేసి ఏం తిన్నావమ్మా అని అడిగే మమ్మీ లేదు. జలాల్ వాళ్ల అమ్మ... పేరుకే నాకు అత్తగారు. కానీ ఎప్పుడూ నేనలా పిలవలేదు. మమ్మీ అని పిలవడమే అలవాటు. అమ్మలాగే చూసింది నన్ను. ఆమెకెప్పుడూ ఆరోగ్యం బాగుండేది కాదు.
కరోనావైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అనగానే సూర్యోదయాలు ఆస్వాదించాలని, యోగాసనాలు వేసి ఆరోగ్యాన్ని చక్కబెట్టుకునే సమయమని, పిల్లలతో, కుటుంబంతో గడిపే అవకాశమని, కొత్త కొత్త వంటలు, కళలు నేర్చుకోవడానికి తగినంత వ్యవధి అని సోషల్ మీడియాలో పోస్టులు చూస్తున్నాను. కానీ, ఈ లాక్ డౌన్ నా జీవితంలో మరిచిపోలేని గాయాన్ని చేసింది.
కరోనావైరస్... దీని గురించి ముందు విన్నప్పుడు పెద్దగా భయపడలేదు. ఏదో మామూలు వైరస్ అనుకున్నాను. నా ఉద్యోగంలో భాగంగా వుహాన్ కథలు ఒక్కొక్కటిగా వింటున్నప్పుడు, వైరస్ వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందో రాస్తున్నప్పుడు మాత్రం నాలో కాస్త భయం మొదలైంది. అది తీవ్రంగా విస్తరిస్తోందని తెలిసి మరింత భయపడ్డాను. అది వృద్ధుల మీదే ఎక్కువ దాడి చేస్తుందని సర్వేలు చెబుతున్నాయని చదివాను. అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై ఇది మరింత తీవ్రంగా ప్రభావం చూపించగలదనే మాటలు నాలో ఆందోళనను పెంచాయి. ఎందుకంటే నాకు కూడా ఆరోగ్య సమస్యలున్న అత్తమామలున్నారు కాబట్టి.

నెమ్మది నెమ్మదిగా కరోనా విలయతాండవం మొదలైంది. చైనా నుంచి పక్క దేశాలకు, తర్వాత ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరించింది. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ఇంకో సంవత్సరమైనా పడుతుందనే మాట నన్ను మరింత భయపెట్టేది. ముఖ్యంగా ఇటలీ మీద కథనాలు రాస్తున్న ప్రతిసారీ ఎంత బాధగా, బెంగగా ఉండేదో చెప్పలేను.
మనుషులు ఇలా పిట్టల్లా రాలిపోతున్నారేంటి? ఈ వైరస్ ఇంత దారుణంగా ప్రాణాలను బలితీసుకుంటుందా? వ్యాక్సిన్ లేదా మందు వచ్చే వరకు మనం ఇలా భయంగానే బతకాలా? ఇది ఒకరి నుంచి మరోకరికి వ్యాపించడం కూడా చాలా సులభం. ఇలాంటి వైరస్ నుంచి మనం ఎలా తప్పించుకుంటాం? మన కుటుంబాలు, స్నేహితులు.. ఇలా తెలిసిన వారందరికీ చాలా జాగ్రత్తగా ఉండాలంటూ నాకు తెలిసింది చెప్పేదాన్ని. వారు విసుక్కున్నా ఫర్వాలేదు, తెలిసిన విషయం.. దాని తీవ్రత వారికి అర్థం కావాలి. అదే నా ఆలోచన. కనీసం నాకు తెలిసిన వారెవరూ ఈ వైరస్ బారిన పడకూడదనే చిన్న ఆశ.
వైరస్ భారత్‌ను కూడా భయపెట్టడం మొదలైంది. కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రజల్లో కూడా భయం పెరిగింది. ఓ కథనంలో చదివాను.. వైరస్ కన్నా భయంకరమైనది భయం అని. నిజమే. సగటు మనిషిని కదా! నాలో కూడా అంతే భయం. ఎందుకుండదు? నాలుగేళ్ల కూతురికి తల్లిని నేను. చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని. మాస్కు వేసుకోకుండా బయటకెళ్లేదాన్ని కాదు. ఎందుకంటే సెలవు పెట్టి ఇంట్లో కూర్చుందాంలే అనుకునే ఉద్యోగం కాదు నాది. జర్నలిస్టులు వార్తలు అందిస్తేనే కదా.. జనానికి విషయం తెలిసేది. మేం వెళ్లాల్సిందే.

బయటకెళ్లి రావడంలో భాగంగా ఈ వైరస్ ఎక్కడ నాకు సోకుతుందో, నా వల్ల ఇంట్లోకి కూడా చేరుతుందేమో, నా వల్ల మరెంత మందికి వ్యాపిస్తుందో అని భయపడుతూనే ఉండేదాన్ని.
అలా భయపడుతున్నప్పుడు ఆ భయాన్ని కాస్త తగ్గించుకునేందుకు తనతో పంచుకునేటప్పుడు జలాల్ నాతో చాలాసార్లు అనేవాడు... "నువ్వు కేవలం ఆఫీస్‌కు వెళ్లి వస్తున్నావు. లక్షల మంది డాక్టర్లు వైరస్ సోకిన వారికి దగ్గరుండి వైద్యం చేస్తున్నారు. మరి వాళ్లేం చేయాలి? భయపడకు, ధైర్యంగా ఉండు. వీలైనంత జాగ్రత్తగా ఉండు" అని.
కరోనా విజృంభిస్తూ వస్తోంది. కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇక కరోనాకి అడ్డుకట్ట వేయాల్సిన సమయం రానే వచ్చింది. మార్చి 22… జనతా కర్ఫ్యూ. జలాల్, నేను కూర్చుని మాట్లాడుకుంటున్నాం. కరోనా కలకలం గురించి, మిగిలిన దేశాల్లో ఈ వైరస్ ప్రభావం గురించి చెప్పుకుంటున్నాం.
కరోనా మొదలైనప్పటి నుంచి నేను ఈ వైరస్ గురించి తప్ప మరే విషయం మాట్లాడటం లేదు. నా మనసులో ఇంకే ఆలోచనా ఉండేది కాదు. ఇదే ఆలోచన. కరోనా గురించే రకరకాల ఆలోచనలు నా మనసులో మెదులుతూ ఉండేవి. ఇదో వైరస్. మనల్ని మనం కాపాడుకునేందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ నాకు తెలుసు సరే. కానీ అందరికీ దీని తీవ్రత అర్థమవుతుందా?
మా ఇంటి దగ్గర పనిచేసే దేవికి చెప్తే.. ‘అస్తమానూ చేతులు కడుక్కుంటే చాలంట, భయపడకండి’ అని సింపుల్‌గా అనేసింది. తనకొక బాబున్నాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోందో అని అడిగి చూశా. "పిల్లలు కదా ఆడుకోవద్దంటే వింటారా చెప్పండి. అందుకే బయటనుంచి వచ్చాక మాత్రం చేతులు కడుక్కోమంటున్నా" అంది. అంటే దీని తీవ్రత అందరికీ ఇంకా పూర్తిగా తెలియలేదనిపించింది. తనకి వివరించి చెప్పా. కానీ అసలు వైరస్ ఎలా వ్యాప్తిస్తుందో తనకు అర్థమవ్వాలంటే చాలా ఓపిగ్గా చెప్పాలని నాకర్థమైంది. అప్పుడే నా భయానికి మరింత బెంగ తోడైంది.
మా మావయ్యగారు అంటే జలాల్ వాళ్ల నాన్న. పెద్దగా చదువుకోలేదు. ఈ వైరస్‌లూ అవీ అంటే అర్థమవుతుందా? సరే, అడుగుదాం అనుకుని ఫోన్ చేశా. వైరస్ గురించి తెలుసా అని అడిగా. తెలుసన్నారు. మాస్కు వేసుకుని బయటకు వెళ్తున్నానమ్మా, లోపలికి రాగానే చేతులు కడుక్కుంటున్నా అని అన్నారు. అంతే, ఆయనకు అక్కడి వరకే తెలుసు.

ఫొటో సోర్స్, Reuters
మరింత వివరంగా అర్థమయ్యేలా పూర్తిగా వివరించి చెప్పా. 'జాగ్రత్తగానే ఉంటున్నాలే అమ్మా' అని చెప్పినా నేను విననట్టే మళ్లీ మళ్లీ నాకు తెలిసినదంతా చెప్పాను. 'ఇదేదో చిన్న విషయమే అనుకుంటున్నారా ఏంటి' అని కాస్త గట్టిగానే అన్నా. "మీరు ఏ పని మీద బయటకి వెళ్తుంటారు పప్పా? మమ్మీకి అసలే చాలా ఆరోగ్య సమస్యలున్నాయి. బయటకి వెళ్లొచ్చి మీరు కాస్త అజాగ్రత్తగా ఉన్నా, చేతులు కడుక్కోకపోయినా, తెచ్చిన వస్తువులు డైరెక్టుగా మమ్మీ చేతికిచ్చినా మీ వల్లో ఆ వైరస్ ఇంట్లోకి వచ్చినట్టు. అనారోగ్యంతో ఉన్నవాళ్లపై ఈ వైరస్ చాలా తొందరగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరెంత జాగ్రత్తగా ఉంటే మమ్మీకి అంత మంచిది" అని చెప్పాను. మా అత్తమ్మ ఎలాగూ బయటకు వెళ్లరు. కాబట్టి మామగారే జాగ్రత్తగా ఉండాలన్నది నా ఆలోచన.
నా మాటలతో ఈ కరోనా తీవ్రత ఆయనకు బాగానే అర్థమైంది. 'అమ్మా, దిల్లీలో పరిస్థితి ఎలా ఉంది?' అనే ఆయన ప్రశ్నలోనే భయం వినిపించింది. ‘‘ఇక్కడ కూడా అలాగే భయంగానే ఉంది. కానీ మీరేం భయపడకండి, మాకు తెలుసుగా ఎంత జాగ్రత్తగా ఉండాలో’’ అని సర్ది చెప్పా. "అమ్మా, మాదేముంది, ఇక పెద్దవాళ్ళం అయిపోయాం. మేం ఉన్నా లేకపోయినా ఫర్వాలేదు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఇబ్బందిగా ఉంటే ఇక్కడికొచ్చేయండి తల్లీ. నాకు దిగులుగా ఉంది" అంటూ గాబరా పడ్డారు. చాలా బెంగగా అనిపించింది నాకు.
"అలా అంటారేంటి.. మీరు లేకపోతే అన్నం తిన్నావా తల్లీ అని ప్రతిరోజూ ఎవరు ఫోన్ చేసి అడుగుతారు? మమ్మీ చెప్పే కబుర్లన్నీ ఎవరు చెప్తారు నాకు? మేం బాగుండాలంటే మమ్మీ, మీరూ ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మమ్మీకి కూడా జాగ్రత్తలు చెప్పండి" అని చెప్పి ఫోన్ పెట్టేశాను.
ఫోన్ అయితే పెట్టేశాను కానీ మనసు మనసులో లేదు. ఏమైనా అజాగ్రత్తగా ఉంటారేమో అనే దిగులు. వాళ్లుండేది గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో. సాయంత్రం అయితే మమ్మీతో కబుర్లు చెప్పేందుకు వాళ్ల స్నేహితులొస్తుంటారు. పిల్లలు ఇంటిదగ్గరే ఆటలాడుతుంటారు. ఇంట్లోకి ఎవరినీ రావద్దని చెప్తారా అంటే.. చెప్పలేరు. వాళ్లకి వివరించి చెప్పడం, వీళ్లకి ఏ ఇబ్బందీ కలగకుండా ఉండాలి అనుకోవడం తప్ప దిల్లీలో ఉంటున్న నేను ఇంకేం చేయగలను? ఆ భయంతో ఆ రోజు మూడు సార్లు ఫోన్ చేశాను. కానీ మా అత్తగారితో మాట్లాడలేదు. మామగారికే మళ్లీ మళ్లీ జాగ్రత్తలు చెప్పాను. ఆమెకి చెప్తే భయపడుతుందేమో అని నేనేమీ చెప్పలేదు. ఈ ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుండగానే ఊహించినదే నిజమైంది.
మార్చి 24వ తేదీ అర్థరాత్రి నుంచి భారత్ అంతటా లాక్ డౌన్. 21 రోజుల పాటు ఎటూ కదలడానికి లేదు. వార్త వినగానే మళ్లీ ఫోన్ చేశా. "పప్పా 21 రోజుల పాటు లాక్ డౌన్. అంటే అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు కదలకూడదు. మమ్మీని జాగ్రత్తగా చూడండి. ఏదంటే అది పెట్టకండి. మందులు జాగ్రత్తగా వేయండి. ఏమైనా ఆరోగ్యం బాగోకపోతే మీరు ఆసుపత్రులు చుట్టూ తిరగడం కూడా కష్టమే ఇప్పుడు. అందుకే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది".. మళ్లీ మళ్లీ అదే మాట చెప్తున్నా. నాకు కూడా తెలియలేదు . ఎందుకంత భయపడ్డానో.. ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేశానో.

మంగళవారం రాత్రి వార్తలు ప్రసారం చేసి ఇంటికొచ్చా. జలాల్ నేను మాట్లాడుకుంటుండగా, "మా చెల్లి ఫోన్ చేసి చెప్పింది.. అమ్మకి ఒంట్లో బాగుండట్లేదని" అని అన్నాడు జలాల్. ఒక్కసారిగా భయమేసింది. ‘‘జాగ్రత్తగా ఉండమని చెప్పావా.. ఇప్పుడు ఎటూ కదలడానికి కూడా లేదు. ఆసుపత్రుల చుట్టూ తిరగడం చాలా కష్టమవుతుంది. ఏదైనా అర్జెంటై ఆసుపత్రిలో చేరాలన్నా మనం వెళ్లలేం కూడా’’ అని అన్నాను.
"ఏంకాదులే.. నువ్వంత కంగారు పడేదేం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలే. కాళ్ల నొప్పులు ఎక్కువయ్యాయన్నారు. మందులు వాడుతున్నాం కదా, నెమ్మదిగా తగ్గుతాయి. కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, తప్పవు ఈ నొప్పులు. ఏం భయం లేదులే" అన్నాడు. "ఓహ్.. అయితే ఫర్వాలేదులే. కాళ్లనొప్పులెన్ని రోజులుంటాయి.. అయినా గానీ రేపు నువ్వు కూడా ఒకసారి వివరంగా చెప్పు.. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో" అని అన్నాను.
మార్చి 25వ తేదీ బుధవారం ఉదయం. టైమ్ ఆరు దాటినట్టుంది. తన ఫోన్ మోగింది. లేచి మాట్లాడుతున్నాడు. నాకు మెలకువ వచ్చీ రానట్టుగా ఉంది కానీ తన మాటలు చిన్నగా వినిపిస్తున్నాయి. ‘‘అల్లా...’’ అని అంటున్న మాటలు.. నెమ్మదిగా లేచి పక్కనే కూర్చున్నా. తన మొహం చూసి అర్ధమైంది మమ్మీకి మళ్లీ ఏదో సీరియస్ అయిందని.
బాగోలేదని ఇలా తెలియగానే అలా వెళ్లిపోవడం మాకు అలవాటు. అలా ఎన్ని సార్లు ఉరుకులు పరుగుల మీద వెళ్లి ఉంటామో. కానీ ఇప్పుడు లాక్ డౌన్ కదా అందుకే కంగారు పడుతున్నట్లున్నారు అనుకుంటూ ‘‘ఏమైందంట.. సీరియస్గా ఏమైనా ఉందా.. హస్పిటల్ లో అడ్మిట్ చేయాలంటున్నారా.. ఎందుకంత కంగారు పడతావ్ .. ఏమైందో చెప్పు .. ఎలా వీలుంటే అలా చేద్దాం’’ అని నిద్రకళ్లతోనే అంటున్నాను.
తన కన్నీళ్లతో నాలో భయం రెట్టింపైంది. మమ్మీకి చాలా సీరియస్ అయ్యిందేమో అనుకుంటూ ‘వీలైనంత తొందరగా హస్పిటల్లో జాయిన్ చెయ్యమను’ అని చెబుతుండగానే ‘ఇక చెయ్యాల్సిన అవసరం కూడా లేదు’ అన్నాడు. ఓ క్షణం మౌనంగా ఉండిపోయాను. నమ్మడానికి నాకు కష్టంగా ఉంది. కాదు.. అసలు నమ్మలేదు నేను. నమ్మలేను కూడా.
వెంటనే పప్పాకి ఫోన్ చేసా. ఏడుస్తున్నారు. ‘ఇంక మమ్మీ లేదమ్మా’ అని చెబుతున్నారు. అయినా నాకు నమ్మాలనిపించలేదు. వెంటనే వాళ్ల పక్కనున్న మరో ఇద్దరికి ఫోన్ చేసా. వాళ్లు అదే చెబుతున్నారు. అయినా నాలో ఏదో అనుమానం. లేదు ఇలా జరిగి ఉందడు. ‘బహుశా స్పృహ తప్పి పడిపోయిందేమో.. మళ్లీ ఓ సారి చూడండి’ అంటున్నా. ‘లేదు మేం చూసాం కదా.. మమ్మీ ఇక లేదు’ అంటున్నా నాకదేం వినపడటం లేదు.
ఎందుకంటే అసలు నేను ఆ మాట వినాలనుకోవడం లేదు. ఒక వేళ ఏమైనా కోమాలోకి వెళ్లిందేమో .. వీళ్లకి అర్దం కాక చనిపోయిందంటున్నారేమో.. మళ్లీ ఫోన్ చేసా.. ‘ఓ సారి డాక్టరుని పిలిచి మళ్లీ చూపించండి. మళ్లీ ఓ సారి చూడమనండి’. అవన్నీ అయిపోయాయని చెప్పినా నేను విననని వాళ్లకి తెలుసేమో.. ‘అలాగే మేం చూపిస్తాం.. నువ్వు కంగారు పడకు.. కాస్త నెమ్మదిగా ఉండు’ అని చెప్పి ఫోన్ పెట్టేసారు.. కాసేపటికి చాలా ఫోన్లు.. మమ్మీ ఇక లేదని.. నేను నమ్మను అని అంటున్నా నమ్మమంటున్నారు.. సడన్ హార్ట్ అటాక్. ఇక మమ్మీ మాటలు వినపడవు.
ఈ కరోనా నుండి తనను తాను ఎలా కాపాడుకుంటుందో అని కంగారు పడ్డాను. కానీ ఈ కరోనా లాక్‌డౌన్ వలన తనను చివరి చూపు చూడకుండా కుమిలి కుమిలి ఏడ్చే రోజును మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. కనీసం కలలో కూడా అనుకోలేదు. మేం పక్కన లేకుండానే మమ్మీ ఇంత దూరంగా వెళ్లిపోతుందని. కరోనా సోకిన వారి గురించి, కరోనా వాళ్లకి మిగులుస్తున్న బాధ గురించి విని బాధపడ్డ నేను.. కరోనా సోకకపోయినా ఇంత శోకాన్ని మిగులుస్తుందని మాత్రం అనుకోలేదు. ఎప్పటికీ మర్చిపోలేను ఈ కరోనా వ్యాధిని.

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల దేశవ్యాప్తంగా రవాణా నిలిచిపోయింది. అన్ని రాష్ట్రాలూ తమ సరిహద్దుల్ని మూసేశాయి. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లే అవకాశం లేదు. మొదట్లో కొందరిని అనుమతించినా, వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ చేశారు. దీంతో స్వస్థలాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన వారిలో కొందరు తమ కుటుంబ సభ్యులు, బంధువులు ఆకస్మికంగా మరణించినా వారి అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నారు.


- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనాపై ప్రభుత్వం ఎలా ‘యుద్ధం’ చేయబోతోంది? కంటైన్మెంట్ ఆపరేషన్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు ముగుస్తుంది?
- కరోనావైరస్: కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఏం చేశారు?
- ప్రజల కదలికలను స్మార్ట్ ఫోన్ల ద్వారా కనిపెడుతున్న గూగుల్.. భారతదేశంలో లాక్‌డౌన్ ప్రకటించాక పరిస్థితిపై రిపోర్ట్
- లైట్లు ఆర్పేయాలన్న మోదీ మాట వినలేదని.. నలుగురు ముస్లిం సోదరుల మీద దాడి
- ఆత్మీయులు చనిపోయినప్పుడు ఆకలి చచ్చిపోతుంది... ఆ శోకంలో ఆహారం ఊరటనిస్తుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









