కరోనావైరస్: ఈ మహమ్మారికి ముంబయి కేంద్రంగా ఎలా మారింది?

మురికివాడల్లోనూ కరోనా వైరస్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విదేశాల నుంచి వచ్చినవారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిందనే విమర్శలు ఉన్నాయి
    • రచయిత, మయాంక్ భగవత్
    • హోదా, బీబీసీ కోసం

దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరం కరోనావైరస్‌ వ్యాప్తికి కేంద్రంగా మారుతోంది.

మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 600 దాటింది. అందులో 377 కేసులు ముంబయి నగరంలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం 400 మందికి పైగా కరోనా బాధితులు ముంబయిలో చికిత్స పొందుతున్నారు.

కరోనా రోగులతో సన్నిహితంగా మెలిగిన 5,443 మందిని ముంబయి నగర పాలక సంస్థ (బీఎంసీ) గుర్తించింది. వారందరినీ స్వీయ నిర్బంధంలో ఉంచి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

వాణిజ్య కేంద్రంగా ఉన్న ముంబయి నగరానికి అధికారిక పనుల మీద నిత్యం అనేక మంది విదేశీయులు వస్తూ వెళ్తుంటారు. లక్షల మంది భారతీయులు ఈ నగరం నుంచి విదేశీ ప్రయాణాలు చేస్తుంటారు. ముంబయిలో ఎక్కువగా కేసులు నమోదు కావడానికి అది ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు.

ముంబయిలో మార్చి ఆరంభంలో తొలి కేసు నిర్ధరణ అయ్యింది. ఇప్పుడు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ ఈ మహమ్మారి వ్యాప్తి చెందింది.

విదేశాల నుంచి తిరిగి వచ్చిన వ్యక్తుల ద్వారా కరోనావైరస్ భారత్‌కు వచ్చింది. ఇప్పుడు దేశంలోని సామాన్య ప్రజలు కూడా దీని బారిన పడుతున్నారు.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం మొదట మార్చి 17న ముంబయిలో పాక్షిక లాక్‌డౌన్ ప్రకటించింది. అయితే, ప్రయాణాలను విరమించుకోవాలని ప్రభుత్వం ఎంతగా విజ్ఞప్తి చేసినా ప్రజలు పెడచెవిన పెట్టారు. దాంతో, లోకల్ రైళ్లను, బస్సులను పూర్తిగా ఆపేసి, పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం.

థర్మల్ స్క్రీనింగ్, కరోనా పరీక్షల సంఖ్య పెరగడంతో, ముంబయిలో పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోయింది.

ఇప్పుడు లక్షల మంది పేదలు నివసించే నగరంలోని మురికివాడల్లోనూ కోవిడ్ -19 కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు నగరంలో అధికారులు కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.

ముంబయిలో కంటైన్మెంట్ జోన్లు ఇవే

తూర్పు శివారు ప్రాంతాలు-

చీతా క్యాంప్, మన్‌ఖర్డ్, చెంబూర్, గోవాండి శివాజినగర్, ఘాట్‌కోపర్ (పశ్చిమ), పవాయి, హీరానందని చండివాలి, ములుంద్ (తూర్పు), నహూర్, భండూప్‌లోని కొన్ని భాగాలు.

పశ్చిమ శివారు ప్రాంతాలు- ఓషివరా, జోగేశ్వరి(తూర్పు, పశ్చిమ), అంధేరి, అంధేరి ఎంఐడీసీ, వెర్సోవా, విలే పార్లే, కలీనా, శాంటాక్రూజ్ (పశ్చిమ), ఖార్ (పశ్చిమ), బాంద్రా (పశ్చిమ), కుర్లా.

సెంట్రల్ ముంబయి- వర్లి, ప్రభాదేవి, అంటోప్ హిల్, లోయర్ పరేల్, శివాడి, కాటన్‌గ్రీన్‌లోని కొన్ని భాగాలు.

దక్షిణ ముంబయి- మలబార్ హిల్, కంబాలా హిల్, గ్రాంట్ రోడ్, నాగ్‌పాడా, మసీదు బందర్, గిర్గాం.

ధారావి మురికివాడకు కరోనా ఎలా చేరుకుంది?

ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడగా చెప్పే, ధారావిలో కరోనా సోకి తాజాగా ఒక వ్యక్తి చనిపోయారు.

విదేశాల నుంచి వచ్చిన కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మురికివాడలకు కూడా కరోనావైరస్ వ్యాప్తి చెందుతోందని రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు.

జై భోలేనగర్‌కు చెందిన ఓ టాక్సీ డ్రైవర్ కరోనా సోకి మరణించారు. ఆ డ్రైవర్ విమానాశ్రయం నుంచి విదేశీ ప్రయాణికులను తీసుకెళ్లారు.

విషునగర్‌లో విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తి ద్వారా వారి ఇంట్లో పనిచేసే 65 ఏళ్ల మహిళకు కరోనా సోకింది.

“విదేశాల నుంచి వచ్చినవారు ఈ వైరస్‌ను తీసుకొచ్చారు. వారిని ప్రభుత్వం నిర్బంధించలేదు. వారు తమ ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వం చెప్పింది. కానీ, వారు ఆ సూచనలను పట్టించుకోకుండా, బయట తిరిగారు. వారి ఇళ్లలో పనిచేసే వారు కూడా వైరస్ బారిన పడ్డారు. ఆ పనిమనుషుల ద్వారా ఇతర ఇళ్లకు కూడా వైరస్ విస్తరించింది. అలా మురికి వాడలకు కూడా ఆ వైరస్ పాకి ఉంటుంది” అని పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ అమోల్ అన్నాడేట్ చెప్పారు.

“మురికివాడల్లో ఉంటున్నవారు విద్యావంతులు కాదు. ఒకే గదిలో 10 నుంచి 15 మంది ఉంటారు. అందులో ఒకరికి వైరస్ సోకితే, మిగతా వారికి కూడా వేగంగా వ్యాపిస్తుంది. కొందరికి తమకు ఎలాంటి రోగం రాదనే మూఢనమ్మకాలు ఉన్నాయి. లాక్‌డౌన్ సమయంలోనూ వారు ఎప్పటిలాగే తిరుగుతుంటారు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోరు” అని సియోన్-ధారవి ప్రాంతంలో 35 ఏళ్లుగా పని చేస్తున్న డాక్టర్ అనిల్ పచ్చనేకర్ అంటున్నారు.

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు

అపోహలు కారణమయ్యాయా?

కోవిడ్-19 గురించి ప్రజలకు చాలా అపోహలు ఉండటం, సరైన అవగాహన లేకపోవడమే ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.

"చాలామంది స్వీయ- నిర్బంధం, సామాజిక దూరం పాటించడంలేదు. ఈ వ్యాధిని చాలా తేలికగా తీసుకుంటున్నారు. ఇది తమను ఏం చేయలేదని అనుకుంటున్నారు. కరోనా వ్యాప్తికి ఇది కూడా ఒక కారణం కావచ్చు” అని బీఎంసీ డిప్యూటీ కమిషనర్ కిరణ్ దిఘావాకర్ చెప్పారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సమాచారం ప్రకారం, కరోనావైరస్ వెడి, తేమతో కూడిన వాతావరణంలో కూడా వ్యాపిస్తుంది. కానీ, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందదనే అపోహతో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికారులు అంటున్నారు.

మురికివాడల్లోనూ కరోనా వైరస్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మురికివాడల్లోనూ కరోనా వైరస్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది

నిఘా నీడలో అనుమానితులు

మహారాష్ట్రలో దాదాపు 43 వేల మంది గృహ నిర్బంధంలో, 2,913 మంది ప్రభుత్వం ఆధ్వర్యంలోని క్వారంటైన్ కేంద్రాలలో ఉన్నారు.

ముంబయిలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి చెబుతున్నారు.

"ముంబయిలో నిర్బంధంలో ఉన్నవారిని నాలుగు వేల మంది బీఎంసీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వారందరినీ పరిశీలిస్తున్నాం. వారిపై నిఘా పెట్టేందుకు అవసరమైతే డ్రోన్లు, జీపీఎస్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటాం” అని మంత్రి తెలిపారు.

మురికివాడల్లో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. మురికివాడల్లోని కరోనా రోగులతో కలిసి తిరిగిన వారందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించే అవకాశం ఉంది.

మురికివాడల్లో నివసించే ప్రజలకు ఆహార పదార్థఆలు, తాగు నీరు అందిండచం మరో సవాలుగా మారింది.

"జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్న చాలామంది వైద్యులను సంప్రదిస్తున్నారు. వైరల్ జ్వరం కూడా, కరోనా లక్షణంలాగే ఉంటుంది. కాబట్టి వైద్యులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సాధారణ జ్వరం అయితే కొన్ని రోజులకే తగ్గిపోతుంది. తగ్గకపోతే, ఆ రోగి ఛాతి భాగాన్ని ఎక్స్-రే తీసి, ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలి” అని భారత వైద్య మండలి ఉపాధ్యక్షుడు డాక్టర్ పచ్చనేకర్ సూచిస్తున్నారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)