కరోనావైరస్: 5జీ టెక్నాలజీతో కోవిడ్-19 వ్యాధి వ్యాపిస్తుందా? - బీబీసీ రియాలిటీ చెక్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేచల్ శ్రేయర్, ఎలీనార్ లావ్రీ
- హోదా, బీబీసీ రియాలిటీ చెక్
కరోనావైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించడంలో 5జీ సాంకేతిక పరిజ్ఞానం సాయం చేస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని శాస్త్ర విజ్ఞాన సమాజం కొట్టి పారేసింది.
బ్రిటన్‌లోని బర్మింగ్‌హమ్, మెర్సీసైడ్ ప్రాంతాల్లో కోవిడ్-19 వ్యాప్తికి 5జీ కారణమవుతోందంటూ ఆ టవర్లను కొందరు తగలబెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్నాయి.
ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లక్షలాది మంది ఫాలోయర్లు ఉన్న కొన్ని వెరిఫైడ్ అకౌంట్ల నుంచి కూడా అటువంటి వీడియోలు షేర్ అవుతున్నాయి.
కోవిడ్-19కి, 5జీ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధం ఉందన్న వాదనలను శాస్త్రవేత్తలు పూర్తిగా కొట్టి పారేస్తున్నారు. జీవశాస్త్రపరంగా ఇది అసాధ్యమని స్పష్టం చేస్తున్నారు.
ఈ తరహా కుట్ర సిద్ధాంతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మాల్సిన అవసరం లేదని బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ మెడికల్ డైరక్టర్ స్టీఫెన్ పావిస్ తేల్చి చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కుట్ర సిద్ధాంతం - ప్రచారాలు
ఈ తరహా ప్రచారం మొదట ఫేస్‌బుక్‌లో జనవరి నెలాఖరులో మొదలైంది. సరిగ్గా అదే సమయంలో అమెరికాలో తొలి కరోనావైరస్ కేసు నమోదైంది.
- 5జీ టెక్నాలజీ మన రోగ నిరోధక వ్యవస్థను క్షీణింపజేస్తుందని, అందువల్ల ఎక్కువ మంది కోవిడ్-19 బారిన పడే అవకాశం ఉందన్నది ఒక వాదన.
- 5జీ టెక్నాలజీ వినియోగించడం వల్ల ఏదో రకంగా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నది మరొక వాదన.
అయితే ఈ రెండు వాదనలు అర్థం లేనివని రీడింగ్ యూనివర్శిటీలో సెల్యులర్ మైక్రోబయాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ సైమన్ క్లార్క్ స్పష్టం చేశారు.
“5జీ సాంకేతిక పరిజ్ఞానం మన రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు” అని క్లార్క్ పేర్కొన్నారు.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?

“సాధారణంగా మనం రోజులో బాగా అలసిపోయినా లేదా సరైన ఆహారం తీసుకోకపోయినా మన రోగనిరోధక వ్యవస్థ ఒక్కసారిగా పడిపోయే అవకాశం ఉంది. అలాగని వ్యవస్థ పనితీరు తీవ్రంగా ఏమీ ప్రభావితం కాదు, కానీ ఆ సమయంలో వైరస్‌లు సోకే అవకాశాన్ని మాత్రం కొట్టిపారేయలేం” అని డాక్టర్ సైమన్ చెప్పారు.
"బలమైన రేడియో తరంగాలు వేడిని పుట్టిస్తాయి. కానీ, 5జీ వల్ల వెలువడే రేడియో తరంగాలు చాలా బలహీనమైనవి. వేడిని పుట్టించి, మీ ఇమ్యూన్ సిస్టమ్‌ను పని చేయకుండా నిరోధించేంత బలం వాటికి లేదు. ఈ విషయంపై ఇప్పటికే చాలా అధ్యయనాలు జరిగాయి" అని ఆయనన్నారు.

ఫొటో సోర్స్, SCAMP/Imperial College London/EBU
5జీ, ఇతర మొబైళ్ల నుంచి వెలువడే రేడియో తరంగాలు విద్యుదయస్కాంత వర్ణపటంలో తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నవైపు ఉంటాయి. ఇవి కంటికి కనిపించే సాధారణ కాంతి కన్నా తక్కువ శక్తిమంతమైనవి, వాటికి శరీరంలోని కణాలకు నష్టాన్ని కలిగించేంత శక్తి ఉండదు.
బ్రిస్టల్ యూనివర్శిటీలో చిన్న పిల్లల వైద్య విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆడమ్ ఫిన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 5జీ టెక్నాలజీ ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదని స్పష్టం చేశారు.
“ప్రస్తుతం వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకడం వల్లే ఈ కోవిడ్-19 మహమ్మారి తలెత్తింది. ఇది వాస్తవం అని మనకు తెలుసు. కోవిడ్-19తో బాధపడుతున్న వ్యక్తి నుంచి వైరస్‌ను సేకరించి మేం ప్రయోగశాలల్లో కూడా దాన్ని పరిశీలిస్తున్నాం.

వైరస్ పని తీరు వేరు... మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా వెలువడే విద్యుదయస్కాంత తరంగాల వ్యవస్థ పనితీరు వేరు.. రెండింటికి మధ్య ఎంతో అంతరం ఉంది” అని ఆడమ్ అభిప్రాయపడ్డారు.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. బ్రిటన్‌లో 5జీ టెక్నాలజీ ఇంకా అందుబాటులోకి రాని ప్రాంతాల్లో కూడా కోవిడ్-19 వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇక కరోనావైరస్ బారిన పడి అల్లాడిపోతున్న ఇరాన్ వంటి దేశాలలో 5జీ అనే ఆలోచనే ఇంకా లేదు.
బ్రిటన్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజిటల్ కల్చర్, మీడియా అండ్ స్పోర్ట్ కూడా రెండింటికి మధ్య సంబంధం ఉందన్న విషయంలో ఎలాంటి నమ్మదగ్గ ఆధారాలు లేవని తేల్చి చెప్పింది.

ఇవి కూడా చదవండి.
- అమెరికాలో ఓ ఆడపులికి కరోనావైరస్
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- కరోనావైరస్: కోవిడ్-19 మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ ఎవరెస్ట్ ఎక్కుతున్న చైనా పర్వతారోహకులు
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
- కరోనా వైరస్: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..
- లక్ష మంది సినీ కార్మికులను ఆదుకుంటా: అమితాబ్ బచ్చన్
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: సామాజిక దూరం, స్వీయ నిర్బంధం అంటే ఏంటి? ఎవరిని ఒంటరిగా ఉంచాలి?
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








