లక్ష మంది సినీ కార్మికులను ఆదుకుంటా: అమితాబ్ బచ్చన్ - ప్రెస్ రివ్యూ

అమితాబ్ బచ్చన్

ఫొటో సోర్స్, Getty Images

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ముందుకొచ్చారంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ వివరాలు ఇవీ...

ఆల్‌ ఇండియా ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ కాన్ఫెడరేషన్‌కు చెందిన లక్ష మంది కార్మికులకు నెల రోజుల పాటు నిత్యావసరాలను అందజేస్తానని 'బిగ్ బి' అమితాబచ్చన్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని సోనీ పిక్చర్స్‌, కల్యాణ్‌ జువెల్లర్స్‌ స్వాగతించాయి.

మరోవైపు కరోనా నియంత్రణకు కేంద్ర మానవ వనరుల శాఖ కింద ఉన్న 28 విభాగాలు పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ.38 కోట్ల విరాళం ప్రకటించాయి. కేంద్రీయ విద్యాలయాల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది రూ.10 కోట్లు, నవోదయ పాఠశాలలు రూ.7.5 కోట్లు విరాళం ఇచ్చాయి.

ఇండియన్‌ బ్యాంకు ఉద్యోగులు 43 వేల మంది రూ.8.1 కోట్లను పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళంగా అందజేశారు. పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులు కూడా ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. లాక్‌డౌన్‌లో ప్రతిరోజు లక్ష మందికి ఆహారం అందజేస్తున్నామని ఝార్ఖండ్‌ సీఎం సోరెన్‌ తెలిపారు.

భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్ సింగ్ రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. మరో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ 5 వేల కుటుంబాలకు నిత్యావసరాలను అందించాలని నిర్ణయించుకున్నారు.

5 నిమిషాల్లో కరోనావైరస్ పరీక్ష

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 5 నిమిషాల్లో కరోనావైరస్ పరీక్ష

ఐదు నిమిషాల్లో కరోనా పరీక్ష

ఐదు నిమిషాల్లోనే కరోనా నిర్ధరణ పరీక్షలు చేయాలని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) నిర్ణయించిందంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని అందించింది. ఆ వివరాలు ఇవీ...

కరోనావైరస్ రోజురోజుకూ విజృంభిస్తుండటం, పెద్దఎత్తున పరీక్షలు చేయాల్సిన అవసరం ఏర్పడటంతో ర్యాపిడ్‌ పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది.

ఈ క్రమంలో 2.20 లక్షల మందికి సరిపడే కిట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్లు పెట్టింది. వీటి ద్వారా రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి అక్కడికక్కడే ర్యాపిడ్‌ కరోనా టెస్ట్‌ చేస్తారు. ఐదు నిమిషాల్లో పాజిటివ్‌ లేదా నెగెటివ్‌ అనేది తెలుస్తుంది.

సదరు వ్యక్తి శరీరంలోకి వైరస్‌ ప్రవేశించిందా లేదా ప్రభావితమైందా అనేది ఈ ర్యాపిడ్‌ పరీక్షల ముఖ్య ఉద్దేశం. ఈ పరీక్షలను కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు అత్యధికంగా నమోదైన ప్రాంతాల్లోనే నిర్వహిస్తారు.

ఇలాంటి ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించే పనిలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఇప్పటికే నిమగ్నమైంది. ర్యాపిడ్‌ టెస్టుల్లో ఒకవేళ పాజిటివ్‌ వస్తే తక్షణమే, హైదరాబాద్‌లోని నిర్ణీత ల్యాబ్‌కు పంపిస్తారు.

అక్కడ వారి గొంతుల్లోంచి స్వాబ్‌ తీసి రియల్‌ టైం పాలిమరేస్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్‌టీ–పీసీఆర్‌) పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్షలో పాజిటివ్‌ వస్తే హైదరాబాద్‌లో చికిత్స చేస్తారు.

ఇక ర్యాపిడ్‌ పరీక్షలో నెగటివ్‌ వచ్చినా జ్వరం, జలుబు, దగ్గు ఉంటే వారిని హోం క్వారంటైన్‌లో 14 రోజులు ఉంచాలని ఐసీఎంఆర్‌ సూచించింది. ర్యాపిడ్‌ టెస్టుల్లో నెగటివ్‌ వచ్చిన వారు హోం క్వారంటైన్‌ పూర్తయ్యాక తిరిగి మళ్లీ పరీక్ష నిర్వహించాకే బయటకు వెళ్లడానికి అనుమతించాలని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది.

జాతీయ స్థాయిలో ఏర్పాటైన జాతీయ టాస్క్ ఫోర్స్ ఈ పరీక్ష ప్రక్రియను వేగవంతం చేస్తోందని సాక్షి ఈ కథనంలో వివరించింది.

కరోనావైరస్:నెలకు 3 వేల వెంటిలేటర్ల తయారీకి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కరోనావైరస్:నెలకు 3 వేల వెంటిలేటర్ల తయారీకి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు

విశాఖ నుంచి నెల రోజుల్లో 3 వేల వెంటిలేటర్లు

కరోనా వ్యాధి నిర్ధరణ కోసం వచ్చే నెల రోజుల్లో 25వేల టెస్టింగ్ కిట్లను విశాఖ మెడ్‌టెక్ జోన్‌లోని పరిశ్రమలు ఉత్పత్తి చేయనున్నాయని పరిశ్రమల శాఖ వర్గాలు చెప్పినట్టు ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది.

ఈ నెల 15 నుంచి దశల వారీగా సరఫరా చేస్తాయని తెలిపింది.

అలాగే నెల రోజుల్లో 3 వేల వెంటిలేటర్లను కూడా మెడ్‌టెక్ జోన్‌లో పరిశ్రమలు సిద్ధం చేస్తాయని ఆయా వర్గాలు పేర్కొన్నట్టు వివరించింది.

రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులకు కావాల్సిన డిస్పోజబుల్ బెడ్ షీట్లు, మాస్కులను కూడా పరిశ్రమల శాఖ సమకూర్చనుందని, ఈ మేరకు రాష్ట్రంలో దుస్తుల తయారీ పరిశ్రమల నిర్వాహకులతో అధికారులు సంప్రదింపులు జరిపినట్టు చెప్పుకొచ్చింది.

అనంతపురం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లోని దుస్తుల తయారీ పరిశ్రమల్లో వెంటనే వీటి తయారీ ప్రారంభించాలని పరిశ్రమల శాఖ ఆదేశాలు జారి చేసిందని తెలిపింది.

ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఆయా పరిశ్రమలు మూతపడ్డాయని ఈనాడు ఈ వార్తలో వివరించింది.

లాక్ డౌన్

ఫొటో సోర్స్, Getty Images

ఉద్యోగాలకు ముప్పు

కరోనావైరస్ సెగ భారత్‌కు గట్టిగానే తగులుతోందని, అన్ని రంగాలను నష్టాల ఊబిలోకి నెట్టిందంటూ నమస్తే తెలంగాణ ఓ వార్తను ప్రచురించింది.

లాక్ డౌన్ నేపథ్యంలో మూతపడ్డ పరిశ్రమలు, సంస్థలు ఇప్పుడు ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. అందులో భాగంగా భారీ ఎత్తున ఉద్యోగాలను రద్దుచేయాలనుకుంటున్నాయి. వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ నిర్వహించిన సీఈవోల సర్వేలో ఇదే తేలింది.

ఆన్‌లైన్‌లో జరిగిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన సంస్థల్లోని సుమారు 200 మంది సీఈవోలు పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ తర్వాత ఉద్యోగ కోతలు ఉంటాయని ఇందులో 52 శాతం మంది అన్నారు.

ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో జనవరి-మార్చి త్రైమాసికంలో ఆదాయం, లాభాలు పెద్ద ఎత్తునే పడిపోవచ్చన్న అంచనాలున్నాయి.

ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని మెజారిటీ సీఈవోలు అంటున్నారు. ప్రస్తుతం అన్ని రంగాలకు కరోనా సెగ తగులుతోంది.

దీంతో లాక్‌డౌన్‌ తర్వాత దాదాపు మొత్తంగా వ్యయ నియంత్రణ చర్యలు ఉంటాయని తాజా సర్వేలో మెజారిటీ సీఈవోలు సంకేతాలిచ్చారు. అయినప్పటికీ 47 శాతం సీఈవోలు.. ఉద్యోగాల్ని కోల్పోయేవారు 15 శాతం దిగువనే ఉండొచ్చనగా, 32 శాతం సీఈవోలు మాత్రం 15-30 శాతంగా ఉండొచ్చని చెప్తున్నారు.

స్థూలంగా దాదాపు 52 శాతం సంస్థలు లాక్‌డౌన్‌ తర్వాత ఉద్యోగాల తీసివేతలు ఉంటాయని చెప్పేస్తున్నట్లు సీఐఐ తెలిపింది. దీనివల్ల జీడీపీ చాలావరకు తగ్గిపోవచ్చని హెచ్చరించింది.

నిరుద్యోగం పెరిగితే మార్కెట్‌లో డిమాండ్‌ పడకేస్తుందని, ఫలితంగా ఉత్పత్తి కుదేలై మొత్తం ఆర్థికవ్యవస్థ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని తెలిపింది. దీంతో రాబోయే ఉద్యోగ కోతల్ని తేలిగ్గా తీసుకోలేమని సీఐఐ వ్యాఖ్యానించినట్టు ఈ వార్తలో వివరించింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)