భర్తను చంపి ఆపై పోర్న్ చూస్తూ గడిపారంటూ మహిళపై ఫిర్యాదు.. పోలీసులు ఏం చెప్పారు? నిందితురాలి తల్లి ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
'మహిళ తన సన్నిహితుడితో కలిసి భర్తను హత్యచేసి ఆపై తెల్లారేవరకు నీలిచిత్రాలు చూస్తూ గడిపింది' అనే వార్త సంచలనం రేపింది.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలుమూరులో జరిగిన ఈ హత్యకు సంబంధించిన వివరాలను దుగ్గిరాల ఎస్‌ఐ వెంకట రవి 'బీబీసీ'కి వివరించారు.
మృతుడు బంధువులు శివకృష్ణ, శివరామకృష్ణ.. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ తల్లి బీబీసీతో మాట్లాడారు.
'చిలుమూరుకు చెందిన లోకం నాగరాజు(45)కు 2007లో కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం అత్తమూరు గ్రామానికి చెందిన లక్ష్మీమాధురితో వివాహమైంది. వారికి ఇద్దరు మగ పిల్లలు.
నాగరాజు గతంలో ప్రైవేటు ఉద్యోగాలు చేసి కొన్నాళ్ల కితం ఉల్లిపాయల వ్యాపారం చేసేవారు. అయితే ఉల్లిపాయల బిజినెస్ చేయడం మాధురికి ఇష్టం ఉండేది కాదు.
భార్య ఐదేళ్ల కిందట విజయవాడలోని ఓ సినిమా థియేటర్‌లో, ఆ తర్వాత ప్రైవేట్ మార్ట్‌లోనూ పనిచేశారు' అని మృతుడి బంధువులు చెప్పారు.

'ఈ క్రమంలో మాధురికి సత్తెనపల్లికి చెందిన గోపి అనే వ్యక్తితో పరిచయమైంది. హైదరాబాద్‌లో కార్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న గోపితో కలిసి ట్రావెల్స్‌లో పనిచేయాలని భర్తను కోరగా అందుకు ఆయన అంగీకరించి హైదరాబాద్ వెళ్లారు' అని వారు తెలిపారు.
'తాను హైదరాబాద్‌లో ఉంటుండగా, గోపి ఎక్కువగా స్థానికంగా ఉంటూ తన భార్యను తరచూ కలుస్తున్నట్లు నాగరాజుకు అనుమానం వచ్చి అక్కడ ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చేశారు. స్థానికంగానే ఉంటూ దుకాణాలకు సరకులు అందించే చిరువ్యాపారం చేస్తూ వస్తున్నారు. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి' అని మృతుడి బంధువులు బీబీసీతో చెప్పారు.

మూడునెలల కిందటే పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్
మాధురి మూడు నెలల కిందట.. భర్త(నాగరాజు) తనను వేధిస్తున్నారంటూ దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో రెండు కుటుంబాలవారిని పిలిచి వారి సమక్షంలో భార్యాభర్తలకు కౌన్సెలింగ్ చేసి పంపించినట్లు పోలీసులు చెప్పారు.
అయితే, కౌన్సెలింగ్ తరువాత కూడా వారిద్దరి కాపురం గొడవలతోనే సాగిందని మృతుడి తండ్రి, బంధువులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
'మాధురి తన సన్నిహితుడైన గోపితో కలిసి నాగరాజును హత్య చేయాలని భావించింది. జనవరి 18 రాత్రి బిర్యానీలో 20 మత్తుమందు బిళ్లలను కలిపి నాగరాజుకు పెట్టింది. మత్తులోకి వెళ్లిన నాగరాజును గోపితో కలిసి చంపేసింది' అని మృతుడు నాగరాజు తండ్రి గాంధీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారని ఎస్ఐ వెంకటరవి 'బీబీసీ'తో చెప్పారు.
'నాగరాజు చనిపోయినట్లు నిర్ధరించుకున్న తరువాత గోపి వెళ్లిపోగా మాధురి వేకువజామున 4 గంటల వరకు ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూశారని, ఆ తరువాత చుట్టుపక్కలవారిని లేపి తన భర్త గుండెపోటుతో చనిపోయారని చెప్పారని మృతుడి బంధువులు తెలిపారు' అని ఎస్ఐ వెల్లడించారు.
'ఊళ్లోనే ఉన్న మా బంధువులు వచ్చి చూసేసరికి నాగరాజు ముక్కు, చెవుల నుంచి రక్తం రావడంతో అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేయించాం’ అని నాగరాజు సోదరుడు శివకృష్ణ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పోస్ట్‌మార్టంలో ఏం తేలింది?
'పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకి పంపగా.. ఛాతీ వద్ద ఎముకలు విరగడం, శ్వాస ఆడకుండా చేయడం మృతికి కారణమని నివేదికలో తేలింది.
దీంతో నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం' అని ఎస్‌ఐ రవి ‘బీబీసీ’తో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'భర్తే నీలిచిత్రాలు చూపించేవారు.. వేధించేవారు'
కాగా భర్తే (మృతుడు నాగరాజు) తనకు పోర్న్ వీడియోలు చూడడం అలవాటు చేశారని విచారణలో మాధురి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
మృతుడు నాగరాజు తండ్రి గాంధీ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మంగళగిరి రూరల్ సీఐ వెంకట బ్రహ్మం బీబీసీకి చెప్పారు.
అయితే నిందితురాలిపై వస్తున్న ఆరోపణలను ఆమె బంధువులు ఖండిస్తున్నారని పోలీసులు తెలిపారు.
జరిగినదానికి మించి తమ ఆడపిల్లను బద్నాం చేస్తున్నారని అంటున్నారని సీఐ చెప్పారు.
పూర్తి విచారణ జరిగే వరకూ ఏ విషయంపైనా స్పష్టతకు రాలేమని, నిందితురాలితో పాటు ఆమెకు సహకరించినట్లుగా చెబుతున్న గోపిని విచారిస్తే గానీ వాస్తవాలు బయటపడవని సీఐ బ్రహ్మం బీబీసీతో అన్నారు.
దుష్ప్రచారం చేస్తున్నారు: మాధురి తల్లి
'నా కూతురిపై మరీ దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు' అని మాధురి తల్లి బీబీసీతో అన్నారు.
'మా కూతురికి, అల్లుడికి విభేదాలున్నాయి. ఎన్నోసార్లు పుట్టింటికి వచ్చి.. మళ్లీ పిల్లలు అన్యాయమైపోతారంటూ మనసు మార్చుకుని వెళ్లేది.. మూడు నెలల క్రింత కూడా పంచాయితీలు జరిగాయి.. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ ఘోరంగా ప్రచారం చేస్తున్నారు. మా బిడ్డ అలా చేసుండదు.. పోలీసుల విచారణ జరక్కముందే అన్నీ నిజాలే అన్నట్టు రాస్తున్నారు.. ఇది చాలా అన్యాయం, ఓ ఆడబిడ్డను ఘోరంగా అవమానిస్తున్నారు'' అని ఆమె బీబీసీ వద్ద విలపించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













