'నా భార్య నన్ను చంపడానికి ఎలా ప్లాన్ చేసిందంటే..'

తమ పెళ్లిరోజు వేడుకలో క్రిస్టోఫర్, మిషెల్ మిల్స్

ఫొటో సోర్స్, Christopher Mills

    • రచయిత, మెలేరి విలియమ్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
    • నుంచి, వేల్స్

పెళ్లి రోజు, క్రిస్టోఫర్ మిల్స్ తాను ప్రాణప్రదంగా ప్రేమించే భార్యతో కలిసి ప్రశాంతమైన పల్లెటూరి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న వేళ, ముసుగులు ధరించిన ఇద్దరు సాయుధులు కారవాన్‌పై దాడిచేశారు. ఆయన్ను చంపడానికి ప్రయత్నించారు.

ఆ సమయంలో వారి నుంచి తప్పించుకోవడానికి, తన భార్యను రక్షించుకోవడానికి క్రిస్టోఫర్ ఆ దుండగులతో పోరాడారు.

ఆ దుండగులు ఆయన్ను తుపాకీతో విచక్షణారహితంగా కొట్టారు. తర్వాత చీకట్లోకి పారిపోయారు.

యూకేలోని వేల్స్‌లో సెనార్త్ వద్ద ఈ దాడి జరిగిన కొద్దిరోజులకే క్రిస్టోఫర్‌కు అసలు విషయం తెలిసింది.

తనను చంపడానికి పన్నిన కుట్రకు సూత్రధారి వేరెవరో కాదని, తన భార్య మిషెల్ అని. ఇది గ్రహించిన ఆయన నివ్వెరపోయారు.

మిషెల్, ఆమె ప్రియుడు గెరైంట్ బెర్రీ కలిసి ఈ పథకం వేశారు. క్రిస్టోఫర్‌ను అడ్డు తొలగించుకుని తామిద్దరూ కొత్త కాపురం ప్రారంభించాలని అనుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దుండగుల దాడిలో గాయపడిన క్రిస్టోఫర్ మిల్స్

ఫొటో సోర్స్, Christopher Mills

ఫొటో క్యాప్షన్, దుండగుల దాడిలో గాయపడిన క్రిస్టోఫర్ మిల్స్

'ఆమె అలా చేస్తుందని ఊహించలేదు...'

''ఇదంతా ఒక సినిమా స్క్రిప్ట్‌లా ఉంది'' అని క్రిస్టోఫర్ మిల్స్ అన్నారు. ''ఈ కుట్రలో నా భార్య ప్రమేయం ఉంటుందని కనీసం ఊహించలేకపోయాను'' అని 55 ఏళ్ల ఆ మాజీ సైనికుడు అన్నారు.

ఈ కుట్రకు పాల్పడిన కార్మార్థేన్‌షైర్‌లోని లాంగెనెచ్‌కు చెందిన మిషెల్ మిల్స్, స్వాన్సీలోని క్లెడాక్‌కు చెందిన మాజీ మెరైన్ గెరైంట్ బెర్రీలకు 19 ఏళ్ల చొప్పున జైలుశిక్ష పడింది.

46 ఏళ్ల వయస్సున్న వీరిద్దరికీ మాజీ సైనికుల కోసం పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థలో పరిచయం ఏర్పడింది.

వివాహేతర సంబంధం సాగించిన మూడు నెలల్లో వారిద్దరూ క్రిస్టోఫర్‌ను ఎలా అడ్డు తొలగించుకోవాలా అనే విషయాలపై మెసేజ్‌లు పంపుకున్నారు.

దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపడమా లేదంటే, ఆయన తినే కూరలో 'యాంటీ-ఫ్రీజ్' (విషపూరితమైన రసాయనం) కలిపి చంపేయాలా అనేదీ వారు చర్చించుకున్నారు.

క్రిస్టోఫర్‌ను హత్య చేయడానికి జరిగిన కుట్రలో మిషెల్, బెర్రీ దోషులని స్వాన్సీ క్రౌన్ కోర్టులో జరిగిన విచారణలో నిర్ధరణ అయింది.

ఈ కేసులో సహ నిందితుడు స్టీవెన్ థామస్‌పై మోపిన 'హత్యకు కుట్ర' ఆరోపణలు వీగిపోయాయి.

క్రిస్టోఫర్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించడమే ఈ పథకం అసలు ఉద్దేశమని, ఆ పని కోసమే బెర్రీ తనను నియమించుకున్నారని థామస్ కోర్టులో చెప్పాడు.

అయితే, నకిలీ తుపాకీని కలిగిఉన్న కేసులో కోర్టు అతనికి 12 నెలల జైలుశిక్ష విధించింది.

ఈ కేసు ఒక టీవీ సీరియల్ మాదిరిగా ఉందని పోలీసులు వ్యాఖ్యానించారు. కానీ, బాధితుడు క్రిస్టోఫర్‌కు మాత్రం ఇదొక అత్యంత భయంకరమైన నిజం.

దాడి జరిగిన మర్నాడే అరెస్టయిన మిషెల్ మిల్స్

ఫొటో సోర్స్, Crown Prosecution Service

ఫొటో క్యాప్షన్, దాడి జరిగిన మర్నాడే అరెస్టయిన మిషెల్ మిల్స్

కుట్ర ఎలా భగ్నమైందంటే...

దాడి జరిగిన రోజు రాత్రి సరిగ్గా 11:30 గంటల సమయంలో, కారవాన్‌లో ఉన్న క్రిస్టోఫర్, మిషెల్ మిల్స్ నిద్ర పోవడానికి సిద్ధమవుతున్నారు. అప్పుడే ఎవరో కారవాన్ తలుపు కొట్టారు.

''నేను తలుపు తీసేసరికి ఎదురుగా మాస్క్ ధరించిన వ్యక్తి ఉన్నాడు'' అని క్రిస్టోఫర్ చెప్పారు.

''అతను నా ముఖంపై తుపాకీతో కొట్టాడు. ఏదో పెద్ద, బరువైన లోహపు వస్తువుతో బాధినట్లు, సుత్తితో మోదినట్లు అనిపించింది. నేను ఎదురుదాడి చేశాను. దీంతో వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు'' అని ఆయన గుర్తుచేసుకున్నారు.

మిషెల్ 999 నంబరుకు ఫోన్ చేసి, వెంటనే పోలీసు బలగాలను పంపాలని కోరడం క్రిస్టోఫర్‌కు వినిపించింది.

ఆర్గోయెడ్ మెడో కారవాన్ పార్క్ యజమాని రీటా ఓవెన్స్ కూడా కొద్దిసేపట్లోనే కంగారుగా సంఘటనస్థలానికి వచ్చారు.

''నేను అక్కడికి వెళ్లేసరికి, క్రిస్టోఫర్ తీవ్రమైన గాయాలతో రక్తసిక్తమై ఉన్నాడు'' అని రీటా చెప్పారు.

అసలు ఏం జరిగిందని తాను మిషెల్ మిల్స్‌ను అడిగితే, ఆమె భుజాలు ఎగరేసి ఏమీ తెలియదన్నట్లుగా నటించిందని, పైగా ఆమె తన ఫోన్‌లో మెసేజ్‌లు పంపడంలో నిమగ్నమై ఉందని రీటా నాటి ఘటన గురించి వివరించారు.

''వారెంతో అన్యోన్యమైన దంపతులని అనుకున్నా. కానీ అది నిజం కాదు'' అని ఆమె అన్నారు.

సమాచారం అందుకున్న 40 నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకున్న సాయుధులైన పోలీసులు, హెలికాప్టర్‌లో పరిసరాల్లో గాలించారు.

సమీపంలోని పొదల్లో దాక్కున్న బెర్రీ, థామస్‌లను కనిపెట్టారు.

వారి దగ్గరున్న బ్యాగ్‌లో గ్యాస్ మాస్క్‌లు, బంధించడానికి వాడే పట్టీ ఉన్నాయి.

క్రిస్టోఫర్ తన భార్యకు రాసినట్లుగా సృష్టించిన 'ఫేక్ సూసైడ్ నోట్' కూడా బెర్రీ దగ్గర దొరికింది.

దోషులుగా తేలిన గెరైంట్ బెర్రీ, మిషెల్ మిల్స్

ఫొటో సోర్స్, Dyfed-Powys Police

ఫొటో క్యాప్షన్, దోషులుగా తేలిన గెరైంట్ బెర్రీ, మిషెల్ మిల్స్

'నా గుండె పగిలినంత పనైంది...'

దాడి జరిగిన మరుసటి రోజే, తన భార్య చేసిన తప్పుడు ఆరోపణలతో గృహహింస అనుమానంతో పోలీసులు క్రిస్టోఫర్‌ను అరెస్టు చేశారు.

అప్పటి వరకూ ఆయనకు అసలు విషయం అర్థంకాలేదు. ఈ కుట్రలో తన భార్యకు కూడా భాగం ఉందనే చేదు నిజం ఆయనకు తెలిసింది.

''నేను ఎప్పుడూ గృహహింసకు పాల్పడలేదు. ముఖ్యంగా మిషెల్‌పై అసలు చేయలేదు. కుట్రలో ఆమెకు సంబంధం ఉందన్న విషయం తెలియగానే నా గుండె జారిపోయింది. ఇదంతా క్రేజీగా ఉంది'' అని క్రిస్టోఫర్ అన్నారు.

''2024 జూన్‌లోనే ఆమెలో మార్పు కనిపించింది. నాపై ఆసక్తి చూపించకుండా, కొంచెం దూరంగా, నిర్లిప్తంగా ఉండేది'' అని గతాన్ని గుర్తుచేసుకున్నారు.

అంతా సవ్యంగా అని అడిగితే, పని ఒత్తిడి వల్లే అలా ఉన్నానని ఆమె సాకు చెప్పేదని క్రిస్టోఫర్ వెల్లడించారు.

మిషెల్ అరెస్టు అయిన తర్వాత, మళ్లీ ఆమెను 2024 అక్టోబర్‌లో జరిగిన విచారణ సమయంలో కోర్టు బోనులోనే క్రిస్టోఫర్ చూశారు.

''ఆమె నాకు తెలిసిన మిషెల్‌లా అనిపించలేదు'' అని చెప్పారు క్రిస్టోఫర్.

''ఆమె అబద్ధాలు చెప్పింది. ఆ కోర్టు హాల్‌లో కూడా ఆమె పచ్చి అబద్ధాలు చెబుతూ అందర్నీ నమ్మించాలని ప్రయత్నించింది'' అని గుర్తుచేసుకున్నారు.

''ఆమె చేసిన పనికి, ఆమెను ఎప్పటికీ క్షమించలేను. ఇదొక అంతులేని పీడకలగా మారిపోయింది'' అని క్రిస్టోఫర్ అన్నారు.

అరెస్టు అయిన తర్వాత పోలీసు వాహనంలో గెరైంట్ బెర్రీ

ఫొటో సోర్స్, Dyfed-Powys Police

ఫొటో క్యాప్షన్, అరెస్టు అయిన తర్వాత పోలీసు వాహనంలో గెరైంట్ బెర్రీ

'ఆ మెసేజ్‌లు డిలీట్ చేసేయ్యి...'

మిషెల్‌, బెర్రీ మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించి వంద పేజీలకు పైగా ఉన్న టెక్ట్స్ మెసేజ్‌లను పోలీసులు కోర్టుకు సమర్పించారు.

''అతని చావును మనం కళ్లారా చూద్దాం. ఆ తర్వాత ఇంటికి వచ్చి వారంతాన్ని హాయిగా కలిసి గడుపుదాం. ఎవరో ఒకరు వచ్చి అతని శవాన్ని కనుగొనేవరకూ వేచిచూద్దాం'' అన్నది బెర్రీ పంపిన మెసేజ్‌ల్లో ఒకటి.

దాడి తర్వాత ఆమె నుంచి బెర్రీకి వచ్చిన ఆఖరి మెసేజ్, ''పోలీసులు వస్తున్నారు. అన్ని మెసేజ్‌లు డిలీట్ చేసేయ్. ఐ లవ్ యూ ...'' అని ఉంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)